Monday, November 4, 2019

కార్తీక పురాణం- 7వ రోజు పారాయ‌ణం   (శుక్ల స‌ప్త‌మి రోజున‌)


త్ర‌యోద‌శాధ్యాయం
క‌న్యాదాన ఫ‌లం

ఓ మ‌హారాజా, ఎంత చెప్పినా త‌ర‌గ‌తి ఈ కార్తీక మ‌హాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయ‌వ‌ల‌సిన దాన‌ధ‌ర్మాల గురించి వివ‌రంగా చెబుతాను విను, అంటూ వ‌శిష్ఠుడు ఇలా చెప్ప‌సాగాడు. త‌ప్ప‌నిస‌రిగా చేయ‌వ‌ల‌సిన వానిని చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న పాపాల క‌లిగించే కార్తీక ధ‌ర్మాల‌న్నీ నా తండ్రి అయిన బ్ర‌హ్మ‌దేవుడు నాకు చెప్పాడు.

జ‌న‌క‌రాజేంద్రా, ఈ కార్తీక మాసంలో క‌న్యాదానం, ప్రాతః కాల స్నానం, యోగ్యులైన బ్రాహ్మ‌ణ బాలున‌కు ఉప‌న‌య‌నం చేయించ‌డం, విద్యాదానం, వ‌స్త్రదానం, అన్న‌దానం ఎంతో ఫ‌లాన్ని అందిస్తాయి. బ్రాహ్మ‌ణ బాలునికి ఈ కార్తీక మాసంలో ఒడుగు చేయించి ద‌క్షిణ స‌మ‌ర్పించ‌డం వ‌ల‌న పూర్వ‌జ‌న్మ పాపాలు కూడా తొల‌గిపోతాయి. ఈ విధంగా సొంత ధ‌నంతో ఉప‌న‌య‌నం చేయించిన వ‌టువు చేసే గాయ‌త్రీ జ‌పం వ‌ల్ల దాతకు సంక్ర‌మించిన మ‌హాపాత‌కాలు కూడా న‌శించిపోతాయి. వంద రావి చెట్లు నాటించిన‌, వంద తోట‌ల‌ను వేయించిన‌, వంద నూతులు, దిగుడుబావులు త‌వ్వించిన పుణ్యాల‌న్నీ క‌లిపినా కూడా ఒక బ్రాహ్మ‌ణ బాలునికి ఉప‌న‌య‌నం చేయించినందు వ‌ల్ల క‌లిగే పుణ్యంలో 16 వంతుకు కూడా స‌రికావు.
శ్లో - మాఘ్యాం వైమాధ‌వే మాసి చోత్త‌మం ద‌త్వాతు బంధ‌నం
కార‌యిష్యంతి తే రాజ‌న్ దానం ద‌త్వాతు కార్తీకే
కార్తీకంలో ఉప‌న‌య‌న దానం చేసి త‌దుప‌రి వ‌చ్చే మాఘ‌మాసంలో గాని, వైశాఖ మాసంలో గాని ఉప‌న‌య‌నం చేయించాలి. సాధువులూ, శ్రోత్రియులూ అయిన బ్రాహ్మ‌ణ బాల‌కుల‌కు ఉప‌న‌య‌నం చేయించ‌డం వ‌ల‌న అనంత పుణ్యం ల‌భిస్తుంద‌ని ధ‌ర్మ‌వేత్త‌ల‌యిన మునులు చెప్పారు. అనంత పుణ్యం క‌లిగించే ఈ కార్యానికి కార్తీక మాసంలో సంక‌ల్పం చెప్పుకుని ఫ‌లానా వారికి నా ద్ర‌వ్యంతో ఉప‌న‌య‌నం చేయిస్తాను అని వాగ్దానం చేయ‌డం వ‌ల్ల క‌లిగే స‌త్ఫ‌లితాన్ని చెప్ప‌డం స్వ‌ర్గ‌లోక వాసుల‌కు కూడా సాధ్యం కాదు. 

జ‌న‌క‌న‌ర‌పాలా, ఇత‌రుల సొమ్ముతో చేసే తీర్థ‌యాత్ర‌లు, దేవ‌బ్రాహ్మ‌ణ స‌మారాధ‌న‌ల ఫ‌లం, పుణ్యం ఆ దాత‌ల‌కే చెందుతుంద‌న్న విష‌యం జ‌గ‌ద్విదితం.
శ్లో - క‌న్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భ‌క్తితో న‌ఘ‌
స్వ‌యం పాపైర్విముక్తః పితృణాం బ్రాహ్మ‌ణః ప‌ద‌మ్
కార్తీకంలో క‌న్యాదాన‌మాచ‌రించిన వాడు స్వ‌యంగా తాను త‌రించ‌డ‌మే కాకుండా త‌న పిత‌రులంద‌రికీ కూడా బ్ర‌హ్మ‌లోక ప్రాప్తిని క‌లిగించిన వాడ‌వుతాడు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఒక క‌థ చెబుతాను విను. 

