Wednesday, November 6, 2019

కార్తీక పురాణం- 9వ రోజు పారాయ‌ణం   (శుక్ల న‌వ‌మి రోజున‌) 

తొమ్మిద‌వ రోజు పారాయ‌ణం
స‌ప్త‌ద‌శాధ్యాయం
పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీర‌సుడు ఈ విధంగా ఉప‌దేశం చేశాడు. నాయ‌నా ఒక‌ప్పుడు కైలాసంలో పార్వ‌తీ దేవికి శివుడు చెప్పిన విష‌యాల‌నే నేను నీకిప్పుడు చెబుతున్నాను.

అంగీర‌సుడు చేసిన ఆత్మ‌జ్ఞాన బోధ‌
శ్లో - క‌ర్మ‌బంధ‌శ్చ ముక్తిశ్చ కార్యంకార‌ణ‌మేవ‌చ‌
స్థూల సూక్ష్మం త‌థా ద్వంద్వ సంబంధో దేహ‌ముచ్య‌తే
క‌ర్త‌బంధం, ముక్తి కార్యం, కార‌ణం స్థూల సూక్ష్మంగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ ద్వంద్వ సంబంధిత‌మైన‌దే దేహంగా వ్య‌వ‌హారంలో ఉంది.
శ్లో - ఆత్ర‌బ్రూమ స్స‌మాధానం కోన్యో జీవ‌శ్చ‌మేవ‌హి
స్వ‌యం పృచ్ఛ‌సిమాం కో2హం బ్ర‌హ్మైవాస్మిన సంశ‌యః
జీవుడంటే వేరెవ‌రూ కాదు. నీవే. అప్పుడు నేనెవ‌రిని అని నిన్ను నువ్వే ప్ర‌శ్నించుకుంటే "నేనే బ్ర‌హ్మ‌నై ఉన్నాను, ఇది నిశ్చ‌యం" అనే స‌మాధాన‌మే వ‌స్తుంది.

అది విన్న ఆ పురుషుడు "ఓ మ‌హాత్మా మీరు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు త‌ట్ట‌డంలేదు. నేను బ్ర‌హ్మ‌ను అనుకోవ‌డానికైనా బ్ర‌హ్మ‌మ‌నే ప‌దార్ధం గురించి తెలిసి ఉండాలి క‌దా!  ఆ ప‌దార్ధ జ్ఞానం కూడా లేని వాడినైన నాకు ఆ వివ‌రాలు చెప్పండి" అని కోరాడు. 

