Sunday, April 3, 2022

మ‌ళ్లీ వ‌స్తున్నాం...

గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన క‌ల‌క‌లం వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని కార్య‌క‌లాపాలు స్తంభించిపోయిన‌ట్టుగానే మ‌న సుంద‌ర‌కాండ‌కు సుదీర్ఘ విరామం వ‌చ్చింది. లాక్ డౌన్ కు, లాక్ డౌన్ కు మ‌ధ్య అడ‌పాద‌డ‌పా కొన్ని కార్య‌క్ర‌మాలు జ‌రిగినా పూర్వం వ‌లె బ్లాగ్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ చేయ‌లేక‌పోయాం. ఇక నుంచి పూర్తి స్థాయిలో బ్లాగ్ అప్ డేట్ చేయ‌బోతున్నామ‌ని తెలియ‌చేయ‌డానికి సంతోషిస్తున్నాను. ప్ర‌స్తుతం సుంద‌ర‌కాండ భ‌క్తులు శ్రీ కోట క‌ల్యాణ‌రామారావు, శ్రీ‌మ‌తి మాధ‌వి పుష్ప‌ల‌త దంప‌తుల నివాసంలో హోమ స‌హిత‌ సుంద‌ర‌కాండతో పాటు శ్రీ‌రామ న‌వ‌మి ప‌ర్వ‌దినాన 10వ తేదీన‌ శ్రీ సీతారామ‌ క‌ల్యాణం, 16వ తేదీన శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకం జ‌ర‌గ‌బోతున్నాయి. శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మం శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేక స‌ర్గ‌లో ఉన్న‌ట్టుగా నిర్వ‌హించాల‌న్న‌ది గురూజీ జీవిత‌కాల స్వ‌ప్నం. గురూజీ శ్రీ‌మాన్ శృంగారం సింగ‌రాచార్యుల వారు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఆ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ మ‌న బ్లాగ్ వీక్ష‌కులు, వారితో పాటుగా ఫేస్ బుక్ లోని సుంద‌ర‌కాండ గ్రూప్ స‌భ్యులు క‌నులారా వీక్షించ‌డానికి ప్ర‌చురించ‌బోతున్నాం. ఇక నుంచి గ‌తంలో వ‌లెనే ఎప్ప‌టిక‌ప్పుడు బ్లాగ్ అప్ డేట్ చేయ‌డం జ‌రుగుతుంది. వీక్షించి మీ అమూల్య‌మైన అభిప్రాయాలు తెలియ‌చేస్తూ ఉండండి.

మీ విధేయుడు

దామ‌రాజు వేంక‌టేశ్వ‌ర్లు

Thursday, March 25, 2021

శ్రీ‌రామ నీనామ మెంతో రుచిరా...

 #సంభవామి_యుగే_యుగే

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .
మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు
మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం - రాముడు .
ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు
ఆనందం నడిస్తే రాముడు
వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు
ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా
వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ
భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు
కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .
విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !
తిరుగులేని మాటకు - రామబాణం
సకల సుఖశాంతులకు - రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన
ఆజానుబాహుడి పోలికకు - రాముడు
అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు
రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .
చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
Rama killed Ravana ;
Ravana was Killed by Rama .
ఆదర్శ దాంపత్యానికి సీతారాములు
గొప్ప కొడుకు - రాముడు
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు
గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .
మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).
మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).
సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .
రామాయణం పలుకుబళ్లు
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .
తెలుగులో కూడా అంతే .
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...
చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం
కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .
వికారంగా ఉంటే -
శూర్పణఖ
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).
పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.
మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర
పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .
ఎంగిలిచేసి పెడితే -
శబరి
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు
అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
అగ్ని పరీక్షలే .
పితూరీలు చెప్పేవారందరూ -
మంథరలే.
సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని
యుద్ధమంటే రామరావణ యుద్ధమే .
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు
ఒంటిమిట్టది ఒక కథ ..
భద్రాద్రిది ఒక కథ
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం
చెబితే మహా భారతం
అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు
అది ఒక జీవన విధానం
అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు
రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు
జై శ్రీ రామ్.....
|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
జై శ్రీరామ్
జై హనుమాన్

Wednesday, January 13, 2021

జై హ‌నుమాన్‌


 

