Tuesday, August 4, 2020

అయోధ్య‌కు శ్రీ‌రామ ఆగ‌మ‌నం సంద‌ర్భంగా శ్రీ‌రామ జ‌పం

జై శ్రీ‌రామ్‌


సుంద‌ర‌కాండ భ‌క్త‌గ‌ణానికి
శుభాశీర్వ‌చ‌నాలు. మ‌నం 5-8-2020వ తేదీన నీ భువిపై జీవించి ఉండ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం, ఎందుకు...??? ఎందుకు...???ఎందుకు...???

త్రేతా యుగంలో జీవించి ఉన్న సాకేతపురి ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌చంద్రుని ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించి త‌రించారు. ఈ క‌లియుగంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను అధిగ‌మించి సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం ప‌విత్ర స‌ర‌యూ న‌దీతీరంలో శ్రీ‌రామ‌చంద్రుడు న‌డ‌యాడిన సాకేత న‌గ‌రంలో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తిరిగి మ‌న కోసం శ్రీ‌రామ‌రాజ్యం మ‌రోసారి స్థాపించ‌బోతున్నారు.

5-8-2020వ తేదీ మ‌ధ్యాహ్నం 12.30 నిముషాల‌కు అయోధ్య‌లో మ‌న భార‌త ప్ర‌ధానామాత్యులు భాగ‌వ‌దోత్త‌ములైన క‌లియుగ మునీశ్వ‌రుల స‌మ‌క్షంలో అభిజిన్ ముహూర్తంలో తిరిగి భ‌ర‌త ఖండంలో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి ఆల‌యం పున‌ర్నిర్మించ‌డానికి శిలాన్యాసం కావించ‌బోతున్నారు. ఈ అభిజిన్ ముహూర్తాన్నే శ్రీ‌రామ జ‌న‌నం అవ‌డం, ఈ ముహూర్తాన్నే శ్రీ‌సీతారామ‌చంద్ర‌స్వామి వారి క‌ల్యాణం జ‌రిగిన సంగ‌తి మ‌నం ఎరిగిన విష‌య‌మే. అందువ‌ల‌న జ్యోతిష్యులు ఈ శిలాన్యాసానికి ఆ ముహూర్త‌మే ఎన్నుకొని ఉంటారు. ఈ విధంగా అప్ర‌తిహ‌త‌మైన శ్రీ‌రామ‌రాజ్యాన్ని మ‌ళ్లీ క‌లియుగంలో మ‌న‌కు రుచి చూపించ‌బోతున్నారు...ఎందుకు...???ఎందుకు...???ఎందుకు??? అనే ప్ర‌శ్న‌కు అందుకే అనేది దీనికి స‌మాధానం.

ఈ స‌మ‌యంలో మ‌న సుంద‌ర‌కాండ స్వామివారు 53వ సుంద‌ర‌కాండ పూర్తి చేసుకుని 54వ సుంద‌ర‌ర‌కాండ‌లో అపూర్వ‌మైన శ్రీ‌రామ ప‌ట్టాభిషేకాన్ని జ‌రుపుకోవ‌ల‌సి ఉంది. ఆ ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మం ఎందుకు స్వామివారు ఆపారో అర్ధం అయింద‌నుకుంటాను. త‌న స్వ‌స్థ‌లంలో త‌ను కొలువుదీరిన త‌ర్వాత‌నే మ‌న చేత న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న విధంగా త‌న శ్రీ‌రామ ప‌ట్టాభిషేకాన్ని జ‌రుపుకోవాల‌ని స్వామివారి నిర్ణ‌యం. దానికి మ‌నం క‌ట్టుబ‌డ‌దాము. మ‌రి మ‌నం స్వామివారిని అయోధ్య‌కు అపూర్వ స్వాగ‌తంతో ఆహ్వానించ‌డానికి ఏం చెయ్యాలి?

మీకు మొద‌ట‌నే చెప్పాను. మ‌నం 5-8-2020 తేదీన ఈ భువిపై జీవించి ఉండ‌డం మ‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అని. మ‌నం జీవించి ఉండ‌గానే మ‌న ఆరాధ్య దైవం శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తిరిగి వారి జ‌న్మస్థ‌లంలోకి కాలిడ‌బోతున్నారు. ఆ నాడు అయోధ్య జ‌నులు శ్రీ‌రామ‌ద‌ర్శ‌నం వ‌ల‌న త‌రించారు. ఈ క‌లియుగంలో మ‌రోసారి రాముని ప్ర‌వేశాన్ని క‌నులారా వీక్షించ‌బోతున్నాం. అందుకే మ‌నం ధ‌న్యులం.
ఈ అవ‌కాశాన్ని మ‌నం విడువ‌కూడ‌దు. అందుకే మ‌న సుంద‌ర‌కాండ భ‌క్తులం 4 రోజుల పాటు స్వామివారి నామాన్ని జ‌పిస్తూ అయోధ్య‌కు ఆహ్వానిద్దాం.

