Wednesday, November 13, 2019

కార్తీక పురాణం- 16వ రోజు పారాయ‌ణం  (బ‌హుళ పాడ్య‌మి రోజున‌)

నోట్ : ఇంత‌వ‌ర‌కు 15 రోజులు స్కాంధ‌పురాణాంత‌ర్గ‌త కార్తీక మాహాత్మ్య పారాయ‌ణం పూర్త‌యింది. ఇక్క‌డ నుంచి ప‌ద్మ‌పురాణాంత‌ర్గ‌త కార్తీక మాహాత్మ్యం ప్రారంభం అవుతుంది. కాబ‌ట్టి తిరిగి ప్ర‌థ‌మోధ్యాయం, ద్వితీయోధ్యాయం అంటూ వ‌రుస క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంది. గ‌మ‌నించ‌గ‌ల‌రు.
-----------------------

ఈ విధంగా సూతుడు ప్ర‌వ‌చించిన స్కాంధ‌పురాణాంత‌ర్గ‌త కార్తీక మాహాత్మ్యాన్ని విని సంతుష్టులై శౌన‌కాది మ‌హామునులు, కుల‌ప‌తులు "సూత‌మునీ, లోకోత్త‌ర పుణ్య‌దాయ‌క‌మైన ఈ కార్తీక పురాణం స్కాంధ‌మందే కాకుండా ప‌ద్మ‌పురాణంలో కూడా ఉంది క‌దా! దాన్ని కూడా విశ‌ద‌ప‌ర‌చండి" అని కోరారు. వారి విన్న‌పాన్ని పుర‌స్క‌రించుకుని సూతుడు
"మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు, మ‌హిమ‌లు వినేవారికి, వినిపించే వారికి విశేష పుణ్యాన్నిస్తాయి త‌ప్పితే విసుగు క‌లిగించ‌వు. భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో మీరు కోరాలే గాని గురు ప్ర‌సాదిత శ‌క్త్యానుసారం వివ‌రించ‌కుండా ఉండ‌గ‌ల‌నా, వినండి" అంటూ ప్రారంభించాడు. స్కాంధ‌పురాణంలో జ‌న‌క మ‌హారాజుకు వ‌శిష్ఠుల వారెలా ఈ మ‌హాత్మ్యాన్ని బోధించారో అదే విధంగా ప‌ద్మ‌పురాణంలో స‌త్య‌భామాదేవికి శ్రీ‌మ‌న్నారాయ‌ణుడైన శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్మ ఈ కార్తీక మాస విశేషాలు వివ‌రించాడు.

