Thursday, March 25, 2021

శ్రీ‌రామ నీనామ మెంతో రుచిరా...

 #సంభవామి_యుగే_యుగే

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .
మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు
మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం - రాముడు .
ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు
ఆనందం నడిస్తే రాముడు
వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు
ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా
వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ
భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు
కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .
విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !
తిరుగులేని మాటకు - రామబాణం
సకల సుఖశాంతులకు - రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన
ఆజానుబాహుడి పోలికకు - రాముడు
అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు
రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .
చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
Rama killed Ravana ;
Ravana was Killed by Rama .
ఆదర్శ దాంపత్యానికి సీతారాములు
గొప్ప కొడుకు - రాముడు
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు
గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .
మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).
మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).
సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .
రామాయణం పలుకుబళ్లు
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .
తెలుగులో కూడా అంతే .
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...
చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం
కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .
వికారంగా ఉంటే -
శూర్పణఖ
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).
పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.
మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర
పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .
ఎంగిలిచేసి పెడితే -
శబరి
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు
అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
అగ్ని పరీక్షలే .
పితూరీలు చెప్పేవారందరూ -
మంథరలే.
సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని
యుద్ధమంటే రామరావణ యుద్ధమే .
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు
ఒంటిమిట్టది ఒక కథ ..
భద్రాద్రిది ఒక కథ
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం
చెబితే మహా భారతం
అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు
అది ఒక జీవన విధానం
అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు
రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు
జై శ్రీ రామ్.....
|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
జై శ్రీరామ్
జై హనుమాన్

Wednesday, January 13, 2021

జై హ‌నుమాన్‌


 

భగవంతుడు భక్తసులభుడు అనడానికి నిదర్శనం. ఇరవై ఏళ్ళక్రితం మనచే సుందరకాండ మహోద్యమము ప్రారంభింపజేసిన అంబ‌ర్ పేట ప్రేమ్ న‌గ‌ర్ అభయాంజనేయ స్వామివారు మెల్లమెల్లగా కరోనాను తగ్గిస్తూ మనను లాక్ డౌన్ నుండి విముక్తి చేస్తున్నారు. ఇటీవల నేను అ స్వామిని సందర్శించవలసి వచ్చింది. ఐతే ఆ సమయములో దర్శనాలు పూర్తి అయినందున గర్భాలయానికి తాళం వేశారు. అందుచేత గ్రిల్స్ నుండే స్వామివారిని సందర్శించుకున్నాను. అప్పుడు స్వామివారిని చూస్తుంటే ఏమనిపించిందో తెలుసా మనలను లాక్ డౌన్ నుండి విముక్తి చేయడానికి స్వామివారే స్వయముగా లాక్ డౌన్లోనికి వెళ్లారు అని. .... మన స్వామివారిని భక్త గణానికి దర్శింపజేయడానికే ఈ పోస్టింగును పెట్టాము. 


 మీ శృంగారం సింగరాచార్యులు.

Saturday, September 12, 2020

శ్రీ హ‌నుమ న‌వాక్ష‌రీ జ‌పం

సుంద‌ర‌కాండ భ‌క్త‌కోటికి
శుభాశీస్సులు. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న పుణ్య‌భూమిని ఆశ్ర‌యించి అర్ధ సంవ‌త్స‌రం గ‌డిచింది. మ‌న భ‌క్తుల్లో 5 శాతం మంది దీని బారిన ప‌డినా మ‌నం కావిస్తున్న పూజ‌ల ఫ‌లితంగా మృత్యువు మ‌న ద‌రిదాపుల‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతూ ఉన్న‌ది. శ్రీ రామ‌చంద్ర‌స్వామివారి క‌ల్యాణం, వినాయ‌క చ‌వితి లాంటి ఎన్నో ముఖ్య‌మైన పండుగ‌ల‌కు దూర‌మ‌య్యాం. అస‌లు ఈ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర‌మైనా లేదా ఆంగ్ల సంవ‌త్స‌రం 2020 అయినా ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ఎంతో కీడు చేసింది. క‌రోనాతో మ‌న వారు నాకు ఫోన్ చేయ‌డం, వెంట‌నే నేను స్వామివారిని కోర‌డం, వారు ఈ రోగం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం జ‌రిగింది. ఈ రోజు అన‌గా 8-9-2020 ఉద‌యం నుంచి మ‌న ‌వాళ్లు ఎంద‌రి నుండో ఎన్నో స‌మ‌స్య‌ల‌తో కూడిన ఫోన్లు అందుకున్నాను. సాయంత్రం స్వామివారి పీఠం వ‌ద్ద కూర్చుని క‌ర్త‌వ్యం గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు చేతిలో నుంచి శ్రీ ఆంజ‌నేయ స‌హ‌స్ర‌నామార్చ‌న పుస్త‌కం జారి ప‌డింది. కొన్ని కాగితాలు అందులో నుంచి విడిపోయాయి. వాటిని ఏరుకునే క్ర‌మంలో స్వామివారి 900వ నామం ఉన్న కాగితంపై చూపు ప‌డింది. అదే