సువీరోపాఖ్యాన‌ము
ద్వాప‌ర యుగంలో వంగ‌దేశాన దుర్మార్గుడైన సువీరుడ‌నే రాజు ఉండే వాడు. లేడి క‌న్నుల వంటి సోగ‌క‌న్నులు గ‌ల సుంద‌రాంగి అత‌ని భార్య‌. దైవ‌యోగం వ‌ల‌న సువీరుడు దాయాదుల‌చే ఓట‌మి పాలై రాజ్య‌భ్ర‌ష్ఠుడై సుంద‌రాంగితో స‌హా అడ‌వుల్లోకి పారిపోయి కంద‌మూలాల‌లో కాలం గ‌డిపే వాడు. ఆ స‌మ‌యంలోనే అత‌ని భార్య గ‌ర్భ‌వ‌తి అయింది. సువీరుడు న‌ర్మ‌దా న‌దీతీరంలో ప‌ర్ణ‌శాల నిర్మించాడు. ఆ ప‌ర్ణ‌శాల‌లోనే రాణి చ‌క్క‌ని కుమార్తెను ప్ర‌స‌వించింది. స‌ర్వ‌సంప‌ద‌లు శ‌త్రువుల పాలై అడ‌వులు ప‌ట్టి తిరుగుతూ కంద‌మూలాలు భుజిస్తూ బ‌తుకుతున్న ఈ రోజుల్లో రాణి క‌డుపు పంటి సంతానం క‌ల‌గ‌డం, పోష‌ణ‌కు చిల్లి గ‌వ్వ‌యినా లేని దుర్భ‌ర దారిద్ర్యం గురించే నిరంత‌రం త‌ల‌చుకుంటూ పూర్వ‌జ‌న్మ‌కృత పాప‌క‌ర్మ‌ల‌ని నిందించుకుంటూ అతి క‌ష్టం మీద ఆ కుమార్తెను సువీర దంప‌తులు పెంచుకోసాగారు. కాల‌గ‌మ‌నంలో సువీరుని కుమార్తె చ‌క్క‌గా ఎదిగి స్ఫుర‌ద్రూపి అయింది. అమిత లావ‌ణ్య సౌంద‌ర్యాల‌తో చూసే వారికి నేత్రానందం క‌లిగించేది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఎంతో మ‌నోహ‌రంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆమెను త‌న‌కిచ్చి వివాహం చేయాల‌ని సువీరుని కోరాడు. ఋషిపుత్రా, ప్ర‌స్తుతం నేను ఘోర ద‌రిద్రంలో ఉన్నాను. క‌నుక నేను కోరినంత ధ‌నాన్ని క‌న్యాశుల్కంగా స‌మ‌ర్పించ‌గ‌లిగితే నీ కోరిక తీరుస్తాను అని సువీరుడు చెప్పాడు. ఆ పిల్ల మీద మ‌క్కువ వీడ‌లేని ఆ మునిబాల‌కుడు ఓ రాజా, నేను మునికుమారుడినైనందు వ‌ల‌న త‌క్ష‌ణ‌మే ఆ ధ‌నం ఇవ్వ‌లేను. త‌ప‌స్సు చేత‌, ఇత‌ర‌త్రా ధ‌నం సంపాదించి తెచ్చి ఇస్తాను. అంత‌వ‌ర‌కు ఈ బాలిక‌ను నా కోసం భ‌ద్ర‌ప‌రిచి ఉంచు అని కోరాడు. అందుకు సువీరుడు అంగీక‌రించ‌డంతో ఆ న‌ర్మ‌దా తీరంలోనే త‌పోనిష్ఠ‌లో కూచున్నాడు. అనూహ్య ధ‌న‌రాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి అందించాడు. ఆ సొమ్ముకు సంతృప్తి చెందిన రాజు త‌మ ఇంటి ఆచారం ప్ర‌కారంగా త‌న కుమార్తెను ముని యువ‌కునికి ఇచ్చి ఆ అర‌ణ్యంలోనే క‌ల్యాణం జ‌రిపించాడు. ఆ బాలిక భ‌ర్త‌తో క‌లిసి వెళ్లిపోయింది. ఆ ద్ర‌వ్యంతో రాజు భార్య‌తో క‌లిసి సుఖంగా జీవించ‌సాగాడు. రాణి మ‌రోసారి గ‌ర్భ‌వ‌తి అయి ఈ సారి కూడా ఆడ‌పిల్ల‌కే జ‌న్మ‌నిచ్చింది. పెద్ద‌పిల్ల‌ను అమ్మి ధ‌నం సంపాదించిన‌ట్టే ఈ బాలిక ద్వారా కూడా మ‌రింత ద్ర‌వ్యం సంపాదించ‌వ‌చ్చున‌ని సువీరుడు ఆనంద‌ప‌డ్డాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది.

