Saturday, November 9, 2019

కార్తీక పురాణం- 12వ రోజు పారాయ‌ణం   (శుక్ల ద్వాద‌శి రోజున‌)

చ‌తుర్వింశాధ్యాయం
అగ‌స్త్యా, కార్తీక శుక్ల ద్వాద‌శిని హ‌రిబోధిని అంటారు. ఆ ఒక్క ప‌ర్వ‌తిథీ వ్ర‌తాచ‌ర‌ణం చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫ‌లం, అన్ని విధాలైన య‌జ్ఞాల‌ను ఆచ‌రించిన ఫ‌లం ప్రాప్తిస్తాయి. విష్ణువు ప‌ట్ల‌, ఏకాద‌శి ప‌ట్ల భ‌క్తి, ఆస‌క్తి పెరుగుతాయి. సూర్య‌చంద్ర‌గ్ర‌హ‌ణ ప‌ర్వాల కంటె గొప్ప‌ది, ఏకాద‌శి కంటె వంద‌రెట్లు మ‌హిమాన్నివ‌త‌మైన‌ది ఈ ద్వాద‌శి. ఈ రోజున‌ ఏ పుణ్యం చేసినా, ఏ పాపం చేసినా అది కోటిరెట్లుగా మారుతుంది. ఈ ద్వాద‌శినాడు ఒక‌రికి అన్న‌దానం చేస్తే కోటి మందికి అన్న‌దానం చేసిన పుణ్యం, ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపం క‌లుగుతాయి. ఒక‌వేళ ద్వాద‌శి ఘ‌డియ‌లు త‌క్కువ‌గా ఉన్న ప‌క్షంలో ఆ స్వ‌ల్ప స‌మ‌య‌మైనా స‌రే పార‌ణ‌కు ఉప‌యోగించాలే గాని, ద్వాద‌శి దాటిన త‌ర్వాత పార‌ణం ప‌నికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవ‌రైనా స‌రే ఏ నియ‌మాన్ని అతిక్ర‌మించినా ఈ ద్వాద‌శి పార‌ణ‌ను మాత్రం విస‌ర్జించ‌కూడ‌దు. ఏకాద‌శి తిథి నాడు ఉప‌వాసం ఉండి ద్వాద‌శి తిథి దాటిపోకుండా పార‌ణ చేయాలి. త‌ద్వారా క‌లిగే శ్రేయ‌స్సును స్వ‌యంగా శేష‌సాయి చెప్పాలే త‌ప్ప శేషుడు కూడా చేప్ప‌లేడు. అందుకు అంబ‌రీషుని క‌థే ఉదాహ‌ర‌ణ‌. 

అంబ‌రీషోపాఖ్యానం
ద్వాద‌శి వ్ర‌తాచ‌ర‌ణ త‌త్ప‌రుడూ, ప‌ర‌మ‌భాగ‌వ‌తోత్త‌ముడూ అయిన అంబ‌రీషుడ‌నే మ‌హారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాద‌శి నాడు ఉప‌వ‌శించి మ‌ర్నాడు ద్వాద‌శి ఘ‌డియ‌లు స్వ‌ల్పంగా ఉన్న కార‌ణంగా తిథి దాట‌కుండానే పార‌ణ చేయాల‌నుకున్నాడు. అదే స‌మ‌యానికి దూర్వాస మ‌హ‌ర్షి విచ్చేసి ఆ నాటి ఆతిథ్యంలో త‌న‌కు కూడా భోజ‌నం పెట్టాల‌ని కోరాడు. అంబ‌రీషుడు ఆయ‌న‌ను ద్వాద‌శి పార‌ణ‌కు ఆహ్వానించాడు. త‌క్ష‌ణ‌మే దూర్వాసుడు స్నానాచ‌ర‌ణ‌, అనుష్ఠానం కోసం న‌దికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంత‌సేప‌టికీ రాక‌పోవ‌డంతో అంబ‌రీషుడు ఆతృత ప‌డ్డాడు. ఆ రోజు ద్వాద‌శి ఘ‌డియ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. కాలాతిక్ర‌మ‌ణం కాకుండా పార‌ణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వ‌చ్చే వ‌ర‌కు ఆగ‌డం గృహ‌స్థ ధ‌ర్మం. దానిని వ‌ద‌ల‌లేడు. ద్వాద‌శి దాట‌కుండా పార‌ణ చేయ‌డం ఈ వ్ర‌త ధ‌ర్మం. దాన్ని వ‌దులుకోలేడు.