ఓం మ ‌హా సుం ద ‌రా య న ‌మః
1    2   3   4     5  6   7   8   9

సుంద‌ర‌కాండ మొత్తం ఈ నామం పైనే ఆధార‌ప‌డి ఉంది. ఎలాగంటే...
"బుద్ధిర్బ‌లం, య‌శోధైర్యం, నిర్భ‌య‌త్వం, అరోగ‌తా, అజాడ్యం, వాక్ప‌టుత్వంచ హ‌నుమ‌త్ స్మ‌ర‌ణా భ‌వేత్‌"
శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి స్మ‌ర‌ణ వ‌ల‌న మ‌న‌కు పైన శ్లోకంలో వివ‌రించిన లాభాలు స‌మ‌కూరుతాయి. మ‌రి ఇలాంటి లాభాలు స‌మ‌కూర్చే ఆంజ‌నేయ‌స్వామివారు సుల‌భంగా ఎక్క‌డ ల‌భ్య‌మ‌వుతారు?  మొత్తం రామాయ‌ణంలోని ఆరు కాండ‌ముల‌లో సుంద‌ర‌కాండ‌మునందు మాత్ర‌మే విరాట్ స్వ‌రూపుడై మ‌న‌కు ల‌భిస్తారు. అందుచేత‌నే సుంద‌ర‌కాండం ఆయ‌న నామంతోనే విల‌సిల్లుతోంది. ఆంజ‌నేయ‌స్వామివారు శివాంశ సంభూతుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు సుంద‌రేశుడు, మ‌హాసుంద‌రుడు అనే నామాలు కూడా ఉన్నాయి.

అందుకే శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి స‌హ‌స్ర నామాల్లో 900వ నామం మ‌హాసుంద‌రాయ న‌మః అని పొందుప‌ర‌చ‌బ‌డింది. కాబ‌ట్టి మ‌హాసుంద‌రాయ న‌మః అనే ఒక్క నామానికి ఒక్కొక్క సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేసిన ఫ‌లితం ల‌భిస్తుంది. 

తొమ్మిద‌వ నంబ‌రుకు చాలా ప్రాధాన్య‌త ఉంది. ఆ ప్రాధాన్య‌త‌ను స‌మ‌యాభావం వ‌ల‌న ఇక్క‌డ వివ‌రించ‌డంలేదు. "త్రిజ‌టా స్వ‌ప్ప వృత్తాంతం"లో దీని స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇవ్వ‌బ‌డుతుంది. కాబ‌ట్టి ఈ 900 నామం చాలా మ‌హిమాన్విత‌మైన‌ది.

డిసెంబ‌రు 2020 వ‌ర‌కు ఈ క‌రోనా ఉంటుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అలాగే ఈ 2020 సంవ‌త్స‌రం ప్ర‌క‌ల‌కు అచ్చిరాని సంవ‌త్స‌రం. అందుచేత మ‌నం ఈ మ‌హిమ గ‌ల శ్రీ స్వామివారి నామాన్ని జ‌ప‌రూప‌కంగా నిర్వ‌హిస్తూ ఈ సంవ‌త్స‌రంలోని శేష మాసాలు మ‌న‌కు ఎలాంటి ఆప‌ద‌లు సంభ‌వించ‌కుండా చూచుకుందాము

