Sunday, November 10, 2019

కార్తీక పురాణం- 13వ రోజు పారాయ‌ణం   (శుక్ల త్ర‌యోద‌శి రోజున‌)

స‌ప్త‌వింశాధ్యాయం
దూర్వాసా, బ్రాహ్మ‌ణుడ‌వైన నీ ప‌ట్ల అప‌చారం జ‌రిగింద‌న్న త‌ప‌న‌తో ఆ అంబ‌రీషుడు విచార‌గ్ర‌స్తుడై ప్రాయోప‌విష్టుని వ‌లె బ్రాహ్మ‌ణ ప‌రివేష్ఠితుడై ఉన్నాడు. నా సుద‌ర్శ‌న చ‌క్రం త‌న కార‌ణంగానే నిన్ను త‌రుముతోంద‌ని దుఃఖిస్తున్నాడు. రాజ‌యినందుకు గ్రోబ్రాహ్మ‌ణ ర‌క్ష‌ణ త‌న ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం కావ‌డం వ‌ల్ల విప్రుడ‌వైన నీకు విప‌త్తు క‌లిగించినందుకు ఎంత‌గానో బాధ ప‌డుతున్నాడు. రాజు దండ‌నీతితోనే ధ‌ర్మ ప‌రిపాల‌న చేయాలి గాని బ్రాహ్మ‌ణుని మాత్రం దండించ‌కూడ‌దు.
శ్లో - బ్రాహ్మ‌ణో బ్రాహ్మ‌ణైవేర నిగ్రాహోవేద‌వాదిభిః
స‌త్య ధ‌ర్మాది నిర‌తైః లోభ దంభ వివ‌ర్తితైః
దోషి అయిన బ్రాహ్మ‌ణుని వేద‌విదులు, స‌త్య‌ధ‌ర్మ‌నిర‌తులు, లోబ‌దంభ శూన్యులు అయిన బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే దండించాలి. బ్రాహ్మ‌ణుడు పాపం చేసి ప్రాయ‌శ్చిత్తం చేసుకోన‌ప్పుడు ధన హ‌ర‌ణం లేదా వ‌స్త్ర హ‌ర‌ణం లేదా స్థాన భ్ర‌ష్ట‌త్వం మొద‌లైన విధుల‌తో బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే శిక్షించాలి త‌ప్పితే రాజు శిక్షించ‌కూడ‌దు. తాను స్వ‌యంగా బ్రాహ్మ‌ణుని చంపినా, త‌న నిమిత్తం బ్రాహ్మ‌ణ‌వ‌ధ జ‌రిగినా, ఇత‌రుల‌తే చంపించినా కూడా బ్ర‌హ్మ‌హ‌త్యాపాత‌కం క‌లుగుతుంద‌ని ధ‌ర్మ శాస్ర్తాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మ‌హాభ‌క్తుడైన ఆ అంబ‌రీషుడు త‌న వ‌ల్ల‌నే బ్రాహ్మ‌ణుడ‌వైన నీకు సుద‌ర్శ‌న వేధ క‌లిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబ‌ట్టి నువ్వు త‌క్ష‌ణ‌మే అంబ‌రీషుని వ‌ద్ద‌కు వెళ్లు. మీ ఇద్ద‌రికీ కూడా శుభం క‌లుగుతుంది అని విష్ణువు చెప్ప‌గానే దూర్వాసుడు అంబ‌రీషుని ఎదుట ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. మ‌రుక్ష‌ణ‌మే సుద‌ర్శ‌నం కూడా అక్క‌డ క‌నిపించింది. భ‌య‌గ్ర‌స్తుడైన దూర్వాసుని, అత‌ని మీద‌కు రానున్న సుద‌ర్శ‌నాన్ని చూడ‌గానే అంబ‌రీషుడు అ చ‌క్రానికి ఎదురెళ్లి "ఓ సుద‌ర్శ‌న చ‌క్ర‌మా, న‌న్ను మ‌న్నించు. భ‌య‌భ్రాంతుడైన వాడిని, అందునా బ్రాహ్మ‌ణుని ఇలా క్రూరంగా హింసించ‌డం న్యాయం కాదు" అంటూనే ధ‌నుర్ధారి అయి ఇలా చెప్ప‌సాగాడు.
స‌ప్త‌వింశోధ్యాయ స‌మాప్తః
---------------
అష్ట‌వింశోధ్యాయం
"ఆగు విష్ణుచ‌క్ర‌మా, ఈ బ్రాహ్మ‌ణ వ‌ధ నీకు త‌గ‌దు. చంప‌డ‌మే ప్ర‌ధాన‌మ‌నుకుంటే న‌న్ను చంపు. ఈ దూర్వాసుని వ‌ద‌ల‌ని ప‌క్షంలో నీతో యుద్ధానికైనా స‌రే నేను సిద్ధంగా ఉన్నాను. రాజుల‌కు యుద్ధ‌మే ధ‌ర్మం గాని, యాచ‌న ధ‌ర్మం కాదు. విష్ణ్వాయుధానివైన నీవు దైవ‌స్వ‌రూపానివే. గ‌నుక నిన్ను ప్రార్థించ‌డంలో త‌ప్పులేదు. అయిన‌ప్ప‌టికీ కూడా ఈ బ్రాహ్మ‌ణ ర‌క్ష‌ణార్ధం నేను నిన్ను ఎదిరించ‌క త‌ప్ప‌దు. నిన్ను జ‌యించ‌గ‌ల‌ది ఈ ప్ర‌పంచంలో ఏదీ లేద‌ని నాకు తెలుసు. అయినా నా బ‌ల‌ప‌రాక్ర‌మాల‌ను కూడా ఒక సారి రుచి చూడూ. మ‌రికొన్నాళ్ల పాటు ఆ శ్రీ‌హ‌రి హ‌స్తాల్లో బ‌తికి ఉండ‌ద‌ల‌చుకుంటే శ‌ర‌ణాగ‌తుడైన దూర్వాసుని వ‌దిలిపెట్టి వెళ్లిపో. లేదంటే నిన్ను క‌చ్చితంగా నేల కూలుస్తాను" అని క్షాత్ర‌ధ‌ర్మ పాల‌న కోసం సుద‌ర్శ‌నానికి, దూర్వాసునికి మ‌ధ్య ధ‌నుర్ధారి అయి నిలిచాడు. అంబ‌రీషుని ఆప్యాయంగా చూస్తూ అత‌ని ధ‌ర్మ‌నిర్వ‌హ‌ణ దీక్ష‌ను మ‌రింత ప‌రీక్షించ‌డం కోసం సుద‌ర్శ‌న చ‌క్రం ఇలా ప‌లుక‌సాగింది.

