Saturday, November 23, 2019

కార్తీక పురాణం- 28వ రోజు పారాయ‌ణం (బ‌హుళ త్ర‌యోద‌శి రోజున‌)

 పంచ‌వింశాధ్యాయం
శ్రీ కృష్ణుడు స‌త్య‌భామ‌తో ఇలా చెబుతున్నాడు. స‌త్య‌భామా, నార‌దుడు చెప్పిన ఆ క‌థ‌ల‌తో ఆశ్చ‌ర్య‌మాన‌సుడైన పృథువు ఆ ఋషిని పూజించి అత‌ని వ‌ద్ద సెల‌వు తీసుకున్నాడు. ఆ కార‌ణంగా ఈ మూడు వ్ర‌తాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాల‌య్యాయి. మాఘ‌, కార్తీక వ్ర‌తాలు వ‌లెనే తిథుల‌లో ఏకాద‌శి, క్షేత్రాల్లో ద్వార‌క నాకు అత్యంత ప్రీతిక‌ర‌మైన‌వి. వీటిని ఎవ‌రైతే విధివిధానంగా ఆచ‌రిస్తారో వారు నాకు య‌జ్ఞాది క్ర‌తువులు, క‌ర్మ‌కాండ‌లు చేసిన వారి క‌న్నా చేరువైపోతారు. అటువంటి వారు నా క‌రుణాపూర్ణులై పాప‌భీతి లేని వార‌వుతారు.
శ్రీ‌కృష్ణుని మాట‌ల‌తో విస్మ‌యం చెందిన స‌త్య‌భామ స్వామీ ధ‌ర్మ‌ద‌త్తుడు ధార‌పోసిన పుణ్యం వ‌ల‌న క‌ల‌హ‌కు కైవ‌ల్యం ల‌భించింది.కేవ‌లం కార్తీక స్నాన పుణ్యం వ‌ల‌న రాజ‌ద్రోహాది పాపాలు ప‌టాపంచ‌లైపోతున్నాయి. స్వ‌యంకృతాలో, క‌ర్త‌ల నుంచి ద‌త్త‌ములో అయినవి స‌రే, అలా కాకుండా మాన‌వ‌జాతికి పాప‌పుణ్యాలేర్ప‌డే విధానం ఏమిటి, వివ‌రించు అని కోర‌డంతో గోవిందుడిలా చెప్ప‌సాగాడు.
పాప‌పుణ్యాలు ఏర్ప‌డే విధానం
శ్లో -దేశ‌గ్రామకులానిస్యుర్భోగ‌భాంజికృతాధిషు  
క‌లౌతు కేవ‌లం క‌ర్తా ఫ‌ల‌భ‌క్పుణ్య‌పాప‌యోః
ప్రియా, కృత‌యుగంలో చేసిన‌ పాప‌పుణ్యాలు గ్రామానికి, ద్వాప‌ర యుగంలోని పాప‌పుణ్యాలు వారి వంశాల‌కి చెందిన‌వి అయి ఉంటాయి. క‌లియుగంలో చేసే క‌ర్మ‌ఫ‌లం మాత్రం కేవ‌లం ఆ క‌ర్త‌కొక్క‌డికే చెందుతుంది.
సంస‌ర్గ ర‌హిత స‌మాయుక్తాల‌నే పాప‌పుణ్యాల‌ను గురించి చెబుతాను, విను. ఫ‌లాపేక్ష క‌లిగిన  మాన‌వుడు ఒక పాత్ర‌లో భుజించ‌డం వ‌ల‌న‌, ఒక స్ర్తీతో ర‌మించ‌డం వ‌ల‌న క‌లిగే పాప‌పుణ్యాల‌ను త‌ప్ప‌నిస‌రిగాను, సంపూర్ణంగాను అనుభ‌విస్తున్నాడు.