ఒక య‌తీశ్వ‌రుడు న‌ర్మ‌దా స్నానానికి వ‌చ్చి అక్క‌డ ప‌ర్ణ‌శాల‌లో సువీరుని, అత‌ని భార్య‌ను, కుమార్తెను చూసి "ఓయీ, నేను కౌండిన్య గోత్ర‌జుడైన య‌తిని. ఈ అర‌ణ్య ప్రాంతంలో సంసారం ఉంటున్న నీవెవ‌రివి" అని అడిగాడు.
అయ్యా, "నేను వంగ‌దేశాధీశుడ‌నైన సువీరుడిని. దాయాదుల వ‌ల‌న రాజ్య‌భ్ర‌ష్టుడ‌నై ఇలా అడ‌విలో నివ‌శిస్తున్నాను అయి సువీరుడు స‌మాధానం ఇచ్చాడు.
శ్లో - న దారిద్ర్యం స‌మం దుఃఖం న శోకః పుత్ర‌మార‌ణాత్‌
న‌చ వ్య‌ధానుగ‌మ‌నేన వియోగః ప్రియాప‌హాత్‌

దరిద్రం క‌న్నా ఏడిపించేది, కొడుకు చావు క‌న్నా ఏడ‌వ‌వ‌ల‌సింది, భార్యా (రాజ్యం, భార్య‌) వియోగం క‌న్నా బ‌య‌ట‌కు ఏడ‌వ‌లేని దుఃఖం ఇంకేమీ ఉండ‌దు. త‌మ‌కు తెలిసిన‌దే క‌దా, ప్ర‌స్తుతం నేను ఆ విధ‌మైన మూడు ర‌కాల విచారాల వ‌ల‌న అమిత దుఃఖితుడ‌నై అమిత దుఃఖితుడ‌నై కంద‌మూలాలు భుజిస్తూ ఈ అర‌ణ్య‌మే ఆశ్ర‌యంగా జీవిస్తున్నాను. అర‌ణ్యంలోనే తొలి చూలుగా ఒక కుమార్తె జ‌న్మించింది. ఆమెను ఒక మునికుమారునికి విక్ర‌యించి ఆ ధ‌నంతో ప్ర‌స్తుతం సుఖంగానే బ‌తుకుతున్నాను. ఇది నా రెండ‌వ కుమార్తె, ఈమె నా భార్య‌. నా గురించి ఇంకా ఏ వివ‌రాలు కావాలో అడిగితే చెబుతాను" అన్నాడు సువీరుడు.

సువీరుని స‌మాధానానికి ఆశ్చ‌ర్య‌పోతూ ఆ య‌తీంద్రుడు ఓ రాజా, ఎంత ప‌ని చేశావు. మూర్ఖుడ‌వై అగ‌ణిత‌మైన పాపాన్ని మూట‌గ‌ట్టుకున్నావు.
శ్లో - క‌న్యాద్ర‌వ్యేణ యో జీవే వ్ర‌తం స‌గ‌చ్ఛ‌తి
దేవాన్ ఋషీన్ పిత్రూన్ క్యాపి క‌న్యా ద్ర‌వ్యేణ త‌ర్ప‌యేత్
శాపం దాస్యంతి తే స‌ర్వే జ‌న్మ‌జ‌న్మ‌న్య పుత్ర‌తామ్
ఆడ‌పిల్ల‌ని అమ్ముకుని అలా వ‌చ్చిన డ‌బ్బుతో జీవించే వారు మ‌ర‌ణానంత‌రం అశివ్ర‌తం అనే న‌ర‌కం పాల‌వుతారు. ఆ సొమ్ముతో దేవ‌, ఋషి, పితృ గ‌ణాల‌కు చేసిన అర్చ‌న త‌ర్ప‌ణాదుల వ‌ల‌న ఆ దేవ ఋషీ పిత్రాదులంద‌రూ కూడా న‌ర‌కాన్ని చ‌వి చూస్తారు. అంతే కాదు, క‌ర్త‌కు జ‌న్మ‌జ‌న్మ‌ల‌కు కూడా పుత్ర సంతానం క‌లుగ‌కూడ‌ద‌ని శ‌పిస్తారు. ఇక ఇలా ఆడ‌పిల్ల‌ని అమ్ముకుని జీవించ‌డ‌మే వృత్తిగా పెట్టుకున్న వారు క‌చ్చితంగా రౌర‌వ న‌ర‌కంలో ప‌డ‌తారు.
శ్లో - స‌ర్వేషామేవ పాపానాం ప్రాయ‌శ్చిత్తం విదుర్భుదాః
క‌న్యావిక్ర‌య శీల‌స్య ప్రాయ‌శ్చిత్తం న చోదిత‌మ్
అన్ని ర‌కాల పాపాల‌కూ ఏవో కొన్ని ప్రాయ‌శ్చిత్తాలున్నాయి. కాని క‌న్యాశుల్కం అనే పేరుతో వ్య‌వ‌హారంలో ఉన్న ఆడ‌పిల్ల‌ని అమ్ముకునే మ‌హాపాపిని ఒడ్డుకు చేర్చ‌గ‌ల ప్రాయ‌శ్చిత్తం ఏ శాస్త్రంలోనూ లేదు.
కాబ‌ట్టి సువీరా ఈ కార్తీక మాసంలో శుక్ల‌ప‌క్షంలో నీ రెండ‌వ కుమార్తెకు క‌న్యాదాన పూర్వ‌కంగా క‌ల్యాణం జ‌రిపించు. కార్తీక మాసంలో విద్యాతేజ‌శ్వీల యుక్తుడైన వ‌రునికి క‌న్యాదానం చేసిన వాడు గంగాది స‌మ‌స్త తీర్ధాల‌లోనూ స్నాన‌దానం చేయ‌డం వ‌ల‌న క‌లిగే పుణ్యాన్నీ, య‌థోక్త ద‌క్షిణాయుతంగా అశ్వ‌మేథాది యాగాలు చేసిన వారు పొందే స‌త్ ఫ‌లితాన్నీ పొందుతాడు అని హిత‌బోధ చేశాడు.

