Thursday, October 31, 2019

కార్తీక పురాణం- 4వ రోజు పారాయ‌ణం  (శుక్ల చ‌వితి రోజున‌)

స‌ప్త‌మాధ్యాయం
ఓ జ‌న‌క రాజేంద్రా క‌ల్మ‌ష‌ఘ్న‌మైన కార్తీక మాసంలో పుష్పార్చ‌న‌, దీప విధానాల‌ను చెబుతాను విను.

ఈ కార్తీక మాసంలో క‌మ‌ల‌నాభుడైన శ్రీ‌హ‌రిని క‌మ‌లాల‌తో పూజించ‌డం వ‌ల‌న క‌మ‌లాస‌ని అయిన ల‌క్ష్మీదేవి ఆ భ‌క్తుల ఇంట స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకుంటుంది. తుల‌సీ ద‌ళాల‌తో గాని, జాజి పూల‌తో గాని, మారేడు ద‌ళాల‌తో గాని పూజించే వారు తిరిగి భూమిపై జ‌న్మించ‌రు. భ‌క్తియుక్తులై పండ్ల దానం చేసే వారి పాపాలు సూర్యోద‌యానికి చీక‌టి వ‌లె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయ‌ల‌తో పూజించే వారిని తేరి చూడ‌డానికి య‌మునికి కూడా శ‌క్తి చాల‌దు. కార్తీకంలో ఎవ‌రైతే సాల‌గ్రామాన్ని తుల‌సీద‌ళాల‌తో పూజిస్తారో వారికి మించిన ధ‌న్యులెవ‌రూ ఉండ‌ర‌నేది అతిశ‌యోక్తి కాదు. బ్రాహ్మ‌ణ స‌మేతులై ఉసిరి చెట్టు కింద వ‌న‌భోజ‌నం చేసే వారి మ‌హాపాత‌కాలు సైతం మ‌ట్టి క‌లిసిపోతాయి. బ్రాహ్మ‌ణ స‌మేతులై ఉసిరి చెట్టు కింద సాల‌గ్రామ పూజ చేసే వారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వ‌లె ఆనందిస్తారు. విష్ణు ఆల‌యంలో మామిడాకుల తోర‌ణం క‌డ‌తారో వారు ప‌ర‌మానందాన్ని పొందుతారు. పూల‌తో గాని, అర‌టి స్తంభాల‌తో గాని, మండ‌పం క‌ట్టిన వారు వైకుంఠంలో విష్ణు సామీప్యం పొందుతారు. ఒక్క‌సారైనా శ్రీ‌హ‌రికి సాష్టాంగ‌దండ ప్ర‌ణామం చేసిన వారు అశ్వ‌మేథం చేసినంత‌టి పుణ్య‌వంతుల‌వుతారు. 