శ్లో - హ‌రిభ‌క్తి ప‌రిత్యాగో ద్వాద‌శీ త్యాగ‌తో భ‌వేత్‌
య‌తో2నుపోషితే భూయాత్ కృత్వాశ‌మ్యగ్ పోష‌ణం
పూర్వం ద్వాద‌శ సంఖ్యాకే పురుషౌ హ‌రివాస‌రే
పాప‌ముల్లంఘ‌నే పాపాత్ నైవ యుజ్యం మ‌నీషిణా
ద్వాద‌శీ వ్ర‌తాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభ‌క్తిని విస‌ర్జించిన వాడ‌వుతాడు. ఏకాద‌శినాడు ఉప‌వాసం చేయ‌క‌పోతే ఎంత పాపం క‌లుగుతుందో ద్వాద‌శినాడు పార‌ణ చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న అంత‌కు రెట్టింపు పాపం క‌లుగుతుంది. అంతే కాదు, ఒక్క ద్వాద‌శీ పార‌ణాతిక్ర‌మ‌ణ వ‌ల‌న ఆ నాటి వ్ర‌త‌ఫ‌లంతో పాటుగానే అంత‌కు పూర్వం చేసిన ప‌న్నెండు ద్వాద‌శీ పార‌ణ‌ల మ‌హాపుణ్యం కూడా హ‌రించుకుపోతుంది. జ‌న్మ‌జ‌న్మాంత‌ర పుణ్య‌బ‌లం క్షీణిస్తుంది. అన్నింటి క‌న్నా ముఖ్యంగా ద్వాద‌శ్య‌తిక్ర‌మ‌ణం వ‌ల‌న విష్ణువిరోధ భీతి ఏర్ప‌డుతుంది. అందువ‌ల‌నే ప్రాణావ‌సాన‌మైనా స‌రే ద్వాద‌శి పార‌ణ చేయ‌డ‌మే క‌ర్త‌వ్యం. త‌ద్వారా సంక్ర‌మించే బ్రాహ్మ‌ణ శాపం వ‌ల‌న క‌ల్పాంత దుఃఖ‌మే క‌లుగుతుంది. దూర్వాసుని వంటి అతిథి ఉన్న‌ప్ప‌టికీ ద్వాద‌శీ తిరోగ‌మ‌నానికి ముందే పార‌ణ చేసి హ‌రిభ‌క్తిని నిలుపుకున్న‌ట్ట‌యితే అతిథి ఉల్లంఘ‌న వ‌ల‌న ఏర్ప‌డే క‌ష్టాల‌ను కూడా ఆ క‌మ‌ల‌నాభుడే క‌డ‌తేరుస్తాడు. ఇలా త‌న మ‌న‌సులో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి కూడా ధ‌ర్మ‌వ‌ర్త‌నుడైన ఆ అంబ‌రీషుడు ద్వాద‌శి 
పార‌ణార్ధం త‌న‌ను ప‌రివేష్ఠించి ఉన్న వేద‌విదుల‌కు త‌న ధ‌ర్మసందేహాన్ని తెలియ‌చేశాడు.

