Wednesday, December 19, 2018

రేపు హ‌నుమ‌ద్ర్వ‌తం

ఆరాధించిన వెంటనే అనుగ్రహించే దైవంగా, హనుమను భక్తులు భావిస్తారు. సకల ప్రతికూల శక్తుల్ని నివారించి సర్వభయాల్నీ పరిహరించే దైవంగా పూజిస్తారు. మార్గశిర శుద్ధ త్రయోదశినాడు, లంకలో ఉన్న సీతను హనుమ తొలిసారిగా దర్శించాడని చెబుతారు. ఈ శుభ తిథినాడు హనుమద్వ్రతం నేపథ్యంగా ఆయనను ఆరాధిస్తారు. తనకు ఎనలేని సంతోషాన్ని అందించిన హనుమను మార్గశిర శుద్ధ త్రయోదశినాడు వ్రతపూర్వకంగా ఆరాధించినవారికి సమస్త మనోభీష్టాలు నెరవేరతాయని సీతాదేవి వరమిచ్చిందంటారు.
 
హనుమాన్‌ వ్రతాన్ని అరటితోటలో లేదా ఆ చెట్టు వద్ద నిర్వహిస్తారు. మంటపం ఏర్పాటుచేసి బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని చిత్రించి, దానిపై ధాన్యం పోసి కలశ స్థాపన చేస్తారు. కలశాన్ని అలంకరించి, దాని సమీపంలో హనుమ విగ్రహం ఉంచుతారు. ఆ తరవాత 13 పోగులు ఉన్న తోరాన్ని స్వామి మూర్తి వద్ద ఉంచి పూజించి ధరిస్తారు.హనుమంతుడి వ్రత ఆచరణ వల్ల కార్యజయం, బుద్ధి వికాసం, మనోధైర్యం, ఆరోగ్య సిద్ధి వంటి శుభఫలితాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆయన ఆచరించి చూపిన జీవనసూత్రాలు అందరికీ ఆదర్శప్రాయాలు!


హ‌నుమ మూర్తిమ‌త్వం
ఆదర్శనీయ మూర్తిమత్వం, ఆచరణీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వం కలబోసిన పరమేశ్వర చైతన్య స్వరూపం- ఆంజనేయస్వామి. రామాయణ గాథలో సీతారాములు, హనుమంతుడు పూర్ణ దేవతామూర్తులు. శ్రీరాముడి తరవాత హనుమకు అంతటి ప్రఖ్యాతి ఉంది. కార్య సాఫల్యం, మహా పరాక్రమం, లక్ష్యసాధనలో ఏకాగ్రత, కుశాగ్రబుద్ధి వంటి ఉదాత్త గుణాలకు ఆ కపి వీరుడు ప్రతీక. రామకార్య నిర్వహణలో నిరుపమాన భక్తిని, సుగ్రీవ అంగద జాంబవంతాది వానర వీరులతో మైత్రిని ఆయన ప్రదర్శించాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలపడంలో ధీరత్వాన్ని, రాక్షస సమూహాన్ని వధించడంలో అసమాన శూరత్వాన్ని చాటుకున్నాడు వాయునందనుడు! 
శ్రీమద్రామాయణంలోని కిష్కింధ కాండలో గోచరమైన హనుమ- సుందరకాండలో విరాట్‌రూపాన్ని చూపి, ఆపై యుద్ధకాండ ముగిసే వరకు కీలక భూమిక పోషించాడు. లంకలో సీతను దర్శించి, ఆమె శోకాన్ని నివారించి అభయాంజనేయుడు అయ్యాడు. జానకి జాడను రాముడికి తెలిపి ఆనందాంజనేయుడిగా కీర్తి గడించాడు. కర్తవ్య దీక్ష చూపి, వానరజాతికి సార్థకత చేకూర్చి ప్రసన్నాంజనేయుడిగా వర్ధిల్లాడు. శ్రీరామదూతగా, నిరంతరమూ రామ చరణ సేవాతరంగిణిలో పునీతమైన దాసాంజనేయుడిగా ఖ్యాతి పొందాడు. అందరి సంకటాల్ని నివారించి, సర్వులకూ ఆహ్లాదం చేకూర్చి ప్రమోదాంజనేయుడిగా నిలిచాడాయన.
 
