Friday, November 15, 2019

కార్తీక పురాణం- 18వ రోజు పారాయ‌ణం   (బ‌హుళ త‌దియ‌ రోజున‌)

పంచ‌మాధ్యాయం
నార‌దుడు చెప్పిన‌దంతా విన్న పృథువు ఓ దేవ‌ర్షీ, కార్తీక మాసం గొప్ప‌ద‌నం వివ‌రించి చెప్పి న‌న్ను ధ‌న్యుని చేశావు. అదే విధంగా స్నానాది విధులు, ఉద్యాప‌నాది విధులు య‌థావిధిగా తెలియ‌చేయండి అని కోరాడు.
కార్తీక వ్ర‌త విధివిధానాలు
శౌచం
శ్లో - అశ్విన్య‌స్య‌తు మాస‌స్య యా శుద్ధైకాద‌శీ భ‌వేత్‌
కార్తీక‌స్య వ్ర‌తారంభం త‌స్యాం కుర్యాద‌తంద్రితః
మ‌హారాజా, ఈ కార్తీక వ్ర‌తాన్ని ఆశ్వ‌యుజ శుద్ధ ఏకాద‌శి నాడే ప్రారంభించాలి. వ్ర‌త‌మాచ‌రించే దీక్ష తీసుకున్న వారు తెల్ల‌వారు ఝామున లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశ‌గా గాని, ఊరి వెలుప‌లికి గాని వెళ్లి య‌జ్ఞోప‌వీతాన్ని చెవికి త‌గిలించుకుని త‌ల‌కు గుడ్డ చుట్టుకుని ఉమ్మి వేయ‌డం వంటివి చేయ‌కుండా మూత్ర‌పురీషాల‌ను విస‌ర్జించాలి. ప‌గ‌లు గాని, సంధ్య‌ల‌లో గాని అయితే ఉత్త‌రాభిముఖంగాను, రాత్రి వేళ‌లో అయితే ద‌క్షిణాభిముఖంగాను అవ‌శిష్టం పూర్తి చేసుకోవాలి. అనంత‌రం మూత్రాయ‌వాన్ని చేత‌ప‌ట్టుకుని మ‌ట్టితో శుభ్రం చేసుకోవాలి. లింగ‌మందు ఒక సారి, గుద‌మందు మూడుసార్లు నీళ్ల‌తోనూ, రెండు సార్లు మ‌ట్టితోను, అపాన‌మందు ఐదుసార్లు, లింగ‌మందు ప‌ది సార్లు నీటితోను, రెండింటిలోనూ మ‌ట్టితో ఏడు సార్లు శుభ్రం చేసుకోవాలి. గృహ‌స్థుల‌కు ఈ విధ‌మైన శౌచ‌విధిని నియ‌మించారు. ఈ శౌచం బ్ర‌హ‌మ‌చారికి రెండు రెట్లు, వాన‌ప్ర‌స్థుల‌కు మూడు రెట్లు, య‌తుల‌కు నాలుగు రెట్లుగా నిర్ణ‌యించారు. ఇది ప‌గ‌లు జ‌రిపే శౌచం. ఏ ఆశ్ర‌మం వారైనా స‌రే రాత్రి పూట ఇందులో స‌గం ఆచ‌రిస్తే చాలు. ప్ర‌యాణాల్లో కూడా అందులో స‌గాన్ని పాటించాలి. చ‌ర‌ణాంగాది శౌచ‌క‌ర్మ చేసుకోని వారు ఆచ‌రించే క‌ర్మ‌లేవీ త‌త్ ఫ‌లాల‌నీయ‌వు.