అంబ‌రీషుని మ‌నోవ్య‌థ‌  
అంబ‌రీషుని స‌మ‌స్య విన్న వేద‌స్వ‌రూపులైన ఆ విప్రులుక్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే శృతిస్మృతి శాస్ర్త‌ పురాణాల‌న్నింటినీ మ‌ననం చేసుకుని మ‌హారాజా ఆ స‌ర్వేశ్వ‌రుడైన భ‌గ‌వంతుడు స‌ర్వ జీవుల యందునా జ‌ఠ‌రాగ్ని రూపంలో ప్ర‌క్షిప్త‌మై ఉంటున్నాడు. ఆ జ‌ఠ‌రాగ్ని ప్రాణ‌వాయువు చేత ప్ర‌జ్వ‌ల‌నం కావ‌డం వ‌ల‌ననే జీవుల‌కు ఆక‌లి క‌లుగుతోంది. దాని తాప‌మే క్షుత్పిపాసా బాధ‌గా వ్య‌వ‌హారంలో ఉంది. కాబ‌ట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప‌చేయ‌డ‌మే జీవ‌ల‌క్ష‌ణం. జీవులు స్వీక‌రించే భ‌క్ష్య‌, భోజ్య‌, చోష్య‌, లేహ్య రూప అన్నాదుల‌ను వారిలోని అగ్ని మాత్ర‌మే భుజిస్తున్నాడు. జీవులంద‌రిలోనూ ఉన్న జ‌ఠ‌రాగ్ని జ‌గ‌న్నాథ స్వ‌రూపం క‌నుక‌నే 
శ్లో - అథ‌శ్వ‌పాకం శూద్రం వాస్వ‌న్య స‌ద్మాగ‌తం శుభం
అతిక్ర‌మ్య న భుంజీత గృహ‌మేద్య‌తిథి నిజం
ఇంటికి వ‌చ్చిన వాడు శూద్రుడైనా స‌రే, ఛండాలుడైనా స‌రే ఆ అతిథిని వ‌దిలి ఆ గృహ‌స్థు భోజ‌నం చేయ‌కూడ‌దు. అలాంటిది స్వ‌యంగా బ్రాహ్మ‌ణుడే అతిథిగా వ‌స్తే అత‌నిని విస్మ‌రించ‌డం అథ‌మాథ‌మం అని వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు క‌దా. పైగా తానే స్వ‌యంగా ఆహ్వానించిన బ్రాహ్మ‌ణుని కంటె ముందుగా తానే భోజ‌నం చేయ‌డం బ్రాహ్మ‌ణావ‌మాన‌మే అవుతుంది. భూవ‌రా, భూసురావ‌మాన‌వ వ‌ల‌న ఆయుష్షు, ఐశ్య‌ర్యం, కీర్తి, ధ‌ర్మం న‌శించిపోతాయి. మ‌న‌స్సంకాల్పాలు తిరోహితాలైపోతాయి. బ్రాహ్మ‌ణుడు స‌ర్వ‌దేవ‌తా స్వ‌రూపుడుగా చెప్ప‌బ‌డి ఉండ‌డం వ‌ల‌న బ్రాహ్మ‌ణావ‌మానం స‌ర్వ‌దేవ‌త‌ల‌నూ అవ‌మానించ‌డంతో స‌మాన‌మ‌వుతుంది. జాతి మాత్రం చేత‌నే బ్రాహ్మ‌ణుడు దేవ‌తాతుల్యుడై ఉండ‌గా కేవ‌లం జ‌న్మ వ‌ల‌నే కాకుండా జ్ఞానం, త‌పోమ‌హిమ వ‌ల‌న శుద్ధ రుద్ర రూపుడుగా కీర్తినందుకునే దూర్వాసుని వంటి ఋషిని భోజ‌నానికి పిలిచి ఆయ‌న క‌న్నా ముందే పార‌ణ చేయ‌డం ధ‌ర్మ‌మ‌ని చెప్ప‌లేము. కోపిష్ఠి అయిన ఆ ఋషి శ‌పిస్తాడ‌నే భ‌యాన్ని ప‌క్క‌కు నెట్టి చూసినా గాని
శ్లో - వ‌యం న నిశ్చ‌యం క్వాపి గ‌చ్ఛామో న‌ర‌పుంగ‌వ‌
త‌థాపి ప్ర‌థ‌మం విప్రాద్భోజ‌నం న ప్ర‌కీర్తితం
బ్రాహ్మ‌ణాతిథి క‌న్నా ముందు భుజించ‌డం కీర్తిక‌ర‌మైన‌ది మాత్రం కాదు.
