Thursday, November 21, 2019

కార్తీక పురాణం 25వ రోజు పారాయణం (బ‌హుళ ద‌శ‌మి రోజున‌)

ఏకోన‌వింశ‌త్యాధ్యాయం
నార‌దా, నీవు అత్య‌ద్భుతంగా చెప్పిన తుల‌సీ మాహాత్మ్యాన్ని విని ధ‌న్యుడిన‌య్యాన‌ను. అదే విధంగా కార్తీక వ్ర‌తాచ‌ర‌ణా ఫ‌లితాల‌ను కూడా ఎంతో చ‌క్క‌గా చెప్పావు. గ‌తంలో ఈ వ్ర‌తం ఎవ‌రు ఎలా ఆచ‌రించారో కూడా స‌వివ‌రంగా తెలియ‌చేయి అని పృథువు అడిగాడు. దానికి స‌మాధానంగా నార‌దుడు ఈ దిగువ క‌థ వివ‌రించాడు.
ధ‌ర్మ‌ద‌త్తోపాఖ్యానం
దీర్ఘ‌కాలం క్రితం స‌హ్య ప‌ర్వ‌త స‌మీపంలో క‌ర‌వీర‌మ‌నే ఊరుండేది. ఆ ఊరిలో ధ‌ర్మ‌వేత్త‌, నిరంత‌ర హ‌రిపూజాస‌క్తుడు, నిత్య ద్వాద‌శాక్ష‌రీ జ‌ప‌వ్ర‌తుడు, అతిథి సేవా ప‌రాయ‌ణుడు అయిన ధ‌ర్మ‌ద‌త్తుడ‌నే బ్రాహ్మ‌ణుడుండే వాడు.
ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగారం చేయ‌ద‌ల‌చి తెల్ల‌వారుఝామునే లేని పూజ‌కు అవ‌స‌రం అయిన వ‌స్తువులు స‌మ‌కూర్చుకుని విష్ణు ఆల‌యానికి బ‌య‌లుదేరాడు. ఆ దారిలో వంక‌ర‌లు తిరిగిన హోర దంష్ట్రలు, పొడ‌వైన నాలుక‌, ఎర్ర‌ని క‌ళ్లు, ద‌ళ‌స‌రి పెదాలు, మాంస‌ర‌హిత‌మైన శ‌రీరం క‌ల‌ది, పంది వ‌లె ఘూర్ణిస్తున్న ఒక దిగంబ‌ర రాక్ష‌సి తార‌స‌ప‌డింది. దాన్ని చూసి భీతి చెందిన బ్రాహ్మ‌ణుడు హ‌రినామ‌స్మ‌ర‌ణ చేస్తూ చేతిలోని తుల‌సి తీర్థంతో ఆమెను తాడించాడు.. ఆ నీళ్లు సోక‌గానే దాని పాపాల‌న్నీ ప‌టాపంచ‌లైపోయాయి. త‌ద్వారా జ్ఞానం ఏర్ప‌డింది. క‌ల‌హ పేరు గ‌ల ఆ రాక్ష‌సి త‌న పూర్వ‌జ‌న్మ క‌ర్మ‌విపాకాన్ని ఆ బ్రాహ్మ‌ణునికి విన్న‌వించింది. "పుణ్య‌మూర్తివైన ఓ బ్రాహ్మ‌ణుడా, పూర్వం నేను సౌరాష్ట్ర దేశంలో భిక్షుడ‌నే బ్రాహ్మ‌ణుని భార్య‌ను. అప్పుడు మిక్కిలి క‌ఠినురాలినై క‌ల‌హ అనే పేరుతో వ్య‌వ‌హారంలో ఉండే దానిని. నేను ఏ నాడూ భ‌ర్త ఆజ్ఞ‌ల‌ను గౌర‌వించి ఎరుగ‌ను. ఆయ‌న హిత‌వు ఆల‌కించే దాన్ని కాదు. నేన‌లా క‌ల‌హ‌కారిణినై అహంక‌రించి ఉండ‌డం వ‌ల‌న కొన్నాళ్ల‌కు నాథుని మ‌న‌సు విరిగి మారుమ‌నువాడాల‌నే కోరిక‌తో ఉండే వాడు. ఆయ‌న‌ను నేను సుఖ‌పెట్ట‌క‌పోయినా మారు మ‌నువు చేసుకోవాల‌నే ఆయ‌న కోరిక‌ను గుర్తించి భ‌రించ‌లేక విషం తాగి చ‌నిపోయాను. 
