Friday, November 1, 2019

కార్తీక పురాణం- 5వ రోజు పారాయ‌ణం  (శుక్ల పంచ‌మి రోజున‌) 

న‌వ‌మాధ్యాయం
య‌మ‌దూత‌ల ప్ర‌శ్న‌ల‌కు విష్ణుదూత‌లు చిరున‌వ్వుతో ఇలా అన్నారు. "ఓ య‌మ‌దూత‌లారా, మేము విష్ణుదూత‌ల‌ము. మీ ప్ర‌భువు మీకు విధించిన ధ‌ర్మాలేమిటి, పాపాత్ములెవ‌రు, పుణ్యాత్ములెవ‌రు? య‌మ దండ‌మున‌కు అర్హులైన వారెవ‌రో అన్నీ విపులీక‌రించి చెప్పండి".

"సూర్య‌చంద్రాగ్నివాయురాకాశ గోసంధ్య‌లు, ద‌శ‌దిశాకాలాలూ వీనిని పాప‌పుణ్యాల‌కు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవ‌త‌లారా, శ్ర‌ద్ధ‌గా వినండి. వేద‌మార్గాన్ని విడిచి త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌హించే వారు, అస‌త్య‌వాదులు, జంతు హింస చేసే వారు, దానం చేయ‌ని వారు, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించే వారు, చేసిన దానాన్ని డాంబికంగా బ‌య‌ట‌పెట్టుకునే వారు, ఇత‌రులు చేసే దానాన్ని కూడా నిరోధించే వారు, ద‌యార‌హితులు, ప‌ర‌భార్యాసంగ‌ములు, మిత్ర‌ద్రోహానికి పాల్ప‌డే వారు, కృత‌ఘ్నులు, ఇత‌రుల పురుష సంత‌తిని చూసి ఏడ్చే వారు, క‌న్యాశుల్కంతో జీవించే వారు, త‌ల్లిదండ్రుల శ్రాద్ధ‌క‌ర్మ‌ల‌ను విడిచిపెట్టిన వారు, వాపీకూప‌త‌టాకాది నిర్మాణాల‌ను ఆటంక‌ప‌రిచే వారు, భోజ‌నం మీద త‌ప్ప మ‌రే ఆలోచ‌న లేని వారు, త‌ల్లిదండ్రుల శ్రాద్ధ క‌ర్మ‌ల‌ను విడిచిపెట్టే వారు, నిత్య స్నాన‌సంధ్యాదులు చేయ‌ని వారు, బ్రాహ్మ‌ణ‌, గో హ‌త్య‌లు చేసే వారు...ఇలాంటి వారంద‌రూ పాపాత్ములు. వారు య‌మ‌లోకంలో బ‌హుదండ‌న‌ల‌కు అర్హులు. ఇక ఈ అజామిళుడంటారా, వీడు చేయ‌ని పాప‌మంటూ ఏదీ లేదు. బ్రాహ్మ‌ణ జ‌న్మ ఎత్తి కూడా దాసీ సంగ‌మ‌లోలువై చేయ‌రాని పాపాలు చేశాడు. వీడు మీ విష్ణులోకం చేర‌డానికి ఏ విధంగా అర్హుడు సెల‌వీయండి" అన్నారు య‌మ‌దూత‌లు.
వారికి స‌మాధానంగా విష్ణుదూత‌లు
ఓ య‌మ‌దూత‌లారా, "ఉత్త‌మ లోకాలు చేరేందుకు ఎవ‌రికి అర్హ‌త ఉంటుంది, ఎలాంటి పుణ్య‌కార్యాలు చేసిన వారు విష్ణుప‌థం చేర‌గ‌ల‌రు చెబుతాం వినండి. ఏ కార‌ణం వ‌ల‌న అయినా చెడు మిత్రుల‌ను వ‌దిలి స‌త్సంగంలో క‌లిసే వారు, నిత్య‌దైవ‌చింత‌నాప‌రులు, స్నాన సంధ్య జ‌ప హోమ త‌త్ప‌రులూ య‌మ లోకానికి అర్హులు కారు. అసూయా ర‌హితులై, జ‌పాగ్నిహోత్ర క‌ర్మ‌లు ఆచ‌రిస్తూ జ‌లాన్న గోదానాలు చేసే వారు, వృషోత్స‌ర్జ‌నాక‌ర్త‌లు కూడా య‌మ‌లోకాన్ని పొందేందుకు అన‌ర్హులు. విద్యాదానం చేసేవారు, ప‌రోప‌కార‌శీలురు, హ‌రిపూజా ప్రియులు, నిరంత‌రం హ‌రినామ జ‌పం చేసే వారు, వివాహ ఉప‌న‌య‌నాలు చేయించే వారు, అనాథ ప్రేత సంస్కారాలు చేసే వారు  కూడా య‌మ‌లోకాన్ని చేర‌లేరు. అంతే కాదు, నిత్యం సాల‌గ్రామాన్ని అర్చించి వాటి తీర్థం సేవించే వారు, తుల‌సీకాష్ఠ మూలిక‌లు ధ‌రించే వారు, ఇళ్ల‌లో తుల‌సిని పెంచే వారు, భాగ‌వ‌తాన్ని ప‌ఠించే వారు, పూజించే వారు, వినేవారు, సూర్య‌డులు మేష‌, తుల, మ‌క‌ర సంక్రాంతుల్లో ఉండ‌గా ప్రాతః కాల స్నానాలు ఆచ‌రించే వారు కూడా య‌మ‌లోకార్హ‌త లేని వారే. తెలిసిగాని, తెలియ‌క‌గాని హ‌రినామ సంకీర్త‌నం చేసే వారు పాప‌విముక్తుల‌వుతారు. అస‌లిన్ని మాట‌లెందుకు, అవ‌సాన కాలంలో ఒక్క‌సారైనా హ‌రినామ స్మ‌ర‌ణ చేసిన వాడు నేరుగా విష్ణులోకానికి రావ‌డానికే అర్హుడు" అన్నారు.

