Monday, November 18, 2019

కార్తీక పురాణం 21వ రోజు పారాయణం (బ‌హుళ ష‌ష్ఠి రోజున‌)

మారుమూల‌ల్లో దాక్కున్నా కూడా వ‌ద‌ల‌కుండా ముట్ట‌డించేందుకు వ‌స్తున్న జ‌లంధ‌రునికి భ‌య‌ప‌డిన దేవ‌త‌లంతా విష్ణుస్తోత్రం చేయ‌సాగారు.
స‌ర్వ‌దేవ‌తాకృత విష్ణు స్తోత్రం

న‌మో మ‌త్స్య‌కూర్మాది నానా స్వ‌రూపాయ‌
స‌దాభ‌క్త కార్యోద్య‌తా యార్తి హంత్రే
విధాత్రాధి స‌ర్గ‌స్థితి ధ్వంస‌క‌ర్ర్తే
గ‌దా శంఖ ప‌ద్మాది హ‌స్తాయ‌తే2స్తు

ర‌మావ‌ల్ల‌భాయాసురాణాం నిహంత్రే
భుజంగారి యానాయ పీతాంబ‌రాయ‌
శ‌ర‌ణ్యాయ త‌స్మై స‌తాస్స్మోవ‌తాస్మః

న‌మోదైత్య సంతాపి తామ‌ర్త్వ‌దుఃఖా
చ‌ల‌ధ్వంసదంభోళ‌యే విష్ణ‌వేతే
భుజంగేశ త‌లేశ‌యానాయార్క చంద్ర‌
ద్వినేత్రాయ త‌స్మై స‌తాస్స్మోవ‌తాస్మః
నార‌దోవాచ‌
సంక‌ష్ట నాశ‌నం స్తోత్ర‌మేత‌ద్య‌స్తు ప‌ఠేన్న‌రః
స‌క‌దాచిన్న సంక‌ష్టః పీడ్య‌తే కృప‌యా హ‌రేః