పారిజాతాప‌హ‌ర‌ణం
ఒకానొక‌ప్పుడు నార‌ద మ‌హ‌ర్షి స్వ‌ర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి శ్రీ‌కృష్ణునికిచ్చి ఓ శ్రీ‌హ‌రీ, నీకున్న ప‌ద‌హారు వేల ఎనిమిది మంది భార్య‌ల్లోనూ నీకు అత్యంత ప్రియ‌మైన ఆమెకి ఈ పూవు బ‌హూక‌రించు అని కోరాడు. ఆ స‌మ‌యానికి రుక్మిణీదేవి అక్క‌డే ఉంది. నంద‌నంద‌నుడు ఆ సుమాన్ని రుక్మిణికి కానుక‌గా ఇచ్చాడు. ఆ సంగ‌తి తెలిసిన స‌త్య‌భామ అలిగింది. ప్రియ‌మైన భార్య‌కి ఇవ్వ‌మంటే త‌న‌కు ఇవ్వాలి గాని, రుక్మిణికి ఇవ్వ‌డం ఏమిట‌ని కోపించింది. కృష్ణుడు ఎంత న‌చ్చ‌చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి త‌న పెర‌టిలో నాటితే త‌ప్ప ఊరుకునేది లేద‌ని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చ‌డ‌మే ప్ర‌ధానంగా త‌ల‌చిన ఆ అనంత ప‌ద్మ‌నాభుడు త‌క్ష‌ణ‌మే స‌త్య‌భామా స‌మేతంగా గ‌రుత్మంతుడిని అధిరోహించి ఇంద్రుని అమ‌రావ‌తీ న‌గ‌రానికి వెళ్లాడు. స్వ‌ర్గ సంప‌ద‌ను, భూలోకానికి పంపేందుకు ఇంద్రుడు అంగీక‌రించ‌లేదు. త‌త్ఫ‌లితంగా ఇంద్ర ఉపేంద్రుల న‌డుమ భీక‌ర‌మైన యుద్ధం జ‌రిగింది. అక్క‌డి గోలోకంలోని గోవుల‌కు, గ‌రుత్మంతునికి కూడా భీక‌ర సంగ్రామం జ‌రిగింది. స‌మ‌రోత్సాహంలో వైన‌తేయుడు త‌న ముక్కుకొన‌ల‌తో గోవుల‌ను కొట్ట‌డం వ‌ల‌న గోవుల చెవులు, తోక‌లు తెగి ర‌క్త‌ధార‌లు భూమి మీద ప‌డ్డాయి. వాటి తోక‌ల వ‌ల‌న గొప్పిచెట్లు, చెవుల వ‌ల‌న చీక‌టి చెట్లు, ర‌క్తం నుంచి మేడి వృక్షాలు ఆవిర్భ‌వించాయి. మోక్షాన్ని కోరుకునే వారు ఈ మూడు చెట్ల‌కూ దూరంగా ఉండాలి. ముట్టుకోకూడ‌దు. అదే విధంగా గోవులు త‌మ కొమ్ముల‌తో కొట్ట‌డం వ‌ల‌న ఆ ప‌క్షిరాజు రెక్క‌న వెంట్రుక నేల రాలింది. వాటి నుంచి నెమ‌ళ్లు, బంగారు పిచ్చుక‌లు, చ‌క్ర‌వాకాలు జ‌న్మించాయి. ఈ మూడూ కూడా శుభ‌ప్ర‌ద‌మైన‌విగా భాసిల్లాయి. గ‌రుడ ద‌ర్శనం వ‌ల‌న మాన‌వులు ఏయే శుభాలైతే పొందుతున్నారో అటువంటి స‌ర్వ‌శ్రేయ‌స్సులూ ఉప‌రి ప‌క్షిత్ర‌యాన్ని చూసిన మాత్రానే పొంద‌గ‌లుగుతున్నారు.

ఎట్ట‌కేల‌కు ఆ త‌గ‌వులో దేవేంద్రుడు త‌గ్గి స‌విన‌యంగా పారిజాత ద్రుమాన్ని యాద‌వేంద్రునికి అర్పించుకున్నాడు. దాన‌వాంత‌కుడు దాన్ని ముద్దుల భార్యామ‌ణి సాత్రాజితి నివాసంలో ప్ర‌తిష్ఠించాడు.అందువ‌ల‌న అమితానందం పొందిన ఆ అన్నుల‌మిన్న త‌న పెనిమిటి పీతాంబ‌రునితో చాలా ప్రేమ‌గా ప్ర‌సంగిస్తూ ప్రాణ‌ప్రియా, నేనెంతైనా ధ‌న్యురాలిని. నీ ప‌ద‌హారు వేల ఎనిమిది మంది స్ర్తీల‌లో నేనే నీకు అత్యంత ప్రియ‌త‌మ‌ను కావ‌డం వ‌ల‌న నా అంత‌చందాలు ధ‌న్య‌త్వం పొందాయి. అస‌లీ జ‌న్మ‌లో నీ అంత‌టి వాడికి భార్య‌ను కావ‌డానికి, నీతో పాటు గ‌రుడారూఢ‌నై బొందెతో స్వ‌ర్గ సంద‌ర్శ‌నం చేయ‌డానికి, క‌థ‌లుగా చెప్పుకోవ‌డ‌మే త‌ప్ప ఎవ‌రూ ఎప్పుడూ క‌ళ్లారా రూసి ఎరుగ‌ని పారిజాత వృక్షం నా పెర‌టి మొక్క‌గా ఉండ‌డానికి ఏమిటి కార‌ణం?  నేను నిన్ను తులాభార రూపంగా నార‌దునికి ధార‌పోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామ‌పాదంతో తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వుగింజంత కూడా కోపం చూప‌కుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆద‌రాభిమానాలు పొంద‌డానికి నేను గ‌త‌జ‌న్మ‌ల‌లో చేసిన పుణ్యం ఏమిటి? అదీ గాక జ‌న్మ‌జ‌న్మ‌కీ నీ జంట ఎడ‌బాయ‌కుండా ఉండాలంటే నేను ఇప్పుడింకా ఏం చేయాలి?? అని అడిగింది. అందుకు ముకుందుడు మంద‌హాసం చేస్తూ ఓ నారీ ల‌లామా, స‌త్య‌భామా నీవు న‌న్ను కోర‌రానిది కోరినా, చెప్ప‌రానిది అడిగినా, ఈయ‌రానిది ఆశించినా కూడా నీ స‌మ‌స్త వంఛ‌ల‌ను నేర‌వేర్చి సంతృప్తురాల‌ను చేయ‌డ‌మే నా విధి. అందుకు కార‌ణం నీ పూర్వ జ‌న్మ‌మే అంటూ ఇలా చెప్ప‌సాగాడు. 


