Friday, November 8, 2019

కార్తీక పురాణం- 11వ రోజు పారాయ‌ణం (శుక్ల ఏకాద‌శి రోజున‌)

ఏక‌వింశాధ్యాయం
అత్రి మ‌హ‌ర్షి ఇలా చెబుతున్నాడు.
అగ‌స్త్యా, సాధార‌ణ‌మైన దొమ్మిగా, కొట్లాట‌గా ప్రారంభ‌మై ఆ పోరాటం ఒక మ‌హాయుద్ధంగా ప‌రిణ‌మించింది. అస్త్రశ‌స్ర్తాల‌తో, ప‌దునైన బాణాల‌తో, వాడివాడి గుదియ‌ల‌తో, ఇనుప‌క‌ట్ల తాడిక‌ర్ర‌లతో, ఖ‌డ్గ‌, ప‌ట్టిస‌, ముస‌ల‌, శూల‌, భ‌ల్లాత‌క‌, తోమ‌ర‌, కుంభ‌, కాఠారాద్యాయుధాల‌తో భీక‌రంగా యుద్ధం సాగింది. ఆ సంకుల స‌మ‌రంలో కాంభోజ‌రాజు మూడు వంద‌ల బాణాల‌ను ప్ర‌యోగించి పురంజ‌యుని గొడుగు, జెండా, ర‌థం కూడ‌గొట్టాడు. ఇంకొక ఐదు బాణాల‌తో అశ్వాల‌నున కూల్చివేశాడు. మ‌రికొన్ని బాణాల‌తో పురంజ‌యుని గాయ‌ప‌రిచాడు. అందుకు కోపించిన పురంజ‌యుడు బ్ర‌హ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన న‌ప‌దునైన బాణాల‌ను కాంభోజ‌రాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని క‌వ‌చాల‌ను చీల్చి గుండెలో దిగ‌బ‌డ్డాయి. ర‌క్తం ధారాపాతంగా కారుతుండ‌గా త‌న వ‌క్షంలో గుచ్చుకున్న బాణాల‌ను పెరికివేసి ఓ పురంజ‌యా, నేను ప‌రుల సొమ్ముకు ఆశ‌ప‌డే వాడిని కాను. నీవు పంపిన బాణాల‌ను నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటినే త‌న వింట సంధించి పురంజ‌యుని మీద‌కు ప్ర‌యోగించాడు. ఆ బాణాలు పురంజ‌యుని సార‌థిని చంపేశాయి. ధ‌నుస్సును ముక్క‌లు చేశాయి. పురంజ‌యుని మ‌రింత గాయ‌ప‌రిచాయి. అంత‌టితో మండిప‌డిన అయోధ్యాధిప‌తి ఇర‌వై రెక్క‌ల బాణాల‌ను వింట సంధించి వాటిని ఆక‌ర్షాంతంగా లాగి కాంభోజునిపై వ‌దిలాడు. ఆ ఇర‌వై బాణాలు ఏక‌కాలంలో కాంభోజుని గుండెల్లో నుంచి వీపు గుండా దూసుకుపోవ‌డంతో అత‌ను మూర్ఛిల్లాడు. దానితో యుద్ధం మ‌రింత భ‌యంక‌రంగా మారింది. తెగిన తొండాల‌తో ఏనుగులు, న‌రికిన త‌ల‌ల‌తో అశ్వాలు, విరిగి ప‌డిన ర‌థాలు, స్వేచ‌ఛ‌గా దొర్లుతున్న ర‌థ‌చ‌క్రాలు, త‌ల‌లు, మొండాలు ఎడంఎడంగా ప‌డి గిల‌గిలా త‌న్నుకుంటున్న క‌ళేబ‌రాల‌తో క‌ద‌న‌రంగం అంతా కంట‌గింపుగా త‌యార‌యింది. మృత‌వీరుల ర‌క్తం అక్క‌డ వాగులు క‌ట్టి ప్ర‌వ‌హించ‌సాగింది. ఆ భీష‌ణ బీభ‌త్స సంగ్రామంలో అధ‌ర్మ‌యుతుడైన పురంజ‌యుని బ‌లం క్ర‌మ‌క్ర‌మంగా క్షీణించిపోయింది. 