అంతఃక‌ర‌ణానికి, త‌ద్వ్యాపారాల‌కి, బుద్ధికి సాక్షి స‌త్, చిత్‌, ఆనంద రూపి అయిన ప‌దార్థ‌మే మూలం అని తెలుసుకో. దేహం కుండ వ‌లె రూపాదివ‌త్ గా ఉన్న పిండ‌శేషం. ఆకాశాది పంచ‌భూతాల వ‌ల‌న పుట్టిన‌ది అయిన కార‌ణంగా ఈ శ‌రీరం ఆత్మ‌త‌ర‌మైన‌దే త‌ప్ప "ఆత్మ" మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు గాని, అగోచ‌ర‌మైన మ‌న‌స్సు గాని, అస్థిర‌మైన ప్రాణం గాని ఇవేవీ ఆత్మ కాదు. దేనివ‌ల‌నైతే దేహేంద్రియాదుల‌న్నీ భాస‌మాన‌నుల‌వుతున్నాయో అదే "ఆత్మ‌". ఆ ఆత్మ‌ప‌దార్ధ‌మే నేను అనే విచికిత్స‌ను పొందు. ఏ విధంగానైనా అయ‌స్కాంత మ‌ణి తాను ఇత‌రాల చేత ఆక‌ర్షింప‌బ‌డ‌కుండా ఇనుమును తాను ఆక‌ర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారిమై బుద్ధ్యాదుల‌ను సైతం చ‌లింప‌చేస్తున్న‌న‌దో దానిని ఆత్మ‌వాచ్య‌మైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వ‌ల‌న జ‌డాలైన దేహేంద్రియాలు, మ‌న‌సు, ప్రాణం భాస‌మానాల‌వుతున్నాయో అదే జ‌న‌న‌మ‌ర‌ణ ర‌హిత‌మైన ఆత్మ‌. ఏదైతే నిర్వికార‌మై నిద్రాజాగ్ర‌త్ స్వ‌ప్పాదుల‌ను, వాటి ఆద్యంతాల‌ను గ్ర‌హిస్తోందో అదే నేను. ఘ‌టాన్ని ప్ర‌కాశింప‌చేసే దీపం ఘ‌టిత‌మైన‌ట్టే దేహేత‌ర‌మైన నేను అన‌బ‌డే ఆత్మ చేత‌నే దేహాతుల‌న్నీ భాస‌మానాల‌వుతాయి. స‌మ‌స్తం ప‌ట్ల ఏర్ప‌డుతూ ఉండే అనూహ్య‌, అగోచ‌ర ప్రేమైక ఆకార‌మే నేను. దేహేంద్రియ మ‌నః ప్రాణాహంకారాల క‌న్నా విభిన్న‌మైన‌ది -జ‌నిత‌త్వ‌, అస్తిత్వ‌, వృద్ధిగ‌త‌త్వ‌, ప‌రిణామ‌త్వ‌, క్షీణ‌త్వ‌, నాశంగ‌త‌త్వాల‌నే ష‌డ్వికారాలూ లేనిదే ఆత్మ‌. అదే నీవు. ఆ నీవే నేను. నేనే నీవుగా త్వ‌మేవాహంగా భావించాలి. ఈ విధంగా త్వం (నీవు అనే ప‌దార్ధ జ్ఞానాన్ని పొంది దాని కార‌ణంగా వ్యాపించే స్వ‌భావం వ‌ల‌న సాక్షాద్విముఖంగా త‌చ్ఛ‌బ‌ద్దార్ధాన్ని గ్ర‌హించాలి. (త‌త్ శ‌బ్దానికి బ్ర‌హ్మ అని అర్ధం)