స‌త్య‌భామ పూర్వ‌జ‌న్మ వృత్తాంతం
కృత‌యుగంలో మాయా న‌గ‌రంలో దేవ‌శ‌ర్మ అనే పేద పండితుడుండే వాడు. అత‌నికి లేక‌లేక ఒక ఆడ‌బిడ్డ జ‌న్మించింది. ఆమే గుణ‌వ‌తి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ అమ్మాయిని త‌న శిష్యుల్లోనే ఒక‌డైన చంద్రుడ‌నే వాడికిచ్చి వివాహం చేశాడు. ఒక నాడు ఈ మామ‌, జామాత ఇద్ద‌రూ క‌లిసి స‌మిథ‌లు, ద‌ర్భ‌లు తెచ్చుకునేందుకు అడ‌వికి వెళ్లి అక్క‌డ ఒక రాక్ష‌సుని చేతిలో హ‌తుల‌య్యారు. బ్రాహ్మ‌ణులూ, ధ‌ర్మాత్ములూ, నిత్య సూర్యోపాస‌నాప‌రులు అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి మ‌ర‌ణించిన ఆ మామ అల్లుళ్ల‌ను వైకుంఠానికి తీసుకుర‌మ్మ‌ని త‌న పారిష‌దుల‌ను ఆజ్ఞాపించాడు. ఆ పారిష‌దులు ప్ర‌భు ఆజ్ఞ‌ను పాలించారు. సూర్య‌తేజ‌స్సుతో స‌మాన‌మైన కాంతులీనుతున్న ఆ ఇద్ద‌రి జీవాలూ వైకుంఠం చేరి విష్ణు సారూప్యం పొంది విష్ణు స‌న్నిధిలో మ‌స‌ల సాగాయి.
ప్ర‌థ‌మోధ్యాయ స‌మాప్తః
--------------
ద్వితీయోధ్యాయం
గుణ‌వ‌తి క‌థ‌

తండ్రి, భ‌ర్త మ‌ర‌ణ‌వార్త విన్న గుణ‌వ‌తి ఎంత‌గానో కుంగిపోయింది. కాని పోయిన వారితో త‌ను కూడా పోలేదు గ‌నుక మ‌ర‌ణం అస‌న్న‌మ‌య్యే వ‌ర‌కు మ‌నుగ‌డ త‌ప్ప‌దు. వేరొక దిక్కులేని ఆ యువ‌తి ఇంట్లో ఉన్న వ‌స్తు సంచ‌యాన్నంత‌టినీ విక్ర‌యించి తండ్రికి, భ‌ర్త‌కు ఉత్త‌మ గ‌తుల‌కై ఆచ‌రించాల్సిన క‌ర్మ‌లు ఆచ‌రించింది. శేష జీవితాన్ని శేష‌శాయి స్మ‌ర‌ణ‌లోనే గ‌డుపుతూ దేహ పోష‌ణార్ధం కూలి ప‌ని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింత‌న‌తో హ‌రిభ‌క్తిని, శాంతిని, స‌త్యాన్ని, జితేంద్రియ‌త్వాన్ని పాటించేది. ప‌ర‌మ స‌దాచారులైన వారి ఇంట పుట్టి పెరిగింది కావ‌డం వ‌ల‌న బాల్యం నుంచి అల‌వ‌డిన కార్మీక వ్ర‌తాన్ని, ఏకాద‌శీ వ్ర‌తాన్ని మాత్రం విడువ‌కుండా ప్ర‌తీ ఏటా ఆచ‌రించేది. 

