Thursday, November 7, 2019

కార్తీక పురాణం- 10వ రోజు పారాయ‌ణం   (శుక్ల ద‌శ‌మి రోజున‌)

ఏకోన‌వింశాధ్యాయం 

జ్ఞాన‌సిద్ధుడు విష్ణుమూర్తినుద్దేశించి ఇలా కీర్తిస్తున్నాడు.

వేద‌వేత్త‌ల చేత వేద‌వేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, ర‌హ‌స్య‌మైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తింప‌బ‌డే వాడా!

సూర్య‌చంద్ర శివ బ్ర‌హ్మాదుల చేత‌, మ‌హారాజాధిరాజుల చేత స్తుతులందుకునే ర‌మ‌ణీయ పాద‌ప‌ద్మాలు గ‌ల వాడా! నీకు న‌మ‌స్కారం.

పంచ‌భూతాలు, సృష్టి సంభూతాలైన స‌మ‌స్త చ‌రాచ‌రాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివ‌సేవిత చ‌ర‌ణా, నువ్వు ప‌ర‌మం కంటె ప‌ర‌ముడ‌వి. నువ్వే స‌ర్వాధికారివి. స్థావ‌ర జంగ‌మ రూప‌మైన స‌మ‌స్త ప్ర‌పంచం కూడా దానికి కార‌ణ‌బీజ‌మైన మాయ‌తో స‌హా నీ యందే ప్ర‌స్ఫుట‌మ‌వుతోంది. సృష్ట్యాదినీ, మ‌ధ్య‌లోనూ, త‌ద‌నంతంలోనూ కూడా ప్రపంచ‌మంతా నీవే నిండి ఉంటావు. భ‌క్ష్య భోజ్య చోష్య లేహ్య చ‌తుర్విధాన్న రూపుడ‌వూ, య‌జ్ఞ స్వ‌రూప‌డ‌వు కూడా నీవే. అమృత‌మ‌యం, ప‌ర‌మ సుఖ‌ప్ర‌దం అయిన నీ స‌చ్చిదానంద రూప సంస్మ‌ర‌ణం చేత‌నే ఈ సంసారం స‌మ‌స్తం వెన్నెల్లో స‌ముద్రంలా భాసిస్తోంది.

హే ఆనంద‌సాగ‌రా!  ఈశ్వ‌రా, జ్ఞాన స్వ‌రూపా, స‌మ‌స్తానికీ ఆధారం, స‌క‌ల పురాణ సారం కూడా నీవే. ఈ విశ్వం స‌మ‌స్తం నీ వ‌ల్ల‌నే జ‌నించి తిరిగి నీ యందే ల‌యిస్తూ ఉంటుంది. ప్రాణులంద‌రి హృద‌యాల్లోనూ ఉండే వాడివీ, ఆత్మ‌వాచ్యుడ‌వూ, అఖిల వంద్యుడ‌వూ, మ‌నోవాగగోచ‌రుడ‌వూ అయిన నువ్వు కేవ‌లం మాంస‌మ‌యాలైన ఈ భౌతిక నేత్రాల‌కు క‌నిపించ‌వు క‌దా తండ్రీ. ఓ కృష్ణా, ఓ ఈశ్వ‌రా, ఓ నారాయ‌ణా నీకు న‌మ‌స్కారం.

 నీ ద‌ర్శ‌న ఫ‌లంతో న‌న్ను ధ‌న్యుని చేయి. ద‌యామ‌యునివై న‌న్ను నిత్యం ప‌రిపాలించు. జ‌గ‌దేక‌పూజ్యుడ‌వైన నీకు మొక్క‌డం వ‌ల‌న నా జ‌న్మ‌కు సాఫ‌ల్యం ల‌భించేలా అనుగ్ర‌హించే దాత‌వు, నేత‌వు, కృపాస‌ముద్రుడ‌వు నీవే. సంసార సాగ‌రంలో సంక‌టాల న‌డుమ కొట్టుమిట్టాడుతున్న న‌న్ను స‌ముద్ధ‌రించు.

హే సిద్ధ‌చ‌రితా, హే ముకుందా, హే త్రిలోక‌నాథా, హే గుణాతీతా, హే గురూ, హే ద‌యామ‌యా విష్ణూ నీకు న‌మ‌స్కారం. నిత్యానంద సుధాబ్ధివాసీ, స్వ‌ర్గాప‌వ‌ర్గ‌ప్ర‌దా, అభేదా, తేజోమ‌యా, సాధుహృత్ప‌ద్మ‌స్థితా, ఆత్మారామా, దేవ‌దేవేశా, గోవిందా నీకిదే న‌మ‌స్కారం.

సృష్టి స్థితిల‌య‌కారా, వైకుంఠ‌వాసా! బుద్ధిమంతులైన వారు ఏ పాదాలపై భ‌క్తి అనే ప‌డ‌వ చేత సంసార సారూప్యాన్ని పొంద‌గ‌లుగుతున్నారో ఆ తేజ‌స్వ‌రూపాలైన నీ పాదాల‌కివే నా ప్ర‌ణామాలు.