ఈ జ‌పానికి ద‌శ‌కోటి నామోచ్ఛ‌ర‌ణ (10,00,000) కావించాల‌ని, దీనికి 30 రోజుల గ‌డువు ఉండాల‌ని నిర్ణ‌యించాము. ఈ కార్య‌క్ర‌మానికి ముందుగా భ‌క్తుల‌ను న‌మోదు చేసుకునే కార్య‌క్ర‌మంతో ప్రారంభించి ముగింపు త‌ర్వాత శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి అష్టోత్త‌రశ‌త మ‌రియు స‌హ‌స్ర నామార్చ‌న కావించాల‌ని నిర్ణ‌యించాం. 

అలాగే

భ‌క్తులు చేసిన జ‌ప సంఖ్య‌ను వారి గోత్ర నామాల‌తో స‌హా లిస్టుల‌ను సిద్ధం కావించి ఆ లిస్టును కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామివారి పాదస‌న్నిధికి చేర్చాల‌ని గొప్ప నిర్ణ‌యం త‌ల‌పెట్టాము (నిబంధ‌న‌ల వ‌ల‌న కొండ‌గ‌ట్టుకు వెళ్ల‌డానికి భ‌క్తులు అనుమ‌తించ‌బ‌డ‌రు).

భ‌క్తుల గోత్ర నామాల న‌మోదు కార్య‌క్ర‌మం
ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి 14-9-2020 సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల పేర్ల న‌మోదు ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 17-9-2020 వ‌ర‌కు (మ‌హాల‌య అమావాస్య‌) ఎంత మంది భ‌క్తులు ఈ జ‌పంలో పాల్గొన‌బోతున్నారో వారి గోత్ర‌నామాల‌తో స‌హా ఫైన‌ల్ లిస్టు ఈ దాసునికి చేరుతుంది. 

జ‌ప ప్రారంభ కార్య‌క్ర‌మం
అధిక ఆశ్వ‌యుజ మాసం మొద‌టి రోజు వ‌దిలి 19-9-2020 శ‌నివారం నుంచి జ‌పాలు ప్రారంభించ‌బ‌డి 16-10-2020 శుక్ర‌వారంతో ముగుస్తుంది. నిజ ఆశ్వ‌యుజ మాసం రెండ‌వ రోజు శ‌నివారం రోజున శ్రీ స్వామివారికి స‌హ‌స్ర‌నామార్చ‌న జ‌రుప‌బ‌డుతుంది.

ప‌ర్య‌వేక్ష‌కులు
య‌థాప్ర‌కారం భ‌క్లుల లిస్టులు సిద్ధం కావించి అందించ‌డానికి శ్రీ ఆత్మూరి మాణిక్య‌రావుగారిని కోరుతున్నాము.
అలాగే స‌మ‌య నిబంధ‌న‌లు పాటించి త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డానికి శ్రీ దామ‌రాజు వేంక‌టేశ్వ‌ర్లు గారిని కోరుతున్నాము. గ‌డువు ముగిస‌న త‌ర్వాత వ‌చ్చే పేర్ల‌ను శ్రీ మాణిక్య‌రావుగారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ల‌సిన ప‌ని లేదు. అలాగే స‌మ‌య‌పాల‌న చేయ‌ని వారిని ఒక త‌ప్పు కాచి రెండ‌వ సారి త‌ప్పు చేస్తే వారి పేర్ల‌ను శాశ్వ‌తంగా తొల‌గించ‌వ‌చ్చును.
 