కర్మయోగిగా, మహావీరుడిగా, అనంత సుగుణాల రాశిగా ఆంజనేయస్వామి ప్రస్ఫుటమవుతాడు. ‘హనుమాన్‌ వాక్య కోవిదః’ అని మారుతిని వాల్మీకి అభివర్ణించాడు. వాక్కు అంటే, కేవలం మాట కాదు. అది ఎన్నో అంశాల సమ్మేళనం. బుద్ధిశక్తి, విశేష జ్ఞానం, దాన్ని వ్యక్తీకరించే నైపుణ్యం, నిశిత పరిశీలన, పదునైన ఆలోచన, సమయోచిత ప్రవర్తన, సందర్భోచిత ప్రసంగం... ఇలా ఎన్నో అంశాలు ‘వాక్కు’తో మమేకమై ఉంటాయి. ఈ లక్షణాలన్నింటినీ హనుమ తన కార్యసాధన పరంపరలో చూపించాడు.

 
మంత్రశాస్త్రపరంగా హనుమ నామధేయం- సుందరుడు. ఆ సుందరత్వాన్ని ఆయన త్రికరణశుద్ధిగా ప్రకటించాడు. మనోసంకల్పం, వాక్కు, కర్మాచరణలో ఆంజనేయుడిగా వ్యక్తమయ్యాడు. రాక్షస సంహారంలో నృసింహ తత్వాన్ని, జ్ఞానవంతుడిగా హయగ్రీవ అంశను, అనంత వేగ శక్తిలో గరుత్మంతుడి బలిమిని ప్రదర్శించాడు. సజ్జన శుభంకరుడిగా, దుర్జన భయంకరుడిగా విశ్వరూపం ప్రదర్శించి పంచముఖ ఆంజనేయుడిగా తేజరిల్లాడు. ఆ మహాశక్తికి సంకేతాలు అనేక విగ్రహాకృతుల్లో ప్రతిఫలిస్తున్నాయి.


శ్రీమదాంజనేయ కల్యాణము
శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి  అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.

ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , " ఆ కన్య ఎవరు ? " అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.

బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , " గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి " అంటాడు. " శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను... విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ " అంటాడు సూర్యుడు. హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , " దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? " అని అడుగుతాడు.

సూర్యుడు ఉత్తరమిస్తాడు , " సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ,  ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు.  నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో, కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది.

సందేహ నివృత్తి అయిన హనుమంతుడు ,  సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము జ్యేష్ఠ శుద్ధ దశమి. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను, పంచామృతములతోను కూడా హనుమంతుడికి అభిషేకము, విగ్రహ శోధన చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు.

