Wednesday, November 20, 2019

కార్తీక పురాణం- 23వ రోజు పారాయ‌ణం  (బ‌హుళ అష్ట‌మి రోజున‌)

వీర‌భ‌ద్రుని మూర్ఛ‌తో వెర్రెత్తిపోయిన శివ‌సేన పొలోమంటూ ప‌రుగు తీసి పుర‌హ‌రుని శ‌ర‌ణు వేడింది. అభ‌యుడైన శివుడు అస‌లేమీ జ‌ర‌గ‌న‌ట్టుగానే చిరున‌వ్వు చిందిస్తూ త‌న నంది వాహ‌నాన్ని అధిష్ఠించి ర‌ణ‌భూమికి బ‌య‌లుదేరాడు. అంత‌వ‌ర‌కు భ‌య‌కంపితులైన స‌మ‌స్త గ‌ణాల వారూ కూడా శివ‌సంద‌ర్శ‌న‌తో ధైర్య‌వంతులై తిరిగి ర‌ణ‌భూమిలో ప్ర‌వేశించారు. నంది వాహ‌నారూఢుడై వ‌స్తున్న శివుని చూడ‌గానే కార్తీక వ్ర‌త‌స్థుని చూపి పారిపోయే పాపాల వ‌లె రాక్ష‌సులంతా పారిపోసాగారు. జ‌లంధ‌రుడు చండీశ్వ‌రునితో త‌ల‌ప‌డ్డాడు. శుంభ‌నిశుంభ, కాల‌నేమి, అశ్వ‌ముఖ‌, బ‌లాహ‌క‌, ఖ‌డ్గ‌రోమ‌, ప్ర‌చండ‌, ఘ‌స్మ‌రాది రాక్ష‌స నాయ‌కులంద‌రూ ఒక్కుమ్మ‌డిగా ఈశ్వ‌రునితో త‌ల‌ప‌డ్డారు. స‌ర్వేశ్వ‌రుడైన శివునికి వీరేపాటి?  ఆయ‌నొక గండ్ర‌గొడ్డ‌లితో ఖ‌డ్గ‌రోముని శిర‌స్సు న‌రికేశాడు. బ‌లాహ‌కుడి త‌ల‌ను రెండు చెక్క‌లు చేశాడు. పాశ‌ప్ర‌యోగంతో ఘ‌స్మ‌రుని నేల కూల్చాడు. ఈ లోప‌ల శివ‌వాహ‌న‌మైన వృష‌భం శృంగ ఘాతాల‌కి అనేక మంది రాక్ష‌సులు య‌మ‌లోకానికి చేరారు. శివ‌ప్ర‌తాపంతో చిల్లులు ప‌డిపోయిన త‌న సేనా చ‌క్రాన్ని చూసుకుంటూ జ‌లంధ‌రుడు స‌రాస‌రి రుద్రుడినే త‌న‌తో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన‌సూచ‌కంగా ప‌ది బ‌ల‌మైన బాణాల‌తో ప‌శుప‌తిని గాయ‌ప‌రిచాడు. అయినా శివుని ముఖంలో చిరున‌వ్వు మాయ‌లేదు. ఆ మంద‌హాసంతోనే జ‌లంధ‌రుడినీ, అశ్వాల‌ను, ర‌థాన్ని, జెండాను, ధ‌నుస్సునీ న‌రికేశాడు. ర‌థ‌హీనుడైన రాక్ష‌సుడు ఒక గ‌ద తీసుకుని గంగాధ‌రుని మీద‌కు రాబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్లు వెన‌క్కి ప‌డేలా కొట్టాడు. అంత‌టితో ఈశ్వ‌రుడు త‌న క‌న్నా బ‌ల‌వంతుడ‌ని గుర్తించిన జ‌లంధ‌రుడు స‌ర్వ‌స‌మ్మోహ‌న‌క‌ర‌మైన గంధ‌ర్వ మాయ‌ను ప్ర‌యోగించాడు. నాద‌మూర్తి అయిన న‌ట‌రాజు మోహితుడ‌య్యాడు. గంధ‌ర్వ‌గానాలు, అప్స‌ర‌స‌ల నాట్యాలు, దేవ‌గ‌ణ వాద్య ఘోష‌ల‌తో ఆయ‌న స‌మ్మోహితుడైపోయాడు. ఆ మోహంతో ఆయ‌న ధ‌రించిన స‌మ‌స్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే ఆయ‌న‌లా మోహితుడైపోయాడో త‌క్ష‌ణ‌మే జ‌లంధ‌రుడు శుంభ‌నిశుంభులిద్ద‌రినీ యుద్ధంలో నిల‌బెట్టి తాను పార్వ‌తీ ప్ర‌లోభంతో శివ‌మందిరానికి బ‌య‌లుదేరాడు. వెళ్లేముందు శివ‌స్వ‌రూపాన్ని ఏకాగ్రంగా అవ‌లోకించాడు. మాయ త‌ప్ప బ‌లం ప‌నికిరాద‌ని గ్ర‌హించిన జ‌లంధ‌రుడు పంచ‌ముఖాల‌తోనూ, ప‌ది చేతుల‌తోనూ, జ‌ట‌ల‌తోనూ అచ్చం శివుడు ధ‌రించిన ఆయుధాలను పోలిన ఆయుధాల‌తో ఒకానొక మాయా వృష‌భం మీద శివ‌మందిర‌మైన పార్వ‌తీదేవి అంతఃపురానికి బ‌య‌లుదేరాడు.
