త్రయోవింశొధ్యాయం
విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథానంతరం ఓ గణాధిపతులారా, జయవిజయులు వైకుంఠంలోని ద్వారపాలకులని విన్నాను. వారెలాంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణుస్వరూపులై అంత స్థానం పొందారో తెలియచేయండి అంటూ ధర్మదత్తుడు అడిగాడు.
జయవిజయుల పూర్వజన్మం
తృణబిందుని కూతురు దేవహూతి. కర్దమ ప్రజాపతి దృక్ స్ఖలనం వలన ఆమెకి ఇద్దరు కుమారులు కలిగారు. వారే జయవిజయులు. వారిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనతరం అష్టాక్షరీ మంత్రాన్ని పఠించడం వల్ల వారు విష్ణుసాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిదులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞావంతులుగా ప్రసిద్ధి చెందారు. మరుదత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించాలని కోరాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్లి ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకుడుగా ఉండి ఆ యజ్ఞాన్ని విజయవంతంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి లెక్కలేనంతగా దక్షిణ ఇచ్చాడు. ఆ సొమ్ముతో అన్నదమ్ములిద్దరూ ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వహించాలని వాంఛించారు. కాని మరుత్తు ఇచ్చిన దక్షిణ పంపకంలో ఇద్దరికీ తగాదా వచ్చింది. ఇద్దరికీ చెరి సగం అయి జయుడంటే తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు అన్నాడు. ఆ వాదోపవాదాల సందర్భంగా క్రోధంతో విజయుడు అలిగి నువ్వు మొసలివైపో అంటూ జయునికి శాపం పెట్టాడు. జయుడు కూడా అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ఎదురు శాపం పెట్టాడు. తప్పు గ్రహించిన సోదరులిద్దరూ విష్ణువును పూజించి ఆయనను సాక్షాత్కరింపచేసుకున్నారు. తమ
పరస్పర శాపాలను, దానికి కారణాలను వివరించి ప్రభూ, నీకు అత్యంత సన్నిహితులమైన మేము మొసలిగాను, ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరం. మాకు శాపాల నుంచి విముక్తి పొందే మార్గం చూపించమని వేడుకున్నారు.
విష్ణుమూర్తి నవ్వుతూ జయవిజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోకుండా చేయడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాదవాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను.అంబరీషుని వాక్యం మన్నించి వివిధ యోనుల్లోను జన్మించి దశావతారాలు ధరించాను. మీరు సత్యం తప్పిన వారు కావడం చేత శాపాలను అనుభవించి అంత్యంతో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించాడు. విష్ణుమూర్తి ఆదేశాన్ని శిరసావహించి జయవిజయులు గండకీ నదీ ప్రాంతంలో మకర, మాతంగాలుగా జన్మించారు. పూర్వజన్మ జ్జ్ఞానం గలవారై విష్ణుచింతనలోనే కాలం గడపసాగారు. అలా ఉండగా కార్తీక మాసం వచ్చింది.
కార్తీక స్నానం చేసేందుకు ఏనుగు రూపంలో ఉన్న జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోకి దిగిందే తడవుగా విజయుడు ఆ ఏనుగు పాదాన్ని బలంగా కరిచి పట్టుకున్నాడు. విడిపించుకోవడంలో విఫలుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచిందే తడవుగా అక్కడ ప్రత్యక్షమైన విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని ప్రయోగించి కరిమకరాలు రెండింటికీ మోక్షప్రాప్తి కలిగించాడు. అప్పటి నుంచి ఆ క్షేత్రం హరిక్షేత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రాయుధం ఒరిపిడి కారణంగా ఆ గండకీ నదిలోని శిలలకు చక్రచిహ్నాలు ఏర్పడ్డాయి.
