Thursday, November 14, 2019

కార్తీక పురాణం- 17వ రోజు పారాయ‌ణం (బ‌హుళ విదియ‌ రోజున‌)

తృతీయాధ్యాయం
ఇంకా సూతుడు ఇలా చెబుతున్నాడు.
పూర్వాధ్యాయంలో చెప్పిన‌ట్టు స‌త్య‌భామ శ్రీ‌కృష్ణునికి న‌మ‌స్క‌రించి ప్రాణేశ్వ‌రా కాల స్వ‌రూపుడ‌వైన నీకు స‌ర్వ‌కాలాలూ అవ‌య‌వాలై అల‌రారుతుండ‌గా తిథుల‌లో ఏకాద‌శి, నెల‌ల్లో కార్తీకం మాత్ర‌మే అంత ఇష్టం కావ‌డానికి కార‌ణం ఏమిటో సెల‌వీయండి అని అడిగింది. ఎప్పుడూ న‌వ్వు ఆభ‌ర‌ణంగా ఉండే న‌వ‌నీత‌చోరుడు ఇలా చెప్ప‌సాగాడు. స‌త్యా, చ‌క్క‌ని ప్ర‌శ్నే వేశావు. ఇది అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవ‌ల‌సిన విష‌యం. గ‌తంలో పృథు చ‌క్ర‌వ‌ర్తి నార‌దుని ఇదే ప్ర‌శ్న వేశాడు. దానికి నార‌దుడు చెప్పిన స‌మాధాన‌మే ఇప్పుడు నీకు కూడా చెబుతున్నాను.


స‌ముద్ర‌నంద‌నుడైన శంఖుడ‌నే రాక్ష‌సుడు త్రిలోక కంట‌కుడై స‌ర్వ‌దేవ‌తాధికారాల‌నూ హ‌స్త‌గ‌తం చేసుకుని వారిని స్వ‌ర్గం నుంచి త‌రిమేశాడు. పారిపోయిన దేవ‌త‌లు భార్యాబంధువుల‌తో స‌హా మేరు ప‌ర్వ‌త గుహ‌ల్లో త‌ల దాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి క‌ల‌గ‌లేదు. ప‌ద‌వులు పోయినంత మాత్రాన ప‌టుత్వాలు పోతాయా, ప‌ద‌వి లేన‌ప్పుడే దానిని సాధించుకోవ‌డం కోసం త‌మ బ‌లాన్ని పెంచుకుంటారు. వేద‌మంత్రాదుల వ‌ల‌న దేవ‌త‌లు శ‌క్తివంతుల‌య్యే అవ‌కాశం ఉంది. గ‌నుక వేదాల‌ను కూడా కైవ‌సం చేసుకోవాలి అనుకున్నాడు. విష్ణువు యోగ‌నిద్రాగ‌తుడైన ఒకానొక వేళ‌లో బ్ర‌హ్మ నుంచి వేదాల‌ను ఆక‌ర్షించాడు. కాని య‌జ్ఞ‌మంత్ర బీజాల‌తో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి త‌ప్పించుకుని ఉద‌కాల్లో త‌ల దాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగ‌రంలో ప్ర‌వేశించి వెత‌క‌నారంభించాడు. కాని వాటిని క‌నిపెట్ట‌లేక‌పోయాడు. 

