Saturday, September 12, 2020

శ్రీ హ‌నుమ న‌వాక్ష‌రీ జ‌పం

సుంద‌ర‌కాండ భ‌క్త‌కోటికి
శుభాశీస్సులు. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న పుణ్య‌భూమిని ఆశ్ర‌యించి అర్ధ సంవ‌త్స‌రం గ‌డిచింది. మ‌న భ‌క్తుల్లో 5 శాతం మంది దీని బారిన ప‌డినా మ‌నం కావిస్తున్న పూజ‌ల ఫ‌లితంగా మృత్యువు మ‌న ద‌రిదాపుల‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతూ ఉన్న‌ది. శ్రీ రామ‌చంద్ర‌స్వామివారి క‌ల్యాణం, వినాయ‌క చ‌వితి లాంటి ఎన్నో ముఖ్య‌మైన పండుగ‌ల‌కు దూర‌మ‌య్యాం. అస‌లు ఈ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర‌మైనా లేదా ఆంగ్ల సంవ‌త్స‌రం 2020 అయినా ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ఎంతో కీడు చేసింది. క‌రోనాతో మ‌న వారు నాకు ఫోన్ చేయ‌డం, వెంట‌నే నేను స్వామివారిని కోర‌డం, వారు ఈ రోగం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం జ‌రిగింది. ఈ రోజు అన‌గా 8-9-2020 ఉద‌యం నుంచి మ‌న ‌వాళ్లు ఎంద‌రి నుండో ఎన్నో స‌మ‌స్య‌ల‌తో కూడిన ఫోన్లు అందుకున్నాను. సాయంత్రం స్వామివారి పీఠం వ‌ద్ద కూర్చుని క‌ర్త‌వ్యం గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు చేతిలో నుంచి శ్రీ ఆంజ‌నేయ స‌హ‌స్ర‌నామార్చ‌న పుస్త‌కం జారి ప‌డింది. కొన్ని కాగితాలు అందులో నుంచి విడిపోయాయి. వాటిని ఏరుకునే క్ర‌మంలో స్వామివారి 900వ నామం ఉన్న కాగితంపై చూపు ప‌డింది. అదే

ఓం మ ‌హా సుం ద ‌రా య న ‌మః
1    2   3   4     5  6   7   8   9

సుంద‌ర‌కాండ మొత్తం ఈ నామం పైనే ఆధార‌ప‌డి ఉంది. ఎలాగంటే...
"బుద్ధిర్బ‌లం, య‌శోధైర్యం, నిర్భ‌య‌త్వం, అరోగ‌తా, అజాడ్యం, వాక్ప‌టుత్వంచ హ‌నుమ‌త్ స్మ‌ర‌ణా భ‌వేత్‌"
శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి స్మ‌ర‌ణ వ‌ల‌న మ‌న‌కు పైన శ్లోకంలో వివ‌రించిన లాభాలు స‌మ‌కూరుతాయి. మ‌రి ఇలాంటి లాభాలు స‌మ‌కూర్చే ఆంజ‌నేయ‌స్వామివారు సుల‌భంగా ఎక్క‌డ ల‌భ్య‌మ‌వుతారు?  మొత్తం రామాయ‌ణంలోని ఆరు కాండ‌ముల‌లో సుంద‌ర‌కాండ‌మునందు మాత్ర‌మే విరాట్ స్వ‌రూపుడై మ‌న‌కు ల‌భిస్తారు. అందుచేత‌నే సుంద‌ర‌కాండం ఆయ‌న నామంతోనే విల‌సిల్లుతోంది. ఆంజ‌నేయ‌స్వామివారు శివాంశ సంభూతుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు సుంద‌రేశుడు, మ‌హాసుంద‌రుడు అనే నామాలు కూడా ఉన్నాయి.

అందుకే శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి స‌హ‌స్ర నామాల్లో 900వ నామం మ‌హాసుంద‌రాయ న‌మః అని పొందుప‌ర‌చ‌బ‌డింది. కాబ‌ట్టి మ‌హాసుంద‌రాయ న‌మః అనే ఒక్క నామానికి ఒక్కొక్క సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేసిన ఫ‌లితం ల‌భిస్తుంది. 

తొమ్మిద‌వ నంబ‌రుకు చాలా ప్రాధాన్య‌త ఉంది. ఆ ప్రాధాన్య‌త‌ను స‌మ‌యాభావం వ‌ల‌న ఇక్క‌డ వివ‌రించ‌డంలేదు. "త్రిజ‌టా స్వ‌ప్ప వృత్తాంతం"లో దీని స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇవ్వ‌బ‌డుతుంది. కాబ‌ట్టి ఈ 900 నామం చాలా మ‌హిమాన్విత‌మైన‌ది.

డిసెంబ‌రు 2020 వ‌ర‌కు ఈ క‌రోనా ఉంటుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అలాగే ఈ 2020 సంవ‌త్స‌రం ప్ర‌క‌ల‌కు అచ్చిరాని సంవ‌త్స‌రం. అందుచేత మ‌నం ఈ మ‌హిమ గ‌ల శ్రీ స్వామివారి నామాన్ని జ‌ప‌రూప‌కంగా నిర్వ‌హిస్తూ ఈ సంవ‌త్స‌రంలోని శేష మాసాలు మ‌న‌కు ఎలాంటి ఆప‌ద‌లు సంభ‌వించ‌కుండా చూచుకుందాము

ఈ జ‌పానికి ద‌శ‌కోటి నామోచ్ఛ‌ర‌ణ (10,00,000) కావించాల‌ని, దీనికి 30 రోజుల గ‌డువు ఉండాల‌ని నిర్ణ‌యించాము. ఈ కార్య‌క్ర‌మానికి ముందుగా భ‌క్తుల‌ను న‌మోదు చేసుకునే కార్య‌క్ర‌మంతో ప్రారంభించి ముగింపు త‌ర్వాత శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి అష్టోత్త‌రశ‌త మ‌రియు స‌హ‌స్ర నామార్చ‌న కావించాల‌ని నిర్ణ‌యించాం. 