జ‌పంలో పాల్గొనే భ‌క్తుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు
ఎన్ని మార్లు చెప్పినా పాల్గొనువారు ప్ర‌క‌ట‌న పూర్తిగా చ‌ద‌వ‌కుండా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌రిగ్గా పాటించ‌కుండా మాకు త‌ల‌నొప్పి క‌ల‌గ‌చేస్తున్నారు. ఈ మారు మాత్రం నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌ప అవ‌కాశం క‌లుగ‌చేయ‌లేము.
నిబంధ‌న‌లు జాగ్ర‌త్త‌గా చ‌దివి అమ‌లు చేయండి.
1. పాల్గొను వారు త‌మ వివ‌రాలు ఇలా ఇవ్వాలి. 1) గోత్రం 2) ఇంటిపేరు 3) పాల్గొను వారి పేరు
2. చాలా మంది పేర్లు, గోత్రాలు ఇంగ్లీషు అక్ష‌రాల్లో ఇవ్వ‌డం వ‌ల‌న తెలుగులోకి వ‌చ్చే స‌రికి త‌ప్పులు వ‌స్తున్నాయి. అందుచేత పాల్గొనే వారు త‌మ వివ‌రాలు తెలుగులోనే రాయాలి. ఒక‌వేళ తెలుగులో రాయ‌లేని వారు కాగితం మీద తెలుగులో రాసి ఫొటో తీసి పంప‌వ‌చ్చును. నిబంధ‌న‌లు పాటించ‌ని వారి పేర్లు మాణిక్య‌రావుగారు తిర‌స్క‌రించ‌వ‌చ్చును.
3.మ‌న ముందు శ్రీ స్వామివారు 10 కోట్ల నామోచ్చార‌ణ అనే పెద్ద భారం పెట్టినందున ప్ర‌తి వారు త‌మ జ‌పాల‌ను పెంచే ప్ర‌య‌త్నం చేయండి. కొంద‌రు త‌మ పేర్లు లిస్టులో రావ‌డానికి ఒక జ‌ప‌మాల‌ను తిప్పి అయింద‌నిపిస్తారు. అలా కాకుండా త్రిక‌ర‌ణ‌శుద్ధిగా రోజూ ఈ జ‌పం నిర్వ‌హించండి.
4. జ‌పం ఉద‌యం పూట‌నే చేయాలి. భోజ‌న‌మున‌కు ముందు జ‌పం పూర్తి కావాలి
5. మీ జ‌న సంఖ్య‌ను ఏ రోజుది ఆ రోజే మ‌ధ్యాహ్నం 2 గంట‌లు దాట‌కుండా పోస్టు చేయాలి.
6. మీ పోస్టింగులు సుంద‌ర‌కాండ గ్రూప్ లో మాత్ర‌మే ఉండాలి. ఇత‌ర‌త్రా ఎలా పంపినా వాటిని తిర‌స్క‌రిస్తాము.
7. సందేహాలు తీర్చుకోవ‌డానికి మా ఫోను ద్వారా అవ‌కాశం క‌ల్పించాము.
8. ఆరోగ్య కార‌ణాల వ‌ల‌న చివ‌రి రోజు స‌హ‌స్ర నామార్చ‌న‌కు గాని, కొండ‌గ‌ట్టు యాత్ర‌కు గాని ఎవ‌రికి అనుమ‌తి లేదు.
కొండ‌గ‌ట్టు స్వామివారికి మా స్వీయ ఆర్జ‌న ధ‌నంతోనే పాల్గొను వారి లిస్టులు స‌మ‌ర్పిస్తారు.
ఈ అపూర్వ అవ‌కాశం జార‌విడుచుకోకండి. అంద‌రూ మీ పేర్ల‌ను గ‌డువు లోగా న‌మోదు చేసుకోండి.
శుభ‌మ‌స్తు
మీ శృంగారం సింగ‌రాచార్యులు


Tuesday, August 11, 2020

రామ‌నామ‌జ‌పం

 అయోధ్య‌లో శ్రీ‌రామాల‌యానికి శంకుస్థాప‌న జ‌ర‌గ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌ని, అందులోనూ మ‌నం జీవించి ఉన్న కాలంలోనే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం మ‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని గురూజీ శ్రీ‌మాన్ శృంగారం సింగ‌రాచార్యుల వారు భావించారు. అందుకే రామాల‌యం శంకుస్థాప‌న జ‌రిగిన వారంలో ఆగ‌స్టు 5-8 తేదీల మ‌ధ్య‌న మ‌న సుంద‌ర‌కాండ భ‌క్త‌బృందం అంద‌రూ ఇళ్ల‌లో కూచుని శ్రీ‌రామ‌జ‌య‌రామ జ‌య‌జ‌య రామ అంటూ శ‌క్తి మేర‌కు జ‌పం చేయాల‌ని సూచించారు. ఆ మేర‌కు మొత్తం 152 మంది భ‌క్త‌బృందం ఈ జ‌పంలో పాల్గొని 4 రోజుల్లోనూ మొత్తం 5,86,457 నామాలు జ‌పం చేశారు. 9వ తేదీ ఆదివారంనాడు గురూజీ వారి నివాసంలోనే సుంద‌ర‌కాండ భ‌క్తులంద‌రి సంక్షేమం కోసం ప్ర‌త్యేకించి ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో అంద‌రి ఆయురారోగ్యాల కోసం హోమం నిర్వ‌హించి భ‌క్త‌బృందం అంద‌రికీ ఆశీస్సులు అంద‌చేశారు. గురూజీ ఆదేశం మేర‌కు 152 మంది భ‌క్తులు చేసిన జ‌పం వివ‌రాలు ఈ దిగువ ప‌ట్టిక‌ల్లో ఉన్నాయి. 