కాని నీచ‌బుద్ధి గ‌ల ఆ సువీరుడు ఆ స‌జ్జ‌నుని స‌ద్బోధ‌ను కొట్టిపారేస్తూ బాగా చెప్పావ‌య్యా బాప‌డా, పుట్టినందుకు పుత్ర‌దారా గృహ క్షేత్ర వాసోవ‌సు ర‌త్నాద్య‌లంకారాదుల‌తో ఈ శ‌రీరాన్ని పుష్టిప‌ర‌చి సుఖించాలే గాని ధ‌ర్మం ధ‌ర్మం అంటూ కూచుంటే ఎలా? అస‌లు ధ‌ర్మ‌మంటే ఏమిటి, దాన‌మంటే ఏమిటి, ఫ‌ల‌మంటే ఏమిటి, పుణ్య‌లోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారూ ఏదో ర‌కంగా డ‌బ్బు సంపాదించి భోగాలు అనుభ‌విచండ‌మే ప్ర‌ధానం. పెద్ద‌పిల్ల కంటె అధికంగా ధ‌నం ఇచ్చే వాడికే నా చిన్న పిల్ల‌ను ఇచ్చి పెళ్లి చేసి న‌ను కోరుకునే సుఖ‌భోగాల‌న్నీ అనుభ‌విస్తాను. అయినా నా విష‌యాల‌న్నీ నీకెందుకు, నీ దారిన నువ్వెళ్లు అని క‌సిరి కొట్టాడు.
అంత‌టితో ఆ తాప‌సి త‌న దారిన తాను వెళ్లిపోయాడు. 


శృత‌కీర్త్యుపాఖ్యానం 
ఈ సువీరుని పూర్వీకుల్లో శృత‌కీర్తి అనే రాజొక‌డున్నాడు. స‌మ‌స్త ధ‌ర్మాలు ఆచ‌రించాడు. శ‌తాధిక యాగాలు చేశాడు. ఆ పుణ్య‌కార్యాల వ‌ల‌న స్వ‌ర్గంలో ఇంద్రాదుల చేత గౌర‌వం పొందుతూ స‌మ‌స్త సుఖాలు అనుభ‌విస్తున్నాడు.

సువీరునికి య‌ముడు విధించిన శిక్ష కార‌ణంగా య‌మ‌దూత‌లు స్వ‌ర్గం చేసి అక్క‌డ సుఖిస్తున్న శృత‌కీర్తి జీవానికి పాశ‌బంధం వేసి న‌ర‌కానికి తీసుకువ‌చ్చారు. ఆ చ‌ర్య‌కు ఆశ్చ‌ర్య‌ప‌డిన శృత‌కీర్తి య‌ముని ముంగిట నిల‌బ‌డి స్వ‌ర్గంలో ఉన్న న‌న్ను ఇక్క‌డికెందుకు ర‌ప్పించావు, నేను చేసిన పాప‌మేమిటి? అని నిల‌దీశాడు. 

