Tuesday, November 5, 2019

కార్తీక పురాణం- 8వ రోజు పారాయ‌ణం   (శుక్ల అష్ట‌మి రోజున‌)

పంచాద‌శాధ్యాయం

కార్తీక మాహాత్మ్యాన్ని మ‌రింత‌గా వివ‌రిస్తూ వ‌శిష్ఠ మ‌హ‌ర్షి ఇలా చెప్ప‌సాగాడు.
ఓ జ‌న‌క న‌రేంద్రా, కార్తీక మాసంలో ఎవ‌రైతే హ‌రి ముంద‌ర నాట్యం చేస్తారో వారు శ్రీ‌హ‌రి నివాసం పొందుతారు. కార్తీక ద్వాద‌శినాడు శ్రీ‌హ‌రికి దీప‌మాలార్ప‌ణ చేసే వారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్ల ప‌క్ష సాయంకాల వేళ‌ల్లో విష్ణువును అర్చించే వారు స్వ‌ర్గ నాయ‌కుల‌వుతారు. ఈ నెల రోజులూ నియ‌మంగా విష్ణ్వాల‌యానికి వెళ్లి దైవ‌ద‌ర్శ‌నం చేసుకునే వారు సాలోక్య మోక్షం అందుకుంటారు. అలా గుడికి వెళ్లేట‌ప్పుడు వారు వేసే ఒక్కో అడుగుకు ఒక్కో అశ్వ‌మేథ య‌జ్ఞ ఫ‌లం పొందుతారు. కార్తీక మాసంలో అస‌లు విష్ణుమూర్తి గుడికి వెళ్ల‌ని వారు క‌చ్చితంగా రౌర‌వ న‌ర‌కానికో, కాల‌సూత్ర న‌ర‌కానికే వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు చేసే ప్ర‌తీ స‌త్ర్కియ అక్ష‌య పుణ్యాన్ని, ప్ర‌తీ దుష్క‌ర్మ అక్ష‌య పాపాన్ని క‌లిగిస్తాయి. శుక్ల ద్వాద‌శినాడు విప్ర స‌హితుడై భ‌క్తితో గంధ పుష్పాక్ష‌త‌లు, ధూప‌దీప పాద భ‌క్ష్య నివేద‌న‌ల‌తో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేదే లేదు. కార్తీక శుద్ధ ద్వాద‌శినాడు శివాల‌యంలో గాని, కేశ‌వాల‌యంలో గాని ల‌క్ష దీపాల‌ను వెలిగించి స‌మ‌ర్పించే వారు విమానారూఢులై దేవ‌త‌ల‌తో స్తుతింప‌బ‌డుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీక మాసం నెల్లాళ్లూ దీపం పెట్ట‌లేని వారు శుద్ధ ద్వాద‌శి, చ‌తుర్ద‌శి, పౌర్ణ‌మి మూడు రోజులైనా దీపం పెట్టాలి. ఆవు పాలు పితికేందుకు ప‌ట్టేటంత స‌మ‌య‌మైనా దైవ‌స‌న్నిధిలో దీపం వెలిగించిన వారు పుణ్యాత్ముల‌వుతారు. ఇత‌రులు పెట్టిన దీపాన్ని ప్ర‌కాశింప‌చేసిన వారి పాపాలు ఆ దీపాగ్నిలోనే ద‌హించుకుపోతాయి. ఇత‌రులు ఉంచిన దీపం కొండెక్కిన‌ట్ట‌యితే దాన్ని తిరిగి వెలిగించే వారు ఘ‌న‌మైన పాపాల నుంచి కూడా త‌రించిపోతారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక క‌థ చెబుతాను విను.

ఎలుక దివ్య‌పురుషుడైన వృత్తాంతం
స‌ర‌స్వ‌తీ న‌దీ తీరంలో ఎంతో దీర్ఘ కాలం నుంచి పూజా పున‌స్కారాలు లేక శిథిల‌మైపోయిన విష్ణ్వాల‌యం ఒక‌టి ఉండేది. కార్తీక స్నానార్ధ‌మై స‌ర‌స్వ‌తీ న‌దికి వ‌చ్చి ఒక య‌తి ఆ గుడిని చూసి త‌న త‌పోధ్యానాల‌కు ఆ ఏకాంత ప్ర‌దేశం అనువుగా ఉంటుంద‌ని భావించి ఆ ప్రాంతాన్ని తుడిచి శుభ్రం చేశారు. నీరు చ‌ల్లాడు. స‌మీప గ్రామానికి వెళ్లి ప‌త్తి, నూనె 12 ప్ర‌మిద‌లు తెచ్చి దీపాలు వెలిగించి "నారాయ‌ణార్ప‌ణ‌మ‌స్తు" అనుకుని త‌న‌లో తాను ధ్యానం చేసుకోసాగాడు.