వేలాది బోధ‌న‌ల వ‌ల‌న, య‌జ్ఞం చేయ‌డం వ‌ల‌న, పంక్తి భోజ‌నం చేయ‌డం వ‌ల‌న క‌లిగే పాప‌పుణ్యాల్లో నాలుగో వంతు మాత్ర‌మే పొందుతున్నాడు. ఇత‌రులు చేసిన పాప‌పుణ్యాల‌ను చూడ‌డం వ‌ల‌న, త‌లంచుకోవ‌డం వ‌ల‌న అందులోని వందో భాగాన్ని పొందుతున్నాడు. ఇత‌రుల‌ను దూషించే వాడు, తృణీక‌రించే వాడు, చెడుగా మాట్లాడే వాడు, పితూరీలు చేసే వాడు ఇత‌రుల పాపాల‌ను తాను పుచ్చుకుని పుణ్యం జార‌విడుచుకుంటున్నాడు. త‌న భార్య చేత‌నో, కొడుకు చేత‌నో, శిష్యుని చేత‌నో త‌ప్ప ఇత‌రుల చేత సేవ‌లు చేయించుకునే వాడు త‌ప్ప‌నిస‌రిగా వారికి త‌గినంత ద్ర‌వ్యం ఇచ్చి తీరాలి. అలా ఇవ్వ‌ని వాడు త‌న పుణ్యంలో సేవానురూప‌మైన పుణ్యాన్ని ఇత‌రుల‌కు జార‌విడుచుకున్న వాడ‌వుతాడు. పంక్తి భోజ‌నాల్లో, భోక్త‌ల్లో ఏ లోపం జ‌రిగినా ఆ లోపం ఎవ‌రికి జ‌రిగిందో వారు య‌జ‌మానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హ‌రించిన వార‌వుతున్నారు. స్నాన‌సంధ్యాదులు ఆచ‌రిస్తూ ఇత‌రుల‌ను తాకినా, ఇత‌రుల‌తో మాట్లాడినా వారు త‌మ పుణ్యంలో ఆరో వంతు పుణ్యాన్ని ఇత‌రుల‌కు కోల్పోతాడు. ఎవ‌రి నుంచి అయినా యాచ‌న చేసి తెచ్చిన ధ‌నంతో ఆచ‌రించే స‌త్క‌ర్మ వ‌ల‌న క‌లిగే పుణ్యం ధ‌నం ఇచ్చిన వానికే ద‌క్కుతుంది. క‌ర్త‌కు క‌ర్మ‌ఫ‌లం వినా మ‌రేమీ మిగ‌ల‌దు. దొంగిలించి తెచ్చిన ప‌ర‌ద్ర‌వ్యంతో చేసే పుణ్య‌క‌ర్మ వ‌ల‌న వ‌చ్చే పుణ్యం ఆ ధ‌నం యొక్క య‌జ‌మానికే చెందితుంది.
ఋణ‌శేషం ఉండ‌గా మ‌ర‌ణించిన వారి పుణ్యంలో శేష‌రుణానికి స‌రిపోయేటంత పుణ్యం ఋణ‌దాత‌కు చెందుతుంది. పాపం కాని, పుణ్యం కాని ఫ‌లానా ప‌ని చేయాల‌నే సంక‌ల్పం క‌లిగిన వాడు, ఆ ప‌ని చేయ‌డంలో తోడ్ప‌డే వాడు, దానికి త‌గినంత సాధ‌న సంప‌త్తులు స‌మ‌కూర్చే వాడు, ప్రోత్స‌హించే వాడు త‌లా ఆరోవంతు ఫ‌లాన్ని పొందుతారు. ప్ర‌జ‌ల పాప‌పుణ్యాల్లో రాజుకు, శిష్యుని పాప‌పుణ్యాల్లో గురువుకు, కుమారుని నుంచి తండ్రికి, భార్య నుంచి భ‌ర్త‌కు ఆరోభాగం చెందుతుంది. ఏ స్ర్తీ అయితే ప‌తిభ‌క్తి గ‌ల‌దై నిత్యం భ‌ర్త‌ను సంతోష‌పెడుతుందో ఆమె త‌న భ‌ర్త చేసిన పుణ్యంలో స‌గ‌భాగానికి అధికారిణి అవుతుంది. త‌న సేవ‌కుడు లేదా కొడుకు ఇత‌రుల చేసిన ఆచ‌రింప‌చేసిన పుణ్యంతో త‌న‌కు ఆరో వంతు మాత్ర‌మే ల‌భిస్తుంది. ఈ విధంగా ఇత‌రులెవ‌రూ మ‌న‌కి దానం చేయ‌క‌పోయినా, మ‌న‌కే నిమిత్తం లేక‌పోయినా వివిధ జ‌న సాంగ‌త్యాల వ‌ల‌న పాప‌పుణ్యాలు మాన‌వుల‌కు ప్రాప్తించ‌క త‌ప్ప‌డంలేదు. అందుకే స‌జ్జ‌న సాంగ‌త్యమే అత్యంత ప్ర‌ధాన‌మ‌ని గుర్తించాలి. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక క‌థ చెబుతాను విను.
