రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎ.ఎమ్.ఎస్.కాలేజి,
వైస్-ప్రెసిడెంట్, ఎ.ఎం.ఎస్
----------------------------------------------
జయము జయము శ్రీ జానకి మాతా
అవనీ జాతా అగ్ని పునీతా ||
అయోనిజగా జన్మించితివి
రాముని సతిగా రాణించితివి ||
ఆదిలక్ష్మి అవతారము నీవు
అఖిల జగాలకు అమ్మవు నీవు||
జనక మహీపతి జన్నము చేయగా
పుడమిని దున్నగ పుట్టిన దానవు ||జయము||
ఆటల పాటల హరుని చాపమును
మంజూషముతో మలపిన బాలవు||
శ్రీరాముడు శివధనువు విరువగా
వరమాల వేసి వధువు నీవైతివి
కోసలపతికే కోడలవైతివి
అయోధ్యాపురిని అలరారితివి||
కైక ఆజ్ఞపై కానలకేగెడు
ఆ శ్రీరాముని అనుసరించితివి ||జయము||
మహిమాన్విత అనసూయ సాధ్వి
మక్కువనొసగె అంగరాగము||
పసిడిలేడి అని భ్రమసిపోతివి
అసురమాయ యని ఎరుగనైతివి
భిక్షు వేషమున రావణాసురుడు
అపహరించి నిను కొనిపోయె లంకకు||
ఆనవాలుగా ఆభరణమ్ములు
జారవిడిచితివి ఋష్యమూకమున (దారి పొడవునా) ||జయము||
అశోకవనమున శింశుప ఛాయను
రావణుడుంచెను అసురుల నడుమ||
రాముని ధ్యాసే శ్వాసగ నిలిపి
తపమొనరించిన తాపసి (ప్రియసతి) నీవు
రావణాసురుని క్రూర వచనములు
రాక్షస వనితల బెదిరింపులను||
పతిశౌర్యంపై విశ్వాసముతో
నిబ్బరముగా భరియించితివీవు ||జయము||
క్లేశము మీరగా కేశిరాసితో
ప్రాణత్యాగమును పూనితివమ్మా||
(తనువును వీడగ తలచితివమ్మా)
వారధి దాటి సూక్ష్మరూపమున
రామకథను వినిపించెను హనుమ
రామముద్రికను ఇచ్చె భక్తిగా
రామబంటు కపి ఆనవాలుగా||
(రామబంటు కపి సంకేతముగా)
కొలచిన వారికి అభయమొసంగె
వరములిచ్చితివి కపివరునకు
(వరములు ఇచ్చే భాగ్యమునొసగ
కపీశ్వరుని దీవించితివి) ||జయము||
మారుతి లంకా దహనము చేయగ
అగ్నిని ఆపెను శీతలోభవ అని||
కపికిచ్చితివి చూడామణిని
కబురు పంపితివి శ్రీకాంతునికి
నిర్మించె రామసేతు సుగ్రీవసేన
రామబాణమది రావణుకూల్చే ||
నీ వరమున సంజీవిని తెచ్చె
సకల సిద్ధితో పరమ పావని ||జయము||
అగ్ని పరీక్షే కోరె రఘుపతి
అగ్నిపునీతగ రాణించితివి||
శ్రీరాముని పట్టాభిషేకమున
పట్టమహిషిగా పరిఢవిల్లితివి
పరమ ప్రీతితో మణిహారమొసగి
మారుతికి చూపె వాత్సల్యమును||
(పరమ ప్రేమతో అపురూప మణిహారం
ఇచ్చితివి మారుతికే రక్షగా)||
ప్రజావాక్యమే రాజధర్మమని
కానలకంపెను చూలాలిని ||జయము||
లవకుశులను వాల్మీకే గురువై
వీరులుగా రాఘవునికి ఒసగి||
అవనిజాతవు తల్లిని చేరి
అవతారము చాలించిన మాన్వి
శాంతమూర్తివి సహనశీలివి
ధీరలలితవు స్ఫూర్తి ప్రదాతవు||
(ధీరోదాత్తవు స్ఫూర్తి ప్రదాతవు)
పతినే దైవముగా భావించి
సతీమతల్లిగా వర్థిల్లితివి (పేరొందితివి) ||జయము||
అడవికంపిన ఆ రఘురాముని
ఆంతర్యమెరిగిన ఆలివి నీవు||
సీతారాముల దాంపత్యమది
ఆదర్శమయ్యె అవనీ తలమున
రామాయణ కథయే ప్రవిస్తరం
సీతా చరిత్రయే మహత్తరం||
పద్యము గద్యము ఎరుగని దుర్గకు
నిను కీర్తించే భాగ్యమే భాగ్యము ||జయము||
నీగుణగానము చేతు నిత్యము
నీ చరణమ్ముల స్మరింతు నిరతము||
శ్రీరామపత్ని జనకస్యపుత్రి
భూగర్భ జాతా, భువనైక మాతా||
నిన్ను కొలువగా మాయలు తొలగును
మర్మము తెలియును మోక్షము కలుగును||
పరమపావననీ జాగు సేయక
కావుము మమ్ము నిరతము నీవు ||జయము||
-------------------------------------------------
ఫలశృతి
సీతాచాలీసా పఠనం సర్వాభీష్ఠ ప్రదం
సర్వ దుఃఖహరం
పుడమిన అది అజరావరం
ఉద్భవస్థితి సంహారకారిణి
క్లేశ హారిణీం
సర్వ శ్రేయస్కరీం
సీతాం నమో నమః
శ్రీరామ వల్లభాం
-----------------------------------------------------
రచయిత్రి అంతరంగం
ఎందరో మహానుభావులు అందరికీ కృతజ్ఞతలు
మా కొయ్యూరు రామాలయంలో శ్రీరామనవమి కల్యాణం జరుపుతున్నప్పుడు శ్రీరామునికి, హనుమంతుడికి చాలీసా ఉంది. సీతాదేవికి కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను. కొయ్యూరు నుంచి వచ్చాక సీతాచాలీసా రాయాలని కొన్ని రామాయణ గ్రంథాలు, పరిశోధన గ్రంథాలు చదివి నా పద్ధతిలో రాసి దానిని నా స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల సూచనలతో మార్పులు, చేర్పులు చేసుకుంటూ మెరుగులు దిద్దుతూ వచ్చాను. కేవలము సంకల్పమే నాది. కాని ఈ నా ప్రయత్నానికి సహాయసహకారాలు అందించి ప్రోత్సహించిన మరియు ఆలపించిన ఎ.ఎమ్.ఎస్.సంగీత కళాశాల అధ్యాపక మరియు విద్యార్థినీ బృందానికీ, ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ సీతారామ హనుమంతుల కరుణా కటాక్షములు మీ మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ...
వేలవేల కృతజ్ఞతలతో
శ్రీమతి/ డాక్టర్ జిఎల్‌కె దుర్గ వామరాజు,
రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎ.ఎమ్.ఎస్.కాలేజి,
వైస్-ప్రెసిడెంట్, ఎ.ఎం.ఎస్
------------------------------------------------------------