శ్లో - అత‌ద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధి ముఖేన‌చ‌
వేదాంతానాం ప్ర‌వృత్తిస్యాత్ ద్విరాచార్య సుభాషితం
అతః శ‌బ్దానికి బ్ర‌హ్మ‌ణ్య‌మైన ప్ర‌పంచ‌మ‌ని అర్ధం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇదీ కాదు ఒక‌టొక‌టిగా ప్ర‌తీ దానినీ కొట్టి పారేయ‌డం. అంటే బ్ర‌హ్మ ఆత్మ కాదు, కాలు ఆత్మ కాదు అనుకుంటూ స‌ర్వావ‌యేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాక‌పోతే మ‌రి అది ఏది అని ప్ర‌శ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్ర‌హ్మ లేదా ఆత్మ‌. ఇక సాక్షాద్విధిముఖాత్ అంటే స‌త్యం జ్ఞానం అనంతం బ్ర‌హ్మ అనే వాక్యాల ద్వారా స‌త్య‌త‌, జ్ఞానం, ఆనందం వ‌ల‌నే ఆత్మ‌ను తెలుసుకోవాలి అని అర్ధం. ఆ ఆత్మ సంసార‌ల‌క్ష‌ణావేష్టితం కాద‌ని, స‌త్య‌మ‌ని, ప్ర‌జ్ఞాది ల‌క్ష‌ణ యుత‌మ‌నీ, ప‌రిపూర్ణ‌మ‌ని పూర్వోక్త సాధ‌న‌ల వ‌ల‌న తెలుసుకో. దేనినైతే స‌ర్వ‌జ్ఞం ప‌రేశం సంపూర్ణ శ‌క్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్ర‌హ్మ నేను. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ‌. అదే నువ్వు. అదే నేను. త‌ద‌నుప్ర‌విశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జ‌గ‌త్ ప్ర‌వేశ‌మూ ప్ర‌వేశ జీవుల‌ను గురించిన నియంతృత్వం, క‌ర్మ‌ఫ‌ల‌ప్ర‌ద‌త్వం స‌ర్వ‌జీవ‌కార‌ణ క‌ర్తృత్వం దేనికైతే సాధ్య‌మో అదే బ్ర‌హ్మ‌. త‌త్వ‌మ‌సి = త‌త్ అంటే బ్ర‌హ్మ లేదా ఆత్మ‌త్వం. అంటే నువ్వే, నువ్వే అంటే ప‌ర‌బ్ర‌హ్మం అని అర్ధం. ఓ జిజ్ఞాసూ ఆద్య‌యానంద ప‌ర‌మాత్మ‌యే ప‌త్య‌గాత్మ‌. ఈ ప్ర‌త్య‌గాత్మే ఆ ప‌ర‌మాత్మ‌. ఈ ప్ర‌కార‌మైన తాదాత్మ్య‌త ఏ నాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్ర‌మే త‌త్ శ‌బ్దార్ధం త‌నేన‌ని, త్వం శ‌బ‌ద్దం సాధ‌న‌మే గాని ఇత‌రం కాద‌ని అవ‌గ‌త‌మైపోతుంది.
నీకు మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వ‌డం  కోసం మ‌రింత‌గా వివ‌రిస్తాను.
త‌త్వ‌మ‌సి = త‌త్‌+త్వం+అసి.  అంటే తాదాత్మ్యం. ఇందులో వాక్యార్ధాలైన కించిజ్ఞ‌త్వ‌, స‌ర్వ‌జ్ఞ‌తా  విశిష్టులైన జీవేశ్వ‌రుల‌ను ప‌క్క‌న పెట్టి ల‌క్ష్యార్ధాలైన ఆత్మ‌ల‌నే గ్ర‌హించిన‌ట్ట‌యితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది. (ముఖ్యార్ధ వేధా శంక తొల‌గించుకునేందుకు ల‌క్ష‌ణావృత్తి చ‌ద‌వాలి). అందులో భాగ‌ల‌క్ష‌ణ అనే దాని వ‌ల‌న ఇది సాధింప‌బ‌డుతూ ఉంటుంది. (ఉదా :  సో2యం దేవ‌ద‌త్తః ఆత్మ‌సంప‌న్నః) అహం బ్ర‌హ్మా2స్మి అనే వాక్యార్ధ బోధ స్థిర‌ప‌డే వ‌ర‌కు కూడా శ‌మ‌ద‌మాది సాధ‌న సంప‌త్తితో శ్ర‌వ‌ణ మ‌న‌నాదికాల‌ను ఆచ‌రించాలి. ఎప్పుడైతే శ్రుతి వ‌ల్ల‌నో, గురు క‌టాక్షం వ‌ల్ల‌నో తాదాత్మ్య బోధ సిద్ధ‌ప‌డుతుందో అప్పుడీ వ‌ర్త‌మాన సంసార లంప‌టం దానిక‌దే పుటుక్కున తెలిగ‌పోతుంది. అయినా కొంత‌కాలం పాటు ప్రార‌బ్ధ క‌ర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్ష‌య‌మ‌వ‌డంతో పున‌రావృత్తిర‌హిత‌మైన స్థాయిని చేర‌తాము. దాన్నే ముక్తి లేదా మోక్షం అంటారు. అందువ‌ల‌న ముందుగా చిత్త‌శుద్ధి కోసం క‌ర్మిష్ఠులుగా ఉండి ఆ ఫ‌లాన్ని దైవార్ప‌ణం చేస్తూ ఉండ‌డం వ‌ల‌న ప్రార‌బ్ధాన్న‌నుస‌రించి ఆ జ‌న్మ‌లోనే గాని లేదా ప్రార‌బ్ధ క‌ర్మ ఫ‌లం అధిక‌మైతే మ‌రుజ‌న్మ‌లోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస‌ప‌రులై, జ్ఞానులై క‌ర్మ‌బంధాల‌ను తెంచుకుని ముక్తుల‌వుతారు.
నాయ‌నా బంధించేవి ఫ‌ల‌వాంఛిత క‌ర్మ‌లు (ఏదైనా ప్ర‌తిఫ‌లాన్ని ఆశించి చేసే క‌ర్మ‌లు). ముక్తినిచ్చేవి ఫ‌ల‌ప‌రిత్యాగ క‌ర్మ‌లు (ఏ ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా చేసే క‌ర్మ‌లు) అని అంగీర‌సుడు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చాడు.
స‌ప్త‌ద‌శాధ్యాయ స‌మాప్తః
--------------
అష్టాద‌శాధ్యాయం
అంగీర‌సుడు చెప్పింది వినిన ఆ దివ్య‌పురుషుడు క‌ర్మ‌యోగాన్ని గురించి అడుగుతాడు. దానికి స‌మాధానంగా అంగీర‌సుడిలా వివ‌రించాడు.
చ‌క్క‌ని విష‌యం అడిగావు. సుఖ‌దుఃఖాది ద్వంద్వాల‌న్నీ దేహానికే గాని ఆత్మ‌కు లేవు. ఎవ‌డైతే ఆత్మానాత్మ సంశ‌య‌గ్ర‌స్తుడో వాడు మాత్ర‌మే క‌ర్మ‌ల‌ను చేసి త‌ద్వారా చిత్త‌శుద్ధిని పొందిన‌వాడై ఆత్మ‌జ్ఞాని కావాలి. దేహ‌ధారి అయిన వాడు త‌న వ‌ర్ణాశ్ర‌మ విద్యుక్తాలైన స్నాన శౌచ‌కాది క‌ర్మ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా చేసి తీరాలి.
శ్లో - స్నానేన‌ర‌హితం క‌ర్మ‌హ‌స్తి భుక్త క‌పిత్థ‌వ‌త్‌
ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శ్రుతిచోదితం
స్నానం చేయ‌కుండా చేసే ఏ క‌ర్మ అయినా స‌రే ఏనుగు తిన్న వెల‌గ‌పండులా నిష్ఫ‌ల‌మే అవుతుంది. అందునా బ్రాహ్మ‌ణుల‌కు ప్రాతఃకాల స్నానం వేదోక్త‌మై ఉన్న‌ది. 