మ‌త్స్య కూర్మాది అవ‌తార‌ములు ధ‌రించిన వాడ‌వు, స‌దా భ‌క్తుల కార్య‌ములు చేయుట యందు సంసిద్ధుడ‌వు, దుఃఖ‌ములు న‌శింప‌చేయువాడ‌వు, బ్ర‌హ్మాదుల‌ను సృష్టించి పెంచి ల‌యింప‌చేయువాడ‌వు అయిన నీకు న‌మ‌స్కారం.
ల‌క్ష్మీప‌తి, రాక్ష‌సారాతి, గ‌రుడ వాహ‌నుడు, ప‌ట్టుబ‌ట్ట‌లు ధ‌రించిన వాడు, య‌జ్ఞాదుల క‌ర్త‌, క్రియార‌హితుడు, స‌ర్వ‌ర‌క్ష‌కుడు అయిన నీకు న‌మ‌స్కారం.
రాక్ష‌సుల పీడ కార‌ణంగా ఏర్ప‌డిన దేవ‌త‌ల దుఃఖ‌మ‌నే కొండ‌ను న‌శింప‌చేయు వ‌జ్రాయుధం వంటి వాడ‌వు, శేష‌శ‌య‌నుడ‌వు, సూర్య‌చంద్రుల‌నే నేత్రాలు క‌లవాడ‌వు అయిన నీకు న‌మ‌స్కారం. పునః న‌మ‌స్కారం.
ఇలా దేవ‌త‌లు ర‌చించిన‌ది, స‌మ‌స్త క‌ష్టాల‌ను శ‌మింప‌చేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మాన‌వుడు ప‌ఠిస్తూ ఉంటాడో వాని ఆప‌ద‌ల‌న్నీశ్రీ‌హ‌రి ద‌య వ‌ల‌న తొల‌గిపోతాయి అని పృథువుకి చెప్పిన నార‌దుడు మ‌ర‌లా పురాణ ప్ర‌వ‌చ‌నానికి ఉప‌క్ర‌మించాడు.
దేవ‌త‌లు చేసిన ఈ స్తోత్రాలు ఆ చ‌క్ర‌పాణి చెవిన ప‌డ్డాయి. దేవ‌త‌ల క‌ష్టానికి చింతిస్తూనే, దాన‌వుల‌పై కోపం క‌ల‌వాడైన శ్రీ‌హ‌రి త‌న శ‌య్య‌ను వీడి గ‌రుడ వాహ‌నంపై క‌దులుతూ "ల‌క్ష్మీ నీ త‌మ్ముడైన జ‌లంధ‌రునికి, దేవ‌తాగ‌ణాల‌కి యుద్ధం జ‌రుగుతోంది. దేవ‌త‌లు న‌న్నాశ్ర‌యించారు. నేను వెడుతున్నాను" అని చెప్పాడు
అందుకా ఇందిరాదేవి ర‌వంత చ‌లించిన‌దై "నాథా నేను నీకు ప్రియురాల‌నై ఉండ‌గా నువ్వు నా త‌మ్ముని వ‌ధించ‌డం ఎలా జ‌రుగుతుంది" అని ప్ర‌శ్నించింది. ఆ మాట‌కు మాధ‌వుడు న‌వ్వి "నిజ‌మే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత‌, బ్ర‌హ్మ నుంచి అత‌ను పొందిన వ‌రాల చేత, శివాంశ సంజాతుడు కావ‌డం చేత కూడా జ‌లంధ‌రుడు నేను చంప‌ద‌గిన వాడు కాదు" అని మాత్రం చెప్పి స‌ర్వాయుధ స‌మీకృతుడై, గ‌రుడ వాహ‌నాన్ని అధిరోహించి అతి వేగంగా యుద్ధ‌భూమిని చేరాడు.
మ‌హాబ‌లి అయిన గ‌రుడుని రెక్క‌ల విసురులకి పుట్టిన గాలి వ‌ల‌న రాక్ష‌స సేన‌లు మేఘ‌శ‌క‌లాల వ‌లె చెల్లాచెద‌రై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జ‌లంధ‌రుడు ఆగ్ర‌హంతో ఆకాశానికి ఎగిరి విష్ణువుని ఎదిరించాడు. వారి మ‌ధ్య‌న ఘోర యుద్ధం జ‌రిగింది. విష్ణుమూర్తి బాణాల‌తో జ‌లంధ‌రుని జెండా, ర‌థ‌చ‌క్రాలు, ధ‌నుస్సు చూర్ణం చేశాడు. అనంత‌రం ఒక గొప్ప‌ ప‌దునైన బాణాన్ని గుండెల‌పై ప్ర‌యోగించాడు. అమిత బాధ‌తో కూడిన క్రోధంతో జ‌లంధ‌రుడు గ‌దాధ‌రుడై ముందుగా గ‌రుడుని త‌ల‌పై మోద‌డంతో గ‌రుత్మంతుడు భూమికి వాలాడు. త‌క్ష‌ణ‌మే విష్ణువు అత‌ని