అంత‌వ‌ర‌కు ప‌ర‌దృష్టి గోచ‌రం గాని పార్వ‌తి అలా వ‌స్తూ ఉన్న మాయా జ‌లంధ‌రుని కంట ప‌డింది. అందానికి మారుపేరైన ఆ పార్వ‌తిని చూస్తూనే జ‌లంధ‌రునికి వీర్య‌స్ఖ‌ల‌నం అయింది. ఎప్పుడైతే వాడు వీర్య‌స్ఖ‌ల‌నం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయావిద్య న‌శించిపోయింది. వాడు రాక్ష‌సుడ‌నే విష‌యం పార్వ‌తికి అర్ధ‌మైపోయింది. అంత‌టితో ఆమె అంత‌ర్హిత అయి మాన‌స స‌రోవ‌ర తీరాన్నిచేరి విష్ణువును ధ్యానించింది. త‌క్ష‌ణ‌మే ప్ర‌త్య‌క్ష‌మైన విష్ణుమూర్తి ఆమెను ఓదార్చి "త‌ల్లీ, పార్వ‌తీ వాడు చూపించిన తోవ‌లోనే నేను కూడా ప్ర‌యాణించాల్సి ఉంది. దిగులు ప‌డ‌కు" అని చెప్పాడు. "నీ పాతివ్ర‌త్య మ‌హిమ వ‌ల‌న ప‌శుప‌తి ఎలా జ‌యింప‌రాని వాడుగా ఉన్నాడో అలాగే ఆ జ‌లంధ‌రుని భార్య పాతివ్ర‌త్య మ‌హిమ వ‌ల‌న వాడు కూడా జ‌యింప‌రానివాడుగా త‌యార‌య్యాడు. వాడు నీ ప‌ట్ల రాక్ష‌స మాయ‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్టే వాడి ఇల్లాలి ముందు నేను నా విష్ణుమాయ‌ను ప్ర‌యోగిస్తాను" అని ధైర్యం చెప్పి రాక్ష‌స లోకానికి బ‌య‌లుదేరాడు.
పంచ‌ద‌శోధ్యాయ స‌మాప్తః
-------------------------- 
ఆ విధంగా విష్ణువు బ‌య‌లుదేరిన క్ష‌ణం నుంచి జ‌లంధ‌రుని భార్య బృంద‌కు దుస్వ‌ప్నాలు క‌లుగ‌సాగాయి. జ‌లంధ‌రుడు దున్న‌పోతు మీద ఎక్కి తిరుగుతున్న‌ట్టు, దిగంబ‌రుడైన‌ట్టు, ఒళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్న‌ట్టు, న‌ల్ల రంగు పూల‌తో అలంకృతుడైన‌ట్టు, పూర్తిగా ముండ‌నం చేయించుకున్న‌ట్టు, ద‌క్షిణ దిక్కుగా ప్ర‌యాణిస్తున్న‌ట్టు, త‌న‌తో స‌హా ప‌ట్ట‌ణం అంతా స‌ముద్రంలో మునిగిపోతున్న‌ట్టు క‌ల‌లు వ‌చ్చాయి. అంత‌లోనే మేల్కొన్న బృంద ఉద‌య సూర్యుని ద‌ర్శించి తాను చూసిన‌ది క‌లే అయినా అశుభ‌మ‌ని చింతించ‌సాగింది. అది మొద‌లు ఆమెకు మ‌నశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని త‌ల‌బోస్తూ అస్థిర‌మ‌తియై తిర‌గ‌సాగింది. ఆ విధంగా ఒకానొక వేళ వ‌న‌విహారం చేస్తూ ఉండ‌గా సింహం వంటి ముఖాలు క‌లిగిన ఇద్ద‌రు రాక్ష‌సులు క‌నిపించారు. వారిని చూసి భీతిల్లిన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వ‌నంలోనే శిష్య‌స‌మేతంగా ఉన్న ఒకానొక ముని కంఠాన్ని చుట్టుకుని "ఓ మునివ‌ర్యా ర‌క్షించండి. నాకు మీరే శ‌ర‌ణు" అని కేక‌లు వేయ‌సాగింది. అప్పుడా ముని భ‌య‌గ్ర‌స్త అయిన ఆమెను, ఆమె వెన్నంటి వ‌స్తున్న ర‌క్క‌సుల్ని చూసి ఒక్క హుంకారం చేత ఆ రాక్ష‌సులు పారిపోయేలా చేశాడు. అంత‌టితో ధైర్యం వ‌చ్చిన బృంద ఆ మునికి ప్ర‌ణ‌మిల్లి "ఓ ఋషీంద్రా, ఈ గండం నుంచి న‌న్ను కాపాడిన ద‌యాళుడివి. నా సంశ‌యాలు కొన్ని మీ ముందుంచుతున్నాను. నాన భ‌ర్త జ‌లంధ‌రుడు ఈశ్వ‌రునితో యుద్ధానికి వెళ్లాడు. అక్క‌డ ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉందో ద‌య‌చేసి నాకు తెలియ‌చేయండి" అని వేడుకుంది. 
