Thursday, April 14, 2016

"గురు" చాతుర్యం

గురు శ‌బ్దంలో గు అంటే అంధ‌కారం, రు అంటే తొల‌గించ‌డం...అంటే మ‌న‌లోని అంధ‌కారాన్ని తొల‌గించి జ్ఞాన జ్యోతిని వెలిగించే వారే గురువు అని దీని అర్ధం. గురువుల వ‌ద్ద విద్య అధ్య‌య‌నం చేసే వారిలో ప‌లు ర‌కాల శిష్యులుంటారు. కొంద‌రు గురువు ఏం చెబితే దాన్ని తుచ త‌ప్ప‌కుండా పాటిస్తారు. గురువు త‌మ‌ను ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ త‌ప్పుదారిలో న‌డిపించ‌ర‌నే విశ్వాసం వారిది. మ‌రి కొంద‌రు శిష్యులు ప్ర‌తి దాన్ని తార్కిక దృష్టితో చూస్తూ గురువుతో త‌ర్కిస్తూ ఉంటారు. ఆ త‌ర్కంలో త‌మ‌కు సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం అందుకున్న త‌ర్వాత వారు కూడా గురువు చెప్పిన అంశాన్ని తుచ త‌ప్ప‌కుండా ఆచ‌రిస్తారు. అలాంటి త‌ర్కం కూడా ఒక్కోసారి మేలే చేస్తుంది..గురూజీ బోధ‌న‌లోని ఆంత‌ర్యం ఏమిటో ప‌ది మందికి తెలుస్తుంది. స‌త్యం విశ్వ‌వ్యాపితం అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ క‌థ చ‌ద‌వాల్సిందే... 

ఒక గురూజీ త‌న శిష్యుల‌కి విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం మ‌హాత్మ్యాన్ని బోధిస్తున్నారు.
"శ్రీ‌రామ రామ రామేతి ర‌మే రామే మ‌నోర‌మే
స‌హ‌స్ర‌నామ త‌త్తుల్యం రామ‌నామ వ‌రాన‌నే"
శ్లోకం వ‌ల్లె వేయించి విశిష్ట‌త తెలియ‌చేస్తూ రామ‌నామం మూడు సార్లు జ‌పిస్తే 
స‌హ‌స్ర విష్ణునామ పారాయ‌ణ‌తో స‌మానం అని చెప్పారు.
రామ‌నామం వ‌ల్లె వేస్తున్న శిష్యుల్లో ఒక‌డు గురువు మాట‌తో విభేదించాడు. 
"గురూజీ మూడు సార్లు రామ‌నామం ప‌లికితే వెయ్యి నామాల జ‌పం ఎలా అవుతుంది...? ఆ త‌ర్కం ఏమిటో నాకు అర్ధం కావ‌డంలేద‌"న్నాడు. 
శ్రీ‌రామ‌చంద్రుని  మ‌హాభ‌క్తుడైన గురూజీ అప్ప‌టిక‌ప్పుడే త‌డుముకోకుండా జ‌వాబిస్తూ శ్రీ‌రామ‌నామం వ్య‌వ‌హారంలో ఉన్న ప‌దాల‌న్నింటిలోనూ అత్యంత మధుర‌మైన‌ద‌ని సాక్షాత్తు ప‌ర‌మ‌శివుడే చెప్పాడు. ఆ నామాన్ని ఒక సారి జ‌పిస్తే విష్ణు స‌హ‌స్ర‌నామం ఒక సారి పారాయ‌ణ చేసినట్టు లేదా విష్ణునామం వెయ్యి సార్లు జ‌పించిన‌ట్ట‌వుతుంద‌న్న‌ది ఆ శివుని వాక్కే అన్నారు.
దానికో ఆస‌క్తిక‌ర‌మైన లెక్క కూడా చెప్పారు.
రామ శ‌బ్దాన్ని తీసుకుంటే ర మ‌రియు మ అక్ష‌రాలు క‌నిపిస్తాయి. 
ర (హ‌ల్లుల్లో ఆ వ‌ర‌సలో రెండో అక్ష‌రం...య‌,ర‌,ల‌,వ‌,శ‌,ష‌)
మ ( హ‌ల్లుల్లో ఆ వ‌ర‌సలో ఐదో అక్ష‌రం...ప‌,ఫ‌,బ‌.భ‌.మ‌)
రామ‌లో ఉన్న రెండు ప‌దాల్లోని అంకెల‌ను గుణిస్తే (2X 5) 10 వ‌స్తుంది. 
రామ‌, రామ‌, రామ అన‌డం వ‌ల్ల 2X 5, 2X 5, 2X 5 = 10X10X10 = 1000. ఈ త‌ర్కం ప్ర‌కారం మూడు సార్లు రామ‌నామం జ‌పిస్తే వెయ్యినామ జ‌పం అయిన‌ట్టా, కాదా..? 
గురూజీ లెక్క‌ల‌తో  స‌హా చెప్పిన ఈ త‌ర్కం ఆ కొంటెకోణంగికి బాగా న‌చ్చింది. వెనువెంట‌నే పూర్తి మ‌న‌స్సు పెట్టి విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణ క్ర‌మాన్ని సంపూర్ణంగా అధ్య‌య‌నం చేయ‌డం ప్రారంభించాడు. ఈ త‌ర్కాన్ని ప్ర‌పంచానికి తెలియ‌చేసినందుకు ఆ కొంటె శిష్యుని అబినందించ‌కుండా ఉండ‌గ‌ల‌మా...?

No comments:

Post a Comment