భగవంతుడు భక్తసులభుడు అనడానికి నిదర్శనం. ఇరవై ఏళ్ళక్రితం మనచే సుందరకాండ మహోద్యమము ప్రారంభింపజేసిన అంబ‌ర్ పేట ప్రేమ్ న‌గ‌ర్ అభయాంజనేయ స్వామివారు మెల్లమెల్లగా కరోనాను తగ్గిస్తూ మనను లాక్ డౌన్ నుండి విముక్తి చేస్తున్నారు. ఇటీవల నేను అ స్వామిని సందర్శించవలసి వచ్చింది. ఐతే ఆ సమయములో దర్శనాలు పూర్తి అయినందున గర్భాలయానికి తాళం వేశారు. అందుచేత గ్రిల్స్ నుండే స్వామివారిని సందర్శించుకున్నాను. అప్పుడు స్వామివారిని చూస్తుంటే ఏమనిపించిందో తెలుసా మనలను లాక్ డౌన్ నుండి విముక్తి చేయడానికి స్వామివారే స్వయముగా లాక్ డౌన్లోనికి వెళ్లారు అని. .... మన స్వామివారిని భక్త గణానికి దర్శింపజేయడానికే ఈ పోస్టింగును పెట్టాము. 


 మీ శృంగారం సింగరాచార్యులు.

Saturday, September 12, 2020

శ్రీ హ‌నుమ న‌వాక్ష‌రీ జ‌పం

సుంద‌ర‌కాండ భ‌క్త‌కోటికి
శుభాశీస్సులు. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న పుణ్య‌భూమిని ఆశ్ర‌యించి అర్ధ సంవ‌త్స‌రం గ‌డిచింది. మ‌న భ‌క్తుల్లో 5 శాతం మంది దీని బారిన ప‌డినా మ‌నం కావిస్తున్న పూజ‌ల ఫ‌లితంగా మృత్యువు మ‌న ద‌రిదాపుల‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతూ ఉన్న‌ది. శ్రీ రామ‌చంద్ర‌స్వామివారి క‌ల్యాణం, వినాయ‌క చ‌వితి లాంటి ఎన్నో ముఖ్య‌మైన పండుగ‌ల‌కు దూర‌మ‌య్యాం. అస‌లు ఈ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర‌మైనా లేదా ఆంగ్ల సంవ‌త్స‌రం 2020 అయినా ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ఎంతో కీడు చేసింది. క‌రోనాతో మ‌న వారు నాకు ఫోన్ చేయ‌డం, వెంట‌నే నేను స్వామివారిని కోర‌డం, వారు ఈ రోగం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం జ‌రిగింది. ఈ రోజు అన‌గా 8-9-2020 ఉద‌యం నుంచి మ‌న ‌వాళ్లు ఎంద‌రి నుండో ఎన్నో స‌మ‌స్య‌ల‌తో కూడిన ఫోన్లు అందుకున్నాను. సాయంత్రం స్వామివారి పీఠం వ‌ద్ద కూర్చుని క‌ర్త‌వ్యం గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు చేతిలో నుంచి శ్రీ ఆంజ‌నేయ స‌హ‌స్ర‌నామార్చ‌న పుస్త‌కం జారి ప‌డింది. కొన్ని కాగితాలు అందులో నుంచి విడిపోయాయి. వాటిని ఏరుకునే క్ర‌మంలో స్వామివారి 900వ నామం ఉన్న కాగితంపై చూపు ప‌డింది. అదే

ఓం మ ‌హా సుం ద ‌రా య న ‌మః
1    2   3   4     5  6   7   8   9

సుంద‌ర‌కాండ మొత్తం ఈ నామం పైనే ఆధార‌ప‌డి ఉంది. ఎలాగంటే...
"బుద్ధిర్బ‌లం, య‌శోధైర్యం, నిర్భ‌య‌త్వం, అరోగ‌తా, అజాడ్యం, వాక్ప‌టుత్వంచ హ‌నుమ‌త్ స్మ‌ర‌ణా భ‌వేత్‌"
శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి స్మ‌ర‌ణ వ‌ల‌న మ‌న‌కు పైన శ్లోకంలో వివ‌రించిన లాభాలు స‌మ‌కూరుతాయి. మ‌రి ఇలాంటి లాభాలు స‌మ‌కూర్చే ఆంజ‌నేయ‌స్వామివారు సుల‌భంగా ఎక్క‌డ ల‌భ్య‌మ‌వుతారు?  మొత్తం రామాయ‌ణంలోని ఆరు కాండ‌ముల‌లో సుంద‌ర‌కాండ‌మునందు మాత్ర‌మే విరాట్ స్వ‌రూపుడై మ‌న‌కు ల‌భిస్తారు. అందుచేత‌నే సుంద‌ర‌కాండం ఆయ‌న నామంతోనే విల‌సిల్లుతోంది. ఆంజ‌నేయ‌స్వామివారు శివాంశ సంభూతుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు సుంద‌రేశుడు, మ‌హాసుంద‌రుడు అనే నామాలు కూడా ఉన్నాయి.