ధ‌ర‌ణీపాలా, ద్వాద‌శీ పార‌ణా ప‌రిత్యాగం వ‌ల‌న, త‌త్పూర్వ దిన‌మైన ఏకాద‌శ్యుప‌వాసానికి భంగం క‌లుగుతుంది. ఆ ఏకాద‌శి వ్ర‌త‌భంగానికి ప్రాయ‌శ్చిత్త‌మ‌నేదే లేదు. ఇలా బ్రాహ్మ‌ణాతిథిని అతిక్ర‌మించ‌డం వ‌ల‌న విప్ర ప‌రాభ‌వానికి కూడా విరుగుడు లేదు. రెండూ స‌మ‌తూకంలోనే ఉన్నాయి.
చ‌తుర్వింశోపాధ్యాయ స‌మాప్తః
--------------
పంచ‌వింశాధ్యాయం
విప్రుల ధ‌ర్మ‌బోధ 
అంబ‌రీషా, పూర్వ‌క‌ర్మానుసారం నీకిప్పుడు రెండు ప‌క్క‌ల నుంచి కంఠాన్ని చుట్టుకుని ఉన్న తాడులా ఈ ధ‌ర్మ‌సంక‌టం ప్రాప్తించింది. దూర్వాసుడు వ‌చ్చే వ‌ర‌కు ఆగాలో లేదా ద్వాద‌శీ ఘ‌డియ‌లు దాట‌కుండా పార‌ణ చేయాలో ఏదీ నిశ్చ‌యంగా చెప్ప‌డానికి మేము అశ‌క్తుల‌పైపోతున్నాము.
శ్లో- స్వ‌బుధ్యాతు స‌మాలోక్య కురుత్వం త‌వ నిశ్చ‌యం
కాబ‌ట్టి ఆత్మ‌బుద్ధి సుఖం చైవ అనే సూత్రం అనుస‌రించి భారం ఆ భ‌గ‌వంతుడి మీద పెట్టి తోచిన దానిని నువ్వాచ‌రించు అన్నారు. బ్రాహ్మ‌ణుల మాట‌లు విన‌గానే అంబ‌రీషుడు ఓ బ్రాహ్మ‌ణులారా, బ్రాహ్మ‌ణ శాపం క‌న్నా విష్ణుభ‌క్తిని విడిచి పెట్ట‌డ‌మే ఎక్కువ క‌ష్టంగా భావిస్తున్నాను.
శ్లో - క‌ర్తుం సాధ్యం య‌థాకాలం ద్వాద‌శ్య‌ద్భిస్తు పార‌యేత్
కృతావ‌కాశ వ‌త్ప‌శ్చాత్ భుం జీత్యేత్య‌ప‌రే జ‌గుః
శృతులు ప్ర‌క‌టించిన ప్ర‌మాణం చేత ప్ర‌స్తుతం నేను కాసిని మంచినీళ్లు తాగుతాను. అందువ‌ల్ల అతిథి న్నా ముందు అన్నం తిన్న దోషం రాదు. ద్వాద‌శి ఘ‌డియ‌లు దాట‌కుండా ఆహారం తీసుకున్న పార‌ణ ఫ‌లిత‌మూ ఉంటుంది. ఇందువ‌ల‌న దూర్వాసుడు శ‌పించే అవ‌కాశ‌మూ ఉండ‌దు. నా జ‌న్మాంత‌ర పాప‌మూ న‌శిస్తుంది. ఇదే నా నిర్ణ‌యం అన్నాడు.
అనంత‌రం వారి ఎదుట‌నే స్వ‌ల్పంగా జ‌లం స్వీక‌రించాడు. నోటి ద‌గ్గ‌ర నీటి పాత్ర‌నింకా నేల‌మీద పెట్ట‌నైనా లేదు, అదే స‌మ‌యంలో అక్క‌డ దూర్వాసుడు అడుగు పెట్టాడు. చేతిలో జ‌ల‌పాత్ర‌తో ఉన్న రాజును చూడ‌గానే జ‌రిగిందేమిటో గ్ర‌హించాడు. చూపుల‌తోనే కాల్చేస్తాడా అన్న‌ట్టు చుర‌చురా చూశాడు. మాట‌లతోనే మార‌ణ‌హోమం చేస్తాడా అన్న‌ట్టు రేరే దుర‌హంకారపూరిత రాజాథ‌మా, అతిథినైన నేను లేకుండానే ద్వాద‌శి పార‌ణ చేస్తావా?
