ఆ మర్నాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిశారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్షసంయుతమైన చక్కని ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమ ప్రతిష్ఠించుకుని ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వహించారు.
తదనంతర విధులన్ని నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకుని తులసీ బృందావనం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మరోసారి విష్ణువుని కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఓం తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు. ధ్యానవాహన, అసన, అర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్ర్త, ఆభరణ, గంధపుష్పాక్షత, ధూపదీప నైవేద్యాదులు సమర్పించి పుష్ప హారాలు అలంకరించి నమస్కరించి షోడశోపచార పూజలు చేశారు.
విష్ణువుకు ఎదురుగా చిలవలు, పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద శాలి వ్రీహి ధాన్య తిలాదులు పెట్టి ఆ పైన ఆవునేతి దీపాన్ని వెలిగించి శ్రీహరికి సమర్పించారు.
అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న సాంధపురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రత కార్తీక పూర్ణిమ, స్నానాది పుణ్యసంచయ కథాస్వరూపాలైన తత్త్వనిష్ఠోపాఖ్యానం, అంబరీషోపాఖ్యానం మరీ మరీ మనం చేసుకున్నారు.
తదుపరి మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్ధం సూతుల వారిచే ప్రవచింపబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణం కోసం నైమిశారణ్య సమాగతులైన సద్ర్బాహ్మణులకు ఉసిరికలు, కార్తీక దీపాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించారు.
ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలు, సంకీర్తనలు, నృత్యగానాది ఉపచార సమర్పణలతో గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మసాఫల్యత పొందారు.
15వ రోజు పారాయణ సమాప్తః
No comments:
Post a Comment