ప్ర‌తీ రోజూ ప్రాతః స్నానం చేయ‌లేని వారు సూర్య‌సంచారం గ‌ల తులా-కార్తీక‌; మ‌క‌ర‌-మాఘ‌;  మేష‌-వైశాఖాల్లో అయినా చేయాలి. జీవితంలో ఈ మూడు మాసాలు ప్రాతః కాల స్నానం చేసిన వాడు స‌రాస‌రి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్య‌కాలాల్లో గాని, చంద్ర‌సూర్య‌గ్ర‌హ‌ణ కాలాల్లో గాని స్నానం అత్యంత ప్ర‌ధానం. గ్ర‌హ‌ణ స‌మ‌యాల్లో గ్ర‌హ‌ణ‌కాల స్నానం త‌ప్ప‌నిస‌రి.స‌ర్వ‌కాలాల్లోను బ్రాహ్మ‌ణులు, పుణ్య‌కాలాల్లో స‌ర్వ ప్ర‌జ‌లు స్నాన సంధ్యా జ‌ప‌, హోమ సూర్య‌న‌మస్కారాలు త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. స్నాన‌క‌ర్మ వ‌దిలిన‌వాడు రౌర‌వ న‌ర‌కంలో ప‌డి పునః క‌ర్మ‌భ్ర‌ష్టుడుగా జ‌న్మిస్తాడు. ఓ వివేక‌వంతుడా, పుణ్య‌కాలాల‌న్నింటిలోనూ స‌ర్వోత్త‌మ‌మైన‌ది కార్తీకం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగ‌ను మించిన తీర్ధం, భార్య‌తో స‌మాన‌మైన సుఖం, ధ‌ర్మ‌తుల్య‌మైన స్నేహం, కంటి కంటే వెలుగు లేన‌ట్టుగానే కార్తీక మాసంతో స‌మాన‌మైన పుణ్య‌కాలం గాని, కార్తీక దామోద‌రుని క‌న్నా దైవం గాని లేరు. క‌ర్మ‌మ‌ర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధ‌ర్మాన్ని ఆచ‌రించే వాడు వైకుంఠం చేర‌తాడు. నాయ‌నా విష్ణుమూర్తి ల‌క్ష్మీస‌మేతుడై ఆషాఢ శుక్ల‌ద‌శ‌మ్యంతంలో పాల‌స‌ముద్రాన్ని చేరి నిద్రా మిష‌తో శ‌య‌నిస్తాడు. పునః హ‌రిబోధిని అనే కార్తీక శుక్ల ద్వాద‌శినాడు నిద్ర లేస్తాడు. ఈ న‌డుమ నాలుగు మాసాల‌నే చాతుర్మాస్యాలంటారు. విష్ణుమూర్తి నిద్రాసుఖ‌ప్ర‌ద‌మైన ఈ నాలుగు నెల‌లూ ఎవ‌రైతే హ‌రిధ్యానం, పూజ‌లు చేస్తుంటారో వారి పుణ్యాలు అనంత‌మై విష్ణులోకాలు పొందుతారు. ఈ విష‌య‌మై ఒక పురాణ ర‌హ‌స్యాన్ని చెబుతాను విను. 