ఆ య‌తి ప్ర‌తీ రోజూ ఇలా చేస్తుండ‌గా ఎక్క‌డా ఆహారం దొర‌క్క ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ఒక ఎలుక ఆ గుడిలోకి వ‌చ్చి ఆహారాన్వేష‌ణ‌లో విష్ణు విగ్ర‌హానికి ప్ర‌ద‌క్షిణంగా తిరిగి మెల్ల‌గా దీపాల ద‌గ్గ‌ర‌కు చేరింది. అప్ప‌టికే ఒక ప్ర‌మిద‌లో నూనె అయిపోవ‌డం వ‌ల‌న ఆరిపోయిన వ‌త్తి మాత్ర‌మే ఉంది. త‌డిగా ఉన్న ఆ వ‌త్తి నుంచి వ‌చ్చే నూనె వాస‌న‌కు భ్ర‌మ‌సిన ఎలుక అదేదో ఆహారంగా భావించి వ‌త్తిని నోట క‌రుచుకుని ప‌క్క‌నే వెలుగుతున్న మ‌రో దీపం ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప‌రిశీలించ‌బోయింది. అప్ప‌టికే బాగా త‌డిసి ఆరిపోయి ఉన్నా వ‌త్తి కొన వెలుగుతున్న వ‌త్తికి త‌గ‌ల‌డంతో అగ్ని సంప‌ర్కమై వెల‌గ‌డంతో ఆ ఎలుక దాన్ని వ‌దిలేసింది. అది కూడా ప్ర‌మిద‌లో ప‌డ‌డంతో రెండు వ‌త్తులు చ‌క్క‌గా వెలుగ‌సాగాయి. రాజా కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు విష్ణు స‌న్నిధిలో ఒక య‌తీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఆ ఎలుక తిరిగి వెల‌గ‌డంతో పూర్వ‌పుణ్య‌వ‌శాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే ప్రాణం విడిచి దివ్య‌మైన పురుష శ‌రీరాన్ని పొందింది. 

అప్పుడు ధ్యానం నుంచి వెలుప‌లికి వ‌చ్చిన య‌తి ఆ అపూర్వ పురుషుని చూసి ఎవ‌రు నువ్వు, ఇక్క‌డికెందుకు వ‌చ్చావు అని అడిగాడు. ఆ పురుషుడు ఓ య‌తీంద్రా,నేను ఒక ఎలుక‌ను. కేవ‌లం గ‌డ్డిప‌ర‌క‌ల వంటి ఆహారంతో జీవించే వాడిని. అలాంటి నాకు ఇప్పుడీ దుర్ల‌భ‌మైన మోక్షం ఏ పుణ్యం వ‌ల‌న వ‌చ్చిందో తెలియ‌డంలేదు. పూర్వ‌జ‌న్మ‌లో నేనెవ‌రిని? ఏ పాపాలు చేయ‌డం వ‌ల‌న ఎలుక జ‌న్మం ఎత్తాను?? ఏ పుణ్యం వ‌ల‌న ఈ దివ్య‌దేహం పొందాను??? అంటూ త‌ప‌స్పంస‌న్నుడ‌వైన నీవే నాకు స‌రైన స‌మాధానం చెప్పు. నేను నీ శిష్యుడిని అంటూ అంజ‌లి ఘ‌టించి ప్రార్థించాడు. ఆ య‌తి త‌న జ్ఞాన నేత్రంతో అంతా ద‌ర్శించి ఇలా చెప్ప‌సాగాడు.