అందుకే శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి స‌హ‌స్ర నామాల్లో 900వ నామం మ‌హాసుంద‌రాయ న‌మః అని పొందుప‌ర‌చ‌బ‌డింది. కాబ‌ట్టి మ‌హాసుంద‌రాయ న‌మః అనే ఒక్క నామానికి ఒక్కొక్క సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేసిన ఫ‌లితం ల‌భిస్తుంది. 

తొమ్మిద‌వ నంబ‌రుకు చాలా ప్రాధాన్య‌త ఉంది. ఆ ప్రాధాన్య‌త‌ను స‌మ‌యాభావం వ‌ల‌న ఇక్క‌డ వివ‌రించ‌డంలేదు. "త్రిజ‌టా స్వ‌ప్ప వృత్తాంతం"లో దీని స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇవ్వ‌బ‌డుతుంది. కాబ‌ట్టి ఈ 900 నామం చాలా మ‌హిమాన్విత‌మైన‌ది.

డిసెంబ‌రు 2020 వ‌ర‌కు ఈ క‌రోనా ఉంటుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అలాగే ఈ 2020 సంవ‌త్స‌రం ప్ర‌క‌ల‌కు అచ్చిరాని సంవ‌త్స‌రం. అందుచేత మ‌నం ఈ మ‌హిమ గ‌ల శ్రీ స్వామివారి నామాన్ని జ‌ప‌రూప‌కంగా నిర్వ‌హిస్తూ ఈ సంవ‌త్స‌రంలోని శేష మాసాలు మ‌న‌కు ఎలాంటి ఆప‌ద‌లు సంభ‌వించ‌కుండా చూచుకుందాము

ఈ జ‌పానికి ద‌శ‌కోటి నామోచ్ఛ‌ర‌ణ (10,00,000) కావించాల‌ని, దీనికి 30 రోజుల గ‌డువు ఉండాల‌ని నిర్ణ‌యించాము. ఈ కార్య‌క్ర‌మానికి ముందుగా భ‌క్తుల‌ను న‌మోదు చేసుకునే కార్య‌క్ర‌మంతో ప్రారంభించి ముగింపు త‌ర్వాత శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి అష్టోత్త‌రశ‌త మ‌రియు స‌హ‌స్ర నామార్చ‌న కావించాల‌ని నిర్ణ‌యించాం. 

అలాగే

భ‌క్తులు చేసిన జ‌ప సంఖ్య‌ను వారి గోత్ర నామాల‌తో స‌హా లిస్టుల‌ను సిద్ధం కావించి ఆ లిస్టును కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామివారి పాదస‌న్నిధికి చేర్చాల‌ని గొప్ప నిర్ణ‌యం త‌ల‌పెట్టాము (నిబంధ‌న‌ల వ‌ల‌న కొండ‌గ‌ట్టుకు వెళ్ల‌డానికి భ‌క్తులు అనుమ‌తించ‌బ‌డ‌రు).

భ‌క్తుల గోత్ర నామాల న‌మోదు కార్య‌క్ర‌మం
ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి 14-9-2020 సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల పేర్ల న‌మోదు ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 17-9-2020 వ‌ర‌కు (మ‌హాల‌య అమావాస్య‌) ఎంత మంది భ‌క్తులు ఈ జ‌పంలో పాల్గొన‌బోతున్నారో వారి గోత్ర‌నామాల‌తో స‌హా ఫైన‌ల్ లిస్టు ఈ దాసునికి చేరుతుంది. 

జ‌ప ప్రారంభ కార్య‌క్ర‌మం
అధిక ఆశ్వ‌యుజ మాసం మొద‌టి రోజు వ‌దిలి 19-9-2020 శ‌నివారం నుంచి జ‌పాలు ప్రారంభించ‌బ‌డి 16-10-2020 శుక్ర‌వారంతో ముగుస్తుంది. నిజ ఆశ్వ‌యుజ మాసం రెండ‌వ రోజు శ‌నివారం రోజున శ్రీ స్వామివారికి స‌హ‌స్ర‌నామార్చ‌న జ‌రుప‌బ‌డుతుంది.