మంద‌హాసం చేస్తూ ఆ య‌మ‌ధ‌ర్మ‌రాజు "శృత‌కీర్తీ, నువ్వు పుణ్యాత్ముడ‌మే, స్వ‌ర్గార్హుడ‌వే. కాని నీ వంశంలోనే జ‌న్మించిన సువీరుడు క‌న్య‌ను విక్ర‌యించి మ‌హాపాపి అయ్యాడు. అత‌ను చేసిన మ‌హాపాపం వ‌ల‌న అత‌ని వంశీకులైన మీరంగా న‌ర‌కానికి రావ‌ల‌సివ‌చ్చింది. అయినా వ్య‌క్తిగ‌తంగా అత్య‌ధిక పుణ్యాత్ముడ‌వి కావ‌డం వ‌ల‌న నీకొక అవ‌కాశం ఇస్తున్నాను. ప‌ర‌మ పాప‌కృత్యం చేసిన సువీరుని రెండో కుమార్తె న‌ర్మ‌దా న‌దీ తారంలోని ప‌ర్ణ‌శాల‌లో త‌ల్లితో క‌లిసి జీవిస్తోంది. ఆ బిడ్డ‌కింకా వివాహంకాలేదు. అనుగ్ర‌హం వ‌ల‌న భూలోక వాసులు గుర్తించే దేహం పొంది అక్క‌డ‌కు వెళ్లి ఆమెను యోగ్యుడైన వ‌రునికి క‌న్యాదాన‌యుక్తంగా దానం చేయి. శృత‌కీర్తీ, ఎవ‌రైతే కార్తీక మాసంలో స‌ర్వాలంకార భూషిత అయిన క‌న్య‌ను యోగ్యుడైన వ‌రునికి దానం చేస్తాడో వాడు లోకాధిప‌తితో స‌మానం అవుతాడు. అలా క‌న్యాదానం చేయాల‌నే సంక‌ల్పం ఉండి సంతానం లేని వాడు బ్రాహ్మ‌ణ క‌న్యాదానానికి గాని, క‌న్యాదానం చేయ‌బోతున్న బ్రాహ్మ‌ణునికి గాని ధ‌న‌స‌హాయం చేసిన‌ట్ట‌యితే అత‌డు క‌న్యాదాత పొందే ఫ‌లాన్ని పొందుతాడు. అంతే కాదు, స్వ‌లాభాపేక్ష‌ర‌హితుడై రెండు పాడి ఆవుల‌ను చెల్లించి ఒక క‌న్య‌ను కొని ఆ క‌న్య‌ను ఆమెను చక్క‌ని వ‌రునికి ఇచ్చి వివాహం చేసినా కూడా క‌న్యాదాన ఫ‌లాన్ని పొందుతాడు. కాబ‌ట్టి శృత‌కీర్తీ, నువ్వు త‌క్ష‌ణ‌మే భూలోకానికి వెళ్లి సువీరుని రెండో కుమార్తెను ఎవ‌రైనా స‌ద్ర్బాహ్మ‌ణునికి క‌న్యాదాన మూలంగా దానం చేసిన‌ట్ట‌యితే నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరుడు కూడా న‌ర‌కం నుంచి విముక్తుల‌వుతారు" అని చెప్పాడు. 

ధ‌ర్ముని అనుగ్ర‌హం వ‌ల‌న దేహం ధ‌రించిన శృత‌కీర్తి వెంట‌నే భూలోకంలోని న‌ర్మ‌దా న‌దీతీరాన్ని చేరి అక్క‌డ ప‌ర్ణ‌శాల‌లో ఉన్న సువీరుని భార్య‌కు హిత‌వు చెప్పి వారి రెండో సంతాన‌మైన ఆడ‌పిల్ల‌ని సువ‌ర్ణాలంకార భూషిత‌ను చేసి శివ‌ప్రీతిగా శివార్ప‌ణ‌మ‌స్తు అంటూ ఒక బ్రాహ్మ‌ణునికి క‌న్యాదానం చేశాడు. ఆ పుణ్య మ‌హిమ వ‌ల‌న సువీరుడు న‌ర‌క‌పీడా విముక్తుడై, స్వ‌ర్గానికి చేరి సుఖించ‌సాగాడు. ఆ త‌ర్వాత శృత‌కీర్తి ప‌ది మంది బ్ర‌హ్మ‌చారుల‌కు క‌న్యామూల్యాన్ని ధార పోయ‌డం వ‌ల‌న వారివారి పితృపితామ‌హాదివ‌ర్గాల వారంతా ప‌రిపూర్ణంగా పాపాల నుంచి విముక్తులై స్వ‌ర్గాన్ని పొందారు. ఆ త‌ర్వాత శృత‌కీర్తి కూడా య‌థాపూర్వంగా స్వ‌ర్గం చేరి త‌న వారిని క‌లిసి సుఖించ‌సాగాడు. కాబ‌ట్టి ఓ జ‌న‌క మ‌హారాజా కార్తీక మాసంలో క‌న్యాదానం చేసే వాడు స‌ర్వ‌పాపాలు న‌శింప‌చేసుకుంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. క‌న్యామూలాన్ని చెల్లించ‌లేని వాడు వివాహార్ధం మాట స‌హాయం చేసినా కూడా అమిత‌మైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవ‌రైతే కార్తీక మాసంలో య‌థావిధిగా కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రిస్తారో వారు స్వ‌ర్గాన్ని చేరుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌ని వారు న‌ర‌కానికి చేర‌డం కూడా ఖాయ‌మే.
త్ర‌యోద‌శాధ్యాయ స‌మాప్తః
---------------