కురుజాతి వీరుల విజృంభ‌ణ‌కు త‌ట్టుకోలేక ఆ సాయంకాలానికి స‌మ‌ర‌భూమిని వ‌దిలి, ప‌ట్ట‌ణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆ నాటి శ‌త్రువుల జ‌యానికి ప‌డీప‌డీ దుఃఖిస్తున్న పురంజ‌యుని చూసి సుశీలుడ‌నే పురోహితుడు ఓ మ‌హారాజా శ‌త్ర‌వైన వీర‌సేనుని గెల‌వాల‌నే కోరికే గ‌నుక బ‌లంగా ఉన్న‌ట్ట‌యితే ఈ క్ష‌ణ‌మే భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో విష్ణువును సేవించి శ‌ర‌ణాగ‌తి చేయ‌డం ఒక్క‌టే మార్గం. ఇది కార్తీక పౌర్ణ‌మి. కృత్తికా న‌క్ష‌త్ర యుతుడై చంద్రుడు షోడ‌శ క‌ళా శోభాయ‌మానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో ల‌భించే పూల‌ను సేక‌రించి హ‌రి ముందు మోక‌రించి పూజించు. విష్ణు స‌న్నిధిలో దీపాలు వెలిగించు. గోవిందా, నారాయ‌ణా అంటూ స్వామివారి నామాల‌ను మేళ‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య‌న ఎలుగెత్తి పాడు. శ్రీ‌హ‌రి ముందు న‌ర్తించు. అలా చేసిన‌ట్ట‌యితే విష్ణుమూర్తి అనుగ్ర‌హం వ‌ల‌న నీకు మ‌హావీరుడైన కుమారుడు క‌లుగుతాడు. కార్తీక మాసంలో త‌న‌ను ఆరాధించే భ‌క్తుల ర‌క్ష‌ణార్ధం శ్రీ‌హ‌రి శ‌త్రుభ‌యంక‌ర‌మైన సుద‌ర్శ‌న చ‌క్రాన్ని స్వ‌యంగా పంపుతాడు. 

ఈ కార్తీక పుణ్య మ‌హిమ చెప్ప‌డం ఎవ‌రి వ‌ల్ల సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. భూప‌తి, ఈ నాటి నీ ఓట‌మికి కార‌ణం సైన్య‌బ‌లం లేక‌పోవ‌డం లేదా నీకు శ‌రీర‌బ‌లం లేక‌పోవ‌డం కానే కాదు. మితిమీరిన అధ‌ర్మ‌వ‌ర్త‌నం వ‌ల‌న నీ ధ‌ర్మ‌ఫ‌లం క్షీణించిపోయింది. ఫ‌లితంగా దైవ‌బ‌లం త‌గ్గిపోయింది. అదే నీ ప‌రాజ‌యానికి కార‌ణం. కాబ‌ట్టి పురంజ‌యా, శోకాన్ని వ‌దిలి భ‌క్తితో శ్రీ‌హ‌రిని సేవించు. క‌ల‌త మాని కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించు. ఈ కార్తీక వ్ర‌తం వ‌ల‌న ఆయురారోగ్య ఐశ్య‌ర్య సుఖ సంప‌త్ సౌభాగ్య సంతానాలు సంఘ‌టిల్లి తీరుతాయి. నా మాట‌ల‌ను విశ్వ‌సించు అని హితోక్తులు ప‌లికాడు
ఏక‌వింశోధ్యాయ స‌మాప్తః
---------------
ద్వావింశాధ్యాయం
రెండో రోజు యుద్ధం-పురంజ‌యుని విజ‌యం