Tuesday, August 4, 2020

అయోధ్య‌కు శ్రీ‌రామ ఆగ‌మ‌నం సంద‌ర్భంగా శ్రీ‌రామ జ‌పం

జై శ్రీ‌రామ్‌


సుంద‌ర‌కాండ భ‌క్త‌గ‌ణానికి
శుభాశీర్వ‌చ‌నాలు. మ‌నం 5-8-2020వ తేదీన నీ భువిపై జీవించి ఉండ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం, ఎందుకు...??? ఎందుకు...???ఎందుకు...???

త్రేతా యుగంలో జీవించి ఉన్న సాకేతపురి ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌చంద్రుని ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించి త‌రించారు. ఈ క‌లియుగంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను అధిగ‌మించి సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం ప‌విత్ర స‌ర‌యూ న‌దీతీరంలో శ్రీ‌రామ‌చంద్రుడు న‌డ‌యాడిన సాకేత న‌గ‌రంలో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తిరిగి మ‌న కోసం శ్రీ‌రామ‌రాజ్యం మ‌రోసారి స్థాపించ‌బోతున్నారు.

5-8-2020వ తేదీ మ‌ధ్యాహ్నం 12.30 నిముషాల‌కు అయోధ్య‌లో మ‌న భార‌త ప్ర‌ధానామాత్యులు భాగ‌వ‌దోత్త‌ములైన క‌లియుగ మునీశ్వ‌రుల స‌మ‌క్షంలో అభిజిన్ ముహూర్తంలో తిరిగి భ‌ర‌త ఖండంలో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి ఆల‌యం పున‌ర్నిర్మించ‌డానికి శిలాన్యాసం కావించ‌బోతున్నారు. ఈ అభిజిన్ ముహూర్తాన్నే శ్రీ‌రామ జ‌న‌నం అవ‌డం, ఈ ముహూర్తాన్నే శ్రీ‌సీతారామ‌చంద్ర‌స్వామి వారి క‌ల్యాణం జ‌రిగిన సంగ‌తి మ‌నం ఎరిగిన విష‌య‌మే. అందువ‌ల‌న జ్యోతిష్యులు ఈ శిలాన్యాసానికి ఆ ముహూర్త‌మే ఎన్నుకొని ఉంటారు. ఈ విధంగా అప్ర‌తిహ‌త‌మైన శ్రీ‌రామ‌రాజ్యాన్ని మ‌ళ్లీ క‌లియుగంలో మ‌న‌కు రుచి చూపించ‌బోతున్నారు...ఎందుకు...???ఎందుకు...???ఎందుకు??? అనే ప్ర‌శ్న‌కు అందుకే అనేది దీనికి స‌మాధానం.

ఈ స‌మ‌యంలో మ‌న సుంద‌ర‌కాండ స్వామివారు 53వ సుంద‌ర‌కాండ పూర్తి చేసుకుని 54వ సుంద‌ర‌ర‌కాండ‌లో అపూర్వ‌మైన శ్రీ‌రామ ప‌ట్టాభిషేకాన్ని జ‌రుపుకోవ‌ల‌సి ఉంది. ఆ ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మం ఎందుకు స్వామివారు ఆపారో అర్ధం అయింద‌నుకుంటాను. త‌న స్వ‌స్థ‌లంలో త‌ను కొలువుదీరిన త‌ర్వాత‌నే మ‌న చేత న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న విధంగా త‌న శ్రీ‌రామ ప‌ట్టాభిషేకాన్ని జ‌రుపుకోవాల‌ని స్వామివారి నిర్ణ‌యం. దానికి మ‌నం క‌ట్టుబ‌డ‌దాము. మ‌రి మ‌నం స్వామివారిని అయోధ్య‌కు అపూర్వ స్వాగ‌తంతో ఆహ్వానించ‌డానికి ఏం చెయ్యాలి?