అలాగే

భ‌క్తులు చేసిన జ‌ప సంఖ్య‌ను వారి గోత్ర నామాల‌తో స‌హా లిస్టుల‌ను సిద్ధం కావించి ఆ లిస్టును కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామివారి పాదస‌న్నిధికి చేర్చాల‌ని గొప్ప నిర్ణ‌యం త‌ల‌పెట్టాము (నిబంధ‌న‌ల వ‌ల‌న కొండ‌గ‌ట్టుకు వెళ్ల‌డానికి భ‌క్తులు అనుమ‌తించ‌బ‌డ‌రు).

భ‌క్తుల గోత్ర నామాల న‌మోదు కార్య‌క్ర‌మం
ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి 14-9-2020 సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల పేర్ల న‌మోదు ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 17-9-2020 వ‌ర‌కు (మ‌హాల‌య అమావాస్య‌) ఎంత మంది భ‌క్తులు ఈ జ‌పంలో పాల్గొన‌బోతున్నారో వారి గోత్ర‌నామాల‌తో స‌హా ఫైన‌ల్ లిస్టు ఈ దాసునికి చేరుతుంది. 

జ‌ప ప్రారంభ కార్య‌క్ర‌మం
అధిక ఆశ్వ‌యుజ మాసం మొద‌టి రోజు వ‌దిలి 19-9-2020 శ‌నివారం నుంచి జ‌పాలు ప్రారంభించ‌బ‌డి 16-10-2020 శుక్ర‌వారంతో ముగుస్తుంది. నిజ ఆశ్వ‌యుజ మాసం రెండ‌వ రోజు శ‌నివారం రోజున శ్రీ స్వామివారికి స‌హ‌స్ర‌నామార్చ‌న జ‌రుప‌బ‌డుతుంది.

ప‌ర్య‌వేక్ష‌కులు
య‌థాప్ర‌కారం భ‌క్లుల లిస్టులు సిద్ధం కావించి అందించ‌డానికి శ్రీ ఆత్మూరి మాణిక్య‌రావుగారిని కోరుతున్నాము.
అలాగే స‌మ‌య నిబంధ‌న‌లు పాటించి త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డానికి శ్రీ దామ‌రాజు వేంక‌టేశ్వ‌ర్లు గారిని కోరుతున్నాము. గ‌డువు ముగిస‌న త‌ర్వాత వ‌చ్చే పేర్ల‌ను శ్రీ మాణిక్య‌రావుగారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ల‌సిన ప‌ని లేదు. అలాగే స‌మ‌య‌పాల‌న చేయ‌ని వారిని ఒక త‌ప్పు కాచి రెండ‌వ సారి త‌ప్పు చేస్తే వారి పేర్ల‌ను శాశ్వ‌తంగా తొల‌గించ‌వ‌చ్చును.
 
జ‌పంలో పాల్గొనే భ‌క్తుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు
ఎన్ని మార్లు చెప్పినా పాల్గొనువారు ప్ర‌క‌ట‌న పూర్తిగా చ‌ద‌వ‌కుండా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌రిగ్గా పాటించ‌కుండా మాకు త‌ల‌నొప్పి క‌ల‌గ‌చేస్తున్నారు. ఈ మారు మాత్రం నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌ప అవ‌కాశం క‌లుగ‌చేయ‌లేము.
నిబంధ‌న‌లు జాగ్ర‌త్త‌గా చ‌దివి అమ‌లు చేయండి.
1. పాల్గొను వారు త‌మ వివ‌రాలు ఇలా ఇవ్వాలి. 1) గోత్రం 2) ఇంటిపేరు 3) పాల్గొను వారి పేరు
2. చాలా మంది పేర్లు, గోత్రాలు ఇంగ్లీషు అక్ష‌రాల్లో ఇవ్వ‌డం వ‌ల‌న తెలుగులోకి వ‌చ్చే స‌రికి త‌ప్పులు వ‌స్తున్నాయి. అందుచేత పాల్గొనే వారు త‌మ వివ‌రాలు తెలుగులోనే రాయాలి. ఒక‌వేళ తెలుగులో రాయ‌లేని వారు కాగితం మీద తెలుగులో రాసి ఫొటో తీసి పంప‌వ‌చ్చును. నిబంధ‌న‌లు పాటించ‌ని వారి పేర్లు మాణిక్య‌రావుగారు తిర‌స్క‌రించ‌వ‌చ్చును.
3.మ‌న ముందు శ్రీ స్వామివారు 10 కోట్ల నామోచ్చార‌ణ అనే పెద్ద భారం పెట్టినందున ప్ర‌తి వారు త‌మ జ‌పాల‌ను పెంచే ప్ర‌య‌త్నం చేయండి. కొంద‌రు త‌మ పేర్లు లిస్టులో రావ‌డానికి ఒక జ‌ప‌మాల‌ను తిప్పి అయింద‌నిపిస్తారు. అలా కాకుండా త్రిక‌ర‌ణ‌శుద్ధిగా రోజూ ఈ జ‌పం నిర్వ‌హించండి.
4. జ‌పం ఉద‌యం పూట‌నే చేయాలి. భోజ‌న‌మున‌కు ముందు జ‌పం పూర్తి కావాలి
5. మీ జ‌న సంఖ్య‌ను ఏ రోజుది ఆ రోజే మ‌ధ్యాహ్నం 2 గంట‌లు దాట‌కుండా పోస్టు చేయాలి.
6. మీ పోస్టింగులు సుంద‌ర‌కాండ గ్రూప్ లో మాత్ర‌మే ఉండాలి. ఇత‌ర‌త్రా ఎలా పంపినా వాటిని తిర‌స్క‌రిస్తాము.
7. సందేహాలు తీర్చుకోవ‌డానికి మా ఫోను ద్వారా అవ‌కాశం క‌ల్పించాము.
8. ఆరోగ్య కార‌ణాల వ‌ల‌న చివ‌రి రోజు స‌హ‌స్ర నామార్చ‌న‌కు గాని, కొండ‌గ‌ట్టు యాత్ర‌కు గాని ఎవ‌రికి అనుమ‌తి లేదు.
కొండ‌గ‌ట్టు స్వామివారికి మా స్వీయ ఆర్జ‌న ధ‌నంతోనే పాల్గొను వారి లిస్టులు స‌మ‌ర్పిస్తారు.
ఈ అపూర్వ అవ‌కాశం జార‌విడుచుకోకండి. అంద‌రూ మీ పేర్ల‌ను గ‌డువు లోగా న‌మోదు చేసుకోండి.
శుభ‌మ‌స్తు
మీ శృంగారం సింగ‌రాచార్యులు


