Thursday, October 30, 2014

బిల్వ మహిమ - భస్మధారణ ఫలం

శివ స్వరూపంగా బిల్వవృక్షం భావించబడుతున్నది. మొత్తం చతుర్దశ (14) భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వ వృక్షం సూచిక అంటారు. దీని మూలం (వేర్లు) గంధపుష్పార్చితం చేసేవారికి వంశాభివృద్ధి, ఈ వృక్షం చుట్టూ దీపారాధన శివజ్ఞానదాయిని, ఇంత విశేష మహిమగల ఈ మారేడు చెట్టు నీడన, ఒక్కరికి అన్నం పెట్టినా కోటిమందికి అన్నదానం చేసిన ఫలితం. దీని క్రింద ఒక శివభక్తునికి క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే, అట్టివాడికి జన్మాంతరాల యందు కూడా అన్నదారిద్ర్యం ఉండదు.
సాలగ్రామ శిలా మహిమ:
గుప్పిట్లో ఇమిడే ప్రమాణం గల సాలగ్రామ శిలలను, గృహ పూజలలో వాడవచ్చు!
ఈ సాలగ్రామ శిలలు గండకీ నదిలో మహావిష్ణు ప్రతిరూపాలుగా లభ్యమవుతాయి. సహజ శంఖ చక్ర చిహ్నాలు కలిగిఉంటాయి.
ఈ సాలగ్రామ శిలాదానం ఇహపర సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలకు మోక్షప్రాప్తిని కలిగిస్తుంది.
సోమవారం శివ ప్రీతికరం
లోకరీతి ప్రకారం, సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతున్నది.
శంకరుడు అగ్నిని తన స్వరూపంగా కలిగిన లక్షణయుతుడు. (త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ...అని రుద్ర సూక్తం) ఈ వేడిమిని చల్లబరచ గలిగేది సోముడు. (చంద్రుడు).
జ్యోతిషరీత్యా 'కృత్తికాగ్నిర్దేవతా' అని శ్రుతి. అగ్ని నక్షత్రం కృత్తిక. కృత్తికా నక్షత్రం చంద్ర కళలన్నీ ఉండే పూర్ణిమనాడు ఉండటం ఏ మాసంలో సంభవిస్తుందో అదే కార్తీకం. కనుకనే కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది.
అంతరార్ధం ప్రకారం (స + ఉమ = సోమ) ఉమాసహితంగా ఉండే రోజు కనుక సోమవారం శివ ప్రీతికరం!
భస్మధారణ - ఫలం
భస్మము ద్వివిధాలుగా ఉంటుంది.
1. స్వల్పభస్మం 2. మహాభస్మం . వీటివల్లనే శ్రౌత, స్మార్త - లౌకికాలనే మూడు విభూతులు ఉత్పన్నమయ్యాయి.
విభూతిని శివనామస్మరణంతోనూ; మంత్రపూర్వకంగానూ ధరించవచ్చు!
త్రిపుండ్రాలుగా ధరించబడే ఈ విభూతిలో ముఖ్య ద్రవ్యం - కాల్చబడిన గోమయం. వితంతుస్త్రీలు పంచాక్షరీ జపంతో భస్మధారణ చేయాలి.
సత్యశాంభవ దీక్షాయుతులు మాత్రం ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మధారణతో ఉండాలి.
భస్మధారణ లేకుండా చేసే ఏ పూజలైనా, నిష్ఫలాలని చెప్తుంటారు. 32 స్థానాలు భస్మధారణానుకూలం. సాధారణంగా 16చోట్ల భస్మం ధరించేవారున్నారు. గృహస్థులు మాత్రం తల, బాహుద్వయం, హృదయం, నాభి అనే ఐదు తావుల భస్మధారణ చేస్తేచాలు!
నీచులనుండి దానం పరిగ్రహించడం కూడా పాపమే!.. ఇట్టి పాపాన్ని పోగొట్టగలది భస్మధారణ.
ఇంకా...స్త్రీ హత్య, గోవధ, పరస్త్రీగమనం, అకారణహింస, పంట దొంగలించుట, గృహదహనాది సమస్త ఘోరపాపాలకు భస్మధారణ తక్షణ నివృత్తి సాధకమని శివ తత్త్వజ్ఞులు చెప్తారు.
నియమంగా భస్మధారణ చేయడం, శివోపాసన చేయడం దేవతలకు సంప్రీతికరం కనుక అట్టివాడు దైవకృపకు తప్పక పాత్రుడు కాగలడు.
ఇక, ఇప్పుడు ఏయే రోజులలో ఏయే దేవతలను పూజ ద్వారా సంతృప్తి చేయవచ్చునో చెప్పి, ఈ అనంత మహాపురాణానికి ఉపసంహారం చెప్పుకుందాం!
వివిధ దేవతారాధన :
1. ప్రతినెలా బహుళపక్ష చవితి : విఘ్నేశుడు , పాపనివారణ
2. ప్రతిపక్షంలోనూ ద్వాదశి : విష్ణువు , అఖండ సంపద
3. జ్యేష్ఠ - మార్గశీర్ష మాసాలు : శివారాధన, భోగ మోక్ష ప్రదం
4. కార్తీక మాసం ఆదివారాలు : సూర్యుడు , సర్వరోగ నివారణ
5. అశ్వయుజ శుక్ల పక్షం : దేవి , ఐశ్వర్య భోగ సిద్ధి

No comments:

Post a Comment