Monday, November 25, 2019

కార్తీక పురాణం- 29వ రోజు పారాయ‌ణం (బ‌హుళ చ‌తుర్ద‌శి రోజున‌)

స‌ప్తవింశాధ్యాయం
నార‌దుని హిత‌వుపై ర‌వంత చింతించిన ర‌వి సుతుడు ఆ ధ‌నేశ్వ‌రున‌కు ప్రేత‌ప‌తి అనే త‌న దూత‌ను తోడిచ్చి న‌ర‌కాన్ని త‌రింప‌చేయ‌వ‌ల‌సిందిగా ఆదేశించాడు. ఆ దూత ధ‌నేశ్వ‌రుని న‌త‌న‌తో తీసుకు వెళ్తూ మార్గ‌మ‌ధ్యంలో న‌ర‌కం లోకంలో భిన్న విభాగాల‌ను చూపిస్తూ వివ‌రించాడు. 

తప్త‌వాలుక‌ము : ఓ ధ‌నేశ్వ‌రా మ‌ర‌ణించిన వెంట‌నే పాప‌క‌ర్ముల‌ను ఇక్క‌డ‌కు తీసుకువ‌స్తారు. వారి శ‌రీరాలు కాలుస్తూ ఉంటే దిక్కులు పిక్క‌టిల్లేలా రోదిస్తూ ఉంటారు. దీనిని త‌ప్త‌వాలుక న‌ర‌కం అంటారు. వైశ్వ‌దేవ‌వ‌రులైన అతిథుల‌ను పూజించ‌ని వారు; గురువుల‌ను, అగ్నిని, బ్రాహ్మ‌ణుల‌ను, గోవును, వేద‌విదుల‌ను, య‌జ‌మానిని కాళ్ల‌తో త‌న్నిన వారి పాదాల‌ను మా య‌మ‌దూత‌లు ఎలా కాల్చుతున్నారో చూడు అన్నాడు. 

అంధ‌తామిస్ర‌ము : ఈ న‌ర‌కంలోసూది మొన‌లు వంటి భ‌యంక‌ర ముఖాలు క‌లిగిన పురుగులు పాపాత్ముల శ‌రీరాల‌ను తొలిచేస్తూ ఉంటాయి. ఇది ప‌ద‌హారు ర‌కాలుగా కుక్క‌లు, గ్ర‌ద్ద‌లు, కాకులు మొద‌లైన ప‌క్షిజంతుస‌మ‌న్విత‌మై ఉంటుంది. ప‌రుల ర‌హ‌స్యాల‌ను భేదించే పాపాత్ములంద‌రూ ఈ న‌ర‌కంలో దండ‌న‌లు అనుభ‌విస్తూ ఉంటారు.

క్ర‌క‌చ‌ము : ఇది మూడో న‌ర‌కం. ఇక్క‌డ పాపాత్ముల‌ను అడ్డంగా, నిలువుగా, ఏటావాలుగా, ఐమూలంగా అంగాంగాల‌నూ రంపాల‌తో కోస్తూ ఉంటారు.
అసివ్ర‌త‌వ‌నం : ఇది నాలుగో ర‌కం న‌ర‌కం. భార్యాభ‌ర్త‌లు, త‌ల్లిదండ్రుల నుంచి సంతానం విడ‌దీసిన పాపులంతా ఈ న‌ర‌కానికి చేర‌తారు. వారిని నిలువెల్లా బాణాల‌తో గుచ్చి,  అసివ్ర‌తాల‌చే కోస్తూ ఉంటారు. ధార‌లు కారే నెత్తుటి వాస‌న‌కు తోడుళ్లు వెంట‌బ‌డి త‌రుముతూ ఉంటే భ‌య‌ప‌డి పారిపోవాల‌ని ప‌రుగులు తీస్తూ పారిపోయే దిక్కులేక ప‌రిత‌పిస్తూ ఉంటారు. చంపుట‌, భేదించుట వంటి విధుల‌తో ఈ న‌ర‌కం ఆరు ర‌కాలుగా ఉంటుంది. 

కూట‌శాల్మ‌లి : ప‌ర‌స్ర్తీల‌ను, ప‌ర‌ద్ర‌వ్యాన్ని హ‌రించిన‌ వారు, ఇత‌రుల‌కు అప‌కారం త‌ల‌పెట్టిన వారు ఈ న‌ర‌కంలో శిక్ష‌లు అనుభ‌విస్తూ ఉంటారు.
ర‌క్త‌పూయ‌ము : ఆర‌వ‌దైన ఈ ర‌క్త‌పూయ న‌ర‌కంలో పాపాత్ముల‌ను త‌ల‌కిందులుగా వేలాడ‌దీసి య‌మ‌కింక‌రులు దండిస్తూ ఉంటారు. కులాచారాల రీత్యా తిన‌కూడ‌ని వ‌స్తువులు తిన్న వారు, ప‌ర‌నింద చేసిన వారు, చాడీలు చెప్పిన వారు ఈ న‌ర‌కానికి చేర‌తారు.