శ్లో - అస్నాత్వాతుమ‌లం భుంక్తే - అద‌త్వాఘంతు కేవ‌లం
యో నిమంత్రితాతిథిః పూర్వం మోహాద్భుంక్తేత‌తోథ‌మః
మ‌లాశీస‌తు విజ్ఞేయః క్రిమినిష్ఠాగ‌తోయ‌థా
భుంజ‌తేత్వ‌ఘం పాపాయే ప‌చంత్యాత్మ‌కార‌ణాత్ 
అతిథ్య‌ర్ధంచ ప‌క్వం యే భుంజ‌తేతే త్వ‌ఘాథ‌మ‌మ్‌
స్నానం చేయ‌కుండా భోజ‌నం చేసే వాడు మ‌ల‌భోజి అవుతాడు. ప‌రునికి పెట్ట‌కుండా తానొక్క‌డే తినే వాడు పాప‌భోజి అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి ముందుగా త‌నే భోజ‌నం చేసే వాడు అశుద్ధంలో పురుగులా మ‌లాశి అవుతాడు. ప‌క్వ‌మైనది గాని, ఫ‌లం గాని, నీళ్లు గాని భోజ‌నార్ధంగా భావించి సేవించిన‌ది ఏదైనా స‌రే అన్నంతో స‌మాన‌మే అవుతుంది. అందువ‌ల‌న నీ అంగీకృతుడ‌నైన అతిథిని నేను రాకుండానే నా కన్నా ముందు అన్న‌ప్ర‌తినిధిగా జ‌ల‌పార‌ణం చేశావు. బ్రాహ్మ‌ణ తిర‌స్కారివైన నీవు బ్రాహ్మ‌ణ ప్రియుడైన విష్ణువుకి భ‌క్తుడు ఎలా అవుతావు. "య‌థాపురోథ‌స‌న్స్వ‌శ్య మ‌ద‌మోహాన్మ‌హీప‌తే" నీ పురోహితుడు చెప్పిన‌ట్టు కాకుండా మ‌రో విధంగా ఆచ‌రించే మ‌ద‌మోహితుడులా ప్ర‌వ‌ర్తించావు నీవు అన్నాడు దూర్వాసుడు.

ఆ ఆగ్ర‌హానికి భ‌య‌కంపితుడైన అంబ‌రీషుడు దోసిలి ప‌ట్టిన వాడై మునీంద్రా నేను పాపినే. ప‌ర‌మ నీచుడినే. అయినా నిన్ను శ‌ర‌ణు కోరుతున్నాను. నేను క్ష‌త్రియుడ‌ను గ‌నుక ఏ అభిజాత్యాహంకారం వ‌ల్ల‌నో త‌ప్పు చేశాను. కాని నువ్వు బ్రాహ్మ‌ణుడైన కార‌ణంగా శాంతం వ‌హించు. న‌న్ను ర‌క్షించు. అని పాదాల మీద ప‌డి ప్రార్థించాడు. అయినా స‌రే దూర్వాసుని కోపం త‌గ్గ‌లేదు. మ‌ణిమ‌కుటాన్ని ద‌రించే ఆ అయోధ్యాప‌తి శిర‌స్సును ఎడ‌మ కాలితో త‌న్నేశాడు. ర‌వ్వంత ఎడంగా వెళ్లి ఎవ‌రికైనా కోసం వ‌చ్చిన‌ప్పుడు ప్రార్థిస్తే వాళ్లు శాంతువ‌లుతారు. కాని నేన‌లాంటి వాడిని కాను. నాకు కోపం వ‌స్తే శాపం