స‌త్యా పుణ్య‌గ‌ణ్యాలు, భుక్తిముక్తిదాలు, పుత్ర‌పౌత్ర సౌభాగ్యం సంధాయ‌కాలు అయిన ఆ రెండు వ్ర‌తాలు నాకు అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌వ‌న్న సంగ‌తి నీకు తెలుసు క‌దా. కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండ‌గా నిత్యం ప్రాతః స్నానం ఆచ‌రించే వారి స‌మ‌స్త పాపాల‌నూ న‌శింప‌చేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధ‌న‌లు, జాగ‌ర‌ణ‌, తుల‌సీ పూజ చేసే వారు అంత్యంలో వైకుంఠ వాసుడైన మ‌హావిష్ణుస్వ‌రూపులై భాసిస్తారు. విష్ణ్వాల‌యంలో మార్జ‌నం చేసి స‌ర్వ‌తో భ‌ద్రం, శంఖం, ప‌ద్మం వంటి ముగ్గులు పెట్టి పూజాపున‌స్కారాలాచ‌రించేవారు జీవ‌న్ముక్తుల‌వుతారు. త‌దుప‌రి పెద్ద‌లు చెబుతున్న‌విధంగా కార్తీక‌మాసంలో నెల‌రోజుల్లోనూ...క‌నీసం మూడు రోజులైనా కార్తీక వ్ర‌తం ఆచ‌రించిన వారు దేవ‌త‌లు కూడా న‌మ‌స్క‌రించ‌ద‌గిన వార‌వుతారు. ఇక పుట్టింది ల‌గాయ‌తు జీవితాంతం చేసేవారి పుణ్యైవైభ‌వాన్ని చెప్ప‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు. అదే విధంగా ఆ నాటి గుణ‌వ‌తి విష్ణు ప్రియంక‌ర అయి ఏకాద‌శీ కార్తీక వ్ర‌తాలు వ‌ద‌ల‌కుండా క‌డు నిష్ఠ‌తో చేస్తూ కాలం గ‌డిపి వ‌యోభారం వ‌ల‌న శుష్కించి, జ్వ‌ర‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ కూడా కార్తీక స్నానం మాన‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో న‌దికి వెళ్లి ఆ చ‌లిలో కూడా న‌డుములోతు నీళ్ల‌లో స్నానం చేసే ప్ర‌య‌త్నంలో ఉంది. అంత‌లోనే ఆకాశం నుంచి శంఖ‌, చ‌క్ర‌, గ‌ద‌, ప‌ద్మం వంటి ఆయుధాలు క‌లిగిన విష్ణుదూత‌లు గ‌రుడ‌ప‌తాకాయుత‌మైన విమానంలో వ‌చ్చి గుణ‌వతిని అందులోకి తీసుకుని దివ్య స్ర్తీల చేత సేవ‌లు చేయిస్తూ త‌మ‌తో పాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్ర‌త పుణ్య‌ఫ‌లంగా ఆమె పొగ‌లేని అగ్నిశిఖ వ‌లె ప్ర‌కాశిస్తూ హ‌రి సాన్నిధ్యాన్ని పొందింది. 