చ‌తుర్ద‌శాధ్యాయం
ఓ మిథిలాధీశా, కార్తీక మాస‌మంతా పూర్వోక్త స‌ర్వ‌ధ‌ర్మ సంయుతంగా కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించ‌లేక‌పోయినా కార్తీక పౌర్ణ‌మి నాడు వృషోత్స‌ర్గం చేసిన వారి జ‌న్మాంత‌ర పాపాల‌న్నీ కూడా న‌శించిపోతాయి.
వృషోత్స‌ర్గ‌ము
జ‌న‌క మ‌హీపాలా, దేశ‌వాళి గోవుకు జ‌న్మించిన కోడెదూడ‌ను అచ్చుబోసి ఆంబోతుగా వ‌ద‌ల‌డాన్నే వృషోత్స‌ర్గం అంటారు. ఈ మాన‌వ లోకంలో ఏ ఇక‌ర క‌ర్మాచ‌ర‌ణ‌ల వ‌ల‌న కూడా సాధ్యం కాని పుణ్యం ప్ర‌సాదించే ఈ కార్తీక మాసంలోనే పూర్ణిమ నాడు పితృదేవ‌తా ప్రీతికోసం ఒక కోడెదూడ‌ను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛ‌గా వ‌ద‌లాలి. అలా చేయ‌డం వ‌ల‌న గ‌యాక్షేత్రంలో కోటి సార్లు పితృదేవ‌త‌ల‌కు శ్రాద్ధ‌క‌ర్మ నిర్వ‌హించిన పుణ్యం క‌లుగుతుంది.
శ్లో - యః కోవాస్మ‌త్కులే జాతః పౌర్ణ‌మాస్యాంతు కార్తీకే
ఉత్ప్ర‌జేద్వృష‌భం నీలం తేన తృప్తా వ‌యంత్వితి
కాంక్షంతి నృప‌శార్దూల పుణ్య‌లోక స్థితా అపి
పుణ్య‌లోకాల్లో ఉన్న పిత‌రులు కూడా త‌మ కులంలో పుట్టిన వాడెవ‌రైనా కార్తీక పౌర్ణ‌మినాడు న‌ల్ల‌ని గిత్త‌ను అచ్చుబోసి వ‌దిలిన‌ట్ట‌యితే మ‌న‌కు అమితానందం క‌లుగుతుంది క‌దా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధ‌నికుడై ఉండి కూడా జీవితంలో ఒక్క‌సారైనా కార్తీక మాసంలో వృష‌త్స‌ర్గం చేయ‌ని వాడు అంధ‌తామిస్రం అనే న‌ర‌కంలో ప‌డ‌తాడు. గ‌యాశ్రాద్ధం వ‌ల‌న గాని, ప్ర‌తివ‌ర్షాబ్ధి వ‌ల‌న గాని, తీర్థ‌స్థ‌లాల్లో త‌ర్ప‌ణం చేయ‌డం వ‌ల‌న గాని ఈ వృషోత్స‌ర్గంతో స‌మాన‌మైన ఆనందం పిత‌రులు పొంద‌లేర‌న్న‌ది తెలుసుకో. 

వివిధ దానాలు
కార్తీక మాసంలో పండ్ల‌ను దానం చేసే వాడు దేవ‌ర్షి పిత్రూణాల నుంచి విముక్తుడ‌వుతాడు. ద‌క్షిణాయుతంగా ధాత్రీ (ఉసిరిక‌) ఫ‌లాన్ని దాన‌మిచ్చే వాడు సార్వ‌భౌముడ‌వుతాడు. కార్తీక పౌర్ణ‌మి నాడు లింగ‌దానం స‌మ‌స్త పాప‌హ‌రం, అత్యంత పుణ్య‌దాయ‌కం. ఈ దానం వ‌ల‌న ఈ జ‌న‌మ‌లో అనేక భోగాలు అనుభ‌వించి మ‌రుజ‌న్మ‌లో చ‌క్ర‌వ‌ర్తిత్వం పొందుతాడు