విష్ణువుకు ఎదురుగా జ‌ప‌,హోమ‌, దేవ‌తార్చ‌న‌లు చేసే వారు పిత‌రుల‌తో స‌హా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానం చేసి త‌డి బ‌ట్ట‌లతో ఉన్న వానికి పొడి బ‌ట్ట దానం చేస్తే ప‌ది వేల అశ్వ‌మేథాల ఫ‌లాన్ని పొందుతారు. ఆల‌యం శిఖ‌రంపై ధ్వ‌జారోహ‌ణం చేసి వారి పాపాలు గాలికి పుష్ప ప‌రాగం వ‌లె ఎగిరిపోతాయి. న‌ల్ల‌ని లేదా తెల్ల‌ని అవిశె పూల‌తో శ్రీ‌హ‌రి పూజ చేసిన వారికి ప‌ది వేల య‌జ్ఞాల ఫ‌లం ల‌భిస్తుంది. ఏ స్ర్తీ అయినా బృందావ‌నాన్ని గోమయంతో అలికి, పంచ‌రంగుల‌తో శంఖ‌ప‌ద్మ‌స్వ‌స్తికాది రంగ‌వ‌ల్లులు తీర్చి దిద్దితే ఆమె విష్ణువుకు ప్రియురాల‌వుతుంది. విష్ణు స‌న్నిధిలో నందా దీపాన్ని అర్పించ‌డం వ‌ల‌న క‌లిగే పుణ్యాన్ని ఆదిశేషుడైనా వేనోళ్ల పొగ‌డ‌లేడు. కార్తీక‌మాసంలో శివుని జిల్లేడు పూల‌తో పూజించిన వారు దీర్ఘాయుష్మంతులై అంత‌మున మోక్షాన్ని పొందుతారు. విష్ణు ఆల‌యంలో మండ‌పాన్ని అలంక‌రించిన వారు హ‌రిమందిరంలో చిర‌స్థాయిగా ఉంటారు. హ‌రిని మ‌ల్లె పూల‌తో పూజించిన వారి పాపాలు స‌ర్వ‌నాశ‌న‌మైపోతాయి. తుల‌సీగంధంతో సాల‌గ్రామ పూజ చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు స‌న్నిధిలో నాట్యం చేసిన వారి పూర్వ‌సంచిత పాపాల‌న్నీ నాశ‌న‌మైపోతాయి. భ‌క్తియుక్తులై అన్న‌దానం చేసిన వారి పాపాలు గాలికి మంచుతున‌క‌ల్లా ఎగిరిపోతాయి.కార్తీక మాసంలో నువ్వుల దానం, మ‌హాన‌దీ స్నానం, బ్ర‌హ్మ‌ప‌త్ర భోజ‌నం, అన్న‌దానం ఈ నాలుగూ ఆచ‌రించ‌డం ధ‌ర్మంగా చెప్ప‌బ‌డుతోంది. స్నాన‌దానాలు ఆచ‌రించ‌ని వారు, లోభియై య‌థాశ‌క్తి దానం చేయ‌ని వారు నూరు జ‌న్మ‌లు కుక్క‌లుగా పుట్టి క‌డ‌ప‌ట ఛండాల‌యోనిన జ‌న్మిస్తారు. కార్తీక వ్ర‌త శూన్యులు మ‌రుజ‌న్మ‌లో గాడిద‌గా పుట్టి త‌దుప‌రి నూరు పుట్టుక‌లు శున‌క‌యోనిని జ‌న్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీ‌హ‌రిని క‌దంబ పుష్పాల‌తో పూజించిన వారు సూర్యమండ‌లంలోనే నివ‌శిస్తారు.

ఓజ‌న‌క మ‌హారాజా, కార్తీక మాసంలో ఎవ‌రైతే అవిశ పూల‌ను తాము ధ‌రించి త‌దుప‌రి ఆవిశ పూల మాలిక‌ల‌తో శ్రీ‌హ‌రిని పూజిస్తారో వారు స్వ‌ర్గాధిప‌తుల‌వుతారు. మాల‌లు, తుల‌సిద‌ళాల‌తో విష్ణువును పూజించే వ‌నిత‌లు వైకుంఠాన్ని పొందుతారు.
ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశ‌క్తులైన వారు
శ్లో - కార్తీకే భానువారేతు స్నాన‌క‌ర్మ‌మాచ‌రేత్
మాస స్నానేన య‌త్పుణ్యం త‌త్పుణ్యం ల‌భ‌తే నృప‌
శ్లో - ఆద్యేంతిమే తిథౌ మ‌ధ్య‌మేచ దినే యః స్నాన‌మాచ‌రేత్‌
మాస‌న్నాన ఫ‌లంతేన ల‌భ్య‌తే నాత్ర సంశ‌యః

కార్తీక మాసంలో ఆదివారం నాడు కాని లేదా శుక్ల పాడ్య‌మి, పూర్ణిమ నాడు గాని, అమావాస్య నాడు గాని సంక‌ల్ప స‌హితంగా ప్రాతః స్నాన‌మాచ‌రించ‌డం వ‌ల‌న ఆ మాస‌మంతా స్నానం చేసిన పుణ్యం ల‌భిస్తుంది. ఆ పాటి శ‌క్తి కూడా లేని వారు కార్తీక మాసం నెల‌రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మ‌హాపురాణాన్ని చ‌దివినా, విన్నా కూడా స్నాన‌ఫ‌లాన్ని పొందుతారు. తాము స్వ‌యంగా సంక‌ల్ప‌పూర్వ‌కంగా విష్ణువును పూజించే వారు అవ్య‌య ప‌దాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాల స‌మ‌యాల్లో దేవాల‌యాల్లో శివ‌, విష్ణు స్తోత్రాలు ప‌ఠించే వారు కొంత కాలం స్వ‌ర్గంలో ఉండి ఆ త‌ర్వాత ధ్రువ‌లోకాన్ని పొందుతారు. ఇలా ప్ర‌తీ కార్తీక మాసంలో ఎవ‌రైతే హ‌రిహ‌రుల‌ను స్మ‌రించ‌కుండా ఉంటారో వారు ఏడు జ‌న్మ‌ల పాటు న‌క్క‌లుగా పుడ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
స‌ప్త‌మాధ్యాయ స‌మాప్తః
---------------- 