అంత‌లోనే బ్ర‌హ్మ పూజాద్ర‌వ్యాల్ని స‌మ‌కూర్చుకుని మేరు గుహాల‌య వాసులైన దేవ‌త‌లంద‌రినీ వెంట పెట్టుకుని వైకుఠం చేరాడు. స‌మ‌స్త దేవ‌త‌లూ నృత్య‌, వాద్య, గీత, నామ‌స్మ‌ర‌ణ‌ల‌తోనూ, ధూప‌దీపాల‌తోనూ కోలాహ‌లం చేస్తూ యోగ‌నిద్రాగ‌తుడైన శ్రీ‌హ‌రిని మేల్కొలిపే ప్ర‌య‌త్నం చేశారు. ఎట్ట‌కేల‌కు నిదుర లేచిన శ్రీ‌హ‌రిని షోడ‌శోప‌చారాల‌తో పూజించి శ‌ర‌ణు కోరారు. శ‌ర‌ణాగ‌తులైన వారిని చూసి గోవిందుడు ఇలా అన్నాడు. మీరు చేసిన స‌ర్వోప‌చారాల‌కూ సంతోషించిన నేను మీ ప‌ట్ల వ‌ర‌దుడ‌న‌వుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాద‌శి రోజు తెల్ల‌వారు ఝామున నేను మేలుకొనే వ‌ర‌కూ మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప‌దీప సుగంధ ద్ర‌వ్యాలు, నృత్య‌, వాద్య, నామ‌స్మ‌ర‌ణ‌లు, షోడ‌శోప‌చారాల‌తో కార్తీక శుద్ధ ఏకాద‌శి ప్రాతః కాలంలో న‌న్ను సేవించే మాన‌వులు నాకు ప్రీతిపాత్రులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. వారు నాకు స‌మ‌ర్పించే అర్ఘ్య‌పాద్యాదుల‌న్నీ ఆయా భ‌క్తుల సుఖ‌సౌఖ్యాల‌కే కార‌ణ‌మ‌వుతాయి. ఇప్పుడు మంత్ర బీజ స‌మాయుక్తాలైన వేదాలు ఉద‌క‌గ‌తాలైన‌ట్టే ప్ర‌తీ కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జ‌లాశ్ర‌యాలై వ‌ర్థిల్లు గాక‌. నేనిప్పుడే మీనావ‌తారుడ‌నై స‌ముద్ర ప్ర‌వేశం చేసి శంఖుని సంహ‌రించి వేదాల్ని కాపాడ‌తాను.ఇక నుంచి  కార్తీక మాసంలో ప్రాతః సంధ్య‌లో మాన‌వులు చేసే న‌దీస్నానం అవ‌బృథ స్నాన‌తుల్యం అగు గాక‌. ఓ మ‌హేంద్రా, కార్తీక వ్ర‌తం ఆచ‌రించిన వారంద‌రూ పుణ్య‌లోకాలు పొందేందుకు అర్హుల‌వుతారు. ఓ వ‌రుణ‌దేవా, కార్తీక వ్ర‌తాన్ని జ‌న్మ‌వ్ర‌తంగా భావించి విద్యుక్త విధానంగా ఆచ‌రిస్తారో వారు మీ అంద‌రి చేత కూడా పూజించ‌ద‌గిన వార‌వుతారు. మేళ‌తాళాల‌తో, మంగ‌ళ‌వాద్యాల‌తో మీరు న‌న్ను మేలుకొలిపిన ఈ ఏకాద‌శి నాకు అత్యంత ప్రీతిక‌ర‌మైన‌ది. అందువ‌ల‌న కార్తీక వ్ర‌త‌, ఏకాద‌శీ వ్ర‌తాల‌నే ఈ రెండింటినీ ఆచ‌రించ‌డం క‌న్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మ‌రో ద‌గ్గ‌ర దారి లేద‌ని తెలుసుకోండి. త‌పో దాన య‌జ్ఞ తీర్ధాదుల‌న్నీ స్వ‌ర్గ ఫ‌లాన్ని అందించ‌గ‌ల‌వే గాని నా వైకుంఠ‌ప‌దాన్నీయ‌లేవు. 
తృతీయోధ్యాయ స‌మాప్తః
--------------------
చ‌తుర్దాధ్యాయం (మ‌త్స్యావ‌తారం)
శ్రీ మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌క‌లా ఉప‌దేశించి త‌క్ష‌ణ‌మే మ‌హా మ‌త్స్య‌శాబ‌క‌మై వింధ్య‌ప‌ర్వత సానువుల్లోని క‌శ్య‌పుని దోసిలి జ‌లాల్లో ద‌ర్శ‌నం ఇచ్చాడు. క‌శ్య‌పుడా చేప‌పిల్ల‌నున త‌న క‌మండ‌లంలో ఉంచాడు. మ‌రుక్ష‌ణ‌మే ఆ మీన‌పు కూన‌ పెరిగిపోవ‌డం వ‌ల‌న దానినొక నూతిలో ఉంచాడు. రెప్ప‌పాటు కాలంలోనే అది నూతిని మించి ఎదిగిపోవ‌డం వ‌ల‌న క‌శ్య‌పుడు దాన్ని తెచ్చి ఒక స‌ర‌స్సులో ఉంచాడు. కాని ఆ విష్ణుమీనం స‌ర‌స్సును కూడా అధిగ‌మించి ఎదిగిపోయింది. దాంతో దాన్ని స‌ముద్రంలో వ‌ద‌లవ‌ల‌సి వ‌చ్చింది. ఆ మ‌హాస‌ముద్రంలో మ‌త్స్య‌మూర్తి విప‌రీతంగా పెరిగి శంఖుని వ‌ధించి వాడిని త‌న చేతి శంఖంగా ధ‌రించి బ‌ద‌రీ వ‌నానికి చేరాడు. అక్క‌డ ఎప్ప‌టివ‌లెనే విష్ణురూపాన్ని ధ‌రించి ఋషుల‌ను చూసి "ఓ మునులారా, వేదాలు ఉద‌కాల‌లో ప్ర‌వేశించి ర‌హ‌స్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్లి జ‌లాంత‌ర్గాములైన ఆ వేదాల‌ను వెతికి తీసుకురండి. నేను దేవ‌గ‌ణ స‌మాయుక్తుడ‌నై ప్ర‌యాగ‌లో ఉంటాను" అని చెప్పాడు. 