Tuesday, August 11, 2020

రామ‌నామ‌జ‌పం

 అయోధ్య‌లో శ్రీ‌రామాల‌యానికి శంకుస్థాప‌న జ‌ర‌గ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌ని, అందులోనూ మ‌నం జీవించి ఉన్న కాలంలోనే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం మ‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని గురూజీ శ్రీ‌మాన్ శృంగారం సింగ‌రాచార్యుల వారు భావించారు. అందుకే రామాల‌యం శంకుస్థాప‌న జ‌రిగిన వారంలో ఆగ‌స్టు 5-8 తేదీల మ‌ధ్య‌న మ‌న సుంద‌ర‌కాండ భ‌క్త‌బృందం అంద‌రూ ఇళ్ల‌లో కూచుని శ్రీ‌రామ‌జ‌య‌రామ జ‌య‌జ‌య రామ అంటూ శ‌క్తి మేర‌కు జ‌పం చేయాల‌ని సూచించారు. ఆ మేర‌కు మొత్తం 152 మంది భ‌క్త‌బృందం ఈ జ‌పంలో పాల్గొని 4 రోజుల్లోనూ మొత్తం 5,86,457 నామాలు జ‌పం చేశారు. 9వ తేదీ ఆదివారంనాడు గురూజీ వారి నివాసంలోనే సుంద‌ర‌కాండ భ‌క్తులంద‌రి సంక్షేమం కోసం ప్ర‌త్యేకించి ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో అంద‌రి ఆయురారోగ్యాల కోసం హోమం నిర్వ‌హించి భ‌క్త‌బృందం అంద‌రికీ ఆశీస్సులు అంద‌చేశారు. గురూజీ ఆదేశం మేర‌కు 152 మంది భ‌క్తులు చేసిన జ‌పం వివ‌రాలు ఈ దిగువ ప‌ట్టిక‌ల్లో ఉన్నాయి. 


Tuesday, August 4, 2020

అయోధ్య‌కు శ్రీ‌రామ ఆగ‌మ‌నం సంద‌ర్భంగా శ్రీ‌రామ జ‌పం

జై శ్రీ‌రామ్‌


సుంద‌ర‌కాండ భ‌క్త‌గ‌ణానికి
శుభాశీర్వ‌చ‌నాలు. మ‌నం 5-8-2020వ తేదీన నీ భువిపై జీవించి ఉండ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం, ఎందుకు...??? ఎందుకు...???ఎందుకు...???

త్రేతా యుగంలో జీవించి ఉన్న సాకేతపురి ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌చంద్రుని ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించి త‌రించారు. ఈ క‌లియుగంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను అధిగ‌మించి సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం ప‌విత్ర స‌ర‌యూ న‌దీతీరంలో శ్రీ‌రామ‌చంద్రుడు న‌డ‌యాడిన సాకేత న‌గ‌రంలో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తిరిగి మ‌న కోసం శ్రీ‌రామ‌రాజ్యం మ‌రోసారి స్థాపించ‌బోతున్నారు.

5-8-2020వ తేదీ మ‌ధ్యాహ్నం 12.30 నిముషాల‌కు అయోధ్య‌లో మ‌న భార‌త ప్ర‌ధానామాత్యులు భాగ‌వ‌దోత్త‌ములైన క‌లియుగ మునీశ్వ‌రుల స‌మ‌క్షంలో అభిజిన్ ముహూర్తంలో తిరిగి భ‌ర‌త ఖండంలో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి ఆల‌యం పున‌ర్నిర్మించ‌డానికి శిలాన్యాసం కావించ‌బోతున్నారు. ఈ అభిజిన్ ముహూర్తాన్నే శ్రీ‌రామ జ‌న‌నం అవ‌డం, ఈ ముహూర్తాన్నే శ్రీ‌సీతారామ‌చంద్ర‌స్వామి వారి క‌ల్యాణం జ‌రిగిన సంగ‌తి మ‌నం ఎరిగిన విష‌య‌మే. అందువ‌ల‌న జ్యోతిష్యులు ఈ శిలాన్యాసానికి ఆ ముహూర్త‌మే ఎన్నుకొని ఉంటారు. ఈ విధంగా అప్ర‌తిహ‌త‌మైన శ్రీ‌రామ‌రాజ్యాన్ని మ‌ళ్లీ క‌లియుగంలో మ‌న‌కు రుచి చూపించ‌బోతున్నారు...ఎందుకు...???ఎందుకు...???ఎందుకు??? అనే ప్ర‌శ్న‌కు అందుకే అనేది దీనికి స‌మాధానం.

