Sunday, November 17, 2019

కార్తీక పురాణం- 20వ రోజు పారాయ‌ణం (బ‌హుళ పంచ‌మి రోజున‌)

న‌వ‌మాధ్యాయం
దేవ‌ర్షీ తుల‌సిని స్థాపించి ఆ మండ‌పంలోనే ముందుగా విష్ణుపూజ చేయాల‌ని సెల‌విచ్చారు. పైగా తుల‌సిని హ‌రిప్రియా, విష్ణు వ‌ల్ల‌భ వంటి పేర్ల‌తో సంబోధించావు. శ్రీ‌హ‌రికి అంత‌టి ప్రియంక‌ర‌మైన ఆ తుల‌సీ మాహాత్మ్యాన్ని వినిపించు అని పృథువు నార‌దుని కోరాడు. 

శ్ర‌ద్ధ‌గా విను. పూర్వం ఒకానొక సారి ఇంద్రుడు స‌మ‌స్త  దేవ‌తాప్స‌ర‌స‌లు వెంట గారా శివ‌ద‌ర్శనం కోసం కైలాసానికి వెళ్లాడు. ఆ స‌మ‌యానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. భీత మ‌హాదంష్ర్టా నేత్రాల‌తో మృత్యు భ‌యంక‌రంగా ఉన్న ఆ స్వ‌రూపాన్ని శివునిగా గుర్తించ‌లేక ఈశ్వ‌రుడు ఎక్క‌డున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఆయ‌న‌నే ప్ర‌శ్నించాడు. కాని ఆ పురుషోత్త‌ముడు జ‌వాబీయ‌ని కార‌ణంగా నిన్ను శిక్షిస్తున్నాను. ఎవ‌డు ర‌క్షిస్తాడో చూస్తాను అంటూ వ‌జ్రాయుధంలో కంఠ‌సీమ‌పై కొట్టాడు. ఆ దెబ్బ‌కు భీక‌రాకారుడి కంఠం క‌మిలి న‌ల్ల‌న‌యింది గాని ఇంద్రుడి వ‌జ్రాయుధం బూడిదైపోయింది. అంత‌టితో ఆ భీష‌ణ మూర్తి నుంచి వ‌చ్చే తేజ‌స్సు దేవేంద్రుని కూడా ద‌గ్ధం చేసేలా తోచ‌డంతో దేవ‌గురువైన బృహ‌స్ప‌తి ఆ బేతాళ స్వ‌రూపం శివుడేన‌ని గుర్తించి ఇంద్రునిచే మొక్కించి శాంతి స్తోత్రంచేశాడు.

బృహ‌స్ప‌తి కృత బేతాళ శాంతి స్తోత్రం
న‌మో దేవాధి దేవాయ త్ర్యయంబ‌కాయ క‌ప‌ర్థినే
త్రిపురాఘ్నాయ శ‌ర్వాయ న‌మో2ంధక నిషూదినే

విరూపా యాదిరూపాయ బ్ర‌హ్మ‌రూపాయ శంభ‌వే
య‌జ్ఞ విద్ధంస‌క‌ర్రీవై య‌జ్ఞానాం ఫ‌ల‌దాయినే

కాలాంత కాల‌కాలాయ కాలభోగీధ‌రాయ‌చ‌
న‌మో బ్ర‌హ్మ శిరోహంత్రే, బ్ర‌హ్మ‌ణ్యాయ న‌మోన‌మః

బృహ‌స్ప‌తి ఈ విధంగా ప్రార్థించ‌డంతో శాంతించిన శివుడు త్రిలోక నాశ‌క‌మైన త‌న త్రినేత్రాగ్నిని ఉప‌సంహ‌రించేందుకు నిశ్చ‌యించుకుని "బృహ‌స్ప‌తీ, నా కోసం నుంచి ఇంద్రుని బ‌తికించినందుకు ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్ర‌ఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం న‌న్ను ముగ్ధుని చేసింది ఏదైనా వ‌రం కోరుకో అన్నాడు.
ఆ మాట మీద బృహ‌స్ప‌తి "హే శివా నీకు నిజంగా సంతోషం క‌లిగితే మ‌ళ్లీ అడుగుతున్నాను. త్రిదివేశుని, త్రిలోకాల‌ను కూడా నీ మూడో కంటి మంట నుంచి ర‌క్షించు. నీ ఫాలాగ్ని జ్వాల‌ను శాంతింప‌చెయ్యి. ఇదే నా కోరిక" అన్నాడు.