య‌మ‌దూత‌లు న‌న్ను తీసుకెళ్లి య‌ముడి ముందు నిల‌బెట్టారు. య‌ముడు చిత్ర‌గుప్తుని చూసి చిత్ర‌గుప్తా దీని క‌ర్మ‌కాండ‌లు తెలియ‌చేయి. శుభ‌మైనా, అశుభ‌మైనా స‌రే క‌ర్మ‌ఫ‌లాన్ని అనుభ‌వించాల్సిందేన‌న్నాడు. చిత్ర‌గుప్తుడు ఆయ‌న‌ను ఉద్దేశించి య‌మ‌ధ‌ర్మ‌రాజా, ఇది ఒక మంచి ప‌ని కూడా చేయ‌లేదు. ష‌డ్ర‌సోపేతంగా తాను భోజ‌నం చేసిన త‌ర్వాత కూడా భ‌ర్త‌కు అన్నం పెట్టేది కాదు. అందువ‌ల‌న మేక జ‌న్మ ఎత్తి బాధిష్ట య‌గుగాక‌. నిత్యం భ‌ర్త‌తో క‌ల‌హించి అత‌ని మ‌న‌సుకు బాధ క‌లిగించినందుకు పంది యోనిని పురుగై పుట్టు గాక‌. వంటిన వంట‌ను తానొక్క‌తే తిన్న పాపానికి పిల్లి యోనిని పుట్టి త‌న పిల్ల‌ల‌ను తానే తిను గాక‌. భ‌ర్తృద్వేషి అయి ఆత్మ‌హ‌త్య చేసుకున్నందు వ‌ల‌న అత్యంత నిందిత‌మైన ప్రేత శ‌రీరాన్ని పొందు గాక‌. ఇది ప్రేత రూపం పొంది కొన్నాళ్లు నిర్మ‌ల స్థానంలో ఉండి అనంత‌రం యోనిత్ర‌యాన జ‌న్మించి అప్ప‌టికైనా స‌త్కార్య‌ములు ఆచ‌రించు గాక" అని తీర్మానించాడు.
ఓ ధ‌ర్మ‌ద‌త్తా, అది మొద‌లుగా నేను 500 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్రేత శ‌రీరం ధ‌రించి ఆక‌లిద‌ప్పుల‌తో అల్లాడుతూ నా పాపాలు త‌లుచుకుని దుఃఖిస్తున్నాను.అనంత‌రం కృష్ణాస‌ర‌స్వ‌తి సంగ‌మ స్థాన‌మైన ద‌క్షిణ దేశానికి రాగా అక్క‌డి శివ‌గ‌ణాలు న‌న్ను త‌రిమికొట్టాయి. ఆ ర‌కంగా ఇక్క‌డ‌కు చేరుకున్నాను. ఈ ప్రాంతం ద్వారా పోతూ న‌న్ను చూసి భ‌యంతో కంపించిపోయిన  నువ్వు ప‌ర‌మ‌పావ‌న‌మైన తుల‌సి తీర్థంతో న‌న్ను కొట్ట‌డం వ‌ల‌న ఈ పూర్వ‌జ‌న్మ స్మృతి క‌లిగింది. పుణ్య‌తేజ‌స్వి అయిన నీ ప్ర‌త్య‌క్ష ద‌ర్శ‌న భాగ్యం క‌లిగింది. కాబ‌ట్టి క‌ళంక ర‌హితుడ‌వైన నీవు నాకు  మోక్ష‌మార్గం బోధించు. త‌దుప‌రి ఎత్త‌వ‌ల‌సిన యోనుల‌లోని జ‌న్మ‌త్ర‌యం నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం తెలియ‌చేయి అని ప్రాధేయ‌ప‌డింది.
క‌ల‌హ చెప్పిందంతా విని క‌ల‌త ప‌డిన మ‌న‌సు గ‌ల వాడైన ఆ విప్రుడు సుదీర్ఘ స‌మ‌యం ఆలోచించి దుఃఖ‌భార హృద‌యంతో ఇలా చెప్ప‌సాగాడు.
ఏకోన‌వింశ‌త్యాధ్యాయ స‌మాప్తః
---------------------
వింశ‌త్యాధ్యాయం
"ఓ క‌ల‌హా, తీర్థాలు సంచ‌రించి దానాలు, వ్ర‌తాలు చేయ‌డం వ‌ల‌న పాపాలు న‌శించిపోతాయి. కాని నీ ప్రేత శ‌రీరం వ‌ల‌న వాటిని ఆచ‌రించేందుకు నీకు అధికారం లేదు. అదీ గాక మూడు యోనుల్లో మూడు జ‌న్మ‌ల‌లో అనుభ‌వించాల్సిన క‌ర్మ‌ప‌రిపాకం స్వ‌ల్ప పుణ్యాల‌తో తీర‌దు. అందు వ‌ల‌న నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఆచ‌రిస్తున్న కార్తీక వ్ర‌త పుణ్యంలో స‌గ‌భాగాన్ని నీకు ధార‌పోస్తాను. త‌ద్వారా నీవు త‌రించి ముక్తి పొందు" అని ధ‌ర్మ‌ద‌త్తుడు చెప్పాడు.