ఈ విధంగా సాగుతున్న య‌మ‌, విష్ణుదూత‌ల సంవాదాన్ని విన్న అజామిళుడులోని జీవుడు త‌న దాసీ సాంగ‌త్యాది పాపాల‌న్నింటినీ త‌లంచుకుని దుఃఖించ‌సాగాడు. ఇదేమి ఆశ్చ‌ర్యం, ఆ న‌ల్ల‌ని క‌త్తులు ధ‌రించిన య‌మ‌దూత‌లు ఏమైపోయారు?  నేనీ వైకుంఠంలో ఎలా ఉండ‌గ‌లిగాను?  పూర్వ జ‌న్మ పుణ్యం కాక‌పోతే నా జిహ్వ‌పై హ‌రినామం ఎలా వ‌చ్చింది, నాకు వైకుంఠ ప్రాప్తి ఎలా క‌లిగింది అని త‌న‌లో తానే అనుకుంటూ హ‌రినామ‌స్మ‌ర‌ణం చేయ‌సాగాడు.

కాబ‌ట్టి ఓ రాజా కేవ‌ల హ‌రినామ స్మ‌ర‌ణ‌మే అంత‌టి ముక్తి ప్ర‌ద‌మైన‌ది. అలాంటిది హ‌రికి ఎంతో ప్రియ‌మైన కార్తీక వ్ర‌తం ఆచ‌రిస్తే ఎంత పుణ్యం క‌లుగుతుందో ఊహించు అన్నాడు వ‌శిష్ఠుడు.
న‌వ‌మాధ్యాయ స‌మాప్తః
--------------

ద‌శ‌మాధ్యాయం

ఈ వృత్తాంతం వినిపించిన వ‌శిష్ఠుని జ‌న‌క‌మ‌హారాజు ఇలా అడిగాడు.
"ఓ మ‌హ‌ర్షీ, ఈ అజామిళుడు పూర్వ‌జ‌న్మ‌లో ఎవ‌రు, ఏ పాపం వ‌ల‌న ఇలా పుట్టాడు, విష్ణుదూత‌ల మాట‌ల‌కు య‌మ‌దూత‌లు ఎలా త‌గ్గారు" అని ప్ర‌శ్నించాడు. 

దానికి వ‌శిష్ఠుడు నీవ‌డిగిన ప్ర‌శ్న‌ల‌కు ఒక క్ర‌మంలో స‌మాధానాలు చెబుతాను.