మీకు మొద‌ట‌నే చెప్పాను. మ‌నం 5-8-2020 తేదీన ఈ భువిపై జీవించి ఉండ‌డం మ‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అని. మ‌నం జీవించి ఉండ‌గానే మ‌న ఆరాధ్య దైవం శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తిరిగి వారి జ‌న్మస్థ‌లంలోకి కాలిడ‌బోతున్నారు. ఆ నాడు అయోధ్య జ‌నులు శ్రీ‌రామ‌ద‌ర్శ‌నం వ‌ల‌న త‌రించారు. ఈ క‌లియుగంలో మ‌రోసారి రాముని ప్ర‌వేశాన్ని క‌నులారా వీక్షించ‌బోతున్నాం. అందుకే మ‌నం ధ‌న్యులం.
ఈ అవ‌కాశాన్ని మ‌నం విడువ‌కూడ‌దు. అందుకే మ‌న సుంద‌ర‌కాండ భ‌క్తులం 4 రోజుల పాటు స్వామివారి నామాన్ని జ‌పిస్తూ అయోధ్య‌కు ఆహ్వానిద్దాం.

శ్రీ‌రామ‌చంద్రుడు విజ‌యుడై త‌న స్వ‌గృహానికి వ‌చ్చేసే స‌మ‌యంలో మ‌నంద‌రం వారి విజ‌య‌సూచ‌కంగా శ్రీ‌రామ జ‌య‌రామ జ‌య‌జ‌య‌రామ అనే నామ జ‌పంతో వారిని ప్ర‌స‌న్నం చేసుకుందాం.

జ‌పానికి మార్గ‌ద‌ర్శ‌కాలు

స‌మయం లేనందువ‌ల్ల మ‌న సుంద‌ర‌కాండ అభిమానులు ప్ర‌తి వారు ఈ ప్ర‌క‌ట‌న‌ను త‌మ వారికి పంపి వారికి కూడా ఈ అపూర్వ ఫ‌లాన్ని అనుభ‌వించేట‌ట్లు చేయ‌గ‌ల‌రు.

ఈ కార్య‌క్ర‌మం 5-8-2020న ప్రారంభించి 8-8-2020 నాడు స‌మాప్తి చేయాలి.

ఎంత‌మంది ఈ జ‌పాన్ని చేశారో  వారంద‌రి గోత్ర‌నామాల‌తో 9-8-2020 ఆదివారం రోజున శ్రీ‌రామ‌చంద్ర స్వామివారికి అష్టోత్త‌ర శ‌త నామార్చ‌న‌, స‌హ‌స్ర‌నామార్చ‌న చేయ‌బ‌డుతుంది.