పంచ‌వింశోధ్యాయ స‌మాప్తః
-------------------
ష‌డ్వింశోధ్యాయం
ధ‌నేశ్వ‌రుడి క‌థ‌-స‌త్యాంగ‌త్య మ‌హిమ‌
చాలా కాలం క్రితం అవంతీపురంలో ధ‌నేశ్వ‌రుడ‌నే బ్రాహ్మ‌ణుడుండే వాడు. స‌హ‌జంగానే ధ‌నికుడైన అత‌డు కులాచార భ్ర‌ష్టుడై, పాపాస‌క్తుడై చ‌రించే వాడు. అస‌త్యాలు ప‌లుకుతూ వేశ్య‌ల‌తో గ‌డుపుతూ మ‌ధుపానాలు, దొంగ‌త‌నాలు చేస్తూ కాలం గ‌డిపే వాడు. ష‌డ్ర‌సాలు, కంబ‌ళ్లు, చ‌ర్మాల వ‌ర్త‌కం చేసేవాడు. వ‌ర్త‌కం నిమిత్తం ఒక దేశం నుంచి మ‌రో దేశానికి వెళ్ల‌డం అత‌ని అల‌వాటు. అదే విధంగా ఒక‌సారి మాహిష్మ‌తి న‌గ‌రం చేరాడు. ఆ న‌గ‌ర ప్రాకారం చుట్టూ న‌ర్మ‌దా న‌ది ప్ర‌వ‌హిస్తుంది.
ధ‌నేశ్వ‌రుడు ఆ ప‌ట్ట‌ణంలో వ‌ర్త‌కం చేసుకుంటూ ఉండ‌గానే కార్తీక మాసం ప్ర‌వేశించింది. దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థ‌లంగా మారింది. వ‌చ్చేపోయే జ‌నాల ర‌ద్దీ వ‌ల‌న వ‌ర్త‌కం బాగా జ‌రుగుతుంది క‌దా, ధ‌నేశ్వ‌రుడు నెలంతా అక్క‌డే ఉండిపోయాడు. వ‌ర్త‌క ల‌క్ష్యంతో ప్ర‌తీరోజూ న‌ర్మ‌దా న‌దీ తీరంలో సంచ‌రిస్తూ అక్క‌డ స్నాన‌, జ‌ప‌, దేవ‌తార్చ‌న విధులు నిర్వ‌హిస్తున్న వారిని చూశాడు. నృత్య‌, గాన, మంగ‌ళ వాద్య‌యుతంగా హ‌రికీర్త‌న‌లు, క‌థ‌లు ఆల‌పించే వారు, విష్ణుముద్ర‌ల‌ను ధ‌రించిన వారు, తుల‌సి మాల‌ల‌తో అల‌రారుతున్న వారు అయిన భ‌క్తుల‌ను చూశాడు. చూడ‌డ‌మే కాదు, నెల పొడుగునా తాన‌క్క‌డే మ‌సులుతూ ఉండ‌డం వ‌ల‌న  వారితో ప‌రిచ‌యం క‌లిగింది. వారితో సంభాషిస్తూ ఉండే వాడు. ఎంద‌రో పుణ్య‌వంతుల‌ను స్వ‌యంగా స్పృశించాడు. తుద‌కు ఆ స‌జ్జ‌న సాంగ‌త్యం వ‌ల‌న అప్పుడ‌ప్పుడూ విష్ణునామోచ్చార‌ణ‌చేశాడు.
నెల రోజులు ఇట్టే గ‌డిచిపోయాయి. కార్తీకోద్యాప‌నా విధినీ, విష్ణు జాగారాన్ని కూడా ధ‌నేశ్వ‌రుడు ద‌ర్శించాడు. పౌర్ణ‌మినాడు గో బ్రాహ్మ‌ణ పూజ‌లాచ‌రించి, ద‌క్షిణ భోజ‌నాదులు స‌మ‌ర్పించే వ్ర‌త‌స్థుల‌ను చూశాడు. సాయంకాల వేళ‌ల్లో శివ‌ప్రీత్య‌ర్ధం చేసే దీపోత్స‌వాల‌ను తిల‌కించాడు. స‌త్య‌భామా, నాకు అత్యంత ప్రీతిక‌ర‌మైన కార్తీక మాసంలో శివారాధ‌న దేనికి అని ఆశ్చ‌ర్య‌ప‌డ‌కు సుమా!
శ్లో - మ‌మ‌రుద్ర‌స్య‌యః క‌శ్చిదంత‌రం ప‌రిక‌ల్ప‌యేత్‌
త‌స్య‌పుణ్య క్రియాస్స‌ర్వా నిష్ఫ‌లాస్స్య‌ర్న సంశ‌యః
ఎవ‌రైతే న‌న్ను, శివుని భేద‌భావంతో చూస్తారో వారి స‌మ‌స్త పుణ్య‌క‌ర్మ‌లు వృధా అయిపోతాయి. శివుడు కార్తీక పౌర్ణ‌మి నాడే త్రిపురాసుర సంహారం చేసిన వాడ‌వ‌డం చేత కూడా ఆయ‌న ఆ రోజున ఆరాధ‌నీయుడ‌య్యాడు.