సంత‌శించిన సాంబ‌శివుడు "వాచ‌స్ప‌తీ, నా మూడో కంటి నుంచి వెలువ‌రించిన అగ్ని వెన‌క్కి తీసుకోద‌గిన‌ది కాదు. అయినా నీ ప్రార్థ‌న‌ను మ‌న్నించి అగ్ని లోక‌ద‌హ‌నం చేయ‌కుండా ఉండేందుకుగాను స‌ముద్రంలోకి చిమ్మేస్తు"న్నానంటూ అలాగే చేశాడు. ఆ అగ్ని గంగా సాగ‌ర సంగ‌మాన ప‌డి బాల‌క రూపాన్ని ధ‌రించింది. పుడుతూనే ఏడ్చిన ఆ బాలుని ఏడుపు ధ్వ‌నికి స్వ‌ర్గాది లోక ప‌ర్యంతం చెవుడు పొందింది. ఆ రోద‌న విని బ్ర‌హ్మ ప‌రుగుప‌రుగున స‌ముద్రుని వ‌ద్ద‌కు వ‌చ్చి ఈ అద్భుత శిశువు ఎవ‌రి పుత్రుడ‌ని అడిగాడు. స‌ముద్రుడాయ‌న‌కు న‌మ‌స్క‌రించి "గంగా సంగ‌మంలో జ‌న్మించాడు గ‌నుక ఇత‌డు నా కుమారుడే. ద‌య‌చేసి వీనికి జాత‌క‌ర్మాది సంస్కారాలు చేయి" అని కోరాడు. ఈ మాట‌లు జ‌రిగే లోప‌లే ఆ కుర్రాడు బ్ర‌హ్మ గ‌డ్డం ప‌ట్టుకుని ఊగిస‌లాడ‌సాగాడు. వాడి ప‌ట్టు నుంచి త‌న గ‌డ్డం వ‌దిలించుకోవ‌డం బ్ర‌హ్మ‌కు క‌ళ్ల నీళ్ల ప‌ర్యంతం అయింది. అందువ‌ల్ల విధాత "ఓ స‌ముద్రుడా నా క‌ళ్ల నుంచి రాలి చిందిన నీటిని ధ‌రించిన కార‌ణంగా వీడు జ‌లంధ‌రుడ‌నే పేర ప్ర‌ఖ్యాతుడ‌వుతాడు. స‌క‌ల విద్యావేత్త‌, వీరుడూ అయి శివునిచే త‌ప్ప ఇత‌రుల‌కు వ‌ధించ‌రాని వాడ‌వుతాడు" అని దీవించి ప‌ట్టాభిషిక్తుని చేశాడు. ఆ జ‌లంధ‌రునికి కాల‌నేమి కూతుడు బృంద‌నిచ్చి పెళ్లి చేశారు. రూప‌, వ‌యో, బ‌ల విలాసుడైన జ‌లంధ‌రుడు బృంద‌ను భార్య‌గా గ్ర‌హించి దాన‌వాచార్యుడైన శుక్రుని స‌హాయంతో స‌ముద్రం నుంచి భూమిని ఆక్ర‌మించి స్వ‌ర్గంలా ప‌రిపాలించ‌సాగాడు .
న‌వ‌మోధ్యాయ సంపూర్ణః
-----------
ద‌శ‌మాధ్యాయం
నార‌దుడు ఇంకా ఇలా కొన‌సాగించాడు. పూర్వ దైవోప‌హ‌త‌మైన పాతాళాది లోకాల‌లో దాగిన దాన‌వ బ‌ల‌మంతా ఇప్పుడు జ‌లంధురుని ఆశ్రయించింది. అత‌ని అండ‌తో వారంతా నిర్భ‌యంగా సంచ‌రించ‌సాగారు. ఆ జ‌లంధ‌రుడు ఒక‌నాడు శిరోహీనుడైన రాహువుని చూసి వీడికి త‌ల లేదేమిటి అని ప్ర‌శ్నించాడు. దానికి శుక్రుడు స‌మాధానం ఇస్తూ గ‌తంలో క్షీర‌సాగ‌ర మ‌ధ‌న వృత్తాంతం, ఆ సంద‌ర్భంగా విష్ణువు అత‌ని త‌ల న‌రికివేయ‌డం ఇత్యాది ఇతిహాసం అంతా చెప్పాడు. అది విన్న స‌ముద్ర త‌న‌యువైన జ‌లంధ‌రుడు మండిప‌డ్డాడు. త‌న స‌ముద్రుని వ‌ధించ‌డం ప‌ట్ల చాలా మ‌ధ‌న‌ప‌డ్డాడు. ఘస్మ‌రుడ‌నే వానిని దేవ‌త‌ల ద‌గ్గ‌ర‌కి రాయ‌బారిగా పంపాడు. వాడు ఇంద్రుని వ‌ద్ద‌కు వెళ్లి నేను రాక్ష‌స ప్ర‌భువైన జ‌లంధ‌రుని దూత‌ను. అయ‌న పంపిన శ్రీ‌ముఖాన్ని విను రేరే ఇంద్రా, నా తండ్రి అయిన స‌ముద్రుని ప‌ర్వ‌తంతో మ‌ధించి అప‌హ‌రించిన ర‌త్నాల‌ను అన్నింటినీ వెంట‌నే నాకు అప్ప‌గించు అని ఆందులో ఒక హెచ్చ‌రిక ఉంది.  