క‌రుణాక‌ర‌మైన దృష్టులు ప్ర‌స‌రింప‌చేస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంట‌నే ఇద్ద‌రు వాన‌రులు వ‌చ్చారు. ముని వారికి క‌నుబొమ‌ల‌తోనే క‌ర్త‌వ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మ‌ర‌ల ఆకాశానికి ఎగిరి అతి స్వ‌ల్ప‌కాలంలోనే న‌రికివేత‌కు గురైన జ‌లంధ‌రుని చేతులు, మొండెం, త‌ల తెచ్చి వారి ముందుంచారు. త‌న భ‌ర్త ఖండితావ‌య‌వాల‌ను చూసి బృంద ఘొల్లుమ‌ని ఏడ్చింది. అక్క‌డే ఉన్న ఋషి పాదాల‌పై ప‌డి త‌న భ‌ర్త‌ను బ‌తికించాల్సిందిగా ప్రార్థించింది. అందుకా ముని న‌వ్వుతూ "శివోప‌హ‌తులైన వారిని బ‌తికించ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ ప‌ట్ల ఏర్ప‌డిన అవ్యాజ‌మైన క‌రుణ వ‌ల‌న త‌ప్ప‌క బ‌తికిస్తాను" అంటూ అంత‌ర్హితుడ‌య్యాడు. ఖిన్నురాలైన బృంద‌ను కౌగ‌లించుకుని ఆమె ముఖాన్ని ప‌దేప‌దే ముద్దాడాడు. పున‌రుజ్జీవితుడైన భ‌ర్త ప‌ట్ల అనురాగంతో బృంద పుల‌కించిపోయింది. వారిద్ద‌రూ ఆ వ‌నంలోనే వివిధ ర‌కాలుగా సుర‌త క్రీడ‌ల్లో మునిగిపోయారు. మ‌ర‌ణించిన భ‌ర్త తిరిగి వ‌చ్చాడనే ఆనందంలో బృంద వెంట‌నే గుర్తు ప‌ట్ట‌లేక‌పోయినా ఒకానొక సుర‌త సుఖానంత‌రం ఆమె అత‌నిని విష్ణుమూర్తిగా గుర్తించింది. "ఓ విష్ణుమూర్తీ ప‌ర స్ర్తీ గామివై నీ ప్ర‌వ‌ర్త‌న నిందింప‌బ‌డును గాక‌. నీ మాయ‌తో ఇతః పూర్వం క‌ల్పించిన వాన‌రులిద్ద‌రూ రాక్ష‌సులై జ‌న్మించి నీ భార్య‌నే హ‌రించెద‌రు గాక‌. నీవు భార్యావియోగ దుఃఖితుడ‌వై నీ శిష్యుడైన ఆదిశేషునితో స‌హా అడ‌వుల్లో తిరుగుతూ వాన‌ర స‌హాయ‌మే గ‌తి అయిన వాడివ‌గుదువు గాక" అని శ‌పించి త‌నకు చేరువ‌వుతున్న శ్రీ‌హ‌రి నుంచి త‌ప్పించుకుని అగ్ని వెలిగించుకుని అందులో ప‌డి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ బృంద‌నే స్మ‌రించ‌సాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె చితాభ‌స్మాన్ని త‌నువంతా పూసుకుని విల‌పించ‌సాగాడు. సిద్ధులు, ఋషులు ఎంద‌రు ఎంతగా చెప్పినా విష్ణుమూర్తి అశాంతితో అల్లాడిపోసాగాడు. 
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 15, 16 అధ్యాయాలు స‌మాప్తం
23వ రోజు పారాయ‌ణం ముగిసింది.

No comments:

Post a Comment