దంత‌ధావ‌నం
ముఖ‌మార్జ‌నం చేయ‌ని వారికి మంత్రాలు ప‌ట్టివ్వు. ముఖాన్ని, జిహ్వ‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
మంత్రం - ఆయుర్బ‌లం య‌శోవ‌ర్చః ప్ర‌జాః ప‌శువ‌సూనిచ
బ్ర‌హ్మ ప్ర‌జ్ఞాంచ మేధాంచ త్వ‌న్నో దేవావ‌న‌స్ప‌తే
అనే మంత్రం ప‌ఠిస్తూ పాల‌వృక్షం 12 అంగుళాల శాఖ‌తో దంత‌ధాన‌వం చేసుకోవాలి. క్ష‌య‌తిథుల‌లోనూ, ఉప‌వాస దినాల‌లోనూ, పాడ్య‌మి, అమావాస్య‌, న‌వ‌మి, ప‌క్ష‌, స‌ప్త‌మి, సూర్య‌చంద్ర‌గ్ర‌హ‌ణాలు వంటి వేళ‌ల్లో దంత‌ధావ‌నం చేయ‌కూడ‌దు. ముళ్ల‌చెట్లు, ప‌త్తి, వావి, మోదుగ‌, మ‌ర్రి, ఆముదం చెట్ల పుల్ల‌ల‌తో దంత‌ధావ‌నం చేయ‌కూడ‌దు.
దంత‌ధావ‌నం త‌ర్వాత భ‌క్తి, నిర్మ‌ల‌బుద్ధి క‌ల‌వాడై గంధ పుష్ప‌తాంబూలాలు గ్ర‌హించి శివాల‌యానికి గాని, విష్ణ్వాల‌యానికి గాని వెళ్లి అక్క‌డి దేవ‌తా మూర్తుల‌కు అర్ఘ్య పాద్యాది ఉప‌చారాలు ఆచ‌రించి స్తోత్ర న‌మ‌స్కారాలు స‌మ‌ర్పించి నృత్య‌గీత‌వాద్యాది సేవ‌ల‌ను చేయాలి. దేవాల‌యాల్లోని గాయ‌కులు, న‌ర్త‌కులు, తాళ‌మృదంగాది వాద్య‌విశేష విద్వాంసులు అంద‌రినీ విష్ణుస్వ‌రూపులుగా భావించి పుష్ప‌తాంబూలాల‌తో అర్చించాలి. కృత‌యుగంలో య‌జ్ఞం, ద్వాప‌రంలో దానం భ‌గ‌వ‌త్ర్పీతిక‌రాలు కాగా ఈ క‌లియుగంలో అమిత భ‌క్తితో కూడిన సంకీర్త‌న ఒక్క‌టే ఆ భ‌గ‌వంతునికి సంత‌సాన్ని క‌లిగిస్తుంది.

నాయ‌నా, ఓ పృథురాజా ఒకానొక‌సారి నేను శ్రీ‌హ‌రిని ద‌ర్శించి తాతా, నీ నిజ‌మైన నివాస స్థాన‌మేదో చెప్ప‌మ‌నికోరాను. అందుకాయ‌న చిరున‌వ్వు చిందిస్తూ నార‌దా నేను వైకుంఠంలో గాని, యోగుల హృద‌యాల్లో గాని ఉండ‌ను. కేవ‌లం నా భ‌క్తులు న‌న్నెక్క‌డ కీర్తిస్తూ ఉంటారో అక్క‌డే ఉంటాను. న‌న్ను కీర్తించే భ‌క్తుల‌ను ఎవ‌రైనా గౌర‌వించిన‌ట్ట‌యితే సంతోషిస్తాను. న‌న్ను షోడ‌శోప‌చారాల‌తో పూచించినా నా కంత సంతోషం క‌లగ‌దు.ఎవ‌రు నా పురాణ గాధ‌ల‌ను, నా భ‌క్తుల కీర్త‌న‌లు విని నిందిస్తారో వారు నాకు శ‌త్రువులే అవుతారు అని చెప్పాడు.