వేదాల చేత గాని, శాస్త్రత‌ర్క‌పురాణ నీతి కావ్యాదుల చేత గాని మాన‌వులు నిన్ను ద‌ర్శించ‌లేరు. నీ పాద‌సేవ‌, భ‌క్తి అనే అంజ‌నాల‌ను ధ‌రించ‌గ‌లిగిన వారు మాత్ర‌మే నీ రూపాన్ని భావించి ఆత్మ‌స్వ‌రూపునిగా గుర్తించి త‌రించ‌గ‌లుగుతున్నారు. ప్ర‌హ్లాద‌, ధ్రువ‌, మార్కండేయ‌, విభీష‌ణ‌, ఉద్ధ‌వ‌, గ‌జేంద్రాది భ‌క్త కోటుల‌ను ర‌క్షించిన నీ నామ స్మ‌ర‌ణ మాత్రం చేత‌నే స‌మ‌స్త పాపాలు న‌శించిపోతున్నాయి. ఓ కేశ‌వా, ఓ గోవిందా, ఓ విష్ణూ, ఓ మ‌ధుసూద‌నా, ఓ త్రివిక్ర‌మా, ఓ వామ‌నా, ఓ శ్రీ‌ధ‌రా, ఓ హృషీకేశా, ఓ ప‌ద్మ‌నాభా, ఓ దామోద‌రా, ఓ సంక‌ర్ష‌ణా, ఓ వాసుదేవా నీకు న‌మ‌స్కారం. న‌న్ను ర‌క్షించు.

ఎడ‌తెరిపి లేకుండా పార‌వ‌శ్యంతో త‌న‌ను స్తుతిస్తున్న జ్ఞాన‌సిద్ధుని విష్ణుమూర్తి చిరున‌వ్వుతో చూస్తూ "జ్ఞాన‌సిద్ధా నీ స్తోత్రానికి నేను సంతోష‌భ‌రితుడ‌న‌య్యాను. ఏమి వ‌రం కావాలో కోరుకో" అన్నాడు. 

హే జ‌గ‌న్నాథా, నీకు నాపై అనుగ్ర‌హం ఉన్న‌ట్ట‌యితే నాకు సాలోక్యాన్ని (వైకుంఠం) ప్ర‌సాదించు అని జ్ఞాన‌సిద్ధుడు కోర‌డంతో తథాస్తు అని శ్రీ‌హ‌రి ఇలా చెప్ప‌సాగాడు.
జ్ఞాన‌సిద్ధా, నీ కోరిక నెర‌వేరుతుంది. కాని అత్యంత దురాత్ముల‌తో నిండిపోతున్న ఈ న‌ర లోకంలో మ‌హాపాపాత్ములు సైతం సులువుగా త‌రించే సూత్రాన్ని చెబుతాను విను. స‌త్పురుషా, నేను ప్ర‌తీ ఆషాఢ శుద్ధ ద‌శ‌మి నాడు ల‌క్ష్మీస‌మేతుడ‌నై పాల స‌ముద్రంలో ప‌వ‌ళించి కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెల‌లూ ఎవ‌రైతే స‌ద్ర్వ‌తాలు ఆచ‌రిస్తారో వారి పాపాల‌న్నీ న‌శించిపోయి నా సాన్నిధ్యం పొంద‌గ‌లుగుతారు. విజ్ఞులు, వైష్ణ‌వులు అయిన నీవు, నీ స‌హ‌వ్ర‌తులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్ర‌తాచ‌ర‌ణం చేయండి. చాతుర్మాస్య వ్ర‌తాచ‌ర‌ణ శూన్యులైన వారు బ్ర‌హ్మ‌హ‌త్యాపాత‌క ఫ‌లాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర‌, మెల‌కువ‌,క‌ల అనేవేవీ లేవు. నేను వాటికి అతీతుడ‌ను. అయినా నా భ‌క్తుల‌ను ప‌రీక్షించ‌డానికి త్రికాలాల్లోనూ నిద్రా మిష‌తో జ‌గ‌న్నాట‌క రంగాన్ని చూస్తూ ఉంటాను. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోను ప‌ఠించే వారు కూడా త‌రిస్తారు. వీటిని లోకంలో ప్ర‌చారం చేసి లోకోప‌కారానికి న‌డుం క‌ట్టు. అని చెప్పి నారాయ‌ణుడు ల‌క్ష్మీ స‌మేతుడై ఆషాఢ శుక్ల ద‌శ‌మి నాడు పాల‌స‌ముద్రాన్ని చేరి శేష‌త‌ల్పంపై శ‌య‌నించ‌సాగాడు.