య‌మ‌దూత‌ల ఆరోప‌ణ - య‌ముని ఉప‌దేశం
అయ్యా పాపాత్ముడూ, దురాచార‌ప‌రుడూ, నిషిద్ధ క‌ర్మ‌లు ఆచ‌రించిన వాడు అయిన అజామిళుని జీవుని తెచ్చే స‌మ‌యంలో విష్ణుదూత‌లు మ‌మ్మ‌ల్ని అడ్డ‌గించి అత‌న్ని మా నుంచి విడిపించి వైకుంఠానికి తీసుకువెళ్లారు. వారిని ఎదిరించ‌లేక మేమిలా రిక్త‌హ‌స్తులుగా వ‌చ్చాము అని విష్ణుపారిష‌దుల చేత తిర‌స్కృతులైన య‌మ దూత‌లు య‌మునికి నివేదించారు.

కింక‌రులు చెప్పింది విన్న స‌మ‌వ‌ర్తికి ర‌వంత ఆగ్ర‌హం క‌లిగింది. జ్ఞాన‌దృష్టితో స‌మ‌స్తం అవ‌లోకించి వారితో ఇలా అన్నాడు.

కింక‌రులారా, కించిద‌పి పుణ్య విహీనోపి - ఆ అజామిళుడు మ‌హాపాపే అయిన‌ప్ప‌టికీ అంత్య కాలంలో హ‌రినామ స్మ‌ర‌ణ చేయ‌డం వ‌ల‌న స‌మ‌స్త‌పాపాలు న‌శించి విష్ణుప్రియుడ‌య్యాడు. తెలిసి తాకినా, తెలియ‌క తాకినా స‌మ‌స్త జాతుల‌ను అగ్ని ఎలా ద‌హిస్తుందో అలాగే దుష్టాత్ములై, శ్రీ‌హ‌రిని ఎన్న‌డూ క‌ల‌లోనైనా స్మ‌రించ‌ని వారు అంత్య‌కాలంలో శ్రీ‌హ‌రీ, నారాయ‌ణా అని ప‌లికితే చాలు వారి స‌మ‌స్త పాపాలు హ‌రించుకుపోతాయి. ఇక భ‌క్తిభావంతో ఎల్ల‌ప్పుడూ హ‌రినామ స్మ‌ర‌ణ చేసే వారు కేవ‌లం కైవ‌ల్యానికే చేరగ‌లుగుతారు.

ఇలా సేవ‌కుల‌కు ఎంతవ‌ర‌కు చెప్పాలో అంత‌వ‌ర‌కు మాత్ర‌మే చెప్పిన య‌మ‌ధ‌ర్మ‌రాజు ఆ అజామిళుని పూర్వ‌వృత్తాంతాన్ని కూడా జ్ఞాన‌దృష్టితో వీక్షించాడు. 

అజామిళుని పూర్వ‌జ‌న్మ‌
అజామిళుడు పూర్వ‌జ‌న్మ‌లో సౌరాష్ట్ర దేశంలో శివార్చ‌కుడుగా ఉండేవాడు. ఆ జ‌న్మ‌లో కూడా స్నాన సంధ్యాదులు విస్మ‌రించి, దైవేత‌రాల‌నే చింతిస్తూ, దేవుని ద్ర‌వ్యాన్ని కూడా అప‌హ‌రించే వాడు. బ్రాహ్మ‌ణుడై ఉండి కూడా ఆయుధాలు చేత‌ప‌ట్టి తిరుగుతూ దుష్టుల‌తో స్నేహం చేస్తూ కాలం గ‌డిపాడు. 

అదే గ్రామంలో ఒక ద‌రిద్ర బ్రాహ్మ‌ణుడుండే వాడు. అత‌ను ద‌రిద్ర పీడితుడై, అన్నం కోసం అన్ని ప్ర‌దేశాలు తిరుగుతూ యాయ‌వార వృత్తి అవ‌లంబించే వాడు. ఒక‌సారి అత‌ను యాయ‌వార వృత్తి ద్వారా ఆ రోజు త‌న‌కు ల‌భించిన వ‌స్తువుల‌తో ఇంటికి వ‌చ్చి భార్య‌ని పిలిచి "చాలా ఆక‌లిగా ఉంది. తొంద‌ర‌గా వంట చేయి. ముందుగా కాసిని మంచినీళ్లు ఇస్తే అవి తాగి ఉప‌శాంతి పొందుతాను" అన్నాడు.