5వ తేదీ ఉద‌యం స్వామివారి ఫొటో శుద్ధి చేసిన ప్ర‌దేశంలో ఉంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి జ‌ప‌మాల‌తో పై నామ జ‌పాన్ని ప్రారంభించండి. ఉద‌యం టిఫిన్ చేయ‌వ‌చ్చును. భోజ‌నం మాత్రం మ‌ధ్యాహ్నం జ‌పానంత‌రం మాత్ర‌మే చేయాలి. ఆ రోజు ఆల‌స్యంగా ప్రారంభిస్తున్నందు వ‌ల్ల కొద్ది జ‌పం మాత్రం చేయ‌వ‌చ్చును. ఆ త‌ర్వాత 6,7,8 తేదీల్లో య‌ధావిధిగా ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోగా త‌మ‌కు అనువైన స‌మ‌యంలో త‌మ త‌మ శ‌క్త్యానుసారం జ‌పం చేయ‌వ‌చ్చును. తాము చేసిన జ‌ప‌సంఖ్య‌ను గ్రూపులో మాత్ర‌మే  పెట్టాలి. త‌మ వ్య‌క్తిగ‌త గ్రూప్ ల‌లో పెడితే వాటిని స్వీక‌రించం. విదేశాల్లో ఉన్న వారు సాధ్య‌మైనంత‌వ‌ర‌కు భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపుగా ఎప్పుడైనా త‌మ జ‌ప‌సంఖ్య‌ను పోస్ట్ చేయ‌వ‌చ్చును. ఈ స‌మ‌యం భార‌త‌దేశంలో నివ‌శించే వారికి కూడా వ‌ర్తిస్తుంది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని త‌మ గోత్ర‌నామాల‌ను ఇంగ్లీషులో రాయ‌కుండా అచ్చ తెలుగు ప‌దాల్లోనే రాయండి లేదా కాగితం మీద తెలుగులో రాసి ఫొటో తీసి పంపాలి. పేర్లు న‌మోదు కార్య‌క్ర‌మం లేనందు వ‌ల్ల ప్ర‌తీ వారు త‌మ గోత్రం, ఇంటిపేరు, జ‌పం చేసే వారి పేరు విధిగా ఇవ్వాలి. అసంపూర్తిగా ఉన్న గోత్ర‌నామాలు తిర‌స్క‌రించ‌బ‌డ‌తాయ‌ని గుర్తుంచుకోండి. ప్ర‌తీ వారు ఈ 4 రోజులూ త‌ప్ప‌కుండా చేయాల‌ని నియ‌మం ఏమీ లేదు. మ‌ధ్య‌లో ఈ ప్ర‌క‌ట‌న చూసిన వారు ఆ రోజు నుంచే ప్రారంభించ‌వ‌చ్చును. ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకుని  శ్రీ‌రామ స‌హ‌స్ర నామాచ‌ర్చ‌న‌లో మీ పేరు ఉండే విధంగా చూసుకోండి.

మీ
శృంగారం సింగ‌రాచార్యులు

Friday, July 24, 2020

ఆంజ‌నేయ ద్వాద‌శ నామ పారాయ‌ణ‌


గురూజీ మ‌రో మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచం అంతా గ‌డ‌గ‌డా వ‌ణికిపోతోంది. ఏ క్ష‌ణాన వ్యాధి విరుచుకుప‌డుతుందో అని ప్ర‌తీ ఒక్క‌రూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌నంద‌రం మాన‌సిక స్థైర్యంతో నిల‌బ‌డి భ‌గ‌వంతునిపై ప‌రిపూర్ణంగా దృష్టి కేంద్రీక‌రించిన‌ట్ట‌యితే  ఏ మ‌హ‌మ్మారి మ‌న ద‌రికి చేర‌ద‌ని గురూజీ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం నాకు అది అనుభ‌వంలోకి వ‌చ్చింది. నేను జ‌ర్న‌లిస్టున‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రెండు వారాల క్రితం ఒక రోజు నాకు తీవ్రంగా జ‌లుబు చేసింది. జ్వ‌రం అయితే రాలేదు గాని ఒంట్లో స‌ల‌ప‌రంగా ఉండేది. మ‌ర్నాడు స్వ‌ల్పంగా గొంతునొప్పి ప్రారంభం అయింది. అదే స‌మ‌యంలో నా భార్య శ్రీ‌దేవికి కూడా బాగా జ‌లుబు చేసింది. దిక్కు తోచ‌లేదు. భ‌యంభ‌యంగానే ఇద్ద‌రం గ‌డిపాము. ఆ మ‌రుస‌టి రోజుకి కాస్తంత ఉప‌శ‌మించింది. కాని గొంతునొప్పి మాత్రం ఉంది. ఇదంతా మంగ‌ళ‌, బుధ‌వారాల్లో జ‌రిగింది.  బుధ‌వారం ఉద‌యం గురువుగారికి ఫోన్ చేసి మ‌న‌సులో బాధంతా చెప్పాను. అస‌లేం భ‌య‌ప‌డ‌కండి, మ‌న స్వామి అండ‌గా ఉన్నారు. అనిర్వేద శ్రియో మూలం, త‌మ‌స్మిన్ శ్లోకాలు రెండూ 11 రోజుల పాటు 11 మార్లు అనుసంధానం చేయండి, అన్నీ ఆయ‌నే చూసుకుంటారు అని ధైర్యం చెప్పారు. అనుకోకుండా బుధ‌వారం రాత్రి సాక్షాత్తు మ‌న ఆరాధ్య దైవం ఆంజ‌నేయ‌స్వామివారు పంపిన‌ట్టుగానే డాక్ట‌ర్ వెంక‌ట‌శేష‌య్య‌గార‌ని ఒక హోమియో డాక్ట‌ర్ యుట్యూబ్ వీడియో ఒక‌టి వాట్స‌ప్ లో షేర్ అయింది. అది చాలా బాగుంది, డీలిట్ చేయ‌కుండా పూర్తిగా వినండి అని నా భార్య ఫోన్ చేసి చెప్పింది. ఆ వీడియోలో ఆయ‌న కొన్ని హోమియో మందులు చెప్పారు. గురువారంనాడు కెపిహెచ్ బిలో హోమియో స్టోర్ కి వెళ్లి ఆయ‌న చెప్పిన ఆర్సెనికం ఆల్బం, బెల్ల‌డోనా తెచ్చాను. జ‌లుబు, గొంతునొప్పి రెండూ త‌గ్గాయి. ఇది నా ఒక్క‌డి అనుభ‌వ‌మే కాదు. ఈ రోజు నెల‌కొన్న వాతావ‌ర‌ణంలో అంద‌రం ఇలాంటి భ‌యాల‌తోనే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నాం. ఏదైనా కాస్తంత అనుమానం వ‌చ్చి టెస్ట్ చేయించుకుందామ‌న్నా రెండు రోజుల త‌ర్వాత గాని స్లాట్ దొర‌క‌దు, ఆ త‌ర్వాత రిజ‌ల్ట్ రావ‌డానికి మ‌రో 48 గంట‌లు ప‌డుతోంది. ఈ లోగా ప‌రిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆస్ప‌త్రికి పోయినా టెస్ట్ రిపోర్టులు లేనిదే చేర్చుకోవ‌డంలేదు. చేర్చుకున్నా ప్రైవేటు ఆస్ప‌త్రులైతే 10, 15 ల‌క్ష‌లు గుంజేస్తున్నాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌రైన చికిత్స అందించే స్థితి లేదు. ఈ స‌మ‌యంలో మ‌నంద‌రం మ‌న‌సు ఆధ్యాత్మికత వైపు మ‌ళ్లించి దృఢంగా నిల‌బ‌డాల‌న్న‌ది గురూజీ ఆకాంక్ష. అందుకే ఆయ‌న శ‌నివారం నుంచి ఈ కింది కార్య‌క్ర‌మం ప్ర‌క‌టించారు. ఆంజ‌నేయ‌స్వామివారి ద్వాద‌శాక్ష‌రి మంత్ర పారాయ‌ణ మనంద‌రితో చేయించాల‌ని సంక‌ల్పించారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న ఇంట్లో క‌ల‌శ‌స్థాప‌న చేసి మ‌నంద‌రి గోత్ర నామాలు స్వామివారికి నివేదించి మ‌నంద‌రి త‌ర‌ఫున మంత్రోప‌దేశం, మంత్ర జ‌పం చేస్తారు. ఆ క్ష‌ణంలో ఆయ‌న సంక‌ల్పంలో పేర్లు చెప్పిన వారంద‌రికీ మంత్రోప‌దేశం చేసిన‌ట్టుగానే ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌స్తుంది.ఆదివారం ఉద‌యం నుంచి మ‌నంద‌రం ఇళ్ల‌లోనే కూచుని ఆ ద్వాద‌శాక్ష‌రి మంత్రాన్ని శ‌క్తి మేర‌కు నిర్వ‌హిస్తే ఆగ‌స్టు రెండో తేదీ ఆదివారం నాడు మ‌నంద‌రి పేర్ల మీద వారింటిలోనే ద్వాద‌శాక్ష‌రీ మంత్ర హోమం నిర్వ‌హిస్తారు. ఇంత‌క‌న్నా మ‌హ‌ద్భాగ్యం ఏముంటుంది...?  మ‌నంంద‌రినీ ఆ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి స్వామివారే కాపాడ‌తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇతోధికంగా పాల్గొని విజ‌య‌వంతం చేద్దామ‌ని అంద‌రికీ సూచిస్తున్నాను. 
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు