Monday, November 25, 2019

కార్తీక పురాణం- 30వ రోజు పారాయణం (అమావాస్య రోజున)

ధ‌ర్మ‌సూక్ష్మ క‌థ‌నాన్ని ఋషుల‌డిగారు. ఓ సూత‌మ‌హ‌ర్షీ, మాకు పుణ్య‌మైన హ‌రి మాహాత్మ్యం బోధించారు. ఇంకా కార్తీక పురాణం మ‌హ‌త్తును, కార్తీక మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివ‌రించండి అని అడిగారు. ఇదే ఫ‌ల‌శ్రుతి. 
క‌లియుగంలో క‌లుషిత మాన‌సులై రోగాదుల‌కు లోనై సంసార స‌ముద్రంలో మునిగి ఉన్న వారికి అనాయాసంగా పుణ్యం ల‌భించేది మార్గం ఏది? 
ధ‌ర్మంలో ఎక్కువ ధ‌ర్మం ఏది, దేని వ‌ల‌న మోక్షం సిద్ధిస్తుంది, దేవ‌త‌ల్లో ఉన్న‌త‌మైన దేవుడెవ‌రు?? ఏ క‌ర్మ చేత మోహం న‌శిస్తుంది???
క‌లియుగంలో మాన‌వులు మంద‌మ‌తులు, జ‌డులు, మృత్యుపీడితులు అవుతారు. వారికి అనాయాసంగా మోక్షం దొరికే ఉపాయం చెప్పండి అని అడిగారు.
వారి మాట‌ల‌కు సూతుడు మునీశ్వ‌రులారా, మీర‌డిగిన ప్ర‌శ్న చాలా బాగుంది. మంగ‌ళ‌క‌ర‌మైన హ‌రికీర్త‌న స్మృతికి వ‌చ్చింది. కాబ‌ట్టి స‌ర్వ‌సుఖ‌క‌ర‌మైన దాన్ని చెబుతాను, వినండి.
మీరు అల్ప‌బుద్ధులైన జ‌నాల‌కు మోక్షోపాయం చెప్ప‌మ‌ని కోరారు. ఈ ప్ర‌శ్న లోకోప‌కారం కోసం కావ‌డం వ‌ల్ల నాకు చాలా ఆనంద‌దాయ‌క‌మైన‌ది. అనేక యాగాదులు చేసినా, అనేక పుణ్య‌తీర్థాల్లో స్నానాదులు ఆచ‌రించినా ఏ ఫ‌లం పొందుతారో ఆ ఫ‌లం ఇలాంటి మంచి మాట‌ల వ‌లెనే ల‌భిస్తుంది.
మునీశ్వ‌రులారా, కార్తీక ఫ‌లం వేదోక్త‌మైన‌ది. కార్తీక వ్ర‌తం హ‌రికి ఆనంద కార‌ణం. స‌ర్వ‌శాస్ర్తాల‌ను సంపూర్ణంగా చెప్ప‌డానికి నేను స‌మ‌ర్థుడ‌ను కాదు, కాలం కూడా చాల‌దు. కాబ‌ట్టి శాస్త్ర సారం చెబుతాను వినండి. 
శ్రీ‌హ‌రి క‌థ‌ను సంగ్ర‌హంగా చెబుతాను. శ్రీ‌హ‌రి ప‌ట్ల ఆస‌క్తులై, ఆక‌ర్షితులైన వారు ఘోర‌మైన న‌ర‌కాల్లో ప‌డ‌కుండా సంసార స‌ముద్రం నుంచి త‌రిస్తారు. కార్తీకంలో హ‌రిని పూజించి స్నానం, దానం, ఆల‌యాల్లో రాత్రి వేళ దీపం వెలిగించే వారు అనేక పాపాల నుంచి శీఘ్రంగా ముక్తుల‌వుతారు. సూర్యుడు తులారాశిలో ప్ర‌వేశించింది మొద‌లు 30 రోజులు కార్తీక వ్ర‌తం చేయాలి. అలా చేసే వాడు జీవ‌న్ముక్తుడ‌వుతాడు. 
బ్రాహ్మ‌ణులు, క్ష‌త్రియులు, వైశ్యులు, శూద్రులు, స్ర్తీలు కార్తీక వ్ర‌తం చేయ‌క‌పోతే త‌మ పూర్వీకుల‌తో స‌హా అంధ‌తామిశ్రం అనే న‌ర‌కంలో (చీక‌టిమ‌య‌మై ఏమీ క‌నిపించ‌దిని) బాధ‌ల‌నుభ‌విస్తారు. ఇందులో ఎలాంటి సంశ‌యం లేదు.
కార్తీక మాసంలో కావేరీ జ‌లంలో స్నానం చేసే వారు దేవత‌ల చేత ప్ర‌శంస‌లు పొందుతూ హ‌రిలోకం చేర‌తారు. కార్తీక మాసంలో స్నానం చేసి హ‌రిని పూజించిన వారు విగ‌త పాపులై వైకుంఠం చేర‌తారు.
మునీశ్వ‌రులారా, కార్తీక వ్ర‌తం చేయ‌ని వారు వేయి జ‌న్మ‌ల్లో ఛండాలురై పుడ‌తారు. కార్తీక మాసం బ‌హు పుణ్య‌క‌రం. స‌ర్వ‌మాసాల్లో శ్రేష్ఠ‌మైన‌ది. కార్తీక వ్ర‌తం హ‌రిప్రీతిదాయకం. స‌మ‌స్త పాప‌హ‌రం. దుష్టాత్ముల‌కు ఇది అల‌భ్యం. తుల‌లో ర‌వి ఉండ‌గా కార్తీక మాసంలో స్నానం, దానం, పూజ‌, హోమం, హ‌రిసేవ చేసే వారు స‌మ‌స్త దుఃఖ విముక్తులై మోక్షం పొందుతారు. 
కార్తీక మాసంలో దీప‌దానం, కంచుపాత్ర దానం, దీపారాధ‌నం, ధాన్య‌, ఫ‌ల‌, ధ‌న‌, గృహ‌దానం అనంత ఫ‌ల‌ప్ర‌దాలు. 
ధ‌నికుడు గాని, ద‌రిద్రుడు గాని హ‌రి ప్రీతి కోసం కార్తీక మాసంలో క‌థ‌ను విన్నా, క‌థ‌ను వినిపింప‌చేసినా అనంత ఫ‌లం పొందుతారు. కార్తీక మాహాత్మ్యం స‌ర్వ‌పాపాల‌ను హ‌రింప‌చేస్తుంది. స‌మ‌స్త సంప‌త్తులు క‌లుగ‌చేస్తుంది. అన్ని పుణ్యాల క‌న్నా అధికం. ఎడ‌రు ఈ ప‌విత్ర‌మైన, విష్ణు ప్రీతిక‌ర‌మైన అధ్యాయం వింటారో వారు ఈ లోకంలో గొప్ప సుఖాల‌నుభ‌వించి ప‌ర‌లోకంలో బ్ర‌హ్మానందం పొందుతారు. తిరిగి ఒక జ‌న‌న‌మ‌ర‌ణ ప్ర‌వాహంలో ప‌డ‌కుండా చేసేదే ప‌ర‌మ సుఖం లేదా నిత్య సుఖ‌దాయిని. ఇది ఆచ‌రించి అంద‌రూ ముక్తి పొందుతారి ఆశిస్తున్నాను అంటూ సూత మ‌హ‌ర్షి ముగించాడు.  

30 రోజు పారాయణం ముగిసింది.
ప‌ద్మ‌పురాణాంత‌ర్గ‌త‌  కార్తీక మాహాత్మ్యం మాప్తం

No comments:

Post a Comment