కుంభీపాకము : ఇది న‌ర‌కాల‌న్నింటిలోనూ ఘోరాతిహోర‌మైన‌ది, అత్యంత నికృష్ట‌మైన‌ది. మొట్ట‌మొద‌ట నిన్ను చేర్చింది ఆ న‌ర‌కానికే. దుష్ట ద్ర‌వ్య‌ములు, దుర్భ‌రాగ్ని కీల‌లు, దుస్స‌హ దుర్గంధాల‌తో కూడి ఉంటుంది.

రౌర‌వ‌ము : న‌ర‌కాల‌న్నింటిలో ఎనిమిదోదైన ఈ న‌ర‌కం చేరిన వారు వేలాది సంవ‌త్స‌రాల పాటు ఇక్క‌డ శిక్ష‌లు అనుభ‌వించాల్సిందే. ఈ న‌ర‌కంలో ప‌డిన వారికి విముక్తి దీర్ఘ‌కాలికం. 

ధ‌నేశ్వ‌రా, మ‌న ప్ర‌మేయం లేకుండా మ‌న‌కు అంటిన పాపాన్ని శుష్క‌మ‌ని, మ‌న‌కు మ‌న‌మై చేసుకున్న పాపాన్ని ఆర్ర్ద‌మ‌ని అంటారు. ఈ రెండు ర‌కాల పాపాలూ క‌లిపి ఏడు విధాలుగా ఉంటాయి. అప‌కీర్ణం, సాంక్తేయం, మ‌లినీక‌ర‌ణం, జాతిభ్రంశం, ఉప‌వీత‌కం, అతి పాత‌కం, మ‌హా పాత‌కం. దుష్టులైన న‌రులు, దుష్ట చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారు ఈ న‌ర‌కాల‌న్నీ వ‌రుస‌గా అనుభ‌విస్తూ ఉంటారు. కాని నువ్వు కార్తీక వ్ర‌త‌స్థులైన వారి సాంగ‌త్యం ద్వారా పొందిన అమిత పుణ్యం వ‌ల‌న ఈ న‌ర‌కాల‌ను త‌ప్పించుకోగ‌లిగావు. కేవ‌లం ద‌ర్శ‌న‌మాత్రంగానే ఈ న‌ర‌కాలు దాటావు.

ఇలా అన్ని ర‌కాల న‌ర‌కాల‌ను దృశ్య‌మానంగా చూపిస్తూ ఆ య‌మ‌దూత అత‌న్ని య‌క్ష‌లోకానికి చేర్చాడు. అక్క‌డ అత‌ను య‌క్ష‌రూపుడై, కుబేరున‌కు ఆప్తుడై ధ‌న‌య‌క్షుడ‌నే పేరు పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్య‌లో ఏర్ప‌ర‌చిన ధ‌ర‌య‌క్ష తీర్థం ఇత‌ని పేరు మీద ఏర్ప‌డిందే. 

అందువ‌ల‌న పాప‌హారిణి, శోక‌నాశ‌ని అయిన ఈ కార్తీక వ్ర‌త‌ప్ర‌భావం వ‌ల‌న మాన‌వులు త‌ప్ప‌నిస‌రిగా మోక్షాన్ని పొందుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు అని స‌త్య‌భామ‌కు చెప్పిన శ్రీ‌కృష్ణుడు సంధ్యానుష్ఠానం కోసం స్వ‌గృహానికి వెళ్లాడ‌ని సూత‌మ‌హాముని ఋషుల‌కు ప్ర‌వ‌చించాడు.

స‌ప్త‌వింశోధ్యాయ స‌మాప్తః
--------------- 
అష్టావింశోధ్యాయ‌ము
సూతుడు ఇలా చెబుతున్నాడు
ఈ కార్తీక మాసం పాప‌నాశ‌ని, విష్ణు ప్రియ‌క‌రి. భ‌క్తుల‌కు భుక్తి, ముక్తి ప్ర‌దాయిని. క‌ల్పోక్త విధిగా ముందుగా విష్ణుజాగారం, ప్రాతః స్నానం, తుల‌సీ సేవ‌, ఉద్యాప‌నం, దీప‌దానం అనే ఈ ఐదింటినీ ఆచ‌రించిన వారు ఇహంలో భుక్తి పొంద‌గ‌లుగుతున్నారు. పాపాలు పోవాల‌న్నా, దుఃఖాలు తీరాల‌న్నా, క‌ష్టాలు క‌డ‌తేరాల‌న్నా కార్తీక వ్ర‌తాన్ని మించింది మ‌రొక‌టి లేదు. ధ‌ర్మార్ధ కామ మోఖాలు నాలుగింటికీ ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించాల్సిందే. 