అష్ట‌మాధ్యాయం
వ‌శిష్ఠుడు చెప్పిన‌దంతా విని జ‌న‌కుడు ఇలా అడుగుతున్నాడు. "ఓ మ‌హ‌ర్షీ మీరు చెప్పిన‌వ‌న్నీ విన్న త‌ర్వాత నాకొక సందేహం క‌లుగుతోంది. వ‌ర్ణ సాంక‌ర్యాది మ‌హాపాపాల‌ను చేసిన దుర్జ‌నులు వేద త్ర‌యోక్తాలైన ప్రాయ‌శ్చిత్తాల‌ను చేసుకొన‌నిదే ప‌రిశుద్ధులు కారు అని స‌మ‌స్త శాస్ర్తాలు ఘోషిస్తుండ‌గా కేవ‌లం కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ చేత‌నే స‌మ‌స్త పాపాలు న‌శించిపోయి వైకుంఠం పొందుతార‌ని చెప్ప‌డంలోని మ‌ర్మం ఏమిటి, ఎలా సాధ్యం? అత్యంత స్వ‌ల్ప‌మైన పుణ్య‌మాత్రం చేత‌నే గొప్ప‌గొప్ప పాపాలు ఎలా న‌శించిపోతాయి, అగ్ని ద‌గ్ధ‌మ‌వుతున్న ఇంటిలో ఉన్న వాడు ఆ మంట మీద పురిషెడు నీరు చ‌ల్లితే అగ్ని శిఖ‌లు ఆరిపోతాయా? ఏ మ‌హాన‌దీ ప్ర‌వాహంలోనైనా కొట్టుకుపోయే వారిని ఓ పాటి గ‌డ్డిప‌ర‌క గ‌ట్టుకు చేర్చ‌గ‌లుగుతుందా? త‌నంత తానుగా కొండ‌చ‌రియ‌ల‌లోని ఏ ల‌తా సూత్రాన్నో ప‌ట్టుకున్నంత మాత్రం చేత న‌దీ ప్ర‌వాహ వేగాన్నుంచి సంర‌క్షింప‌బ‌డ‌తాడా? వ‌శిష్ఠా ఏ విధ‌మైన దృష్టాంతాల రీత్యా మ‌హాపాపులైన వారు స‌హితం అతి స్వ‌ల్ప‌కార్య‌మైన కార్తీక వ్ర‌తాచ‌ర‌ణం వ‌ల‌న పాప‌ర‌హితులు, పుణ్యాత్ములు ఎలా అవుతారు?" అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.