విష్ణువు ఆజ్ఞ‌ను శిర‌సావ‌హించిన ఋషులు స‌ముద్రంలోకి వెళ్లి య‌జ్ఞ బీజాల‌తో కూడిన వేదాల కోసం అన్వేష‌ణ ప్రారంభించారు. ఓ పృథుమ‌హారాజా, ఆ వేదాల‌లో నుంచి ఆ ఋషుల‌కు ఎవ‌రికెంత ల‌భించిందో అదే వారి శాఖ అయింది. త‌దాదిగా ఆయా శాఖ‌ల‌కు వారు ఋషులుగా భాసించారు. అనంత‌రం వేద‌యుతులై వారు ప్ర‌యాగలోని విష్ణువును ద‌ర్శించి వేదాల‌ను తెచ్చామ‌ని చెప్పారు. విష్ణ్వాజ్ఞ‌పై ఆ స‌మ‌స్త వేదాల‌నూ స్వీక‌రించిన బ్ర‌హ్మ ఆ శుభ‌వేళ‌ను పుర‌స్క‌రించుకుని దేవ‌త‌లు, ఋషుల‌తో క‌లిసి అశ్వ‌మేథ యాగం ఆచ‌రించాడు. య‌జ్ఞానంత‌రం గ‌రుడ‌, స‌మ‌స్త దేవ గంధ‌ర్వ య‌క్ష‌ప‌న్న‌గ గుహ్య‌కాదులంద‌రూ శ్రీ‌హ‌రినిలా ప్రార్థించారు.

"ఓ దేవాధిదేవా, జ‌గ‌న్నాయ‌కా, మా విన్న‌పాల‌ను విను. అత్యంత సంతోష‌దాయ‌క‌మైన ఈ స‌మ‌యంలో మాకు వ‌ర‌ప్ర‌దాత‌వై మ‌మ్మ‌ల్ని కాపాడు. హే ల‌క్ష్మీనాథా, నీ అనుగ్ర‌హం వ‌ల్ల‌నే బ్ర‌హ్మ తాను న‌ష్ట‌పోయిన వేదాల‌ను పొంద‌గ‌లిగాడు. నీ స‌మ‌క్షంలో మేమంద‌రం య‌జ్ఞంలోని హ‌విర్భాగాల‌ను పొందాము. కాబ‌ట్టి, నీ ద‌య వ‌ల‌న ఈ చోటు భూలోకంలో స‌ర్వ‌శ్రేష్ఠ‌మైన‌ది, నిత్య పుణ్య‌వ‌ర్ధ‌క‌మైన‌ది, ఇహ‌ప‌ర సాధ‌క‌మైన‌దిగా ఉండాలి. ఈ కాలం మ‌హా పుణ్య‌వంత‌మైన‌ది, బ్ర‌హ్మ‌హ‌త్యాది పాత‌కాల‌ను సైతం తొల‌గించేది, అక్ష‌య ఫ‌ల‌దాయ‌క‌మైన‌దిగా అయ్యేట్టు వ‌రం ప్ర‌సాదించు" అని విన్న‌వించారు. 