అగ‌స్త్యా, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధ‌తో పురంజ‌యుడు త‌క్ష‌ణ‌మే విష్ణ్వాల‌యానికి వెళ్లి వివిధ ఫ‌ల‌పుష్ప ప‌ల్ల‌వ ద‌ళాదిగా విష్ణుడును షోడ‌శోప‌చారాల‌తో పూజించి ప్ర‌ద‌క్షిణ న‌మ‌స్కారాల‌ర్పించి మేళ‌తాళాల‌తో ఆయ‌న‌ను కీర్తించి పార‌వ‌శ్యంతో న‌ర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్ర‌తిమ చేయించి పూజాదికాలు నిర్వ‌హించాడు. దీప‌మాలిక‌లు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా విష్ణు సేవ‌లో లీన‌మైపోయి మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే శేష సైన్య స‌మేతుడై యుద్ధ‌రంగాన్ని చేరాడు. న‌గ‌ర స‌రిహ‌ద్దుల‌ను దాటుతూనే శ‌త్రువుల‌ను స‌మ‌రానికి ఆహ్వానిస్తూ భీష‌ణ‌మైన ధ‌నుష్ఠంకారం చేశాడు. కాంభోజ కురుజాది బ‌లాలు ఆ శ‌బ్దానికి అప్ర‌మ‌త్తులై యుద్ధ‌భూమికి చేరారు. వ‌జ్రాల వంటి క‌త్తులు, పిడుగుల వంటి బాణాలు, అమిత వేగ‌వంత‌మైన ఆకాశానికి ఎగ‌ర‌గ‌లిగే అశ్వాలు, ఐరావ‌తాల వంటి ఏనుగులు, విజ‌య‌కాంక్ష‌తో ప్రాణాల‌కు తెగించి పోరాడే కాల్బ‌లాల‌తో యుద్ధం దుర్నిరీక్ష్యంగా మారింది. ముందు రోజు రాత్రి పురంజ‌యుని పూజ‌ల‌కు సంతుష్టుడైన గ‌రుడ‌గ‌మ‌నుడు అత‌నికి దైవ‌బ‌లాన్ని జ‌త చేయ‌డం వ‌ల‌న ఆ నాటి యుద్ధంలో శ‌త్రురాజుల శ‌క్తుల‌న్నీ ఉడిగిపోయాయి. కాంభోజుని గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల ర‌థ‌బ‌లాలు, వైరి కూటానికి చెందిన ప‌దాతి బ‌లాలు దైవ‌కృపా పాత్రుడైన పురంజ‌యుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజ‌యుని ప‌రాక్ర‌మానికి గుండెల‌విసిపోయిన శ‌త్రురాజులు ప్రాణ‌భీతితో ర‌ణ‌రంగాన్ని వ‌దిలి త‌మ త‌మ రాజ్యాల‌కు ప‌రుగులు తీశారు. విష్ణుమూర్తి అనుగ్ర‌హం వ‌ల‌న విజ‌యాన్ని పొందిన పురంజ‌యుడు రాజ‌ధాని అయోధ్యా ప్ర‌వేశం చేశాడు. విష్ణుడు అనుకూలుడైతే శ‌త్రువు మిత్రుడ‌వుతాడు. విష్ణువు ప్ర‌తికూలుడైతే మిత్రుడే శ‌త్రువ‌వుతాడు. దేనికైనా దైవ‌బ‌ల‌మే ప్ర‌ధానం. ఆ దైవ‌బ‌లానికి ధ‌ర్మాచ‌ర‌ణే అత్యంత ప్ర‌ధానం. ధ‌ర్మాచ‌ర‌ణ త‌త్ప‌రులై కార్తీక వ్ర‌త ధ‌ర్మానుష్ఠానంతో ఎవ‌రైతే శ్రీ‌హ‌రిని సేవిస్తారో వారి స‌మ‌స్త దుఃఖాలు చిటిక‌లో న‌శించిపోతాయి.