పెట్ట‌కుండా ఉండ‌ను. చేప‌గానూ, తాబేలుగానూ, పందిగానూ, మ‌రుగుజ్జువానిగానూ, వికృత‌మైన ముఖం క‌ల‌వానిగానూ, క్రూరుడైన బ్రాహ్మ‌ణునిగాను, జ్ఞాన‌శూన్యుడైన క్ష‌త్రియునిగానూ, అధికారం లేని క్ష‌త్రియునిగానూ,  దురాచార భూయిష్ట‌మైన పాషండ‌మార్గ‌వేదిగానూ, నిర్ద‌యాపూర్వ‌క బ్రాహ్మ‌ణ హింస‌కుడైన బ్రాహ్మ‌ణునిగానూ ప‌ది జ‌న్మ‌ల‌ను (గ‌ర్భ న‌ర‌కాలు) అనుభ‌వించు అని శ‌పించాడు. అప్ప‌టికే బ్రాహ్మ‌ణ శాప‌భ‌యంతో అవాక్క‌యి ఉన్న అంబ‌రీషుడు అంత్య‌ద‌శ‌లో అయినా శ్రీ మ‌హావిష్ణువు క‌ల్పాంత‌ర కాల లోక క‌ల్యాణార్ధం బ్రాహ్మ‌ణ వాక్యాన్ని తిర‌స్క‌రించ‌కూడ‌ద‌నే త‌న వ్ర‌తం వ‌ల‌న ఆ ప‌ది జ‌న్మ‌ల శాపాన్ని తానే భ‌రించ‌ద‌ల‌చి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటీ రాజు, వీనికింకా పెద్ద శాపం ఇవ్వాలి అని మ‌రోసారి దూర్వాసుడు నోరు తెర‌వ‌బోయాడు. కాని స‌ర్వ‌జ్ఞుడైన శ్రీ‌హ‌రి దూర్వాసుడి నోట ఇంకో శాం వెలువ‌డ‌కుండానే భ‌క్తుడైన అంబ‌రీషుని ర‌క్ష‌ణార్ధం జ‌గ‌దేక శ‌ర‌ణ్యం, జ‌గ‌దేక భీక‌రం అయిన త‌న ఆయుధ‌మైన సుద‌ర్శ‌న చ‌క్రాన్ని వ‌ద‌ల‌డంతో అక్క‌డి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని అది ఆవ‌హించి దూర్వాసుని వైపు క‌దిలి రాసాగింది. అది చూడ‌గానే దూర్వాసుడు తుళ్లి ప‌డ్డాడు. ఆ చ‌క్రానికి చిక్క‌కూడ‌ద‌ని భూచ‌క్ర‌మంతా క్ష‌ణాల్లో ప‌రిభ్ర‌మించాడు. అయినా సుద‌ర్శ‌నం అత‌నిని త‌రుముతూనే ఉంది. భీతావ‌హుడైన ఆ దూర్వాసుడు వ‌శిష్ఠాది బ్ర‌హ్మ‌ర్షుల‌ను, ఇంద్రాది అష్ట దిక్పాల‌కుల‌ను, చిట్ట‌చివ‌రికి శివ బ్ర‌హ్మ‌ల‌నీ శ‌ర‌ణు కోరాడు. కాని అత‌ని వెన‌కాలే విహ్వ‌ల మ‌హాగ్ని జ్వాల‌లు వెద‌జ‌ల్లుతూ వ‌స్తున్న విష్ణుచ‌క్రాన్ని చూసి ఎవ‌రికి వారే త‌ప్పుకున్నారు త‌ప్ప తెగించి ఎవ‌రూ ఎలాంటి అభ‌యం ఇవ్వ‌లేదు. 