ప‌ర్య‌వేక్ష‌కులు
య‌థాప్ర‌కారం భ‌క్లుల లిస్టులు సిద్ధం కావించి అందించ‌డానికి శ్రీ ఆత్మూరి మాణిక్య‌రావుగారిని కోరుతున్నాము.
అలాగే స‌మ‌య నిబంధ‌న‌లు పాటించి త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డానికి శ్రీ దామ‌రాజు వేంక‌టేశ్వ‌ర్లు గారిని కోరుతున్నాము. గ‌డువు ముగిస‌న త‌ర్వాత వ‌చ్చే పేర్ల‌ను శ్రీ మాణిక్య‌రావుగారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ల‌సిన ప‌ని లేదు. అలాగే స‌మ‌య‌పాల‌న చేయ‌ని వారిని ఒక త‌ప్పు కాచి రెండ‌వ సారి త‌ప్పు చేస్తే వారి పేర్ల‌ను శాశ్వ‌తంగా తొల‌గించ‌వ‌చ్చును.
 
జ‌పంలో పాల్గొనే భ‌క్తుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు
ఎన్ని మార్లు చెప్పినా పాల్గొనువారు ప్ర‌క‌ట‌న పూర్తిగా చ‌ద‌వ‌కుండా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌రిగ్గా పాటించ‌కుండా మాకు త‌ల‌నొప్పి క‌ల‌గ‌చేస్తున్నారు. ఈ మారు మాత్రం నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌ప అవ‌కాశం క‌లుగ‌చేయ‌లేము.
నిబంధ‌న‌లు జాగ్ర‌త్త‌గా చ‌దివి అమ‌లు చేయండి.
1. పాల్గొను వారు త‌మ వివ‌రాలు ఇలా ఇవ్వాలి. 1) గోత్రం 2) ఇంటిపేరు 3) పాల్గొను వారి పేరు
2. చాలా మంది పేర్లు, గోత్రాలు ఇంగ్లీషు అక్ష‌రాల్లో ఇవ్వ‌డం వ‌ల‌న తెలుగులోకి వ‌చ్చే స‌రికి త‌ప్పులు వ‌స్తున్నాయి. అందుచేత పాల్గొనే వారు త‌మ వివ‌రాలు తెలుగులోనే రాయాలి. ఒక‌వేళ తెలుగులో రాయ‌లేని వారు కాగితం మీద తెలుగులో రాసి ఫొటో తీసి పంప‌వ‌చ్చును. నిబంధ‌న‌లు పాటించ‌ని వారి పేర్లు మాణిక్య‌రావుగారు తిర‌స్క‌రించ‌వ‌చ్చును.
3.మ‌న ముందు శ్రీ స్వామివారు 10 కోట్ల నామోచ్చార‌ణ అనే పెద్ద భారం పెట్టినందున ప్ర‌తి వారు త‌మ జ‌పాల‌ను పెంచే ప్ర‌య‌త్నం చేయండి. కొంద‌రు త‌మ పేర్లు లిస్టులో రావ‌డానికి ఒక జ‌ప‌మాల‌ను తిప్పి అయింద‌నిపిస్తారు. అలా కాకుండా త్రిక‌ర‌ణ‌శుద్ధిగా రోజూ ఈ జ‌పం నిర్వ‌హించండి.
4. జ‌పం ఉద‌యం పూట‌నే చేయాలి. భోజ‌న‌మున‌కు ముందు జ‌పం పూర్తి కావాలి
5. మీ జ‌న సంఖ్య‌ను ఏ రోజుది ఆ రోజే మ‌ధ్యాహ్నం 2 గంట‌లు దాట‌కుండా పోస్టు చేయాలి.
6. మీ పోస్టింగులు సుంద‌ర‌కాండ గ్రూప్ లో మాత్ర‌మే ఉండాలి. ఇత‌ర‌త్రా ఎలా పంపినా వాటిని తిర‌స్క‌రిస్తాము.
7. సందేహాలు తీర్చుకోవ‌డానికి మా ఫోను ద్వారా అవ‌కాశం క‌ల్పించాము.
8. ఆరోగ్య కార‌ణాల వ‌ల‌న చివ‌రి రోజు స‌హ‌స్ర నామార్చ‌న‌కు గాని, కొండ‌గ‌ట్టు యాత్ర‌కు గాని ఎవ‌రికి అనుమ‌తి లేదు.
కొండ‌గ‌ట్టు స్వామివారికి మా స్వీయ ఆర్జ‌న ధ‌నంతోనే పాల్గొను వారి లిస్టులు స‌మ‌ర్పిస్తారు.
ఈ అపూర్వ అవ‌కాశం జార‌విడుచుకోకండి. అంద‌రూ మీ పేర్ల‌ను గ‌డువు లోగా న‌మోదు చేసుకోండి.
శుభ‌మ‌స్తు
మీ శృంగారం సింగ‌రాచార్యులు