ఈ వృత్తాంతం అంతా చెప్పిన అంగీర‌స‌ముని ఓయీ నీవ‌డిగిన చాతుర్మాస్య వ్ర‌త మ‌హిమ ఇది. దురాత్ములైనా, పాపాత్ములైనా స‌రే హ‌రినారాయ‌ణాప‌రులై ఈ చాతుర్మాస్య వ్ర‌తాచ‌ర‌ణ చేసే బ్రాహ్మ‌ణ‌, క్ష‌త్రియ, వైశ్య‌, శూద్ర‌, స్ర్తీ జాతుల వారంద‌రూ కూడా త‌రించి తీరుతారు. ఈ వ్ర‌తాన్నిచేయ‌ని వారు గో, గోత్ర హ‌త్యా ఫ‌లాన్ని, కోటి జ‌న్మ‌లు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్ర‌ద్ధాభ‌క్తుల‌తో ఆచ‌రించే వారు వంద య‌జ్ఞాలు చేసిన ఫ‌లం పొంది అంతంలో విష్ణులోకం పొందుతారు.
ఏకోన‌వింశాధ్యాయ స‌మాప్తః
-----------
వింశాధ్యాయం


జ‌న‌కుని కోరిక‌పై వ‌శిష్ఠుడు ఇంకా ఇలా చెప్ప‌సాగాడు.
ఓ మిథిలారాజ్య ధౌరేయా, ఈ కార్తీక మాహాత్మ్యం గురించి అత్రి, అగ‌స్త్య మునుల మ‌ధ్య జ‌రిగిన సంవాదం కూడా త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. ఒక నాడు అత్రి మ‌హాముని అగ‌స్త్యుని చూపి కుంభ‌సంభ‌వా, లోక‌త్ర‌యోప‌కారం కోసం కార్తీక మాహాత్మ్య బోధ‌క‌మైన ఒక హ‌రిగాథ‌ను వినిపిస్తాను.

వేదంతో స‌మాన‌మైన శాస్త్రంగాని, ఆరోగ్యాన్ని మించిన ఆనందం గాని, హ‌రికి సాటి అయిన దైవం గాని, కార్తీకంతో స‌మాన‌మైన నెల గాని లేవ‌య్యా. కార్తీక స్నాన‌, దీప‌దానాలు, విష్ణ్వ‌ర్చ‌న‌ల వ‌ల‌న స‌మ‌స్త వాంఛ‌లూ స‌మ‌కూర‌తాయి. ముఖ్యంగా క‌లియుగ ప్రాణులు కేవ‌లం విష్ణుభ‌క్తి వ‌ల‌న మాత్ర‌మే విజ‌య‌, వివేక‌, విజ్ఞాన‌, య‌శోధ‌న ప్ర‌తిష్ఠాన సంప‌త్తులు పొంద‌గ‌లుగుతారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజ‌యుని ఇతిహాసం వివ‌రిస్తాను అంటూ కొన‌సాగించాడు.

పురంజ‌యోపాఖ్యానం
త్రేతా యుగంలో సూర్య‌వంశ క్ష‌త్రియుడైన పురంజ‌యుడ‌నే వాడు అయోధ్య‌ను ప‌రిపాలించే వాడు. స‌ర్వ‌శాస్త్రవిదుడూ, ధ‌ర్మ‌జ్ఞుడూ అయిన రాజు అత్య‌ధిక‌మైన ఐశ్వ‌ర్యం క‌ల‌గ‌డంతో అహంక‌రించిన వాడై బ్రాహ్మ‌ణ ద్వేషి, దేవ బ్రాహ్మ‌ణ భూ హ‌ర్త‌, స‌త్య విహీనుడూ, దుష్ట క‌ర్మ ప‌రాక్ర‌మ యుక్తుడు, దుర్మార్గుడుగా మారిపోయాడు. ఫ‌లితంగా అత‌ని ధ‌ర్మ‌బ‌లం న‌శించిపోయింది. సామంతులైన కాంభోజ‌, కురుజాదులు అనేక మంది ఏక‌మై చ‌తురంగ బ‌లాల‌తో వ‌చ్చి అయోధ్య‌ను ముట్ట‌డించారు. ఈ వార్త తెలిసిన పురంజ‌యుడు కూడా బ‌ల‌మ‌ద‌యుక్తుడై శ‌త్రువుల‌తో త‌ల‌బ‌డేందుకు సిద్ధం అయ్యాడు. పెద్ద‌పెద్ద చ‌క్రాలు, ప‌తాకం, ధ‌నుర్బాణ శ‌స్ర్తాస్త‌సంప‌న్నం అయిన‌, ప‌లు యుద్ధాల్లో విజ‌యం అందించిన‌, చ‌క్క‌టి అశ్వాలు పూన్చిన త‌మ సూర్య‌వంశాన్వ‌మైన ర‌థాన్న‌ధిరోహించి ర‌థ‌గ‌జ‌తురంగ ప‌దాతి ద‌ళాల‌తో న‌గ‌రం నుంచి బ‌య‌లుదేరి శ‌త్రు సైన్యాల‌పై విరుచుకుప‌డ్డాడు.
ద‌శ‌మ దిన పారాయ‌ణ స‌మాప్తః

No comments:

Post a Comment