కాని య‌వ్వ‌న‌వ‌తి, మ‌దాంధురాలు అయిన అత‌ని భార్య భ‌ర్త‌మాట‌లు వినిపించుకోలేదు. త‌న జారుని గురించే త‌ల‌పోస్తున్న ఆమెకు భ‌ర్త మాట‌లు చెవిన ప‌డ‌లేదు. అందుకు కోపించిన భ‌ర్త చేతికందిన క‌ర్ర‌తో ఆమెను కొట్టాడు. కామంతో కూడిన త‌న ఆలోచ‌న‌ల‌కు అడ్డుప‌డ్డాడ‌న్న కోపంతో ఆమె కూడా భ‌ర్త‌కు ముష్టిఘాతాలిచ్చింది. తీవ్రంగా అలిసిపోవ‌డంతో పాటు భార్య దుష్ట‌ప్ర‌వ‌ర్త‌న‌కు చింతించిన ఆ బ్రాహ్మ‌ణుడు ప‌రిత‌పించి ఇల్లు వ‌దిలిపోయాడు. వేరే గ్రామంలో యాయ‌వారం చేసుకుంటూ బ‌త‌క‌సాగాడు. మ‌దాంధ అయిన అత‌ని భార్య భ‌ర్త ఇల్లు వ‌దిలి వెళ్లిపోవ‌డంతో మ‌రింత బ‌రితెగించింది. ఆ జారిణి మ‌గ‌డు తెచ్చిన‌వ‌న్నీ వండుకుని సుష్టుగా తిని భ‌ర్త ఆభ‌ర‌ణాలు అలంక‌రించుకుని, దుస్తులు ధ‌రించి, తాంబూల‌చ‌ర్వ‌ణం చేస్తూ ఒక ర‌జ‌కుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి త‌న‌తో సంభోగించాల్సిందిగా కోరింది. కాని నీతిమంతుడైన ఆ ర‌జ‌కుడు ఆమె కోర్కెను నిరాక‌రించాడు. వారిద్ద‌రి మ‌ధ్య సంవాదం కూడా జ‌రిగింది. అయినా ఆ ర‌జ‌కుడు త‌న‌ను కాద‌న‌డంతో కోప‌గించిన ఆమె ఇత‌ర ర‌సికుల‌ను వెతుక్కుంటూ వీధిన ప‌డింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో శివార్చ‌కుడు ఆమెకు ఎదుర‌య్యాడు. అత‌న్ని సుర‌త క్రీడ‌ల‌కు ఆమె ఆహ్వానించింది. బ్రాహ్మ‌ణుడైనా ప‌ర స్ర్తీ వ్యామోహంతో వెనుక‌ముందు చూడ‌కుండా ఆమె కోర్కెను అంగీక‌రించాడు. ఇద్ద‌రూ ఆ రాత్రంతా సుఖించారు. కాని స‌ద్వంశంలో జ‌న్మించింది కావ‌డం వ‌ల్ల కామం చ‌ల్లార‌గాన‌ ఆ జారిణి త‌న దోషాన్ని గుర్తించి ప‌శ్చాత్తాప‌ప‌డి భ‌ర్త‌ను వెతుక్కుంటూ వెళ్లింది. అత‌న్ని బ‌తిమాలి ఇంటికి తీసుకువ‌చ్చి ఆ త‌ర్వాత అత‌ను చెప్పిందే వేదంగా అత‌ని మాట జ‌వ‌దాట‌కుండా జీవించ‌సాగింది.

ఈ పాప‌క‌ర్మ‌ల వ‌ల‌న మ‌ర‌ణానంత‌రం ఆ శివార్చ‌కుడు రౌరవాది మ‌హాన‌ర‌కాలు అనుభ‌వించి చివ‌రికి స‌త్య‌నిష్ఠుడు అనే బ్రాహ్మ‌ణ‌కుమారుని ఇంటిలో జ‌న్మించాడు. అత‌డే అజామిళుడు. పూర్వ‌జ‌న్మ దుష్ట‌వాస‌న‌ల‌తో జీవితాంతం దుష్ట‌క‌ర్మ‌లే చేసినా కార్తీక పౌర్ణ‌మినాడు శివ‌సంద‌ర్శ‌నం, అంత్య కాలంలో హ‌రినామ‌స్మ‌ర‌ణం చేసిన పుణ్యం వ‌ల‌న మోక్షాన్ని పొందాడు.

