Monday, November 11, 2019

కార్తీక పురాణం- 14వ రోజు పారాయ‌ణం   (శుక్ల చ‌తుర్ద‌శి రోజున‌)

ఏకోన‌త్రింశాధ్యాయం
అనంత‌రం అంబ‌రీషుడు దూర్వాసునికి న‌మ‌స్క‌రించి "ఓ మ‌హామునీ నేను బ‌హుపాపాత్ముడ‌ను. ఆక‌లితో ఉండి అన్నానికై నా ఇంటికి వ‌చ్చిన నిన్ను అల‌స‌ట పాలు చేసిన మంద‌భాగ్యుడ‌ను. అయినా నాపై ద‌య‌తో తిరిగి నా ఇంటికి అతిథిగా విచ్చేశారు. ద‌య‌చేసి నా ఇంట విందార‌గించి నా స‌ర్వ‌దోషాల‌నూ ఉప‌శ‌మింప‌చేయండి" అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంబ‌రీషుని లేవ‌నెత్తి "రాజా ప్రాణ‌దాత‌ను తండ్రి అంటారు. నువ్వు నా ప్రాణాల‌ను కాపాడ‌డం వ‌ల‌న నాకు పితృస్థానంలోని వ్య‌క్తివిగా మారావు. నిజానికి నేనే నీకు న‌మ‌స్క‌రించాలి. కాని బ్రాహ్మ‌ణుడ‌ను, తాప‌సిని, నీ క‌న్నా వ‌యో వృద్ధుడ‌న‌ను కావ‌డం వ‌ల‌న నా న‌మ‌స్కారం నీకు కీడు క‌లిగిస్తుందే గాని మేలు చేయ‌దు. అందువ‌ల్ల‌నే నీకు న‌మ‌స్క‌రించ‌లేదు. నిన్ను క‌ష్ట‌పెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణ‌భిక్ష పెట్టావు. నీ వంటి ధ‌ర్మాత్మునితో క‌లిసి భోజ‌నం చేయ‌డం మ‌హ‌ద్భాగ్యం" అన్నాడు.

అనంత‌రం ఆతిథ్యం స్వీక‌రించి దూర్వాసుడు ఆశ్ర‌మానికి త‌ర‌లి వెళ్లిపోయాడు. కాబ‌ట్టి, కార్తీక శుద్ధ ఏకాద‌శి నాడు ఉప‌వాస, జాగ‌ర‌ణ‌లు చేసి ద్వాద‌శి ఘ‌డియ‌లు దాట‌కుండా పార‌ణం చేయ‌డం వ‌లన అన్ని పాపాలూ అంత‌రించిపోతాయి. ఈ పుణ్య‌గాథ‌ను చ‌దివినా, చ‌దివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో స‌ర్వ‌సౌఖ్యాలు పొంది ప‌రంలో ఉత్త‌మ గ‌తులు పొందుతారు.
ఏకోన‌త్రింశాధ్యాయ స‌మాప్తః
-----------
త్రింశాధ్యాయం
పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మాహాత్మ్యాన్ని విని శౌన‌కాది ఋషులు మ‌హాభాగా క‌లియుగ క‌ల్మ‌షగ‌తులు, రాగాది పాశ‌యుక్త సంపాద‌నా గ్ర‌స్తులు అయిన సామాన్యుల‌కు సునాయాసంగా ల‌భించే పుణ్య‌మేది, అన్ని ధ‌ర్మాల్లోనూ అధిక‌మైన‌దేది, దేవ‌త‌లంద‌రికీ దేవాధిదేవుడెవ‌రు, దేని వ‌ల‌న మోక్షం క‌లుగుతుంది, మోహం దేని వ‌ల‌న‌న న‌శిస్తుంది, జ‌రామృత్యు పీడితులు, జ‌డ‌మ‌తులు, మందులూ అయిన ఈ క‌లికాల‌పు ప్ర‌జ‌లు తేలిగ్గా బ‌య‌ట‌ప‌డే మార్గం ఏమిటి అని అడిగారు. దానికి సూతుడిలా చెప్ప‌సాగాడు.