Saturday, November 24, 2018

గురూజీ నివాసంలో వైభ‌వంగా కార్తీక దీపాలంక‌ర‌ణ మ‌హోత్స‌వం



కార్తీక పౌర్ణ‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గురువుగారు శ్రీ‌మాన్ శృంగారం సింగ‌రాచార్యులుగారు లోక‌క‌ల్యాణాన్ని, త‌న శిష్య‌ప‌రంప‌ర‌లోని అంద‌రి అభ్యున్న‌తిని కాంక్షిస్తూ ఏక దివ‌స సుంద‌ర‌కాండ‌, కార్తీక దీపాలంక‌ర‌ణ అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. తెల్ల‌వారుఝామునే లేచి స్నానాదులు ముగించుకుని 5 గంట‌ల స‌మ‌యంలో ప్రారంభించిన ఏక‌దివ‌స సుంద‌ర‌కాండ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు సాగింది. అనంత‌రం వారి ఇంటి ముందున్న ఖాళీ స్థ‌లంలో దీపాల‌ను శ్రీ‌రాం, స్వ‌స్తిక్‌, ఓంకార రూపంలో అలంక‌రించారు. సాయంత్రం ఆరు గంట‌ల త‌ర్వాత సూర్యాస్త‌మ‌యం అయిన అనంత‌రం అక్క‌డ‌కు వ‌చ్చిన భ‌క్తులంద‌రి చేత సంక‌ల్పం చేయించి దీపాల‌ను వెలిగింప‌చేశారు. శ్రీ‌రాం, స్వ‌స్తిక్‌, ఓంకారాలు అద్భుత‌మైన కాంతులీన‌డంతో పాటు ఎదురుగా అమ‌ర్చిన శ్రీ‌రామ ప‌ట్టాభిషేక చిత్ర‌ప‌టంలో ఎంతో చ‌క్క‌గా ప్ర‌తిబింబించాయి. ఆ వైభ‌వాన్ని చూసేందుకు రెండు క‌న్నులు చాల‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. కొంత సేపు దీపాలు అలా ప్ర‌జ్వ‌లింప‌చేసిన త‌ర్వాత ఉద‌యం తానే స్వ‌యంగా త‌యారుచేసిన పులిహోర‌ను అంద‌రికీ ప్ర‌సాదంగా ఇచ్చి అమ్మ‌గారి స‌మేతంగా అశీస్సులు అంద‌చేసి వీడ్కోలు ప‌లికారు. ఆ దీపాలు వెలిగించి, ఆ వెలుగులు క‌ళ్లారా  చూసిన వారు ధ‌న్యులు. ఆ వైభ‌వాన్ని ఒక చిన్న వీడియోగా రూపొందించి అంద‌చేస్తున్నాను.
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు

Saturday, November 3, 2018

కొండ‌గ‌ట్టు యాత్ర ఘ‌న విజ‌యం

మనము విజయము సాధించాము. శ్రీ మారుతి కోటినామాలతో కొండగట్టుకు యాత్ర సఫలమైనది. యాత్రకు రాని మన సుందరకాండ భక్తులనిమిత్తము అక్కడ జరిగిన  విశేషాలతో కూడిన రెండు పేజీల నివేదికను సిద్దము కావించాము. మన సుందకాండ సభ్యులు తీసిన ఫొటోలను మరియు వీడియోలను కూడ పొందు పరిచాము . నివేదికను  అత్యంత శ్రద్ధతో పూర్తిగా చదవండి.  ఫొటోలను వీడియోలను అవసరమైతే జూమ్ చెస్తూ చూడండి. స్వామివారి మూలవిరాట్టుని ఆయన పాడాలవద్ద ఉంచిన మారుతి కోటి ప్రతులను జూమ్ చేసి చూడండి.  మన  సుందరకాండలొ మరొక విశేషాన్ని నమోదు చేసుకున్నాము. ఇది అత్యంత ఆనంద సమయము. సుందరకాండ భక్త బృందం పండగ చేసుకోవలసిన శుభ సమయము.
- శృంగారం సింగ‌రాచార్యులు
(స‌వివ‌ర‌మైన నివేదిక రేపు ప్ర‌చురించ‌డం జ‌రుగుతుంది)...



















Sunday, August 12, 2018

తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌ర‌లోని 26వ సుంద‌ర‌కాండ‌



సుదీర్ఘ విరామం అనంత‌రం గురూజీ మ‌ళ్లీ రంగ‌ప్ర‌వేశం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి సుంద‌ర‌కాండ‌లు ప్రారంభిస్తున్నారు. క‌ళ్ల శ‌స్త్ర చికిత్స అనంత‌రం తొలి సుంద‌ర‌కాండ, మూడో అష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌లోని 26వ సుంద‌ర‌కాండ స‌త్యాన‌గ‌ర్ లోని గాడేప‌ల్లి అనిల్ కుమార్‌, క‌ల్ప‌న దంప‌తుల నివాసంలో ప్రారంభించ‌బోతున్నారు. ఆ సుంద‌ర‌కాండ ఆహ్వానం ఇక్క‌డ ప్ర‌చురిస్తున్నాము.