ఆరాధ‌న‌కు ఉప‌యోగించ‌కూడ‌ని పూలు
ఓ రాజా, దిరిశెన‌, ఉమ్మెత్త‌, గిరిమ‌ల్లి, మ‌ల్లి, బూరుగ‌, జిల్లేడు, కొండ‌గోగు వీటి పుష్పాలు గాని, తెల్ల అక్ష‌త‌లు గాని విష్ణుపూజ‌కు ప‌నికిరావు. జ‌పాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిశెన పూలు, బండి గురివింద‌, మాల‌తి పుష్పాలు ఈశ్వ‌రార్చ‌న‌కు ప‌నికిరావు. ఎవ‌రైతే సిరిసంప‌ద‌లు కోరుకుంటారో అలాంటి వారు తుల‌సీద‌ళాల‌తో వినాయ‌కుని, గ‌రిక‌తో దుర్గాదేవిని, అవిసె పూల‌తో సూర్యుని పూజించ‌కూడ‌దు. ఏయే దేవ‌త‌ల‌కు ఏయే పూవు శ్రేష్ఠ‌మో వాటితోనే పూజించాలి.
శ్లో - మంత్ర‌హీనం క్రియాహీనం భ‌క్తిహీనం సురేశ్వ‌ర‌
య‌త్పూజితం మ‌యాదేవ ప‌రిపూర్ణం త‌థ‌స్తుతే
ఓ దేవా మంత్ర క్రియాదిక లోప‌భూయిష్ట‌మైన‌ప్ప‌టికీ నేను చేసిన ఈ పూజ నీకు ప‌రిపూర్ణ‌మ‌గు గాక అని  క్ష‌మాప‌ణ కోరుకోవాలి. ఆ త‌ర్వాత దైవానికి ప్ర‌ద‌క్షిణ న‌మ‌స్కారాదులు ఆచ‌రించి పునః క్ష‌మాప‌ణ‌లు చెప్పుకుని నృత్య‌గానాది ఉప‌చారాల‌తో పూజ స‌మాప్తం చేయాలి. ఎవ‌రైతే కార్తీక మాసంలో ప్ర‌తీ దినం రాత్రి శివ‌పూజ గాని, విష్ణుపూజ గాని ఆచ‌రిస్తారో వారు స‌మ‌స్త పాపాల నుంచి ముక్తి పొంది వైకుంఠాన్ని పొంది తీరుతారు.
పంచ‌మాధ్యాయ స‌మాప్తః
-----------
ష‌ష్ఠాధ్యాయం 
రాజా మ‌రింత వివ‌రంగా చెబుతాను విను. వ్ర‌త‌స్థుడు మ‌రో రెండు ఘ‌డియ‌ల్లో తెల్ల‌వారుతుంద‌న‌గా నిద్ర‌లేచి శుచియై నువ్వులు, ద‌ర్భ‌లు, అక్ష‌త‌లు, పువ్వులు, గంధం తీసుకుని న‌దికి వెళ్లాలి. చెరువుల్లో గాని, దైవ‌నిర్మిత జ‌లాశ‌యాల్లో గాని, న‌దుల్లో గాని,సాగ‌ర సంగ‌మాల్లో గాని స్నానం చేస్తే ఒక దాని కంటె ఒక‌టి ప‌ది రెట్లు అధిక పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్య‌తీర్ధంలో స్నానం చేస్తే అంత‌కు ప‌ది రెట్లు ఫ‌లం క‌లుగుతుంది. ముందుగా విష్ణువుని స్మ‌రించి స్నాన సంక‌ల్పం చేసి దేవ‌త‌ల‌కు అర్ఘ్యం ఇవ్వాలి.
అర్ఘ్యం మంతం
న‌మః క‌మ‌ల‌నాభాయ న‌మ‌స్తే జ‌ల‌శాయిన్
న‌మ‌స్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం న‌మోస్తుతే
సూచించిన విధంగా అర్ఘ్యాదుల‌నిచ్చి దైవ‌ధ్యాన న‌మ‌స్కారాలు చేసి
ఓ దామోద‌రా, ఈ జ‌ల‌మందు స్నానం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాను. నీ అనుగ్ర‌హం వ‌ల‌న నా పాపాల‌న‌నీ న‌శించిపోవు గాక‌. హే రాధార‌మ‌ణా, విష్ణూ కార్తీక వ్ర‌త‌స్నాతుడ‌నైన నా అర్ఘ్యాన్ని స్వీక‌రించుదువు గాక‌.
స్నాన‌విధి
ఇలా వ్ర‌త‌స్థుడు గంగ‌, విష్ణు, శివ‌, సూర్యుల‌ను స్మ‌రించి బొడ్డులోతు వ‌ర‌కు నీటిలో దిగి య‌థావిధిగా స్నానం చేయాలి. గృహ‌స్థులు ఉసిరిక ప‌ప్పు, నువ్వుల చూర్ణంతోనూ;  య‌తులు తుల‌సి మొక్క మొద‌టిలో మ‌ట్టితోను స్నానం చేయాలి. విదియ‌, స‌ప్త‌మి, ద‌శ‌మి, త్ర‌యోద‌శి, అమావాస్య ఈ తిథుల్లో నువ్వులు, ఉసిరి పండ్ల‌తో స్నానం చేయ‌కూడ‌దు. ముందుగా శ‌రీర శుద్ధికి స్నానం చేసి ఆ త‌ర్వాత మంత్ర‌స్నానం చేయాలి. స్ర్తీలు, శూద్రులు పురాణోక్త మంత్రాల‌తోనే స్నానం చేయాలి. 