అగ‌స్త్యా, విష్ణుభ‌క్తి సిద్ధించ‌డ‌మే క‌ష్ట‌త‌రం. అందునా కార్తీక వ్ర‌తాచ‌ర‌ణాస‌క్తి, శ‌క్తి క‌ల‌గడం ఇంకా క‌ష్టం. క‌లియుగంలో ఎవ‌రైతే కార్తీక వ్ర‌తం, శ్రీ‌హ‌రి సేవ వ‌ద‌ల‌కుండా చేస్తారో వారు శూద్రులైనా స‌రే వైష్ణ‌వోత్త‌ములుగా ప‌రిగ‌ణింప‌బ‌డ‌తారు. వేద‌విదులైన బ్రాహ్మ‌ణులైన‌ప్ప‌టికీ కూడా ఈ హ‌రిసేవ‌, కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ లేని వారు క‌ర్మ‌చండాలురే అవుతారు. ఇక వేద‌వేత్త అయి, హ‌రిభ‌క్రుడై, కార్తీక వ్ర‌త నిష్ఠుడైన వానిలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నివ‌శిస్తాడు. ఏ జాతి వారైనా స‌రే ఈ సంసార సాగ‌రం నుంచి బ‌య‌ట‌ప‌డి ఉత్త‌మ గ‌తులు పొందాల‌నే కోరిక‌తో విష్ణువును అర్చించిన‌ట్ట‌యితే త‌క్ష‌ణ‌మే త‌రించిపోతారు. స్వతంత్రుడు గాని, ప‌ర‌తంత్రుడు గాని హ‌రిపూజాస‌క్తుడై ఉంటేనే ముక్తి. భ‌క్తుల‌కా శ్రీ‌హ‌రి, విష్ణువుకి భ‌క్తులు అన్యోన్యానురాగ‌బ‌ద్ధులై ఉంటారు. భ‌క్తుల‌కు ఇహ‌ప‌రాలు రెండింటినీ అనుగ్ర‌హించి ర‌క్షించ‌గ‌లిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వ‌మంత‌టా నిండి ఉన్న ఆ మ‌హావిష్ణువుపై సంపూర్ణ భ‌క్తి ప్ర‌ప‌త్తులున్న వారికి మాత్ర‌మే ఈ కార్తీక వ్ర‌తావ‌కాశం చేజిక్కుతుంది. కాబ‌ట్టి వేద‌స‌మ్మ‌తం, స‌క‌ల‌శాస్త్రసారం, గోప్యం, స‌ర్వ‌వ్ర‌తోత్త‌మం అయిన ఈ కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించినా, క‌నీసం కార్తీక మ‌హాత్యాన్ని మ‌న‌స్ఫూర్తిగా వినినా కూడా అలాంటి వారు పాపాలు న‌శించిపోయి వైకుంఠం చేరుకుంటారు. మ‌హ‌త్వ పూర్వ‌క‌మైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో ప‌ఠించ‌డం వ‌ల‌న పితృదేవ‌త‌లు క‌ల్పాంత తృప్తిని పొందుతారు. ఇది నిస్సంస‌యం అని అత్రి ముగించాడు.
ద్వావింశాధ్యాయ స‌మాప్తః
----------------
త్ర‌యోవింశాధ్యాయం
హే అత్రి మునీంద్రా, విష్ణుకృప వ‌ల‌న విజ‌యుడైన పురంజ‌యుడు ఆ త‌ర్వాత ఏమి చేశాడో కూడా వివ‌రించు అన్న అగ‌స్త్యుని మాట‌ల‌కు స్పందించిన అత్రి మ‌హ‌ర్షి ఇలా చెప్ప‌సాగాడు.