ఒకానొక కృత‌యుగంలో విష్ణుమూర్తి ల‌క్ష్మీసమేతుడై వైకుంఠ సింహాస‌నాన్ని అధిష్టించి ఉండ‌గా నార‌దుడు అక్క‌డ‌కు వెళ్లి వారికి మొక్కి హే శ్రీ‌హ‌రీ, భూలోకంలో వేద‌విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాల‌కు లోనైపోతున్నారు. ప్ర‌జలంతా విక‌ర్ములై ఉన్నారు. వారెలా ముక్తుల‌వుతారో తెలియ‌క నేను దుఃఖితుడ‌నై ఉన్నాను అని విన్న‌వించాడు.
నార‌దుని మాట‌ల‌ను విశ్వ‌సించిన నారాయ‌ణుడు స‌తీ స‌మేతంగా వృద్ధ బ్రాహ్మ‌ణ రూపం ధ‌రించి తీర్థ‌క్షేత్రాదులు, బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్తులున్న ప‌ట్ట‌ణాల్లో ప‌ర్య‌టించ‌సాగాడు. కొంద‌రు ఆ దంప‌తుల‌కు అతిథి స‌త్కారాలు చేశారు. కొంద‌రు హేళ‌న చేశారు. ఇంకొంద‌రు ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌తిమ‌ల‌ను పూజిస్తూ ఈ పుణ్య‌దంప‌తుల‌ను తిర‌స్క‌రించారు. కొంద‌రు అభ్య‌క్ష్యాల‌ను భుజిస్తున్నారు. ఇలా ఒక‌టేమిటి, అతి త‌క్కువ పుణ్య‌కార్యాచ‌ర‌ణ‌లు, అత్య‌ధిక పాప‌కార్యాలు చేస్తూ ఉన్నారు. వారిని చూసిన శ్రీ‌హ‌రి ప్ర‌జోద్ధ‌ర‌ణ చింతనా మాన‌సుడై చ‌తుర్భుజాల‌తో, కౌస్తుభాది ఆభ‌ర‌ణాల‌తో య‌థారూపాన్ని పొంది ఉండ‌గా జ్ఞాన‌సిద్ధుడ‌మే ఋషి త‌న శిష్య‌గ‌ణ స‌మేతంగా వ‌చ్చి ఆయ‌న‌ను ఆరాధించి అనేక విధాలుగా స్తుతించాడు.
న‌వ‌మ దిన పారాయ‌ణ స‌మాప్తః

No comments:

Post a Comment