ఈ స‌మ‌యంలో మ‌న సుంద‌ర‌కాండ స్వామివారు 53వ సుంద‌ర‌కాండ పూర్తి చేసుకుని 54వ సుంద‌ర‌ర‌కాండ‌లో అపూర్వ‌మైన శ్రీ‌రామ ప‌ట్టాభిషేకాన్ని జ‌రుపుకోవ‌ల‌సి ఉంది. ఆ ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మం ఎందుకు స్వామివారు ఆపారో అర్ధం అయింద‌నుకుంటాను. త‌న స్వ‌స్థ‌లంలో త‌ను కొలువుదీరిన త‌ర్వాత‌నే మ‌న చేత న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న విధంగా త‌న శ్రీ‌రామ ప‌ట్టాభిషేకాన్ని జ‌రుపుకోవాల‌ని స్వామివారి నిర్ణ‌యం. దానికి మ‌నం క‌ట్టుబ‌డ‌దాము. మ‌రి మ‌నం స్వామివారిని అయోధ్య‌కు అపూర్వ స్వాగ‌తంతో ఆహ్వానించ‌డానికి ఏం చెయ్యాలి?

మీకు మొద‌ట‌నే చెప్పాను. మ‌నం 5-8-2020 తేదీన ఈ భువిపై జీవించి ఉండ‌డం మ‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అని. మ‌నం జీవించి ఉండ‌గానే మ‌న ఆరాధ్య దైవం శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తిరిగి వారి జ‌న్మస్థ‌లంలోకి కాలిడ‌బోతున్నారు. ఆ నాడు అయోధ్య జ‌నులు శ్రీ‌రామ‌ద‌ర్శ‌నం వ‌ల‌న త‌రించారు. ఈ క‌లియుగంలో మ‌రోసారి రాముని ప్ర‌వేశాన్ని క‌నులారా వీక్షించ‌బోతున్నాం. అందుకే మ‌నం ధ‌న్యులం.
ఈ అవ‌కాశాన్ని మ‌నం విడువ‌కూడ‌దు. అందుకే మ‌న సుంద‌ర‌కాండ భ‌క్తులం 4 రోజుల పాటు స్వామివారి నామాన్ని జ‌పిస్తూ అయోధ్య‌కు ఆహ్వానిద్దాం.

శ్రీ‌రామ‌చంద్రుడు విజ‌యుడై త‌న స్వ‌గృహానికి వ‌చ్చేసే స‌మ‌యంలో మ‌నంద‌రం వారి విజ‌య‌సూచ‌కంగా శ్రీ‌రామ జ‌య‌రామ జ‌య‌జ‌య‌రామ అనే నామ జ‌పంతో వారిని ప్ర‌స‌న్నం చేసుకుందాం.

జ‌పానికి మార్గ‌ద‌ర్శ‌కాలు

స‌మయం లేనందువ‌ల్ల మ‌న సుంద‌ర‌కాండ అభిమానులు ప్ర‌తి వారు ఈ ప్ర‌క‌ట‌న‌ను త‌మ వారికి పంపి వారికి కూడా ఈ అపూర్వ ఫ‌లాన్ని అనుభ‌వించేట‌ట్లు చేయ‌గ‌ల‌రు.

ఈ కార్య‌క్ర‌మం 5-8-2020న ప్రారంభించి 8-8-2020 నాడు స‌మాప్తి చేయాలి.

ఎంత‌మంది ఈ జ‌పాన్ని చేశారో  వారంద‌రి గోత్ర‌నామాల‌తో 9-8-2020 ఆదివారం రోజున శ్రీ‌రామ‌చంద్ర స్వామివారికి అష్టోత్త‌ర శ‌త నామార్చ‌న‌, స‌హ‌స్ర‌నామార్చ‌న చేయ‌బ‌డుతుంది.

5వ తేదీ ఉద‌యం స్వామివారి ఫొటో శుద్ధి చేసిన ప్ర‌దేశంలో ఉంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి జ‌ప‌మాల‌తో పై నామ జ‌పాన్ని ప్రారంభించండి. ఉద‌యం టిఫిన్ చేయ‌వ‌చ్చును. భోజ‌నం మాత్రం మ‌ధ్యాహ్నం జ‌పానంత‌రం మాత్ర‌మే చేయాలి. ఆ రోజు ఆల‌స్యంగా ప్రారంభిస్తున్నందు వ‌ల్ల కొద్ది జ‌పం మాత్రం చేయ‌వ‌చ్చును. ఆ త‌ర్వాత 6,7,8 తేదీల్లో య‌ధావిధిగా ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోగా త‌మ‌కు అనువైన స‌మ‌యంలో త‌మ త‌మ శ‌క్త్యానుసారం జ‌పం చేయ‌వ‌చ్చును. తాము చేసిన జ‌ప‌సంఖ్య‌ను గ్రూపులో మాత్ర‌మే  పెట్టాలి. త‌మ వ్య‌క్తిగ‌త గ్రూప్ ల‌లో పెడితే వాటిని స్వీక‌రించం. విదేశాల్లో ఉన్న వారు సాధ్య‌మైనంత‌వ‌ర‌కు భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపుగా ఎప్పుడైనా త‌మ జ‌ప‌సంఖ్య‌ను పోస్ట్ చేయ‌వ‌చ్చును. ఈ స‌మ‌యం భార‌త‌దేశంలో నివ‌శించే వారికి కూడా వ‌ర్తిస్తుంది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని త‌మ గోత్ర‌నామాల‌ను ఇంగ్లీషులో రాయ‌కుండా అచ్చ తెలుగు ప‌దాల్లోనే రాయండి లేదా కాగితం మీద తెలుగులో రాసి ఫొటో తీసి పంపాలి. పేర్లు న‌మోదు కార్య‌క్ర‌మం లేనందు వ‌ల్ల ప్ర‌తీ వారు త‌మ గోత్రం, ఇంటిపేరు, జ‌పం చేసే వారి పేరు విధిగా ఇవ్వాలి. అసంపూర్తిగా ఉన్న గోత్ర‌నామాలు తిర‌స్క‌రించ‌బ‌డ‌తాయ‌ని గుర్తుంచుకోండి. ప్ర‌తీ వారు ఈ 4 రోజులూ త‌ప్ప‌కుండా చేయాల‌ని నియ‌మం ఏమీ లేదు. మ‌ధ్య‌లో ఈ ప్ర‌క‌ట‌న చూసిన వారు ఆ రోజు నుంచే ప్రారంభించ‌వ‌చ్చును. ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకుని  శ్రీ‌రామ స‌హ‌స్ర నామాచ‌ర్చ‌న‌లో మీ పేరు ఉండే విధంగా చూసుకోండి.