భ‌గ‌వంతుని కృప వ‌ల‌న యుద్ధ‌భూమిలో విజ‌య‌ల‌క్ష్మిని వ‌రించిన పురంజ‌యుడు అమ‌రావ‌తిలో ఇంద్రుని వ‌లె అత్యంత వైభ‌వంతో ప్ర‌కాశించాడు. గ‌తంలోని దుష్ట భావాల‌ను విస‌ర్జించి స‌త్య శౌచ పాల‌నం, నిత్య ధ‌ర్మాచ‌ర‌ణం, దాన‌శీల‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తూ, య‌జ్ఞ‌యాగాదులు నిర్వ‌హించాడు. ప్ర‌తీ ఏడాది క్ర‌మం త‌ప్ప‌కుండా కార్తీక వ్ర‌తాచ‌ర‌ణం చేసి క‌ల్మ‌షాల‌న్నీ తొల‌గిపోయి శుద్ధాత్ముడై అరిష‌డ్వ‌ర్గాల‌ను జ‌యించి ప‌ర‌మ వైష్ణ‌వుడై జీవితం గ‌డిపాడు. నిరంత‌రం శ్రీ‌హ‌రి పూజా ప్రియుడై ఏ దేశాల‌లో ఏయే క్షేత్రాల్లో తీర్థాల్లో విష్ణువును ఏయే విధాలుగా పూజించ‌డం వ‌ల‌న జ‌న్మ త‌రిస్తుందా అనే త‌ప‌న‌తో ఉండే వాడు. అంత‌గా హ‌రిసేవా సంవిధాన త‌త్ప‌రుడై సంతృప్తుడ‌య్యాడు. ఒక రోజు ఆకాశ‌వాణి పురంజ‌యా, కావేది తీరంలో శ్రీ‌రంగ క్షేత్రం ఉంది. శ్రీ‌రంగ‌నాథుడ‌నే పేరిట విష్ణుమూర్తి అక్క‌డ వెలిసి పూజ‌లందుకుంటున్నాడు. ఆయ‌న‌ను కార్తీక మాసంలో అర్చించి జ‌న‌న మ‌ర‌ణాల నుంచి క‌డ‌తేరు అంటూ ప్ర‌బోధించ‌డంతో రాజ్య‌పాల‌న మంత్రుల‌కు అప్ప‌గించి త‌గినంత స్థాయిలో చ‌తురంగ బ‌లాలను తీసుకుని అనేక తీర్థ‌క్షేత్రాల‌ను ద‌ర్శిస్తూ అక్క‌డ‌క్క‌డా యోగ్య‌విధిగా శ్రీ‌హ‌రినే అర్చిస్తూ కావేరీ మ‌ధ్యంగ‌త‌మై భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీ‌రంగం చేరి కార్తీక మాసం అంతా కావేరి న‌దిలో స్నానాలు చేసి రంగ‌నాథ సేవ చేశాడు. ప్ర‌తిక్ష‌ణం కృష్ణా, గోవిందా, వాసుదేవా, శ్రీ‌రంగ‌నాథా అని హ‌రినే స్మ‌రిస్తూ జ‌ప‌దానాది విద్యుక్త ధ‌ర్మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని అయోధ్య చేరుకున్నాడు. అనంత‌రం ధ‌ర్మ‌కామం వ‌ల‌న స‌త్ పుత్ర పౌత్రాదుల‌ను పొంది కొన్నాళ్ల‌కు స‌ర్వ‌భోగాల‌ను త్య‌జించి భార్యాస‌మేతంగా వాన‌ప్ర‌స్థం స్వీక‌రించి జీవితం అంతా విష్ణుసేవ‌లోనే లీన‌మ‌య్యాడు. కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ చేశాడు. ఆ పుణ్య‌వ‌శాన అత్యంలో వైకుంఠం చేరుకున్నాడు.
త్ర‌యోవింశాధ్యాయ స‌మాప్తః

No comments:

Post a Comment