నిషిద్ధాహారాలు
అనంత ఫ‌ల‌దాయ‌క‌మైన ఈ కార్తీక వ్ర‌తాచ‌ర‌ణా స‌ద‌వ‌కాశం అంద‌రికీ అంత తేలిక‌గా ల‌భించ‌దు. అమిత ఉత్కృష్ట‌మైన ఈ కార్తీక మాసంలో ఇత‌రుల అన్నం, పితృశేషం, తిన‌కూడ‌నివి తిన‌డం, శ్రాద్ధ‌క‌ర్మ‌ల‌కు భోక్త‌గా వెళ్ల‌డం, నువ్వుల దానం ప‌ట్ట‌డం మానివేయాలి. ఈ నెల‌లో సంఘాన్నం, శూద్రాన్నం, దేవార్చ‌న నాని అన్నం, అప‌రిశుద్ధాన్నం, త్య‌క్త‌క‌ర్ముని అన్నం కూడా తిన‌కూడ‌దు. కార్తీక పౌర్ణ‌మి, అమావాస్య‌ల్లో, పితృదినం నాడు, ఆదివారంనాడు, సూర్య‌చంద్ర గ్ర‌హ‌ణ దినాల్లోను వ్య‌తీపాద‌త వైదృత్యాలు నిషిద్ధం. ఈ నెల‌లో వ‌చ్చే ఏకాద‌శినాడు రాత్రిం బ‌వ‌ళ్లు రెండు పూట‌లా భోజ‌నం చేయ‌కూడ‌దు. ఈ రోజుల్లో ఛాయా న‌క్తం (అంటే త‌మ నీడ శ‌రీర‌పు కొల‌త‌కు రెండింత‌లుగా ప‌డిన‌ప్పుడు భోజ‌నం చేయ‌డం) ఉత్త‌మ‌మ‌ని మ‌హ‌ర్షులు చెప్పారు. ప‌ర‌మ ప‌విత్ర‌మైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాల్లో భోజ‌నం చేసే వారి పాపాలు అంతులేనంత‌గా పెరిగిపోతాయి. అందు వ‌ల‌న కార్తీకంలో తైలాభ్యంగ‌నం, ప‌గ‌టి నిద్ర‌, కంచుపాత్ర‌లో భోజ‌నం, ప‌రాన్న భోజ‌నం, గృహ‌స్నానం, నిషిద్ధ దినాల్లో రాత్రి భోజ‌నం, వేద‌శాస్త్ర నింద ఈ ఏడు క‌ర్మ‌లూ చేయ‌కూడ‌దు. స‌మ‌ర్థులై ఉండి కూడా న‌దీస్నానం చేయ‌కుండా ఇంటి ద‌గ్గ‌రనే వేడి నీటి స్నానం చేసిన‌ట్ట‌యితే అది క‌ల్లుతో చేసిన స్నానానికి స‌మాన‌మ‌ని బ్ర‌హ్మ‌శాస‌నం. సూర్యుడు తుల‌లో ఉండ‌గా న‌దీస్నాన‌మే అత్యంత ప్ర‌ధానం. చేరువ‌లో న‌దులు లేన‌ప్పుడు మాత్రం చెరువుల్లో గాని, కాలువ‌ల్లో గాని, నూతి వ‌ద్ద గాని గంగాగోదావ‌ర్యాది మ‌హాన‌దుల‌ను స్మ‌రించుకుంటూ స్నానం చేయ‌వ‌చ్చును. ఎక్క‌డ చేసినా ప్రాతఃకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయ‌ని వారు న‌ర‌కాన్ని పొంది అనంత‌రం ఛండాల‌పు జ‌న్మ‌నెత్తుతారు. గంగాన‌దీ స్మ‌ర‌ణం చేసి స్నానం చేసి సూర్య‌మండ‌ల‌గ‌తుడైన శ్రీ‌హ‌రిని ధ్యానించి ఆ విష్ణుగాథా పురాణాదులు ఆల‌కించి ఇంటికి వెళ్లాలి. ప‌గ‌లు చేయ‌వ‌ల‌సిన ప‌నుల‌న్నీ ముగించుకుని సాయంకాలం మ‌ర‌లా స్నానం చేసి ఆచ‌మ‌నం చేసి పూజాస్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వ‌రుని ప్ర‌తిష్టించి పంచామృత‌, ఫ‌లోద‌క‌, క‌ల‌శోద‌కాల‌తో మ‌హాస్నానం చేయించి షోడ‌శోప‌చారాల‌తో పూజించాలి.