మీ
శృంగారం సింగ‌రాచార్యులు

Friday, July 24, 2020

ఆంజ‌నేయ ద్వాద‌శ నామ పారాయ‌ణ‌


గురూజీ మ‌రో మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచం అంతా గ‌డ‌గ‌డా వ‌ణికిపోతోంది. ఏ క్ష‌ణాన వ్యాధి విరుచుకుప‌డుతుందో అని ప్ర‌తీ ఒక్క‌రూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌నంద‌రం మాన‌సిక స్థైర్యంతో నిల‌బ‌డి భ‌గ‌వంతునిపై ప‌రిపూర్ణంగా దృష్టి కేంద్రీక‌రించిన‌ట్ట‌యితే  ఏ మ‌హ‌మ్మారి మ‌న ద‌రికి చేర‌ద‌ని గురూజీ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం నాకు అది అనుభ‌వంలోకి వ‌చ్చింది. నేను జ‌ర్న‌లిస్టున‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రెండు వారాల క్రితం ఒక రోజు నాకు తీవ్రంగా జ‌లుబు చేసింది. జ్వ‌రం అయితే రాలేదు గాని ఒంట్లో స‌ల‌ప‌రంగా ఉండేది. మ‌ర్నాడు స్వ‌ల్పంగా గొంతునొప్పి ప్రారంభం అయింది. అదే స‌మ‌యంలో నా భార్య శ్రీ‌దేవికి కూడా బాగా జ‌లుబు చేసింది. దిక్కు తోచ‌లేదు. భ‌యంభ‌యంగానే ఇద్ద‌రం గ‌డిపాము. ఆ మ‌రుస‌టి రోజుకి కాస్తంత ఉప‌శ‌మించింది. కాని గొంతునొప్పి మాత్రం ఉంది. ఇదంతా మంగ‌ళ‌, బుధ‌వారాల్లో జ‌రిగింది.  బుధ‌వారం ఉద‌యం గురువుగారికి ఫోన్ చేసి మ‌న‌సులో బాధంతా చెప్పాను. అస‌లేం భ‌య‌ప‌డ‌కండి, మ‌న స్వామి అండ‌గా ఉన్నారు. అనిర్వేద శ్రియో మూలం, త‌మ‌స్మిన్ శ్లోకాలు రెండూ 11 రోజుల పాటు 11 మార్లు అనుసంధానం చేయండి, అన్నీ ఆయ‌నే చూసుకుంటారు అని ధైర్యం చెప్పారు. అనుకోకుండా బుధ‌వారం రాత్రి సాక్షాత్తు మ‌న ఆరాధ్య దైవం ఆంజ‌నేయ‌స్వామివారు పంపిన‌ట్టుగానే డాక్ట‌ర్ వెంక‌ట‌శేష‌య్య‌గార‌ని ఒక హోమియో డాక్ట‌ర్ యుట్యూబ్ వీడియో ఒక‌టి వాట్స‌ప్ లో షేర్ అయింది. అది చాలా బాగుంది, డీలిట్ చేయ‌కుండా పూర్తిగా వినండి అని నా భార్య ఫోన్ చేసి చెప్పింది. ఆ వీడియోలో ఆయ‌న కొన్ని హోమియో మందులు చెప్పారు. గురువారంనాడు కెపిహెచ్ బిలో హోమియో స్టోర్ కి వెళ్లి ఆయ‌న చెప్పిన ఆర్సెనికం ఆల్బం, బెల్ల‌డోనా తెచ్చాను. జ‌లుబు, గొంతునొప్పి రెండూ త‌గ్గాయి. ఇది నా ఒక్క‌డి అనుభ‌వ‌మే కాదు. ఈ రోజు నెల‌కొన్న వాతావ‌ర‌ణంలో అంద‌రం ఇలాంటి భ‌యాల‌తోనే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నాం. ఏదైనా కాస్తంత అనుమానం వ‌చ్చి టెస్ట్ చేయించుకుందామ‌న్నా రెండు రోజుల త‌ర్వాత గాని స్లాట్ దొర‌క‌దు, ఆ త‌ర్వాత రిజ‌ల్ట్ రావ‌డానికి మ‌రో 48 గంట‌లు ప‌డుతోంది. ఈ లోగా ప‌రిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆస్ప‌త్రికి పోయినా టెస్ట్ రిపోర్టులు లేనిదే చేర్చుకోవ‌డంలేదు. చేర్చుకున్నా ప్రైవేటు ఆస్ప‌త్రులైతే 10, 15 ల‌క్ష‌లు గుంజేస్తున్నాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌రైన చికిత్స అందించే స్థితి లేదు. ఈ స‌మ‌యంలో మ‌నంద‌రం మ‌న‌సు ఆధ్యాత్మికత వైపు మ‌ళ్లించి దృఢంగా నిల‌బ‌డాల‌న్న‌ది గురూజీ ఆకాంక్ష. అందుకే ఆయ‌న శ‌నివారం నుంచి ఈ కింది కార్య‌క్ర‌మం ప్ర‌క‌టించారు. ఆంజ‌నేయ‌స్వామివారి ద్వాద‌శాక్ష‌రి మంత్ర పారాయ‌ణ మనంద‌రితో చేయించాల‌ని సంక‌ల్పించారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న ఇంట్లో క‌ల‌శ‌స్థాప‌న చేసి మ‌నంద‌రి గోత్ర నామాలు స్వామివారికి నివేదించి మ‌నంద‌రి త‌ర‌ఫున మంత్రోప‌దేశం, మంత్ర జ‌పం చేస్తారు. ఆ క్ష‌ణంలో ఆయ‌న సంక‌ల్పంలో పేర్లు చెప్పిన వారంద‌రికీ మంత్రోప‌దేశం చేసిన‌ట్టుగానే ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌స్తుంది.ఆదివారం ఉద‌యం నుంచి మ‌నంద‌రం ఇళ్ల‌లోనే కూచుని ఆ ద్వాద‌శాక్ష‌రి మంత్రాన్ని శ‌క్తి మేర‌కు నిర్వ‌హిస్తే ఆగ‌స్టు రెండో తేదీ ఆదివారం నాడు మ‌నంద‌రి పేర్ల మీద వారింటిలోనే ద్వాద‌శాక్ష‌రీ మంత్ర హోమం నిర్వ‌హిస్తారు. ఇంత‌క‌న్నా మ‌హ‌ద్భాగ్యం ఏముంటుంది...?  మ‌నంంద‌రినీ ఆ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి స్వామివారే కాపాడ‌తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇతోధికంగా పాల్గొని విజ‌య‌వంతం చేద్దామ‌ని అంద‌రికీ సూచిస్తున్నాను. 
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు

Saturday, April 18, 2020

ఈ రోజు ధ‌న్వంత‌రి హోమం దృశ్యాలు

క‌రోనాసుర సంహారాన్ని కోరుతూ శ్రీ‌రామ‌నామ జ‌పం చేయాల‌న్న మ‌న గురూజీ సందేశం మేర‌కు అంద‌రం రంగంలోకి దిగి మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌రామ‌నామ పారాయ‌ణం ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేశాము. మొత్తం 300 మందికి పైగా శిష్యులు, వారి బంధుమిత్రులు శ్రీ‌రామ‌నామ పారాయ‌ణ దీక్ష స్వీక‌రించి శ్రీ రామ‌నామం జ‌పించారు. మొద‌ట మార్చి 28 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 8వ తేదీ లోగా కోటి వెయ్యి నూట ఎనిమిది (1,00,01,108) నామాలు పారాయ‌ణ చేయాల‌ని గురూజీ నిర్దేశించారు. అప్ప‌టికే ఆ సంఖ్య దాటిపోయింది. అయినా కూడా ఈ నెల 14 వ‌ర‌కు జ‌పాన్ని గురూజీ పొడిగించారు. ఇంకా తుది లెక్క తెలియాల్సి ఉంది. నా ఉద్దేశంలో అంద‌రం క‌లిసి చేసిన నామ‌జ‌పం 2 కోట్లు దాటిపోయి ఉంటుంది. ఈ రోజున గురువుగారు శ్రీ‌రామ‌నామ జ‌పం చేసిన వారంద‌రి పేర్ల మీద సంక‌ల్పం చెప్పి లోక‌క‌ల్యాణం, స‌ర్వ‌జ‌న క్షేమం, క‌రోనా నుంచి ప్ర‌పంచానికి విముక్తి ఆకాంక్షిస్తూ ధ‌న్వంత‌రి హోమం స‌మీపంలోనే ఉన్న ఒక బ్రాహ్మ‌ణోత్త‌ముని స‌హాయంతో నిర్వ‌హించి సుద‌ర‌కాండ కుటుంబం అంద‌రికీ త‌మ ఆశీస్సులు అంద‌చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు అంద‌రి కోసం పోస్ట్ చేస్తున్నాను.






Tuesday, April 14, 2020

రామ‌నామ జ‌పం పూర్త‌యింది, శ‌నివారం ధ‌న్వంత‌రి హోమం

గురువుగారు పంపిన చివ‌రి రోజు నివేదిక పంపుతున్నాను. నివేదిక చ‌దివితే అంతా అర్ధం అవుతుంది. అయినా నేను కూడా ఆయ‌న చెప్పిన విష‌యం సంక్షిప్తంగా రాస్తున్నాను. వ‌చ్చే శ‌నివారం ఉద‌యం  ఉద‌యం గురువుగారు ధ‌న్వంత‌రి హోమం చేసి మ‌నంద‌రి గోత్ర నామాల‌తో ప్ర‌క్రియ పూర్తి చేస్తారు. ఆయ‌న పంపిన నివేదికలోని 
"ఓం వాసుదేవాయ విద్మ‌హే వైద్య‌రాజాయ ధీమ‌హి త‌న్నో ధ‌న్వంత‌రి ప్ర‌చోద‌యాత్" 
అనే మంత్రం మ‌నంద‌రం శ‌నివారం ఉద‌యం  ఉద‌యం 7 గంట‌ల‌కు క‌నీసం 11 సార్లు జ‌పం చేస్తే స‌రిపోతుంది. కింద రాసిన బీజాక్ష‌రాల‌తో కూడిన మంత్రం గురూప‌దేశం లేకుండా ఎవ‌రూ చ‌ద‌వ‌కూడ‌దు. అలా చ‌దివితే బెడిసి కొడుతుంది. జాగ్ర‌త్త‌. ఈ నియ‌మం త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. చ‌క్క‌గా ఇన్ని రోజులు పారాయ‌ణ చేసిన త‌ర్వాత ఈ రామ‌నామ పారాయ‌ణ‌లో పాల్గొన్న వారంద‌రి గోత్ర‌నామాలు నివేదిస్తూ మ‌నంద‌రి పేర్ల మీద‌ జ‌రుగుతున్న ఈ హోమం ఇంటిలో ఎవ‌రికీ క‌రోనా ద‌రి చేర‌కుండా కాపాడుతుంది. శుభాకాంక్ష‌లు. 