బాహ్లికోపాఖ్యానం

నాయ‌నా, పూర్వ‌జ‌న్మ‌లో నువ్వు జైమిని గోత్రంలో బాహ్లికుడ‌నే పేరిట బ్రాహ్మ‌ణుడుగా జ‌న్మించావు. బాహ్లిక దేశ‌వాస్త‌వ్యుడైన నువ్వు నిరంత‌రం సంసార పోష‌ణా ప‌రాయ‌ణుడ‌వై స్నాన సంధ్యాదుల‌ను వ‌దిలిపెట్టి, వ్య‌వ‌సాయం చేసుకుంటూ వైదిక క‌ర్మానుష్ఠానులైన విప్రుల‌ను నిందిస్తూ ఉండేవాడివి. దేవ‌తార్చ‌న‌ల‌ను విడిచి సంభావ‌నా లాల‌స‌తో శ్రాద్ధ భోజ‌నాలు చేస్తూ నిషిద్ధ దినాల్లో కూడా రాత్రింబ‌వ‌ళ్లూ తిన‌డ‌మే ప‌నిగా బ‌తికావు. చివ‌ర‌కు కాక‌బ‌లులు, వేద‌బ‌లులు కూడా భుజిస్తూ వేద‌మార్గాన్ని త‌ప్పావు. ఇంటి ప‌నుల కోసం ఒక దాసీ దాన్ని నిమ‌యించుకుని వ‌క్ర‌బుద్ధితో దాన్ని తాకుతూ, మాట్లాడుతూ, హాస్యాలాడుతూ నీ పిల్ల‌ల‌కు కూడా దాని చేత‌నే భోజ‌నాదులు పెట్టించావు. నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్ర‌వ‌ర్తించావు. నీ కంటె దిగువ వారికి పాలు, పెరుగు, మ‌జ్జిగ‌, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడ‌బెట్టావు. ధ‌నం మీద ఆశ‌తో కూతురిని కూడా ద్ర‌వ్యానికి విక్ర‌యించి వ‌దిలించుకున్నావు. ఆ విధంగా కూడ‌బెట్టిన‌దంతా భూమిలో దాచిపెట్టి అర్థంత‌రంగా మ‌ర‌ణించావు. ఆ పాపాల‌న్నింటి కార‌ణంగా న‌ర‌కాన్ని అనుభ‌వించి ఎలుక‌వై జ‌న్మ‌లు ఎత్తుతూ చివ‌రికి ఈ జీర్ణ దేవాల‌యంలో బాట‌సారులు దైవం కోసం స‌మ‌ర్పించిన దేవ‌ద్ర‌వ్యాన్ని కూడా అప‌హ‌రిస్తూ బ‌తికావు. ఈ రోజు మ‌హాపుణ్య‌వంత‌మైన కార్తీక శుద్ధ ద్వాద‌శి కావ‌డం, అదీ విష్ణుస‌న్నిధానం కావ‌డం వ‌ల‌న నీ ఎలుక రూపం పోయి ఈ మాన‌వ రూపం సిద్ధించింది అని వివ‌రించారు.

ఆ య‌తి చెప్పింది విని గ‌త జ‌న్మ‌కృత పాపాల‌కు ప‌శ్చాత్తాపం పొందిన వాడై ఆ య‌తి మార్గ‌ద‌ర్శ‌కంలో మ‌ర్నాటి నుంచి కార్తీక శుద్ధ త్ర‌యోద‌శి, చ‌తుర్ద‌శి, పౌర్ణ‌మి మూడు రోజులూ స‌ర‌స్వ‌తీ న‌దిలో పుణ్య‌స్నానం ఆచ‌రించాడు. ఆ పుణ్య‌ఫ‌లం వ‌ల‌న వివేక‌వంతుడై బ‌తికినంత కాలం ప్ర‌తీ ఏడాది కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ చేస్తూ అంత్యంలో సాయుజ్య మోక్షం పొందాడు.కాబ‌ట్టి కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు స్నాన‌దాన పూజా దీపామాలార్ప‌ణం శ‌క్తి ఉన్నంత మేర‌కు ఆచ‌రించే వాడు శ్రీ మ‌హావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడ‌వుతాడు. పాప‌విముక్తుడై సాయుజ్యం పొందుతాడ‌న్న‌ది స‌త్యం.
పంచాద‌శాధ్యాయ స‌మాప్తః
-----------------