అది విని అమ‌రేంద్రుడు "ఓ రాక్ష‌స దూతా, గ‌తంలో నాకు భ‌య‌ప‌డిన లోక‌కంట‌కాలైన ప‌ర్వ‌తాల‌ని, నా శ‌త్రువులైన రాక్ష‌సులిని ఆ స‌ముద్రుడు త‌న గ‌ర్భంలో దాచుకున్నాడు. అందువ‌ల‌నే స‌ముద్ర మ‌థ‌నం చేయాల్సివ‌చ్చింది. ఇప్ప‌టి మీ రాజు లాగానే గ‌తంలో శంఖుడ‌నే స‌ముద్ర నంద‌నుడు కూడా అహంక‌రించి ప్ర‌వ‌ర్తించి నా త‌మ్ముడైన ఉపేంద్రుని చేతిలో హ‌తుడ‌య్యాడు. కాబ‌ట్టి స‌ముద్ర మ‌థ‌న కార‌ణాన్ని, దానికి అనుభ‌వించాల్సిన ఫ‌లితాన్ని మీ నాయ‌కునికి విన్న‌వించు" అని చెప్పాడు.

ఇంద్రుని స‌మాధానం విని మండిప‌డిన జ‌లంధ‌రుడు స్వ‌ర్గ‌లోకంపై స‌మ‌రం ప్ర‌క‌టించాడు. శుంభ నిశుంభాది సైన్యాధిప‌తుల‌తో స‌హా దేవ‌త‌ల‌పై దండెత్తాడు. ఉభ‌య సైన్యాల వారూ ముస‌ల‌, ప‌రిఘ‌, గ‌దాద్యాయుధాల‌తో దాడులు చేసుకున్నారు. ర‌థ‌, గ‌జ‌, తుర‌గాది శ‌వాలు, ర‌క్త ప్ర‌వాహాల‌తో ర‌ణ‌రంగం నిండిపోయింది. రాక్ష‌స గురువైన శుక్రుడు మ‌ర‌ణించిన రాక్ష‌సులంద‌రినీన మృత సంజీవ‌నీ విద్య‌తో బ‌తికిస్తుండ‌గా దేవ‌గురువైన బృహ‌స్ప‌తి అచేత‌నాలైన దేవ‌గ‌ణాల‌ను, ద్రోణ‌గిరి మీద దివ్యౌష‌ధాల‌తో చేత‌న్య‌వంతం చేయ‌సాగాడు. ఇది గ్ర‌హించిన శుక్రుడు జ‌లంధ‌రుడికి చెప్పి ఆ ద్రోణ‌గిరిని స‌ముద్రంలో పార‌వేయించాడు. 

ద్రోణ‌గిరి ప‌ర్వ‌తం అదృశ్యం కావ‌డంతో దేవ‌త‌ల‌నుద్దేశించి బృహ‌స్ప‌తి ఓ దేవ‌త‌లారా, ఈ జ‌లంధ‌రుడు ఈశ్వ‌రాంశ సంభూతుడు కాబ‌ట్టి మ‌న‌కి జ‌యింప‌శ‌క్యం కాకుండా ఉన్నాడు. ప్ర‌స్తుతానికి ఎవ‌రి దారిన వారు పారిపోండి అని హెచ్చ‌రించాడు. అది విన‌గానే భ‌యార్తులైన దేవ‌త‌లంద‌రూ యుద్ధ‌రంగం నుంచి పారిపోయి మేరు ప‌ర్వ‌త గుహాంత‌రాళాల‌ను ఆశ్ర‌యించారు. అంత‌టితో విజ‌యాన్ని పొందిన జ‌లంధ‌రుడు ఇంద్ర‌ప‌ద‌విలో తాను ప‌ట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదుల‌ను త‌న ప్ర‌తినిధులుగా నిర్ణ‌యించాడు. పారిపోయిన దేవ‌త‌ల‌ను బందీ చేయ‌డం కోసం కొంత సైన్యంతో ఆ మేరు ప‌ర్వ‌తాన్ని స‌మీపించాడు. 

శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 9, 10 అధ్యాయాలు స‌మాప్తం
20వ రోజు పారాయ‌ణం ముగిసింది. 

No comments:

Post a Comment