గ‌ద‌ను ఖ‌డ్గంతో రెండుగా న‌రికివేశాడు. అలిగిన ఆ అసురేంద్రుడు ఉపేంద్రుని ఉద‌రాన్ని పిడికిలిలో పొడిచాడు. ఆ త‌ర్వాత వారి మ‌ధ్య‌న బాహుయుద్ధం ప్రారంభమ‌యింది. వారిరువురి ముష్టిఘాతాలు, జానువుల తాకిళ్లు, భుజాల వేగానికి భూమి మొత్తం ధ్వ‌నిమ‌య‌మైపోయింది. భ‌యావ‌హ‌మైన ఆ మ‌నోహ‌ర క‌ల‌హంలో జ‌లంధ‌రుని బ‌ల‌ప‌రాక్ర‌మాల‌కు సంతుష్టుడైన సంక‌ర్ష‌ణుడు "నీ ప‌రాక్ర‌మం న‌న్ను ముగ్ధుని చేసింది. ఏదైనా వ‌రం కోరుకో" అన్నాడు. విష్ణుమూర్తి అలా అన‌గానే జ‌లంధ‌రుడు చేతులు జోడించి "బావా, ర‌మార‌మ‌ణా. నీవు నా యందు నిజంగా ప్ర‌స‌న్నుడ‌వు అయితే నా అక్క‌గారైన ల‌క్ష్మీదేవితోనూ, నీ స‌మ‌స్త వైష్ణ‌వ గ‌ణాల‌తోనూ స‌హా త‌క్ష‌ణ‌మే వ‌చ్చి నా ఇంట కొలువుండిపో" అని కోరాడు. తానిచ్చిన మాట ప్ర‌కారం తార‌క్ష్య‌వాహ‌నుడు త‌క్ష‌ణ‌మే రాక్ష‌స మందిరానికి త‌ర‌లివెళ్లాడు.   
స‌మ‌స్త దైవ‌స్థానాల్లోనూ రాక్ష‌సుల‌ను ప్ర‌తిష్ఠించాడు జ‌లంధ‌రుడు. దేవ‌, సిద్ధి, గంధ‌ర్వాదులంద‌రి వ‌ద్ద ఉన్న త‌న ర‌త్న స‌ముదాయాన్నంత‌టినీ స్వాధీన‌ప‌రుచుకున్నాడు. వారంద‌రినీ త‌న ప‌ట్ట‌ణంలో ప‌డి ఉండేట్టుగా చేసుకుని తాను త్రిలోక ప్ర‌భుత్వం న‌డ‌ప‌సాగాడు.
ఓ పృథు చ‌క్ర‌వ‌ర్తీ, ఆ విధంగా జ‌లంధ‌రుడు ల‌క్ష్మీనారాయ‌ణుల‌ను త‌న ఇంటి కొలువుంచుకుని భూలోక‌మంత‌టినీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలుతుండ‌గా విష్ణుసేవా నిమిత్తం నేను ఒకసారి ఆ జ‌లంధ‌రుని ఇంటికి వెళ్లాను.
ఏకాద‌శాధ్యాయ స‌మాప్తః
------------------
ద్వాద‌శాధ్యాయం
నార‌దుడు ఇంకా ఇలా చెప్ప‌సాగాడు.
పృథురాజా, అలా త‌న గృహానికి వ‌చ్చిన న‌న్ను జ‌లంధ‌రుడు ఎంతో చ‌క్క‌టి భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో శాస్త్రవిధిన స‌త్క‌రించి ఓ మునిరాజా, ఎక్క‌డ నుంచి ఇలా విచ్చేశావు? ఏఏ లోకాలు సంద‌ర్శించావు. నువ్వు వ‌చ్చిన ప‌నేమిటో చెబితే దాన్ని త‌ప్ప‌క నెర‌వేర్చుతా అన్నాడు.
అప్పుడు జ‌లంధ‌రా, యోజ‌న ప‌రిమాణం, పొడ‌వూ గ‌ల‌ది, అనేకానేక క‌ల్ప‌వృక్షాలు, కామ‌ధేనువులు గ‌ల‌ది, చింతామ‌ణుల‌చే ప్ర‌కాశవంత‌మైన‌ది అయిన కైలాస శిఖ‌రంగా పార్వ‌తీ స‌మేతుడైన ప‌శుప‌తిని సంద‌ర్శించాను. ఆ వైభ‌వాల‌కు దిగ్ర్భాంతుడ‌నైన నేను అంత‌టి సంప‌ద క‌ల‌వారెవ‌రైనా ఉంటారా అని ఆలోచించ‌గా త్రిలోక చ‌క్ర‌వ‌ర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంప‌ద‌లు కూడా చూసి నువ్వు గొప్ప‌వాడివో, ఆ శివుడు గొప్ప‌వాడో తేల్చుకో్వాల‌ని ఇలా వ‌చ్చాను. అన్ని విష‌యాల్లో మీరిద్ద‌రూ దీటుగానే ఉన్నారు