ఆ నాడు శివార్చ‌కునితో జార‌త్వం నెరిపిన ఆ బ్రాహ్మ‌ణ జారిణీ కూడా కొంత కాలానికి మ‌ర‌ణించింది. న‌ర‌కం అనుభ‌వించిన అనంత‌రం క‌న్యాకుబ్జంలోని ఒక ఛండాలుని ఇంటిలో బాలిక‌గా జ‌న్మించింది. ఆ పిల్ల తండ్రి గండాన పుట్ట‌డం వ‌ల‌న వారు ఆ పిల్ల‌ను అడ‌విలో వ‌దిలేశారు. వ‌నాల్లో తిరుగుతున్న ఒక బ్రాహ్మ‌ణుడు ఆ శిశువు అర‌ణ్య‌రోద‌న విని జాలి ప‌డి త‌న‌తో తీసుకువెళ్లి ఇంటి దాసీకి పెంచుకునేందుకు ఇచ్చాడు. ఆ దాసీదాని ద‌గ్గ‌ర పెరిగిన పిల్ల‌నే త‌దుప‌రి జ‌న్మ‌లో అజామిళుడు ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు.

మ‌హారాజా, నువ్వ‌డిగిన అజామిళుని పూర్వ‌గాథ ఇది. స‌మ‌స్త పాపాల‌కు హ‌రినామ స్మ‌ర‌ణ‌ను మించిన ప్రాయ‌శ్చిత్తం మ‌రొక‌టి లేదు. అది సాధ్యం కాన‌ప్పుడే ఇత‌ర ధ‌ర్మ‌శాస్ర్తాది ప్రోక్త పాయ‌శ్చిత్త క‌ర్మ‌లు ఆచ‌రించాల్సి ఉంటుంది.   

జ‌న‌క మ‌హారాజా, ఎవ‌రి జిహ్వ నిరంత‌రం హ‌రిని కీర్తించ‌దో, ఎవ‌రి మ‌న‌సు హ‌రిచ‌ర‌ణాలు ఆశ్ర‌యించ‌దో, ఎవ‌రి చెవులు శ్రీ‌హ‌రి కీర్త‌న‌లు ఆల‌కించ‌దో వారి పాపాలు ఏ విధంగానూ న‌శించే అవ‌కాశం లేదు. ఎవ‌రైతే చింత‌ల‌న్నింటినీ విడిచిపెట్టి నిరంత‌రం విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు త‌ప్ప‌నిస‌రిగా కైవ‌ల్యం పొందుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మోక్షాస‌క్తుల‌కు ముర‌హ‌రి స్మ‌ర‌ణ ఏ విధంగా సూక్ష్మ‌మార్గ‌మో అదే విధంగా కార్తీక ధ‌ర్మాచ‌ర‌ణమ‌నే సూక్ష్మ మార్గం కూడా మ‌హోత్కృష్ట పుణ్య‌ప్ర‌దాయినియై పాత‌కాల‌ను పార‌దోలుతుంది. పాపాల‌ను న‌శింప‌చేసే శ‌క్తి ఈ కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ‌కు మాత్ర‌మే ఉంది. దాని వ‌ల‌న ఎవ‌రు ఈ దివ్య వ్ర‌తాన్ని ఆచ‌రించ‌రో వారు న‌ర‌క ప్రాప్తులువార‌ని తెలుసుకో. పాప‌నాశ‌ని అయిన ఈ కార్తీక మాహాత్మ్యాన్ని వినిపించే వాడు వైకుంఠ గ‌తుడై విష్ణువుతో క‌లిసి సుఖించుతాడు.  
ద‌శ‌మాధ్యాయ స‌మాప్తః
ఐద‌వ రోజు పారాయ‌ణం ముగిసింది
--------------------------------- 
నోట్ - చ‌దివిన వారంద‌రూ అద్భుతం, చాలా బాగుంది, బాగుంది అనే రేటింగ్ బాక్స్ ల్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వండి. ధ‌న్య‌వాదాలు

1 comment:

  1. hunting order cialis online once
    lunch [url=http://cialisle.com/]is there a generic cialis available in the
    us[/url] hall
    without engage http://cialisle.com/ property

    ReplyDelete