ఆ త‌ర్వాత ఆ విప్రుడు ద్వాద‌శాక్ష‌రీ మంత్ర‌యుక్తంగా తుల‌సీ నీటితో ఆమెను అభిషేకించి కార్తీక వ్ర‌త పుణ్యాన్ని ధార‌పోశాడు. ఉత్త‌ర క్ష‌ణంలోనే క‌ల‌హ ప్రేత శ‌రీరాన్ని విడిచి దివ్య‌రూపిణి అయి అగ్ని శిఖ వ‌లె ల‌క్ష్మీక‌ళ‌తో ప్ర‌కాశించింది. అమితానందంతో ఆమె ధ‌ర్మ‌ద‌త్తునికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసుకుంటుండ‌గానే విష్ణు పారిష‌దులు ఆకాశం నుంచి విమానంతో స‌హా వ‌చ్చారు. వారిలోని పుణ్య‌శీల‌, సుశీల అనే ద్వార‌పాల‌కులు క‌ల‌హ‌ను విమానంలోకి తీసుకోగా అప్స‌రోగ‌ణాలు ఆమెను సేవించ‌సాగాయి. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగ‌ణాల‌కు ధ‌ర్మ‌ద‌త్తుడు సాష్టాంగ‌ప‌డ్డాడు. సుశీల‌, పుణ్య‌శీల ఇద్ద‌రూ అత‌న్ని లేవ‌దీసి సంత‌సం క‌లిగించే మాట‌లు ఈ విధంగా చెప్పారు.
"ఓ విష్ణుభ‌క్తా, దీనుల యందు ద‌యాబుద్ధి గ‌ల వాడ‌వు, ధ‌ర్మ‌విదుడ‌వు, విష్ణుభ‌క్తుడ‌వు అయిన నీవు అత్యంత యోగ్యుడ‌వు. లోకోత్త‌ర‌మైన కార్తీక వ్ర‌త‌పుణ్యాన్ని ఒక దీనురాలికి త్యాగం చేయ‌డం వ‌ల‌న నీ నూరు జ‌న్మ‌ల పాపాలు స‌ర్వ‌నాశ‌న‌మైపోయాయి. ఈమె పూర్వ సంచిత‌మంతా నీవు చేయించిన తుల‌సి స్నాన ఫ‌లం వ‌ల‌న తొల‌గిపోయింది. విష్ణు జాగ‌ర‌ణ ఫ‌లంగా విమానం వ‌చ్చింది. నీవు అమెకు అర్పించిన దీప‌దాన పుణ్యం వ‌ల‌న తేజోరూపాన్ని, తుల‌సీ పూజాదుల వ‌ల‌న విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొంద‌బోతోంది. ఓ ప‌విత్ర చ‌రిత్రుడా, మాన‌వుల‌కు మాధ‌వ సేవ వ‌ల‌న క‌లుగ‌ని మ‌నోవాంఛిత‌మంటూ ఏదీ లేదు. విష్ణుత‌త్ప‌రుడ‌వైన నీవు ఇద్ద‌రు భార్య‌ల‌తోనూ క‌లిసి అనేక వేల సంవ‌త్స‌రాలు విష్ణు సాన్నిధ్యంలో వినోదిస్తావు".
ధ‌ర్మ‌ద‌త్తునికి విష్ణుదూత‌ల వ‌రం
ఓ ధ‌ర్మ‌ద‌త్తుడా, వైకుంఠంలో నీ పుణ్య‌ఫ‌లానుభ‌వం అనంత‌రం తిరిగి భూలోకంలోని సూర్య‌వంశంలో ద‌శ‌ర‌థుడ‌నే మ‌హారాజుగా పుడ‌తావు. నీ భార్య‌లిద్ద‌రూ ఆ జ‌న్మ‌లో కూడా భార్య‌లుగా వ‌స్తారు. ఇప్పుడు నీవు పుణ్యాభిషిక్త‌ను చేసిన ఈ క‌ల‌హ ఆ జ‌న్మ‌లో నీకు మూడో భార్య‌గా వ‌స్తుంది. దివ్య‌కార్యం కోసం ఈ భూమిపై జ‌న్మించ‌నున్న విష్ణువు ఆ పుట్టుక‌లో నీ కుమారుడ‌వుతాడు. ఓ ధాత్రీ సువ‌రేణ్యా, విష్ణువుకి అత్యంత ప్రీతిక‌ర‌మైన కార్తీక వ్ర‌తంతో స‌మాన‌మైన య‌జ్ఞ‌యాగాదులు గాని, దాన తీర్థాలు గాని లేవు. అంత‌టి మ‌హోత్కృష్ట‌మైన‌ది, నీవు అచ‌రించిన‌ది అయిన కార్తీక వ్ర‌తంలోని స‌గ భాగాన్ని మాత్ర‌మే పొందిన ఈ క‌ల‌హ విష్ణుసాలోక్యం పొందుతోంది. ఆమెను ఉద్ధ‌రించాల‌నే నీ సంక‌ల్పం నెర‌వేరింది. గ‌నుక నీవు దిగులు విడ‌నాడ‌వ‌య్యా అని విష్ణుదూత‌లు చెప్పారు.
వింశాధ్యాయ స‌మాప్తః   
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 19, 20 అధ్యాయాలు స‌మాప్తం
25వ రోజు పారాయ‌ణం ముగిసింది. 

No comments:

Post a Comment