గాని, ఒక్క స్ర్తీర‌త్న‌పుటాధిక్య‌త వ‌ల‌న ఆ శివుడే ఉత్కృష్ట వైభ‌వోపేతుడుగా క‌నిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్స‌ర‌లు, నాగ‌క‌న్య‌లు మొద‌లైన దేవ‌కాంత‌లెంద‌రైనా ఉండ‌వ‌చ్చు, వాళ్లంతా ఏక‌మైనా స‌రే ఆ వీణాంక‌ధారికి ప్రాణాంక‌స్థిత అయిన పార్వ‌తీదేవి ముందు ఎందుకూ కొర‌గారు. క‌ల్యాణానికి ముందు వీత‌రాగుడైన విష‌మాంబ‌కుడు సైతం ఏ విద్యుల్ల‌తా సౌంద‌ర్య‌మ‌నే అర‌ణ్యంలో భ్రామితుడై చేప‌వ‌లె కొట్టుమిట్టాడాడో, అలాంటి ఆ అద్రినంద‌న‌కు ఏ చానా ఈడు రాలేదు. నిత్యం పార్వ‌తీదేవినే ప‌రిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాల‌నే నిశ్చ‌యంతో బ్ర‌హ్మ‌దేవుడు అప్స‌రాగ‌ణాన్ని సృష్టించాడో ఆ అప్స‌ర‌స‌లు అంద‌రూ ఏక‌మైనా స‌రే ఆ అమ్మ‌వారి అందం ముందు దిగ‌దుడుపే అని తెలుసుకో. నీకెన్ని సంప‌ద‌లున్నా అలాంటి సాధ్వీమ‌ణి లేక‌పోవ‌డం వ‌ల‌న ఐశ్వ‌ర్య‌వంతుల్లో నువ్వు శివుని త‌ర్వాత వాడివే గాని, ప్ర‌థ‌ముడివి మాత్రం కాదు అన్నాను.  జ‌లంధ‌రునితో మాట్లాడిన తర్వాత నేను నా దారిన వ‌చ్చేశాను. 
అనంత‌రం పార్వ‌తీ సౌంద‌ర్య ప్ర‌లోభుడై జ‌లంధ‌రుడు మ‌న్మ‌థ జ్వ‌ర‌గ్ర‌స్తుడ‌య్యాడు. కాముకుల‌కి యుక్తాయుక్త విచ‌క్ష‌ణ‌లుండ‌వు క‌దా! అందువ‌ల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జ‌లంధ‌రుడు సింహికానంద‌నుడైన రాహువ‌నే దూత‌ను చంద్ర‌శేఖ‌రుని వ‌ద్ద‌కు పంపాడు. శుక్ల‌ప‌క్ష‌పు చంద్రునిలా తెల్ల‌గా మెరిసిపోతూ ఉండే కైలాస ప‌ర్వ‌తాల‌న్నీ అత‌ని కారున‌లుపు దేహ‌కాంతులు సోకి న‌ల్ల‌బ‌డుతూ ఉండ‌గా రాహువు కైలాసాన్ని చేరాడు. త‌న రాక‌ను నందీశ్వ‌రుని ద్వారా న‌ట‌రాజుకి క‌బురు పెట్టాడు.
ఏం ప‌ని మీద వ‌చ్చావు అన్న‌ట్టుగా క‌నుబొమ‌ల క‌ద‌లిక‌తోనే రాహువుని శివుడు ప్ర‌శ్నించాడు.
ఓ కైలాస‌వాసా, ఆకాశంలోని దేవ‌త‌ల చేత‌, పాతాళంలోని ఫ‌ణుల చేత కూడా సేవ‌లు పొందుతున్న వాడు, ముల్లోకాల‌కు ఏకైక నాయ‌కుడైన మా రాజు జ‌లంధ‌రుడు నీకు ఈ దిగువ సందేశం ఇమ్మ‌ని ఆజ్ఞాపించాడు.
"హే వృష‌ధ్వ‌జా, వ‌ల్ల‌కాటిలో నివ‌శించే వాడివి, ఎముక‌ల పోగుల‌ను ధ‌రించే వాడివి, దిగంబ‌రుడ‌వి అయిన నీకు హిమవంతుడి కూతురు, అతిలోక సౌంద‌ర్య‌వ‌తి అయిన పార్వ‌తి భార్య‌గా ప‌నికిరాదు. ప్ర‌పంచంలోని అన్ని ర‌కాల ర‌త్నాల‌కూ నేను రాజునై ఉన్నాను కాబ‌ట్టి స్ర్తీర‌త్న‌మైన ఆ పార్వ‌తిని కూడా నాకు స‌మ‌ర్పించు. ఆమెకు భ‌ర్త‌న‌య్యేందుకు నేనే అర్హుడిని, నువ్వేమాత్రం త‌గ‌వు అని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు" అని నివేదించాడు.