షోడ‌శోధ్యాయం
జ‌న‌క మ‌హారాజా, దామోద‌రున‌కు అత్యంత ప్రీతిక‌ర‌మైన ఈ కార్తీకం నెల‌రోజులూ నియ‌మంగా తాంబూల దానం చేసే వారు మ‌రుజ‌న్మ‌లో భూప‌తులుగా జ‌న్మిస్తారు. ఈ నెల‌లో పాడ్య‌మి నుంచి రోజుకొక్క దీపం విష్ణుస‌న్నిధిలో వెలిగించే వారు వైకుంఠ‌గాముల‌వుతారు. సంతాన‌వాంఛితుడు కార్తీక పౌర్ణ‌మి నాడు సంక‌ల్ప‌యుక్తంగా సూర్యుని ఉద్దేశించి స్నానాదులు చేయ‌డం వ‌ల‌న సంతాన‌వంతుల‌వుతారు. విష్ణుస‌న్నిధిలో కొబ్బ‌రికాయ‌ను ద‌క్షిణ తాంబూలాల‌తో దానం ఇచ్చిన వారికి వ్యాధి అనేదే సంక్ర‌మించ‌దు. దుర్మ‌ర‌ణాలు, సంతాన విచ్ఛేదాలు ఉండ‌వు.

స్తంభ రూపం
పౌర్ణ‌మి నాడు విష్ణు స‌న్నిధిన స్తంభ‌దీప ప్ర‌జ్వ‌ల‌నం చేయ‌డం వ‌ల‌న వైకుంఠ‌ప‌తిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని, కొయ్య‌తో గాని స్తంభం చేయించి దానిని విష్ణ్వాల‌యం ముందు పాతి దాని మీద శాలి ధాన్యం, వ్రీహి ధాన్యం, నువ్వులు పోసి, దానిపై దీపం పెట్టిన వారు హ‌రిప్రియుల‌వుతారు. ఈ స్తంభ‌దీపం చూసినంత మాత్రం చేత‌నే స‌మ‌స్త పాపాలు న‌శించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ల‌కి వైకుంఠ‌ప‌తిత్వం సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానం చేయ‌డం వ‌ల‌న క‌లిగే పుణ్యాన్ని వ‌ర్ణించ‌డం నా వ‌ల్ల అయ్యే ప‌ని కాదు. స్తంభ‌దీప మ‌హిమ తెలియ‌చేసే ఒక క‌థ చెబుతా విను అంటూ వ‌శిష్ఠుడు ఈ దిగువ క‌థ చెప్పాడు.

కొయ్య‌మొద్దుకు కైవ‌ల్య‌ప్రాప్తి

వివిధ వృక్ష‌జాతుల‌కు చెందిన మ‌హావృక్షాల‌తో అల‌రారే మ‌తంగ ముని ఆశ్ర‌మంలో ఒక విష్ణ్వాల‌యం ఉండేది. ఎంద‌రెంద‌రో మునులు ఆల‌యానికి వ‌చ్చి కార్తీక వ్ర‌తం స్వీక‌రించి శ్రీ హ‌రిని నెల రో్జులూ షోడ‌శోప‌చార పూజ‌ల‌తో అర్చిస్తూ ఉండే వారు. ఒకానొక కార్తీక మాసంలో వ‌చ్చిన మునివ‌ర్యుడు కార్తీకంలో విష్ణు స‌న్నిధిని స్తంభ దీపం పెట్ట‌డం వ‌ల‌న వైకుంఠం ల‌భిస్తుంద‌ని చెబుతాడు. ఈ రోజు కార్తీక పౌర్ణ‌మి గ‌నుక మ‌నంద‌రం కూడా ఈ విష్ణ్వాల‌యం ప్రాంగ‌ణంలో దీప స్తంభం వెలిగిద్దాం అని సూచించాడు. అందుకు స‌మ్మ‌తించిన ఋషులంద‌రూ ఆ గుడి ఎదుట‌నే కొమ్మ‌లు, క‌ణుపులు గ‌ల స్థూపాకార‌పు చెట్టుని ఒక స్తంభంగా త‌యారుచేసి శాలి వ్రీహిత‌ల స‌మేతంగా దానిపై నేతి దీపం వెలిగించి విష్ణువుకు అర్పించి పురాణ కాల‌క్షేపం చేయ‌సాగారు. అంత‌లోనే వారికి ఛ‌ట‌ఛ‌టారావాలు వినిపించాయి. వెన‌క్కి తిరిగి చూడ‌గా ఆ స్తంభం ఫ‌ట‌ఫ‌టారావాల‌తో నిలువునా ప‌గిలి నేల‌పై ప‌డిపోవ‌డం క‌నిపించింది. అందులో నుంచి ఒక పురుషాకారం బ‌య‌ట‌కు రావ‌డంతో మునులంద‌రూ "ఎవ‌రు నువ్వు, ఇలా స్థాణువుగా ఎందుకు ప‌డి ఉన్నావు" అని అడిగారు. 