శ్రీ‌రామ‌చంద్రుడు విజ‌యుడై త‌న స్వ‌గృహానికి వ‌చ్చేసే స‌మ‌యంలో మ‌నంద‌రం వారి విజ‌య‌సూచ‌కంగా శ్రీ‌రామ జ‌య‌రామ జ‌య‌జ‌య‌రామ అనే నామ జ‌పంతో వారిని ప్ర‌స‌న్నం చేసుకుందాం.

జ‌పానికి మార్గ‌ద‌ర్శ‌కాలు

స‌మయం లేనందువ‌ల్ల మ‌న సుంద‌ర‌కాండ అభిమానులు ప్ర‌తి వారు ఈ ప్ర‌క‌ట‌న‌ను త‌మ వారికి పంపి వారికి కూడా ఈ అపూర్వ ఫ‌లాన్ని అనుభ‌వించేట‌ట్లు చేయ‌గ‌ల‌రు.

ఈ కార్య‌క్ర‌మం 5-8-2020న ప్రారంభించి 8-8-2020 నాడు స‌మాప్తి చేయాలి.

ఎంత‌మంది ఈ జ‌పాన్ని చేశారో  వారంద‌రి గోత్ర‌నామాల‌తో 9-8-2020 ఆదివారం రోజున శ్రీ‌రామ‌చంద్ర స్వామివారికి అష్టోత్త‌ర శ‌త నామార్చ‌న‌, స‌హ‌స్ర‌నామార్చ‌న చేయ‌బ‌డుతుంది.

5వ తేదీ ఉద‌యం స్వామివారి ఫొటో శుద్ధి చేసిన ప్ర‌దేశంలో ఉంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి జ‌ప‌మాల‌తో పై నామ జ‌పాన్ని ప్రారంభించండి. ఉద‌యం టిఫిన్ చేయ‌వ‌చ్చును. భోజ‌నం మాత్రం మ‌ధ్యాహ్నం జ‌పానంత‌రం మాత్ర‌మే చేయాలి. ఆ రోజు ఆల‌స్యంగా ప్రారంభిస్తున్నందు వ‌ల్ల కొద్ది జ‌పం మాత్రం చేయ‌వ‌చ్చును. ఆ త‌ర్వాత 6,7,8 తేదీల్లో య‌ధావిధిగా ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోగా త‌మ‌కు అనువైన స‌మ‌యంలో త‌మ త‌మ శ‌క్త్యానుసారం జ‌పం చేయ‌వ‌చ్చును. తాము చేసిన జ‌ప‌సంఖ్య‌ను గ్రూపులో మాత్ర‌మే  పెట్టాలి. త‌మ వ్య‌క్తిగ‌త గ్రూప్ ల‌లో పెడితే వాటిని స్వీక‌రించం. విదేశాల్లో ఉన్న వారు సాధ్య‌మైనంత‌వ‌ర‌కు భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపుగా ఎప్పుడైనా త‌మ జ‌ప‌సంఖ్య‌ను పోస్ట్ చేయ‌వ‌చ్చును. ఈ స‌మ‌యం భార‌త‌దేశంలో నివ‌శించే వారికి కూడా వ‌ర్తిస్తుంది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని త‌మ గోత్ర‌నామాల‌ను ఇంగ్లీషులో రాయ‌కుండా అచ్చ తెలుగు ప‌దాల్లోనే రాయండి లేదా కాగితం మీద తెలుగులో రాసి ఫొటో తీసి పంపాలి. పేర్లు న‌మోదు కార్య‌క్ర‌మం లేనందు వ‌ల్ల ప్ర‌తీ వారు త‌మ గోత్రం, ఇంటిపేరు, జ‌పం చేసే వారి పేరు విధిగా ఇవ్వాలి. అసంపూర్తిగా ఉన్న గోత్ర‌నామాలు తిర‌స్క‌రించ‌బ‌డ‌తాయ‌ని గుర్తుంచుకోండి. ప్ర‌తీ వారు ఈ 4 రోజులూ త‌ప్ప‌కుండా చేయాల‌ని నియ‌మం ఏమీ లేదు. మ‌ధ్య‌లో ఈ ప్ర‌క‌ట‌న చూసిన వారు ఆ రోజు నుంచే ప్రారంభించ‌వ‌చ్చును. ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకుని  శ్రీ‌రామ స‌హ‌స్ర నామాచ‌ర్చ‌న‌లో మీ పేరు ఉండే విధంగా చూసుకోండి.

మీ
శృంగారం సింగ‌రాచార్యులు

No comments:

Post a Comment