క‌ష్టాల్లో ఉన్న వాడు, దుర్గ‌మ అర‌ణ్యాల పాలైన వాడు, రోగ‌గ్ర‌స్తులు ఈ వ్ర‌తాన్ని పాటించాలి. ఎలాంటి ఇబ్బందులు క‌లిగినా స‌రే వ్ర‌తం మాన‌కుండా ఆచ‌రిస్తూ శివాల‌యంలోనో, విష్ణ్వాల‌యంతోనో హ‌రిజాగారం చేయాలి. శివ‌విష్ణు ఆల‌యాలు స‌మీపంలో లేన‌ప్పుడు రావి చెట్టు వ‌ద్ద లేదా తుల‌సీవ‌నంలో వ్ర‌తం చేసుకోవ‌చ్చు. విష్ణుస‌న్నిధానంలో విష్ణుకీర్త‌న ఆల‌పించే వారు స‌హ‌స్ర గోదాన ఫ‌లాన్ని, వాద్యాలు వాయించే వారు అశ్వ‌మేథ ఫ‌లాన్ని, న‌ర్త‌కులు స‌ర్వ‌తీర్థాల ఫ‌లాన్ని పొందుతారు. ఆప‌ద‌ల్లో ఉన్న వాడు, రోగి, మంచినీరు దొర‌క‌ని వాడు కేశ‌వ నామాలు చేస్తే చాలును. వ్ర‌తోద్యాప‌న‌కు శ‌క్తి లేని వారు బ్రాహ్మ‌ణుల‌కు భోజ‌నం పెడితే స‌రిపోతుంది.

శ్లో- అవ్య‌క్త రూపిణో విష్ణోః స్వ‌రూపో బ్రాహ్మ‌ణో భువి
శ్రీ మ‌హావిష్ణువు స్వ‌రూప‌మే బ్రాహ్మ‌ణుడు. కాబ‌ట్టి కార్తీక మాసంలో బ్రాహ్మ‌ణుని సంతోష‌ప‌ర‌చ‌డం చాలా ప్ర‌ధానం.
అందుకు శ‌క్తి లేని వారు గోపూజ చేసినా చాలును. ఆ పాటి శ‌క్త‌యినా లేని వారు రావి, మ‌ర్రి  వృక్షాల‌ను పూజించినంత మాత్రం చేత‌నే కార్తీక వ్ర‌తం సంపూర్ణం చేసిన ఫ‌లాన్ని పొంద‌గ‌లుగుతారు. 

దీప‌దానం చేసే స్తోమ‌త లేని వారు, దీపారాధ‌న‌కైనా తాహ‌తు లేని వారు ఇత‌రులు వెలిగించిన దీపాన్ని ప్ర‌జ్వ‌లింప‌చేసి గాలి వ‌ల‌న కొండెక్క‌కుండా ప‌రిర‌క్షించానా కూడా పుణ్యం పొందుతారు. పూజ‌కు తుల‌సి అందుబాటులో లేని వారు తుల‌సికి బ‌దులు విష్ణుభ‌క్తుడైన బ్రాహ్మ‌ణుని పూజించాలి.

రావి-మ‌ర్రి 
సూతుడు చెప్పింది విని ఇత‌ర వృక్షాల‌న్నింటి క‌న్నా కూడా రావి, మ‌ర్రి వృక్షాలు మాత్ర‌మే గో బ్రాహ్మ‌ణ తుల్యమైన ప‌విత్ర‌త ఎలా పొందాయి అని మునులు అడిగారు.

పూర్వం ఒక సారి పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రులు మ‌హాసుర‌త భోగంలో ఉండ‌గా కార్యాంత‌రం వ‌ల‌న దేవ‌త‌లు, అగ్ని క‌లిసి బ్రాహ్మ‌ణ వేష‌ధారులై వెళ్లి ఆ సంభోగానికి అంత‌రాయం క‌లిగించారు. అందుకు అలిగిన పార్వ‌తీదేవి సృష్టిలో క్రిమికీట‌కాదులు కూడా సుర‌తంలో సుఖ‌ప‌డుతున్నాయి. అలాంటిది మీరు మా దంప‌తుల సంభోగ సుఖాన్ని చెడ‌గొట్టారు. నాకు సుర‌త భంగం క‌లిగించిన మీరు చెట్లుగా ప‌డిఉండండి అని శ‌పించింది. ఆ కార‌ణంగా దేవ‌త‌లంద‌రూ వృక్షాలుగా మారిపోయారు. ఆ ప‌రిణామంలో బ్ర‌హ్మ పాలాశ వృక్షంగానూ, విష్ణువు అశ్వ‌త్థంగాను, శివుడు వ‌ట‌వృక్షంగాను మారారు. బ్ర‌హ్మ‌కు పూజార్హ‌త లేదు. జ‌గ‌దేక పూజ‌నీయులైన శివ‌కేశ‌వ రూపాలు గ‌ల‌వి గ‌నుక‌నే రావి, మ‌ర్రి వృక్షాల‌కు అంత‌టి ప‌విత్ర‌త క‌లిగింది. వీటిలో రావి చెట్టు శ‌ని దృష్టికి సంబంధించిన‌ది కావ‌డం వ‌ల్ల శ‌నివారంనాడు మాత్ర‌మే పూజ‌నీయమ‌యింది. ఇత‌ర వారాల్లో రావి చెట్టు తాక‌రాదు అని చెప్పి ముగించాడు సూతుడు.   
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 27, 28అధ్యాయాలు స‌మాప్తం
29వ రోజు పారాయ‌ణం ముగిసింది. 

No comments:

Post a Comment