భ‌క్తిగ‌మ్యుడై ఎవ‌డు దేవ‌కార్యార్దం త్రిమూర్త్యాత్మ‌కుడ‌య్యాడో స‌ర్వ‌పాప‌హ‌రుడైన ఆ విష్ణువు న‌న్నీ స్నానంతో ప‌విత్రుని చేయుగాక‌. విష్ణ్వ‌జ్ఞాప‌రులైన ఇంద్రాది స‌మ‌స్త దేవ‌త‌లు న‌న్ను ప‌విత్రుని చేయుదురు గాక‌. ర‌హో య‌జ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వ‌శిష్ఠ క‌శ్య‌పాది మునివ‌రిష్ఠులు న‌న్ను ప‌విత్రుని చేయుదురు గాక‌. గంగాది స‌ర్వ న‌దులు, తీర్థాలు, జ‌ల‌ధార‌లు, న‌దాలు, స‌ప్త‌సాగ‌రాలు, హ్ర‌దాలు న‌న్ను ప‌విత్రుని చేయుగాక‌. ముల్లోకాల్లోనూ గ‌ల అరుంధ్య‌త్యాది ప‌తివ్ర‌తామ త‌ల్లులు, య‌క్ష‌, సిద్ధ, గ‌రుడాదులు, ఓష‌ధులు, ప‌ర్వ‌తాలు న‌న్ను ప‌విత్రుని ప‌విత్రుని చేయుగాక. అని ప్రార్థించుకుని త‌ద‌నంత‌రం మంత్ర‌యుక్తంగా స్నానం చేసి చేతికి ప‌విత్రాన్ని ధ‌రించి దేవ‌, ఋషి, పితృ త‌ర్ప‌ణాల‌ను విధిగా చేయాలి. కార్తీక‌మాసంలో పితృత‌ర్ప‌ణ పూర్వ‌కంగా ఎన్ని నువ్వులైతే విడుస్తారో అన్ని సంవ‌త్స‌రాల పాటు పితృదేవ‌త‌లో స్వ‌ర్గంలో నివ‌శిస్తారు. ఆ త‌ర్ప‌ణానంత‌రం నీటి నుంచి తీరానికి చేరి ప్రాతః కాలానుష్ఠానం (సంధ్యావంద‌నాది విధులు) నెర‌వేర్చుకుని విష్ణుపూజ చేయాలి.
అర్ఘ్య‌మంత్రం
ప్ర‌తిప‌త్ కార్తీక మాసే స్నాత‌స్య విధినామ‌మ‌త్‌
గృహాణార్ఘ్యం మ‌యాద‌త్తం రాధ‌యా స‌హితో హ‌రే
అనే మంత్రంతో గంధ‌పుష్ప‌ఫ‌లాల‌తో కూడిన అర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్ధ దైవ‌తాల‌ను స్మ‌రించి స‌మ‌ర్పించాలి. అనంత‌రం వేద‌పారీణులైన బ్రాహ్మ‌ణులు భ‌క్తిపూర్వ‌కంగా గంధ తాంబూలాల‌దులిచ్చి పూజించి న‌మ‌స్క‌రించాలి. అలా పూజించేట‌ప్పుడు
శ్లో - తీర్థాని ద‌క్షిణే పాదే వేదాస్తన్ముఖ‌మాశ్రితాః
స‌ర్వాంగేష్యాశ్రితాః దేవాః పూజితోస‌మ‌ద‌ర్చ‌యా
కుడి పాద‌మందు స‌ర్వ‌తీర్థ‌ములు, ముఖ‌మందు చ‌తుర్వేద‌ములు, అవ‌య‌వ‌ములందు స‌ర్వ‌దేవ‌త‌ల‌తో అల‌రారే ఈ బ్రాహ్మ‌ణ పూజ వ‌ల‌న ప‌విత్రుడ‌న‌వుతున్నాను అనుకోవాలి. అటు మీద‌ట వ్ర‌త‌స్థుడు హ‌రిప్రియ‌మైన తుల‌సికి ప్ర‌ద‌క్షిణ చేసి దేవ‌త‌లచే నిర్మిత‌మై, మునుల‌తో పూజితురాల‌వైన ఓ తుల‌సీ, నీకు చేస్తున్న న‌మ‌స్కారాలు నాపాపాల‌ను నాశ‌నం చేయుగాక అనుకొని న‌మ‌స్క‌రించుకోవాలి. త‌దుప‌రి స్థిర‌బుద్ధి క‌ల‌వాడై హ‌రిక‌థ‌, పురాణ శ్ర‌వ‌ణాదుల్లో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పిన‌ది చెప్పిన‌ట్టుగా ఏ భ‌క్తులైతే ఆచ‌రిస్తారో వారు త‌ప్ప‌నిస‌రిగా దైవ‌సాలోక్యాన్ని పొందుతారు. స‌మ‌స్త రోగ‌హార‌క‌ము, పాప‌మార‌క‌ము, స‌ద్బుద్ధిదాయ‌క‌ము, పుత్ర‌పౌత్రధ‌న ప్ర‌ద‌ము, ముక్తికార‌క‌ము, విష్ణుప్రీతిక‌ర‌ము అయిన ఈ కార్తీక వ్ర‌తాన్ని మించింది క‌లియుగంలో మ‌రొక‌టి లేదు.
ష‌ష్ఠాధ్యాయ స‌మాప్తః
శ్రీ‌కార్తీపురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం అయిదు, ఆరు అధ్యాయాలు స‌మాప్తం
18వ రోజు పారాయ‌ణం ముగిసింది.

ప‌ద్మ‌పురాణాంత‌ర్గత  కార్తీక మాహాత్మ్యం ఐదు, ఆరు అధ్యాయాలు సమాప్తం

No comments:

Post a Comment