"అంబ‌రీషా, నాతో యుద్ధ‌మంటే సంబ‌ర‌మ‌నుకుంటున్నావా, మ‌హాబ‌ల మ‌ద‌మ‌త్తులైన మ‌ధుకైట‌భుల్ని, మ‌రెంద‌రో రాక్ష‌సుల్ని కూడా అవ‌లీల‌గా నాశ‌నం చేశాను. ఎవ‌రికి కోపం వ‌స్తే వారి ముఖంలోకి చూడ‌డానికి స‌మ‌స్త ప్ర‌పంచం కంపించిపోతుందో అలాంటి బ్ర‌హ్మ‌రుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవ‌స్థ ప‌డుతున్నాడంటే అది నా ప్ర‌తాప‌మేన‌ని మ‌ర్చిపోకు. ఉభ‌య‌తేజ‌స్సంప‌న్నుడైన దూర్వాసుడే నాకు భ‌య‌ప‌డుతుండ‌గా కేవ‌లం క్ష‌త్రియాహంకార కార‌క‌మైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు న‌న్నే చేయ‌గ‌ల‌వు?  క్షేమం కోరుకునే వాడు బ‌ల‌వంతుడితో సంధి చేసుకోవాలే గాని, ఇలా యుద్ధానికి దిగి నాశ‌నం కాకూడ‌దు. విష్ణుభ‌క్తుడివి కాబ‌ట్టి ఇంత‌వ‌ర‌కు నిన్ను స‌హించాను. లేనిపోని బీరాల‌కు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు" అని సుద‌ర్శ‌నం హెచ్చ‌రించింది.

ఈ మాట‌ల‌తో అంబ‌రీషుని క‌ళ్లు ఎరుపెక్కాయి.
"ఏమిటి సుద‌ర్శ‌నా ఎక్కువ‌గా మాట్లాడుతున్నావు, నా దైవ‌మైన శ్రీ‌హ‌రి ఆయుధానివ‌ని ఇంత‌వ‌ర‌కు కూరుకున్నాను గాని లేకుండా నా బాణాల‌తో నిన్నెప్పుడో నూరు ముక్క‌లు చేసి ఉండే వాడిని. దేవ‌బ్రాహ్మ‌ణుల పైనా, స్ర్తీలు, శిశువులు, ఆవుల మీద నేను బాణ ప్ర‌యోగం చేయ‌ను. నువ్వు దేవ‌త‌వైన కార‌ణంగా నీకింకా నా క్రూర నారాచ‌ఘాతాల రుచి తెలియ‌ప‌ర‌చ‌లేదు. నీకు నిజంగానే పౌరుష ప్ర‌తాపాలుంటే నీ దివ్య‌త్వాన్ని దిగ‌విడిచి క్షాత్ర ధ‌ర్మంగా పురుష రూపుడివై యుద్ధం చెయ్యి" అంటూ ఆ సుద‌ర్శ‌న చ‌క్రం పాదాల పైకి ఏక‌కాలంలో ఇర‌వై బాణాల‌ను అంబ‌రీషుడు సంధించాడు. 

అష్ట‌వింశోధ్యాయ స‌మాప్తః
13వ రోజు పారాయ‌ణ ముగిసింది.

No comments:

Post a Comment