దేవ‌త‌ల ప్రార్థ‌న వింటూనే శ్రీ‌హ‌రి దివ్య మంద‌హాసం చేస్తూ "ఓ దైత్యాది దేవ‌త‌లారా, మీ అభిప్రాయం నాకు స‌మ్మ‌త‌మే. మీ కోరిక ప్ర‌కారం ఇది పుణ్య‌క్షేత్ర‌మ‌గుగాక‌. ఇక నుంచి బ్ర‌హ్మ‌క్షేత్ర‌మ‌నే పేర ప్ర‌ఖ్యాతి వ‌హించు గాక‌. అన‌తి కాలంలోనే సూర్య‌వంశీయుడైన భ‌గీర‌థుడు ఈ క్షేత్రానికి గంగ‌ను తీసుకువ‌స్తాడు. ఆ గంగా, సూర్య సుత కాళింది ఈ పుణ్య‌స్థ‌లిలోనే సంగ‌మిస్తాయి. బ్ర‌హ్మాదులైన మీరంద‌రూ నాతో కూడిన వారై ఇక్క‌డే సుస్థితుల‌య్య‌ద‌రు గాక‌. ఇది తీర్థ‌రాజంగా ఖ్యాతి వ‌హించుగాక‌. ఈ ప్ర‌దేశంలో ఆచ‌రించే జ‌ప‌, త‌ప‌, వ్ర‌త‌, య‌జ్ఞ‌, హోమాదులు, అర్చ‌న‌లు అనంత పుణ్య‌ఫ‌ల‌దాలై నా సాన్నిధ్యాన్ని అందిస్తాయి. అనేకానేక జ‌న్మ‌కృతాలైన బ్ర‌హ్మ‌హ‌త్యాది ఘోర‌పాత‌కాలు స‌యితం ఈ క్షేత్ర ద‌ర్శ‌న మాత్రం చేత‌నే న‌శించిపోతాయి. ఇక్క‌డ నా సామీప్యంలో మ‌ర‌ణించిన వారు, వారి ప‌త‌రులు కూడా నా సారూప్యాన్ని పొ్ందుతారు. ఈ కాలం స‌ర్వ‌దా పుణ్య‌ఫ‌లాన్నిస్తుంది. సూర్యుడు మ‌క‌రంలో ఉండ‌గా వ్ర‌త‌స్నానం చేసే వారిని సామాన్య దోషాల‌న్నీ స‌మ‌సిపోతాయి. వారికి నేను క్ర‌మంగా సాలోక్య‌, సామీప్య‌, సారూప్య‌, సాయుజ్యాలు ప్ర‌సాదిస్తాను. ఓ ఋషులారా, శ్ర‌ద్ధ‌గా వినండి. నేను స‌ర్వ‌కాల స‌ర్వావ‌స్థ‌ల్లోనూ ఈ బ‌ద‌రీ వ‌న మ‌ధ్యంలోనే విడిది చేసి ఉంటారు. ఈ తీర్థ‌ద‌ర్శ‌న మాత్రం చేత‌నే స‌ర్వులూ త‌మ పాపాల‌ను పోగొట్టుకున్న వారై జీవ‌న్ముక్తుల‌వుతారు" అంటూ వ‌రాల వాన కురిపించాడు. 

శ్రీ‌మ‌హావిష్ణువు ఈ విధంగా దేవ‌త‌ల‌కు వ‌ర‌దానం చేసి బ్ర‌హ్మ‌తో క‌లిసి అంత‌ర్ధానం అయ్యాడు. ఇంద్రాదులంద‌రూ కూడా త‌మ త‌మ అంశ‌ల‌ను ఆ క్షేత్రంలో వ‌దిలి తాము కూడా అదృశ్యుల‌య్యారు. "ఓ నృపాలా, ఆ బ‌ద‌రీవ‌న యాత్రాద‌ర్శ‌నాదుల చేత మాన‌వులెంద‌టి పుణ్యం పొంద‌గ‌ల‌రో అంత‌టి పుణ్యాన్ని ఈ క‌థాశ్ర‌వ‌ణం మాత్రం చేత‌నే పొంద‌గ‌లుగుతారు' అని చెప్పి ఆగాడు నార‌దుడు. 

17వ రోజు పారాయ‌ణ స‌మాప్తం
ప‌ద్మ‌పురాణాంత‌ర్గత  కార్తీక మాహాత్మ్యం మూడు, నాలుగు అధ్యాయాలు సమాప్తం



No comments:

Post a Comment