ఓ ధర్మదత్తా నువ్వు అడిగిన విష్ణు ద్వారపాలకులైన జయవిజయులు వారిద్దరే. అందు వలన
నీవు కూడా దంభమాత్సర్యాలు విడనాడి సమదర్శనుడవై సుదర్శనాయుధుని చరణసేవలను ఆచరించు. తుల, మకర,
మేష సంక్రమణాల్లో ప్రాతః స్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణ దీక్ష పాటించు. గో బ్రాహ్మణులను, విష్ణుభక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యం, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ఎత్తిన నాటి నుంచి నీవు ఆచరిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కన్నా దాన, తపో, యజ్ఞ, తీర్థాలు ఏవీ గొప్పవి కావని తెలుసుకో. ఓ విప్రుడా దైవప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవూ, నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. మేము ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునికి బోధించి ధర్మదత్తుని తిరిగి వ్రతాచరణోన్ముఖుణ్ని చేశారు. అనంతర
కలహ సమేతంగా విమానంలో వైకుంఠానికి బయలుదేరారు.
ఓ పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడు వింటాడో, ఇతరులకు వినిపిస్తాడో వాడు శ్రీమహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణుసాన్నిధ్యం పొందదగిన జ్హానవంతుడవుతాడు అని నారదుడు చెప్పాడు.
త్రయోవింశోధ్యాయ సమాప్తః
--------------
నారదుడు చెప్పిందంతా విన్న పృథు చక్రవర్తి ఆశ్చర్యచకితుడై "హే దేవర్షీ, ఇప్పుడు నీవు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదుల వలెనే గతంలో కృష్ణ, సరస్వతీ నదుల గురించి కూడా విన్నాను. ఆ మహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక, ఆ క్షేత్రాలకు చెందినవా వివరింపు" అని కోరాడు. అందుకు నారదుడు శ్రద్ధగా విను, కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం. సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మాహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదంటూ ఆ కథ చెప్పసాగాడు.
కృష్ణ, సరస్వతీ నదుల ఉద్భవం
ఒకానొక చాక్షుస మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై సవనం చేసేందుక సమాయత్తం అయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు, మునులు ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రం సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు.
దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగు మహర్షి హే విష్ణూ, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేంటి గతి అని ప్రశ్నించారు. శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరో భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా నిర్ణయించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన
స్థానంలో దీక్షితురాలై ఉన్న ఆ సవతి గాయత్రిని చూపి మత్సరంలో
శ్లో - అపూజ్యా యత్ర పూజ్యంఏ, పూజ్యానాంచ వ్యతిక్రమః
త్రీణిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం
ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడతారో, పూజనీయులు పూజలందుకోవడంలేదో అక్కడ కరువు, భయం, మరణం అనే మూడు విపత్తులూ కలుగుతాయి.
బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఉవిద ప్రజలకు కనిపించని రహస్య నదీ రూపం పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నా కన్నా చిన్న దాన్ని ఆశీనురాలిని చేశారు. కనుక మీరు జడీభూత నదీ నదీ రూపాలు పొందండి అని శపించింది.
సరస్వతీ దేవి క్రోధంతో పలికిన ఆ వచనాలు వింటూనే గాయత్రి చివ్వున లేచి దేవతలు వారిస్తున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తో నాకు కూడా ఆ విధమైన భర్తేనన్న మాట విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది.
ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి మేము నదులైనట్టయితే లోకాలననీ అతలాకుతలం అయిపోతాయి. గనుక అవివేకంతో ఇచ్చిన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కాని ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నా కోపం రూపంగా యాగానికి విఘ్నం జరిగింది. వాగ్దేవినైనా నా మాట తప్పదు. మీరందరూ నదీరూపాలు ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించాల్సిందే. సవతులమైన నేనూ, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాం అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ మారాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతర నదీరూపాలుగానూ మారిపోయారు.
బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగానూ, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతీ నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమం పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, వినినా, వినిపించినా వారి వంశఃమంతా కూడా నదీ దర్శన, స్నాన పుణ్యఫలం పొంది తరించిపోతుంది.
పద్మపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యం అధ్యాయాలు సమాప్తం
27వ
రోజు పారాయణం ముగిసింది
No comments:
Post a Comment