పంచ‌వింశోధ్యాయ స‌మాప్తః
-------------- 
షడ్వింశాధ్యాయం
ఈ విధంగా ప్రాణ‌భీతుడైన దూర్వాసుడు సంభ‌విత లోకాల‌న్నీ సంచ‌రించి చివ‌రికి చ‌క్ర‌పాణి శ్రీ మ‌హావిష్ణు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మ‌ణ ప్రియా, మాధ‌వా, మ‌ధుసూద‌నా. కోటి సూర్యుల‌తో స‌మాన‌మైన కాంతిని వేడి క‌లిగిన నీ సుద‌ర్శ‌న చ‌క్రం న‌న్ను చంప‌డానికి అమిత‌ వేగంగా దూసుకు వ‌స్తోంది. నీవే న‌న్నీ ఆప‌ద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ స‌ర్వేశ్వ‌రుడైన ఆ శ్రీ‌హ‌రినే శ‌ర‌ణు కోరాడు. 

విష్ణుమూర్తి విలాసంగా న‌వ్వుతూ దూర్వాసా ప్ర‌పంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మ‌ణులే దైవాలు. కాని నువ్వు స‌ద్ర్బాహ్మ‌ణుడ‌వూ, రుద్రాంశ సంభూతుడివై ఉండి కూడా అంబ‌రీషుని అకార‌ణంగా శ‌పించావు. పార‌ణ‌కు వ‌స్తాన‌ని చెప్పి స్నానార్ధ‌మై వెళ్లిన నీవు స‌కాలానికి  చేరుకోలేదు. ఆల‌స్యంగా రాద‌ల‌చుకున్న వాడివి నీ కోసం ఎదురుచూడ‌కుండా ద్వాద‌శీ ఘ‌డియ‌లు గ‌తించిపోకుండానే పార‌ణ చేయ‌డానికి అనుమ‌తినైనా ఇవ్వ‌లేదు. ద్వాద‌శి దాటిపోవ‌డానికి కొన్ని క్ష‌ణాలు మాత్ర‌మే వ్య‌వ‌ధి ఉన్న స‌మ‌యంలో వ్ర‌త భంగానికి భ‌య‌ప‌డి మంచినీళ్ల‌ను తీసుకున్నాడే గాని ఆక‌లితో లేదా నిన్న‌వ‌మానించాల‌నో కాదు. అనాహారేతి య‌చ్ఛ‌స్తం శుధ్య‌ర్థం వ‌ర్ణినా స‌దా అని శాస్త్రం చెబుతోంది. నిషిద్ధాహారుల‌కు కూడా జ‌ల‌పానం దోషం కాద‌ని శాస్ర్తాలు చెబుతుండ‌గా అదేమంత త‌ప్ప‌ని నువ్వు శ‌పించాల్సివ‌చ్చింది? ఆత్రేయా  నువ్వెంత క‌టువుగా మాట్లాడినా కూడా అత‌గాడు నిన్ను విన‌య‌పూర్వ‌కంగా శాంతించ‌మ‌ని వేడుకున్నాడే గాని, కోపించ‌లేదు క‌దా? అయినా స‌రే ముముక్షుడైన అత‌డిని నువ్వు ప‌ది దుర్భ‌ర జ‌న్మ‌లు పొందాల‌ని శ‌పించావు. నా భ‌క్తుల‌ను ర‌క్షించుకోవ‌డం కోసం నీ శాపాన్ని క్ష‌ణాల్లో తిప్పి వేయ‌గ‌ల‌ను కాని బ్రాహ్మ‌ణ వాక్యం వ‌ట్టిపోయింద‌నే లోకాప‌వాదం నీకు క‌ల‌గ‌కుండా ఉండ‌డం కోసం ఆ భ‌క్తుని హృద‌యంలో చేరి నీ శాపాన్ని స‌విన‌యంగా స్వీక‌రించాను. నీ శాపాన్ని అంగీక‌రిస్తూ గృహ్ణామి అన్న వాడిని నేనే గాని అంబ‌రీషుడు కానే కాదు. అత‌నికి నీవిచ్చిన శాపం సంగ‌తే తెలియ‌దు. ఋషి ప్ర‌భూ నీ శాపం ప్ర‌కారంగానే కాల్పాంతాన దుష్టుడైన శంఖాసురుని సంహ‌రించ‌డానికి, శిష్యుడైన మ‌నువును ఉద్ధ‌రించ‌డానికీ మ‌హామ‌త్స్యంగా అవ‌త‌రిస్తాను. దేవ‌దాన‌వులు సాగ‌రాన్ని మ‌ధించే వేళ మంధ‌ర‌గిరిని మూపున ధ‌రించ‌డానికి కుదురుగా ఉండేందుకుగాను వ‌రాహాన్న‌వుతాను. హిర‌ణ్య‌క‌శిపుని సంహ‌రించ‌డం కోసం వికృతాన‌నం గ‌ల న‌ర‌సింహ రూపాన్ని ధ‌రిస్తాను. స‌ర్వ‌దేవ‌తా సంర‌క్ష‌ణ కోసం ధ‌ర్మ‌బ‌లుడైనా కూడా దాన‌వుడు క‌నుక బ‌లిని శిక్షించేందుకు వామ‌నుడ‌న‌వుతాను. త్రేతా యుగంలో జ‌మ‌ద‌గ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మ‌ణుడ‌నై దుర్మ‌దులైన రాజుల పీచ‌మ‌ణ‌చివేస్తాను. రావ‌ణ సంహారార్ధం ఆత్మ‌జ్ఞాన శూన్యుడైన అంటే నేనే భ‌గ‌వంతుడ‌నే దానిని మ‌రిచిపోయి మామామానుష విగ్ర‌హుడ‌నైన ద‌శ‌ర‌థ రామునిగా అవ‌త‌రిస్తాను. ద్వాప‌రంలో జ్ఞానినీ, బ‌ల‌వంతుడ‌నూ అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు (బ‌ల‌రాముడు) త‌మ్మునిగా కృష్ణావ‌తారం ధ‌రిస్తాను. క‌ల‌యుగారంభాన పాప‌మోహం కోసం పాషండ మ‌త ప్ర‌చార‌కుడ‌నై బుద్ధుడుగా ఆవిర్భ‌విస్తాను.ఆ యుగాంతాను శ‌తృఘాత‌కుడైన బ్రాహ్మ‌ణుడుగా ప్ర‌భ‌విస్తాను. దూర్వాసా నా ఈ ద‌శావ‌తారాల‌ను, ఆయా అవ‌తారాల‌లోని లీల‌ల‌ను ఎవ‌రు వినినా, చ‌దివినా, తెలుసుకున్నా వారి పాపాలు ప‌టాపంచ‌ల‌వుతాయి అని చెప్పాడు.
శ్లో - ధ‌ర్మానానా విధా వేదే విస్తృత న‌ర‌జ‌న్మ‌నాం
దేశ‌కాల వ‌యోవ‌స్థా వ‌ర్ణాశ్ర‌మ విభాగ‌శః
దేశ‌, కాల వ‌యో అవ‌స్థ‌ల‌ను బ‌ట్టి వ‌ర్ణాశ్ర‌మాల‌ను అనుస‌రించి ధ‌ర్మం అనేక విధాలుగా వేదం ప్ర‌వ‌చించింది. అటువంటి వివిధ ధ‌ర్మాల్లో కూడా ఏకాద‌శి నాడు ఉప‌వాసం, ద్వాద‌శి దాట‌కుండా పార‌ణం అనేవి విశ్వ‌జ‌నీనంగా భాసిస్తున్నాయి. అలాంటి వైదిక ధ‌ర్మాచ‌ర‌ణ చేసినందుకుగాను నువ్వు అంబ‌రీషుని శ‌పించింది చాల‌క తిరిగి మ‌రో ఘోర శాపం ఇవ్వ‌బోయావు. బ్రాహ్మ‌ణుడైన నీ వాక్యాన్ని స‌త్యం చేయ‌డం, భ‌క్తుడైన ఆ రాజుకు కాపాడుకోవ‌డం రెండూ నా బాధ్య‌త‌లే గ‌నుక పునః శ‌పించ‌బోయే నిన్ను నివారించ‌డానికే నా చ‌క్రాన్ని ప్ర‌యోగించాను అని దూర్వాసునికి శ్రీ‌హ‌రి తెలియ‌చేశాడు.
ద్వాద‌శి పారాయ‌ణ స‌మాప్తః  

No comments:

Post a Comment