జ‌న‌కుని ప్ర‌శ్న‌ల‌కు వ‌శిష్ఠుని స‌మాధానం
మంచి విమ‌ర్శే చేశావు మ‌హారాజా. చెబుతాను విను. ధ‌ర్మాన్నిసూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని ఆలోచించ‌కూడ‌దు. అదీ గాక వేద‌శాస్త్ర పురాణాల‌న్నీ అనేక ధ‌ర్మ‌సూక్ష్మాల‌ను మ‌న‌కందిస్తున్నాయి. ఆయా ధ‌ర్మ‌సూత్రాల వ‌ల‌న కొన్ని ప‌ర్యాయాలు గొప్ప‌గొప్ప పుణ్య‌కార్యాలు స్వ‌ల్ప‌మైన‌విగాను, స్వ‌ల్ప పుణ్య‌కార్యాలు గొప్ప‌విగాను ప‌రిణ‌మిస్తాయి. ధ‌ర్మాల‌న్నీ గుణ‌త్ర‌యంతో కూడుకుని స్వ‌ల్పాన‌ల్ప‌త‌ల‌ను సిద్ధింప‌చేసుకుంటాయి. మూల‌ప్ర‌కృతి అయిన మ‌హామాయ కార‌ణంగా స‌త్వ‌ర‌జ‌స్త‌మ‌స్సుల‌నే మూడు గుణాలూ ఏర్ప‌డ్డాయి. వాటిలో స‌త్వ‌గుణ ప్ర‌ధాన‌మైన‌వి ధ‌ర్మ‌సూక్ష్మాలు. క‌ర్మ‌కాండ‌, త‌ప‌స్సు, ప్రాయ‌శ్చిత్తం అన్నీ ర‌జోగుణం వ‌ల‌న ఏర్ప‌డ్డాయి. త‌ర్కం, దైవేత‌ర చింత‌న‌తో సాగించే దైవీయ కృత్యాలు, ఆచ‌రించే దాన‌ధ‌ర్మాలు ఇవ‌న్నీ ధ‌ర్మం యొక్క స్థూల స్వ‌రూపాలు. ఇవి త‌మోగుణం వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. వీటిలో స‌త్వ‌గుణంతో ఆచ‌రించే ధ‌ర్మాలు స్వ‌ల్పంగా క‌నిపించినా దేశ‌కాల యోగ్య‌త‌ల‌నున బ‌ట్టి విశేష ఫ‌లాల‌ను ఇస్తాయి. దేశ‌ము అంటే పుణ్య‌క్షేత్రం. కాల‌ము అంటే పుణ్య‌కార్యం. యోగ్య‌త అంటే పాత్ర‌త‌. బ్ర‌హ్మ‌జ్ఞ‌త క‌ల‌వారు ఈ మూడింటినీ చింతించ‌కుండా చేసే స‌ర్వ‌ధ‌ర్మాలూ, తామ‌సాలూ-వీటి వ‌ల‌న పాపాలు న‌శించ‌వు. కాబ‌ట్టి దేశ‌కాల యోగ్య‌త‌ల‌ను విచారించి చేసేవే స‌త్వ ధ‌ర్మాలు. వీటిలో కొన్ని స‌మ‌కూరి, కొన్ని స‌మ‌కూర‌క జ‌రిపేవి ర‌జోగుణాల‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు క‌దా, జ‌న‌క‌మ‌హారాజా. అన్నింటికీ క‌ర్మ‌మే మూలం. ఎవ‌రి క‌ర్మ‌ను బ‌ట్టి వారికి ఫ‌లితాలుంటాయి. అయిన‌ప్ప‌టికీ మ‌నిషికి జ్ఞానం ఉన్నందు వ‌ల‌న ఆచ‌రించే ధ‌ర్మాల‌ను పై మూడింటితో పోల్చుకుని ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగానైనా ఆచ‌రించాలి. ఈ విధంగా మూడూ క‌లిసి వ‌చ్చిన‌ప్పుడు ఆచ‌రించిన ధ‌ర్మం అక్ష‌య ఫ‌లాన్నిస్తుంది. రాజా ప‌ర్వ‌త‌మంత ఎత్తు క‌ట్టెల‌ను పేర్చి వాటి మ‌ధ్య గురివింద గింజంత అగ్నిక‌ణాన్ని ఉంచితే ఆ అగ్నిక‌ణం ఆ క‌ట్టెల‌ను ఎలా కాల్చివేయ‌గ‌లుగుతుందో, సువిశాల‌మైన న‌ట్టింట పెట్టిన న‌లుసంత దీపం ఆ ఇంటి చీక‌ట్ల‌నెలా తొల‌గిస్తుందో, గుండిగ‌డు మంచినీటిని ఒక ఇండుపు గింజ ఎలా శుభ్ర‌ప‌రుస్తుందో అదే విధంగా తెలిసి గాని, తెలియ‌క గాని పుణ్యాకాలంలో, పుణ్య‌క్షేత్రంలో, పుణ్య‌మూర్తుల వ‌ల‌న ఆచ‌రించే ధ‌ర్మం అనంత పాపాల‌నూ ద‌గ్ధం చేసి మోక్ష‌మార్గం వేస్తుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక క‌థ చెబుతాను విను. 