మంచి ప్ర‌శ్న‌లు వేశారు. ఇలాంటి మంచి విష‌యాల గురించి మాట్లాడుకోవ‌డం వ‌ల‌న వివిధ తీర్థ‌క్షేత్రాట‌న చేసి అక్క‌డ ప‌విత్ర స్నానాలు చేసిన‌, వివిధ య‌జ్ఞ‌యాగాదులు చేసినంత‌టి ఫ‌లితం ల‌భిస్తుంది. ఇంత‌వ‌ర‌కు నేను మీకు చెప్పిన కార్తీక ఫ‌ల‌మే వేదోక్త‌మ‌యిన‌ది, విష్థ్వానంద‌కార‌క‌మైన కార్తీక వ్ర‌త‌మే ఉత్త‌మోత్త‌మం. స‌ర్వ‌శాస్ర్తాల‌ని వివ‌రించి చెప్నేందుకు నేను స‌మ‌ర్థుడిని కాను. స‌మ‌య‌మూ చాల‌దు. క‌నుక అన్ని శాస్ర్తాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణుభ‌క్తి క‌న్నా త‌రుణోపాయం లేదు. విష్ణుగాథ‌ల‌ను వినేవారి పాపాలు న‌శించిపోతాయి. న‌ర‌కానికి ఎంతో దూరంగా ఉంటారు. హ‌రి ప్రీత్య‌ర్థం స్నాన‌, దాన‌, జ‌ప‌, పూజా, దీపారాధ‌న‌లు చేసే వారి పాపాల‌న్నీ వాటిక‌వే ప‌టాపంచ‌లైపోతాయి. సూర్యుడు తులారాశిలో ఉండే నెల‌రోజులూ విడువ‌కుండా కార్తీక వ్ర‌తం ఆచ‌రించే వారు జీవ‌న్ముక్తుల‌వుతారు. కార్తీకంలో కావేరి న‌దీ స్నానం చేసే వారు దేవ‌త‌ల నుతులు అందుకుని విష్ణులోకానికి చేర‌తారు. కార్తీక స్నానం చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. ఈ వ్ర‌తాచ‌ర‌ణ చేయ‌ని వారు వెయ్యి సార్లు ఛండాల‌పు జ‌న్మ‌లెత్తుతారు. స‌ర్వ‌శ్రేష్ఠం, హ‌రి ప్రీతిదాయ‌కం, పుణ్య‌క‌రం అయిన ఈ వ్ర‌తావ‌ర‌ణం దుష్టుల‌కు ల‌భించ‌దు. సూర్యుడు తులా రాశిలో ఉండ‌గా కార్తీక స్నాన‌, దాన‌, జ‌ప‌, పూజాదులు చేసే వారు స‌ర్వ‌దుఃఖాల నుంచి విముక్తుల‌వుతారు. ధ‌న‌, ఫ‌ల, ధాన్య‌, గృహ‌దానాలు అమిత పుణ్య‌ఫ‌లితం అందిస్తాయి. కార్తీకం 30 రోజులూ వ్ర‌తాచ‌ర‌ణ చేసే వారికి సంప‌త్తులు సంభ‌విస్తాయి. పుణ్యాత్ముల‌వుతారు. ఇన్ని మాట‌లెందుకు, విష్ణు ప్రీతిక‌ర‌మైన కార్తీక వ్ర‌తాచ‌ర‌ణం వ‌ల‌న ఇహ‌ప‌ర‌సుఖాలు రెండూ క‌లుగుతాయి.
త్రింశాధ్యాయ స‌మాప్తః


14వ రోజు పారాయ‌ణం స‌మాప్తం  

No comments:

Post a Comment