అందుకు స‌మాధానంగా ఆ దివ్య‌పురుషుడు "ఓ మునివ‌రేణ్యులారా, నేను గ‌తంలో ఒక బ్రాహ్మ‌ణుడ‌ను. అయినా వేద‌శాస్త్ర ప‌ఠ‌న గాని, హ‌రిక‌థా శ్ర‌వ‌ణం గాని, క్షేత్ర సంద‌ర్శ‌న గాని చేసి ఎరుగ‌ను. అప‌రిమిత ఐశ్వ‌ర్యం గ‌ల నేను బ్రాహ్మ‌ణ ధ‌ర్మాన్ని వ‌దిలి రాజునై ప‌రిపాల‌న సాగిస్తూ దుష్ట‌బుద్ధితో ప్ర‌వ‌ర్తించే వాడిని. వేద‌పండితులు, ఆచార‌వంతులు, పుణ్యాత్ములు, ఉత్త‌ములు అయిన బ్రాహ్మ‌ణుల‌ను నీచాస‌నాల‌పై కూచుండ‌చేసి నేను ఉన్న‌తాస‌నంపై కూచునే వాడిని. ఎవ‌రికీ ఏ నాడు దాన‌ధ‌ర్మాలు చేయ‌లేదు. త‌ప్ప‌స‌రైన‌ప్పుడు మాత్రం ఇంతిస్తాను, అంతిస్తాను అని వాగ్దానం చేసే వాడినే త‌ప్ప ద్ర‌వ్యాన్ని మాత్రం ఇచ్చే వాడిని కాను. దేవ బ్రాహ్మ‌ణ ద్ర‌వ్యాల‌ను స్వంతానికే ఖ‌ర్చు చేసుకునే వాడిని. ఆ కార‌ణంగా దేహాంతాన న‌ర‌కానికి పోయి బాధ‌ల‌నుభ‌వించి ఆ త‌ర్వాత‌ 52 వేల సార్లు కుక్క‌గాను, 10 వేల సార్లు కాకిగాను, మ‌రో 10 వేల సార్లు తొండ‌గాను, కోటి జ‌న్మ‌లు చెట్టుగాను పుట్టాను. గ‌త కోటి జ‌న్మ‌లుగా ఇలా మొద్దు వ‌లె మారి కాలం గ‌డుపుతున్నాను. ఇంత‌టి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచ‌నం క‌లిగిందో, ఈ విశేష పురుష రూపం ఎలా వ‌చ్చిందో స‌ర్వ‌జ్ఞులైన మీరే చెప్పాలి" అన్నాడు.

ఈ కార్తీక వ్ర‌త ఫ‌లం ఎంతో అద్భుత‌మైన‌ది. మ‌న క‌ళ్ల ముంద‌రే ఈ కొయ్య‌కు ముక్తి క‌లిగింది క‌దా! అందునా కార్తీక పౌర్ణ‌మి నాడు స్తంభ దీపం పెట్ట‌డం స‌ర్వ‌త్రా శుభ‌ప్ర‌దం. మ‌నం పెట్టిన దీం వ‌ల‌న ఈ మొద్దు ముక్తి పొందింది. మొద్దైనా, మ్రానైనా కార్తీకంలో దైవ‌స‌న్నిధిని దీప‌రూపం వ‌హించ‌డం వ‌ల‌న దామోద‌రుని ద‌య పొంద‌డం త‌థ్యం అని చెప్పుకుంటున్న ఋషుల మాట‌లు అత‌ని చెవిన ప‌డ్డాయి. ఆ దివ్య‌పురుషుడు అయ్య‌లారా! దేహి ఎవ‌రు, జీవి ఎవ‌రు, జీవుడు దేని చేత ముక్తుడు, దేని చేత బ‌ద్ధుడు;  దేని చేత దేహుల‌కు ఇంద్రియాలు క‌లుగుతున్నాయో వివ‌రించండి అని అడిగాడు. ఆ తాప‌సుల్లో ఉన్న అంగీర‌స మ‌హాముని అత‌నికి ఇలా జ్ఞాన‌బోధ చేశాడు.
అష్ట‌మదిన పారాయ‌ణ స‌మాప్తః 

No comments:

Post a Comment