ఇక ధ‌నేశ్వ‌రుడు ఈ పూజామ‌హోత్స‌వాల‌న్నింటినీ ఎంతో ఆశ్చ‌ర్యంతోను, వాంఛ‌తోనూ చూస్తూ అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్నాడు. కాని ఆ స‌మ‌యంలోనే కాల‌వ‌శాన ఒక కృష్ణ‌స‌ర్పం అత‌న్ని కాటు వేయ‌డం, అత‌ను త‌క్ష‌ణ‌మే స్పృహ కోల్పోవ‌డం, అప‌స్మార‌కంలో ఉన్న అత‌గాడికి అక్క‌డి భ‌క్తులు తుల‌సి తీర్థం సేవింప‌చేయ‌డం, ఆ అనంత‌ర క్ష‌ణంలోనే ధ‌నేశ్వ‌రుడు దేహ‌త్యాగం చేయ‌డం జ‌రిగింది.
మ‌రుక్ష‌ణ‌మే య‌మ‌దూత‌లు వ‌చ్చి అత‌ని జీవుడిని పాశ‌బ‌ద్ధుని చేసి కొర‌డాల‌తో మోదుతూ య‌ముని వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. య‌ముడు అత‌ని పాప‌పుణ్యాల గురించి విచార‌ణ ఆరంభించ‌గా చిత్ర‌గుప్తుడు హే య‌మ‌ధ‌ర్మ‌రాజా! వీడు ఆగ‌ర్భ పాపాత్ముడే, అణువంత‌మైనా పుణ్యం చేసిన వాడు కాడు అని చెప్పాడు. ఆ మాట విన్న దండ‌ధ‌రుడు త‌న దూత‌ల చేత ధ‌నేశ్వ‌రుని త‌ల‌ను చిత‌క్కొట్టించి కుంభీపాక న‌ర‌కంలో వేయించాడు.
ఆ ధ‌నేశ్వ‌రుడు ఆ న‌ర‌కంలో ప‌డ‌గానే అక్క‌డి అగ్నులు చ‌ప్ప‌గా చ‌ల్లారిపోయాయి. ఆశ్చ‌ర్య‌ప‌డిన దూత‌లు ఈ విష‌యం కాలునికి విన్న‌వించారు. అంత‌కంటే అబ్బుర‌ప‌డిన న‌ర‌కాధీశుడు త‌క్ష‌ణ‌మే ధ‌నేశ్వ‌రుని త‌న కొలువుకు పిలిపించి తిరిగి విచార‌ణ చేయ‌బోతుండ‌గా అక్క‌డ‌కు విచ్చేసిన దేవ‌ర్షి నార‌దుడు ఓ య‌మ‌ధ‌ర్మ‌రాజా, ఈ ధ‌నేశ్వ‌రుడు త‌న చివ‌రి రోజుల్లో న‌ర‌క నివార‌కాలైన పుణ్యాలు ఆచ‌రించాడు. గ‌నుక ఇత‌నిని నీ న‌ర‌కం ఏమీ చేయ‌లేదు. ఎవ‌రైతే పుణ్య‌పురుష ద‌ర్శ‌న‌, స్ప‌ర్శ‌న‌, భాష‌ణ‌ల‌కు పాత్రులో వారు ఆ స‌జ్జ‌నుల పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతున్నాడు. అటువంటిది ధ‌నేశ్వ‌రుడు ఒక నెల పాటు కార్తీక వ్ర‌త‌స్థులైన ఎంద‌రెంద‌రో పుణ్యాత్ముల‌తో సాంగ‌త్యం చేసి విశేష పుణ్య‌భాగాల‌ను సంపాదించుకున్నాడు. కార్తీక వ్ర‌త‌స్థుల స‌హ‌జీవ‌నం వ‌ల‌న ఇత‌డు కూడా సంపూర్ణ కార్తీక వ్ర‌త‌ఫ‌లాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవ‌సాన వేళ హ‌రిభ‌క్తుల చేత తుల‌సి తీర్ధం పొందాడు. క‌ర్ణ‌పుటాల్లో హ‌రినామ‌స్మ‌ర‌ణం విన్నాడు. పుణ్య న‌ర్మ‌దీ తీర్ధాల‌తో వీని దేహం సుస్నాత‌మ‌యింది. అంద‌రు హ‌రిప్రియుల ఆద‌ర‌ణ‌కు పాత్రుడైన ఈ విప్రుడు న‌ర‌కానుభ‌వానికి అతీతుడే అని తెలుసుకో. ఇత‌గాడు దేవ‌తా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప‌భోగాల‌య‌మైన న‌ర‌కంలో ఉండేందుకు అన‌ర్హుడు అని బోధించి వెళ్లిపోయాడు. 
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 25, 26 అధ్యాయాలు స‌మాప్తం
28వ రోజు పారాయ‌ణం ముగిసింది. 

No comments:

Post a Comment