ప‌ర‌మేశ్వ‌ర షోడ‌శోప‌చార పూజావిధానం
మొద‌ట ప‌ర‌మేశ్వ‌రుడైన ఆ పార్వ‌తీ ప‌తిని ఆవాహ‌నం చేయాలి.ఆ త‌ర్వాత‌
ఓం వృష‌ధ్వ‌జాయ న‌మః - ధ్యానం స‌మ‌ర్ప‌యామి
ఓం గౌరీ ప్రియాయ న‌మః - పాద్యం స‌మ‌ర్ప‌యామి
ఓం లోకేశ్వ‌రాయ న‌మః - అర్ఘ్యం స‌మ‌ర్ప‌యామి
ఓం రుద్రాయ న‌మః - ఆచ‌మ‌నీయం స‌మ‌ర్ప‌యామి
ఓం గంగాధ‌రాయ న‌మః - స్నానం స‌మ‌ర్ప‌యామి
మంత్రం
ఆపోహిష్ఠామ‌యోభువః తాన ఊర్జేద‌థాత‌వ మ‌హేర‌ణాయ చ‌క్ష‌సే
యోవ‌శ్శివ‌త‌మోర‌సః త‌స్య భాజ‌య‌తే హ‌వః ఉశ‌తీర‌వ‌మాత‌రః
త‌స్మాద‌రంగ మావ‌వో యాస్య క్ష‌యాయ జిన్వ‌ధ ఆపోజ‌న‌య‌థాచ‌నః
ఈ మంత్రం ప‌ఠిస్తూ నీటితో అభిషేకించాలి.
ఓం ఆశాంబ‌రాయ న‌మః వ‌స్త్రం స‌మ‌ర్ప‌యామి
ఓం జ‌గ‌న్నాధాయ న‌మః ఉప‌వీతం స‌మ‌ర్ప‌యామి
ఓం క‌పాల‌ధారిణే న‌మః గంథం స‌మ‌ర్ప‌యామి
ఓం ఈశ్వ‌రాయ న‌మః  అక్ష‌తాన్ స‌మ‌ర్ప‌యామి
ఓం పూర్ణ‌గుణాత్మ‌నే న‌మః పుష్పం స‌మ‌ర్ప‌యామి
ఓం ధూమ్రాక్షాయ న‌మః ధూప‌మాఘ్రాప‌యామి
ఓం తేజోరూపాయ న‌మః దీపం స‌మ‌ర్ప‌యామి
ఓం లోక‌ర‌క్ష‌కాయ న్ః నైవేద్యం స‌మ‌ర్ప‌యామి
ఇలా పూజ నిర్వ‌హించిన అనంత‌రం
ఓం భూర్భువ‌స్సువః త‌త్స‌వితుర్వ‌రేణ్యం భ‌ర్గో దేవ‌స్య ధీమ‌హి థియో యోనః ప్ర‌చోద‌యాత్ అనుకుంటూ పువ్వుతో ప‌దార్థాల చుట్టూ నీరు ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం స‌మానాయ స్వాహా, ఓం మ‌హాదేవాయ శివ‌శివ‌శివ‌శివ శంభ‌వే స్వాహా అంటూ నివేద‌నం చేయాలి. అమృత‌మ‌స్తు, అమృతోప‌స్త‌ర‌ణ‌మ‌సి ఋతం స‌త్యేన ప‌రిషించామి, ఉత్త‌రాపోశ‌నం స‌మ‌ర్ప‌యామి అంటూ ప‌దార్థాల కుడివైపు ఒక నీటి చుక్క వ‌ద‌లాలి. ఆ త‌ర్వాత
ఓం లోక‌సాక్షిణే న‌మః తాంబూలం స‌మ‌ర్ప‌యామి
ఓం భ‌వాయ న‌మః ప్ర‌ద‌క్షిణం స‌మ‌ర్ప‌యామి
ఓం క‌పాలినే న‌మః న‌మ‌స్కారం స‌మ‌ర్ప‌యామి
ఇలా నెల‌పొడ‌వునా షోడ‌శోప‌చార పూజ చేయాలి.
పార్వ‌తీ కాంత దేవేశ ప‌ద్మ‌జార్చ్యాంఘ్రి పంక‌జ
అర్ఘ్యం గృహేణ దైత్యారే ద‌త్తం చేద ముమాప‌తే
అంటూ మంత్రం ఇవ్వాలి. అనంత‌రం య‌థాశ‌క్తి దీపాల‌ను స‌మ‌ర్పించి శ‌క్తివంచ‌న లేకుండా బ్రాహ్మ‌ణుల‌కు దానం ఇవ్వాలి. ఈ ప్ర‌కారం కార్తీక మాసం నెల రోజులూ బ్రాహ్మ‌ణ‌స‌మేతంగా న‌క్త వ్ర‌తం ఆచ‌రించే వాడు వంద వాజ‌పేయాలు, వెయ్యి వంతున సోమాశ్వ‌మేథాలు చేసిన ఫ‌లాన్ని పొందుతాడు. కార్తీక‌మాస‌మంతా న‌క్త‌వ్ర‌తాచ‌ర‌ణ వ‌ల‌న పుణ్య‌ధిక్య‌త‌, పాప‌నాశ‌నం అవ‌లీల‌గా ఏర‌ప‌డ‌తాయి. కార్తీక చ‌తుర్ద‌శినాడు పితృప్రీతిగా బ్రాహ్మ‌ణుల‌కు భోజ‌నం పెట్ట‌డం వ‌ల‌న పితృదేవ‌త‌లు సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చ‌తుర్ద‌శినాడు ఔర‌స పుత్రుడు చేసే తిల‌త‌ర్ప‌ణం వ‌ల‌న పితృలోకం స‌ర్వం తృప్తి పొందుతుంది. ఈ చ‌తుర్ద‌శినాడు ఉప‌వాసం ఉండి శివారాధ‌న చేసి తిల‌లు దానం చేస్తే కైలాస క్షేత్రాధిప‌తి అవుతాడు. ఈ కార్తీక వ్ర‌తం ఆచ‌రించిన వారు త‌మ పాపాలు పోగొట్టుకున్న వారై మోక్ష‌గాముల‌వుతారు.
ఓ జ‌న‌క‌మ‌హారాజా, కార్తీక పురాణంలో ఈ ప‌దునాల్గ‌వ అధ్యాయాన్ని శ్ర‌ద్ధాభ‌క్తుల‌తో చ‌దివినా, విన్నా కూడా స‌మ‌స్త పాపాల‌కూ ప్రాయ‌శ్చిత్తం చేసుకోవ‌డం ద్వారా క‌లిగే ఫ‌లితాన్ని పొందుతారు.
స‌ప్త‌మ దిన పారాయ‌ణ స‌మాప్తః
--------------------------------



నోట్ - చ‌దివిన వారంద‌రూ అద్భుతం, చాలా బాగుంది, బాగుంది అనే రేటింగ్ బాక్స్ ల్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వండి. ధ‌న్య‌వాదాలు

3 comments:

  1. Hello there, I found your web site by means of Google even as looking
    for a related matter, your site got here up, it
    seems to be good. I have bookmarked it in my google bookmarks.

    ReplyDelete
  2. I've been surfing online more than 2 hours today, yet I never found any interesting article like yours.

    It's pretty worth enough for me. Personally, if all site
    owners and bloggers made good content as you did,
    the net will be much more useful than ever before.

    ReplyDelete
  3. wonderful points altogether, you just gained a new reader.
    What would you suggest in regards to your put up that you just made a few days
    ago? Any certain?

    ReplyDelete