Sunday, March 29, 2020

నేటి టాప‌ర్ కూచిభొట్ల సురేఖ‌

15,660 నామాల జ‌పం
ద్వితీయ స్థానంలో మేచినే శ‌శిక‌ళ‌
రెండో రోజు నివేదిక‌

శ్రీ‌రామ కోటి స‌హిత శ‌త షోడ‌శ నామ పారాయ‌ణం రెండో రోజు నివేదిక ఇది. ఈ రోజు భ‌క్తులు అత్యుత్సాహంతొ 3,30,650 నామాలు పారాయ‌ణ చేసిన‌ట్టు గురువుగారు ప్ర‌క‌టించారు. ఇందులో సీరియ‌ల్ నంబ‌ర్ 4. శ్రీ‌మ‌తి కూచిభొట్ల సురేఖ 15,660 నామాలు పారాయ‌ణ చేసి ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా సీరియ‌ల్ నంబ‌ర్ 38.శ్రీ‌మ‌తి మేచినేని శ‌శిక‌ళ 14,040 నామాలు పారాయ‌ణ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇద్ద‌రికీ గురూజీ ఆశీస్సులు అంద‌చేశారు.


Friday, March 27, 2020

గురూజీ మ‌హ‌త్సంక‌ల్పం

క‌రోనా భూతాన్ని దేశం నుంచి త‌రిమి కొట్ట‌డం కోసం సుంద‌ర‌కాండ కుటుంబం శ‌క్తివంచ‌న లేకుండా త‌మ వంతు కృషి చేయ‌డానికి గురూజీ ఒక మ‌హ‌త్కార్యం చేప‌ట్టారు. అందుకు సంబంధించిన స‌ర్కుల‌ర్ ఇందులో పొందుప‌ర‌చ‌డం జ‌రుగుతోంది. మా సుంద‌ర‌కాండతో దీర్ఘ‌కాలిక అనుబంధం ఉన్న వారితో పాటు ఈ గ్రూప్ లో స‌భ్యులుగా చేరిన వారికి కూడా ఈ మ‌హ‌ద‌వ‌కాశం క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో ఆ స‌ర్కుల‌ర్ పోస్ట్ చేస్తున్నాను. ద‌య చేసి ప్ర‌తీ ఒక్క‌రూ దాన్ని పూర్తిగా చ‌దివి ఆస‌క్తి ఉంటే నా నంబ‌ర్ 903799169కి గోత్రం, ఇంటిపేరు, య‌జ‌మాని పేరు, ఫోన్ నంబ‌ర్ పంపండి. వారంద‌రి జాబితా కూడా గురూజీకి పంపుతాను. ఆ ప్ర‌కారం మ‌నంద‌రి పేరు మీద గురువుగారు ఇంటిలో సంక‌ల్పం చేస్తారు. ఉద‌యం లేవ‌గానే కాల‌కృత్యాలు తీర్చుకుని మ‌నంద‌రం శ్రీ‌రామ‌నామ జ‌ప పారాయ‌ణం చేద్దాము. ప్ర‌తీ ఒక్క‌రూ ఈ అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచిస్తున్నాను.
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు  