అజామిళోపాఖ్యాన‌ము   
అమిత పూర్వ‌కాలంలో క‌న్యాకుబ్జ క్షేత్ర‌నివాసి, సార్థ‌క నామ‌ధేయుడు అయిన స‌త్య‌నిష్ఠుడ‌నే బ్రాహ్మ‌ణునికి అజామిళుడ‌నే కుమారుడు ఉండే వాడు. వాడు ప‌ర‌మ దురాచారుడు. దాసీ సాంగ‌త్య‌ప‌రుడు, హింసాప్రియుడు. సాటి బ్రాహ్మ‌ణ గృహంలో ఒకానొక దాసితో సాంగ‌త్యం పెట్టుకుని త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి ఆ దాసీదానితోనే భోజ‌న శ‌య‌నాదుల‌న్నీ సాగించే వాడు. కామాంధుడై వైదిక క‌ర్మ‌ల‌న్నింటినీ విడిచిపెట్టి కేవ‌ల కామాస‌క్తుడై ప్ర‌వ‌ర్తించే వాడు. బంధువులంతా అత‌న్ని వ‌దిలివేశారు. కులంలోని వారు వెలి వేశారు. ఈ కార‌ణంగా ఇల్లు వ‌దిలిపెట్టి వెళ్లిపోవ‌ల‌సివ‌చ్చింది. అజామిళుడు ఛండాల‌పు వారిళ్ల‌లో ఒకానొక దాసీదానితో కాపురం పెట్టి, కుక్క‌లు, మృగాల‌ను ఉచ్చులు వేసి ప‌ట్టుకునే వృత్తిలో బ‌తికే జ‌నాల్లో ఒక‌డుగా ఉంటూ మ‌ధుమాంస సేవ‌న‌లు సాగించే వాడు. ఇలా ఉండ‌గా ఒక‌నాడ‌త‌ని ప్రియురాలైన దాసీది క‌ట్టుతాగి తాటి చెట్టు ఎక్క‌డం వ‌ల‌న క‌మ్మ విరిగి కింద ప‌డి మ‌ర‌ణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్ప‌టికే ఆ దాసీదానికి య‌వ్వ‌న‌వ‌తి అయిన కూతురు ఉంది. మ‌హాపాపాత్ముడు, మ‌హాకామాంధుడు అయిన అజామిళుడు త‌న కూతురు వ‌ర‌స అని కూడా త‌ల‌చ‌కుండా ఆ పిల్ల‌నే వ‌రించి ఆమెతో కామోప‌భోగాలు అనుభ‌వించ‌సాగాడు. కాముకుడైన అజామిళుడు కూతురుతోనే అనేక మంది బిడ్డ‌ల‌ను పొందాడు. కాని వారంతా ప‌సికందులుగానే క‌డ‌తేరిపోయారు. చివ‌రిగా పుట్టిన బిడ్డ‌కు "నారాయ‌ణ" అని నామ‌క‌ర‌ణం చేసి అమిత ప్రేమ‌తో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా నిరంత‌రం కుమారునే స్మ‌రించుకుంటూ "నారాయ‌ణా, నారాయ‌ణ" అని పిలుచుకుని త‌న్మ‌యుడ‌వుతూ ఉండేవాడు. కాలం గ‌డిచి అజామిళుడు కాలం చేస స‌మ‌యం ఆస‌న్న‌మ‌యింది. అత‌నిలోని జీవుని తీసుకుపోయేందుకు ఎర్ర‌ని గ‌డ్డ‌ములు, మీస‌ములు క‌లిగి, చేత‌దండ‌పాశాల‌ను ధ‌రించిన భ‌యంక‌ర రూపులైన య‌మ‌దూత‌లు వ‌చ్చారు. వారిని చూస్తూనే గ‌డ‌గ‌డ‌లాడిపోయిన ఆ అజామిళుడు ప్రాణావ‌సాన వేళ కూడా పుత్ర‌వాత్స‌ల్యాన్ని వీడ‌క ఎక్క‌డో దూరంగా స్నేహితుల‌తో ఆట‌ల్లో మునిగి ఉన్న కుమారుని కోసం "నారాయ‌ణా, ఓ నారాయ‌ణా, ఓ తండ్రీ నారాయ‌ణా" అని ప‌దేప‌దే పిలిచాడు. ఆ పిలుపు అత‌ని కుమారునికి విన‌ప‌డ‌లేదు. అత‌ను రానూలేదు. కాని చేరువ‌కు వ‌చ్చిన య‌మ‌దూత‌లు ఆ నారాయ‌ణ నామ‌స్మ‌ర‌ణం విని వెన‌క్కి త‌గ్గారు. అదే స‌మ‌యంలో విష్ణుదూత‌లు వ‌చ్చి "ఓ య‌మ‌దూత‌లారా, అడ్డు తొల‌గండి. అత‌డు మా వెంట రాద‌గిన వాడే గాని, మీ వెంట రాద‌గిన వాడు కాదు" అని హెచ్చ‌రించారు. విక‌సిత ప‌ద్మాల వ‌లె విశాల‌మైన నేత్రాలు క‌ల‌వారు, ప‌ద్మ‌మాలాంబ‌ర ధ‌రులైన ఆ విష్ణుదూత‌ల‌ను చూసి విభ్రాంతులైన య‌మ‌దూత‌లు "అయ్యా మీరెవ‌రు, మా ప్ర‌భువైన య‌మ‌ధ‌ర్మ‌రాజు మాకు విధించిన ధ‌ర్మం ప్ర‌కారం తీసుకుని వెళ్ల‌నున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళ్తామంటున్నారు" అని అడిగారు. వారికి విష్ణుదూత‌లు ఇలా స‌మాధానం చెప్ప‌సాగారు.
నాల్గ‌వ‌ రోజు పారాయ‌ణం స‌మాప్తం

No comments:

Post a Comment