కీర్తిముఖోపాఖ్యానం
రాహువ‌ల చెబుతూ ఉండ‌గానే ఈశ్వ‌రుని క‌నుబొమ‌ల వ‌ల‌న రౌద్రాకారుడైన పురుషుడు వేగ‌వంత‌మైన ధ్వ‌ని క‌లవాడు ఆవిర్భ‌వించాడు. పుడుతూనే ఆ పౌరుష‌మూర్తి రాహువు మీద లంఘించ‌బోగా రాహువు భ‌య‌ప‌డి పారిపోబోయాడు. ఆ రౌద్ర‌మూర్తి అన‌తి దూరంలోనే రాహువుని ప‌ట్టుకుని మింగివేయ‌బోయాడు. అయిన‌ప్ప‌టికీ రాహువు దూత అయిన కార‌ణంగా వ‌ధించ‌డం త‌గ‌ద‌ని రుద్రుడు వారించ‌డంతో ఆ పౌరుష‌మూర్తి త‌న ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నాడు. శివాభిముఖుడై హే జ‌గ‌న్నాథా, నాక‌స‌లే ఆక‌లి ద‌ప్పిక‌లెక్కువ‌. వీనిని తిన‌వ‌ద్దంటున్నావు. క‌నుక నాకు త‌గిన ఆహార‌పానీయాలేమిటో అన‌తీయి అని కోరాడు.
దానికి స‌మాధానంగా హ‌రుడు నీ మాంసాన్నే నీవు ఆర‌గించు అన్నాడు. శివాజ్ఞ‌బ‌ద్ధుడైన ఆ పురుషుడు త‌న శ‌రీరంలోని శిర‌స్సును త‌ప్ప త‌క్కిన అన్ని భాగాల మాంసాన్ని తినేశాడు. శిర‌స్సొక‌టే మిగిలిన ఆ మ‌హాపురుషుని ప‌ట్ల కృపాళువైన శివుడు నీ ఈ భ‌యంక‌ర కృత్యానికి సంతుష్టుడిన‌య్యాను. ఇక నుంచి నీవు కీర్తిముఖ పేరుతో విరాజిల్లు అని ఆశీర్వ‌దించాడు.
ఓ పృథురాజా, త‌దాదిగా ఆ శ‌రీరోవ‌శేషుడు శివ‌ద్వారంలో కీర్తిముఖుడై ప్ర‌కాశిస్తున్నాడు. అంతే కాదు. ఇక‌పై నిన్ను పూజించ‌కుండా న‌న్ను అర్చించిన వారి పూజ‌ల‌న్నీ వృధా అవుతాయి గ‌నుక న‌న్ను అర్చించ‌ద‌ల‌చిన వారు తొలుత కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వ‌రుడు శాసించాడు. అలా కీర్తిముఖ‌గ్ర‌స్తుడు కాబోయిన రాహువును శివుడు బ‌ర్బ‌ర స్థ‌లంలో విముక్తుని చేయ‌డం వ‌ల‌న అప్ప‌టి నుంచి రాహువు బ‌ర్బ‌ర నామ‌ధేయంతో ప్ర‌సిద్ధి చెందాడు. ఆ మీద‌ట రాహువు త‌న‌క‌ది పున‌ర్జ‌న్మ‌గా భావించి భ‌య‌విముక్తుడై జ‌లంధ‌రుని ద‌గ్గ‌ర‌కు వెళ్లి జ‌రిగిందంతా పొల్లు పోకుండా చెప్పాడు. 
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 11, 12 అధ్యాయాలు స‌మాప్తం
21వ రోజు పారాయ‌ణం ముగిసింది.

No comments:

Post a Comment