Sunday, March 22, 2020

దాచేప‌ల్లి వారి నివాసంలో 49వ సుంద‌ర‌కాండ‌

దాచేప‌ల్లి వెంక‌ట‌రెడ్డి, హారిక దంప‌తుల నివాసంలో మార్చి 14 నుంచి 22 వ‌ర‌కు గురూజీ నిర్వ‌హ‌ణ‌లోని తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌ర‌లోని 49వ సుంద‌ర‌కాండ జ‌రిగింది. ఆ కార్య‌క్ర‌మం దృశ్యాల వీడియో ఇది. ఈ సారి కార్య‌క్ర‌మంలో ఇంత‌వ‌ర‌కు మూడు సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌ల్లోని 265 సుంద‌ర‌కాండ‌ల కార్య‌క్ర‌మాల్లో జ‌ర‌గ‌ని ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. మ‌న దేశంలో కూడా ఆ మ‌హ‌మ్మారి ప్ర‌వేశించి రెండో ద‌శ‌కు చేరింది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన మూడో ద‌శ ప్ర‌వేశించ‌కుండా ఉండాలంటే మ‌నంద‌రం ఎంతో జాగ్ర‌త్త‌గా, అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడో ద‌శ‌కు విస్త‌రించ‌కుండా ఉండేందుకు ప్ర‌ధాన న‌రేంద్ర‌మోదీ ఆదివారం (తేదీ 22) ప్ర‌జా క‌ర్ఫ్యూ పాటించాల‌ని పిలుపు ఇచ్చారు. దానికి సామాజిక బాధ్య‌త‌గా స్పందించిన గురూజీ సుంద‌ర‌కాండ కంక‌ణ‌ధారులు త‌ప్ప స‌హ‌స్ర‌నామార్చ‌న‌కు ఎవ‌రూ రావ‌ద్ద‌ని ఆదేశించారు. సాధార‌ణంగా ఏ సుంద‌ర‌కాండ‌లో అయినా ఎంత మంది పాల్గొంటే అంత మంచిద‌ని ప‌దేప‌దే పిలుపు ఇచ్చి ప్రోత్స‌హించే గురూజీ కూడా ఇలాంటి ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం ఇంత‌వ‌ర‌కు ఏ సుంద‌ర‌కాండ‌లోనూ జ‌ర‌గ‌లేదు. ఇంక ముందు ఇలాంటి స‌ద‌ర్భం రాకూడ‌ద‌నే ఆ స్వామివారిని కోరుకుందాం. అలాగే ఎప్పుడూ అవ‌స‌ర‌మైనంత సంఖ్య‌లో రామ‌బంట్లుగా సేవ కోసం శిష్యుల‌ని ఆహ్వానించే గురూజీ ఈ సారి ఒక్క సుబ్ర‌హ్మ‌ణ్యంగారు మిన‌హా ఎవ‌రూ రావ‌ద్ద‌ని ఆదేశించారు. అది కూడా తెల్ల‌వారు ఝామున 4 గంట‌ల‌కి ప్రారంభించి 6 గంట‌ల‌క‌ల్లా మొత్తం కార్య‌క్ర‌మం ముగించేశారు. 7 గంట‌ల‌క‌ల్లా అంద‌రూ ఇళ్ల‌కి చేరి ప్ర‌ధాని పిలుపు మేర‌కు ప్ర‌జా క‌ర్ఫ్యూలో భాగ‌స్వాముల‌య్యేందుకు ఇలా చేశారు. హాట్సాఫ్ గురూజీ.

Monday, February 24, 2020

48వ సుంద‌ర‌కాండ ఆహ్వానం

వ‌చ్చే శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 29) నుంచి మియాపూర్ వాస్త‌వ్యులు గింజుప‌ల్లి ఐన్ స్టీన్‌, ఉమామ‌హేశ్వ‌రి దంప‌తుల ఇంటిలో గురూజీ నిర్వ‌హ‌ణ‌లోని తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌ర‌లోని 48వ సుంద‌ర‌కాండ ప్రారంభం కానుంది. 29వ తేదీ శ‌నివారంనాడు ఉద‌యం సుంద‌ర‌కాండ కంక‌ణ ధార‌ణ ఉంటుంది. ఆస‌క్తి గ‌ల వారంద‌రూ వ‌చ్చి వారం రోజుల కాలానికి సుంద‌ర‌కాండ దీక్షా కంక‌ణం ధ‌రించ‌వ‌చ్చు. ఈ దీక్షా కంక‌ణం తీసుకున్న వారు ఆ 9 రోజులూ ఒక పూట భోజ‌నం చేస్తూ భూశ‌య‌నం చేయాలి. పూర్తి బ్ర‌హ్మ‌చ‌ర్యం వ‌హించాలి. ఇలా చేసిన‌ట్ట‌యితే వారికి ఆంజ‌నేయ‌స్వామి ఆశీస్సులు ల‌భించి వారి క‌ష్టాలు దూరం అవుతాయి. ఇల్లు స‌మృద్ధిగా విల‌సిల్లుతుంది. ఆదివారం (మార్చి 1) ఆ పై శ‌నివారం (మార్చి 7) వ‌ర‌కు నుంచి ప్ర‌తీ రోజూ సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఆంజ‌నేయ అష్టోత్త‌ర శ‌త నామార్చ‌న నిర్వ‌హించి అనంత‌రం సుంద‌రకాండ స‌ర్గ‌ల పారాయ‌ణ‌, త‌ద‌నంత‌రం ఆయా స‌ర్గ‌ల ప్రాశ‌స్త్యం, వాటిలోని ఆంత‌ర్యంపై ధారావాహిక‌గా ప్ర‌వ‌చనం ఉంటాయి. పాల్గొని విని ఆనందించండి.

Saturday, February 15, 2020

సుంద‌ర‌కాండ ప్రాశ‌స్త్యం

47వ అనుబంధ సుంద‌ర‌కాండ ప్రారంభ దృశ్యం

గుంట‌కండ్ల ర‌మేశ్ రెడ్డి, మ‌ణిమాల దంప‌తుల గృహంలో 47వ అనుబంధ సుంద‌ర‌కాండ ఆదివారం కంక‌ణ ధార‌ణ‌తో ప్రారంభ‌మ‌యింది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన తొలి రోజు వీడియో చిత్రీక‌ర‌ణ చూసి ఆనందించండి. రేప‌టి నుంచి ప్ర‌తీ రోజూ సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఆంజ‌నేయ అష్టోత్త‌ర శ‌త‌నామార్చ‌న‌తో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మై సుంద‌ర‌కాండ స‌ర్గ పారాయ‌ణ‌, ప్ర‌వ‌చ‌నాల‌తో రోజు వారీ కార్య‌క్ర‌మాలు ముగుస్తాయి. వ‌చ్చే ఆదివారం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి ప్రారంభ‌మ‌య్యే విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం, రామ‌నామ పారాయ‌ణం, హ‌నుమ‌త్ స్తుతి అనంత‌రం ఆంజ‌నేయ స‌హ‌స్ర‌నామార్చ‌న‌తో వారం రోజుల కార్య‌క్ర‌మాలు వైభ‌వంగా ముగుస్తాయి. అంద‌రూ ఆహ్వానితులే.