శ్రీ మ‌హావిష్ణువునైన నేను అనంత‌ర కాలంలో దేవ‌త‌ల ప్రార్థ‌న మీద దేవ‌కీ గ‌ర్భాన ఇలా కృష్ణుడుగా అవ‌త‌రించాను. నాతో పాటుగానే అనేక మంది వైకుంఠ‌వాసులు యాద‌వులుగా జ‌న్మించారు. పూర్వ‌జ‌న్మ‌లోని చంద్రుడు ఈ జ‌న్మ‌లో అక్రూరుడ‌య్యాడు. దేవ‌శ‌ర్మ స‌త్రాజిత్తుగా జ‌న్మించాడు. బాల్యం నుంచ కార్తీక వ్ర‌తం మీద‌, నా మీద మాత్ర‌మే మ‌న‌సు ల‌గ్నం చేసిన గుణ‌వ‌తి స‌త్రాజిత్తు కుమార్తె స‌త్య‌భామ‌గా అవ‌త‌రించింది. ఆమే నీవు. ఈ జ‌న్మ‌వైభోగానికంత‌కూ కార‌ణం పూర్వ‌జ‌న్మ‌లోని కార్తీక వ్ర‌తాచ‌ర‌ణా పుణ్య‌మే త‌ప్ప ఇత‌రం కాదు. ఆ జ‌న్మ‌లో నా ముంగిట తుల‌సిమొక్క పాతిన పుణ్యానికి ఈ జ‌న్మ‌లో క‌ల్ప‌వృక్షం నీ వాకిట వెలిసింది. ఆ నాడు కార్తీక దీపారాధ‌న చేసిన ఫ‌లితంగా ఈ రోజు నీ ఇంట‌, వంట ల‌క్ష్మీక‌ళ స్థిర‌ప‌డింది. అల‌నాడు నీ స‌మ‌స్త వ్ర‌తాచ‌ర‌ణ పుణ్యాల‌ను నారాయ‌ణా ఏతి స‌మ‌ర్ప‌యామి అంటూ జ‌గ‌త్ప‌తి అయిన నాకే ధార‌పోసిన దానికి ప్ర‌తిఫ‌లంగా ఇప్పుడు నా భార్య‌వ‌య్యావు. పూర్వ జ‌న్మ‌లో జీవితాంతం వ‌ర‌కు కార్తీక వ్ర‌తాన్ని వీడ‌లేని నీ భ‌క్తికి ప్ర‌తిగా సృష్టి ఉన్నంత వ‌ర‌కు నా ఎడ‌బాటు లేని ప్రేమ‌ను అనుభ‌విస్తున్నావు. ఓ సాత్రాజితీ, నువ్వే కాదు నీ మాదిరిగా ఎవ‌రైతే కార్తీక వ్ర‌తానుష్ఠాన నిష్ఠులు, నా భ‌క్త‌గ‌రిష్ఠులు అయి ఉంటారో వారంద‌రూ కూడా నాకు ఇష్టులై స‌ర్వ‌కాల స‌ర్వావ‌స్థ‌ల్లోను కూడా త‌త్కార‌ణాల రీత్యా నా వారుగా, నా సాన్నిధ్యంలోనే ఉంటారు. రాగ‌వ‌తీ, ఒక ర‌హ‌స్యం చెబుతాను విను. త‌పోదాన య‌జ్ఞాదికాల‌ను ఎన్ని నిర్వ‌హించినా కార్తీక వ్ర‌తాచ‌ర‌ణాప‌రుల‌కు ల‌భించే పుణ్యంలో ప‌ద‌హారో వంతు పుణ్యం కూడా పొంద‌లేర‌నేది అతిశ‌యోక్తి కాదు.


శ్రీ కృష్ణుడు తెలియ‌చేసిన త‌న పూర్వ‌జ‌న్మ గాథ‌ను, కార్తీక వ్ర‌త పుణ్య‌ఫ‌లాల‌ను విని పుల‌కితాంగిత‌మై ఆ పూబోడి త‌న ప్రియ‌త‌ముడైన విశ్వంభ‌రునికి విన‌య‌విధేయ‌త‌ల‌తో ప్ర‌ణ‌మిల్లింది.
ద్వితీయోధ్యాయ స‌మాప్తః


ప‌ద్మ‌పురాణాంత‌ర్గత  కార్తీక మాహాత్మ్యం ఒక‌టి, రెండు అధ్యాయాలు సమాప్తం

16వ రోజు పారాయణం ముగిసింది.

No comments:

Post a Comment