Wednesday, October 30, 2019

కార్తీక పురాణం - 3వ రోజు పారాయ‌ణం (శుక్ల త‌దియ రోజున‌)

ఓ శివ‌ధ‌నుస్సంప‌న్నా, జ‌న‌క‌మ‌హారాజా, శ్ర‌ద్ధ‌గా విను. మ‌నం చేసిన పాపాల‌న్నింటినీ న‌శింప‌చేగ‌ల శ‌క్తి ఒక్క కార్తీక వ్ర‌తానికి మాత్ర‌మే ఉంది. కార్తీక మాసంలో విష్ణుస‌న్నిధిలో ఎవ‌రు భ‌గ‌వ‌ద్గీతా పారాయ‌ణం చేస్తారో వారి పాపాల‌న్నీ పాము కుబుసంలా తొల‌గిపోతాయి. అందులోనూ 10, 11 అధ్యాయాలు పారాయ‌ణ చేసిన వారు వైకుంఠానికి క్షేత్ర‌పాల‌కుల‌వుతారు. తుల‌సి ద‌ళాల‌తో గాని, తెలుపు లేదా న‌లుపు గ‌న్నేరు పూల‌తో గాని విష్ణు పూజ చేసిన వారు వైకుంఠానికి చేసి విష్ణువుతో స‌మానంగా భోగాల‌నుభ‌విస్తారు. ఈ కార్తీక మాసంలో హ‌రిహ‌రులెవ‌రి స‌న్నిధినైనా స‌రే ఏ పురాణాన్నైనా ప్ర‌వ‌చించే వారు స‌ర్వ‌క‌ర్మ‌బంధ విముక్తుల‌వుతారు.
కార్తీక వ‌న భోజ‌నం
శ్లో- యః కార్తీకే సితే వ‌న‌భోజ‌న మాచ‌రేత్
న‌యాతి వైష్ణ‌వం ధామ స‌ర్వ‌పాపై ప్ర‌ముచ్య‌తే
కార్తీక మాసం శుక్ల ప‌క్షంలో వ‌న‌భోజ‌నం చేసిన వారు -పాప‌విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జ‌ప‌, హోమ‌, పూపా, భోజ‌న‌, త‌ర్ప‌ణ ఫ‌లాల‌తో- పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచ‌వంతుల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. కాబ‌ట్టి మ‌హారాజా, కార్తీక మాస శుక్ల ప‌క్షంలో అన్ని ర‌కాల వృక్షాల‌తో పాటుగా ఉసిరిచెట్టు ఊడా ఉన్న తోట‌లోనే వ‌న‌భోజ‌నం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాల‌గ్రామం ఉంచి గంధ‌పుష్పాక్ష‌త‌ల‌తో పూజించి య‌థాశ‌క్తి బ్రాహ్మ‌ణుల‌ను ఆహ్వానించి గౌర‌వించి వారితో క‌లిసి భోజ‌నం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వ‌న భోజ‌నం ఎవ‌రైతే నిర్వ‌హిస్తారో వారు ఆయా కాలాల్లో చేసిన స‌ర్వ‌పాపాల నుంచి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు. జ‌న‌క‌ప‌తీ, ఈ కార్తీక మాహాత్మ్యాన్ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో విన్న బ్రాహ్మ‌డుడొక‌డు దుర్యోనీ సంక‌టంనుంచి ర‌క్షింప‌బ‌డిన క‌థ చెబుతాను, విను.
దేవ‌ద‌త్తోపాఖ్యాన‌ము
పూర్వం కావేరీ తీరంలో దేవ‌శ‌ర్మ అనే స‌ద్ర్బాహ్మ‌ణుడుండే వాడు. అత‌నికొక ప‌ర‌మ దుర్మార్గుడైన కుమారుడు క‌లిగాడు. అత‌ని పేరు దేవ‌ద‌త్తుడు. అత‌ని దుష్ట ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను గుర్తించిన తండ్రి అత‌గాడిని పాప‌విముక్తుని చేయాల‌ని సంక‌ల్పించి "నాయ‌నా రోజూ కార్తీక వ్ర‌త స్నానం ఆచ‌రించు. సాయంవేళ హ‌రిస‌న్నిధిలో దీపారాధ‌న చేయి. ఈ విధంగా కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించి ధ‌న్యుడ‌వు కా" అని చెప్పాడు. కాని దుర్వ‌ర్త‌నుడైన ఆ బ్రాహ్మ‌ణ‌పుత్రుడు తాన‌టువంటి క‌ట్టుక‌థ‌ల‌ను న‌మ్మ‌న‌ని, కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌న‌ని తండ్రికి ఎదురుతిరిగాడు. అందుకు ఆగ్ర‌హించిన దేవ‌శ‌ర్మ త‌న కుమారుడిని అడ‌విలోని చెట్టుతొర్ర‌లో ఎలుక‌వై ప‌డి ఉండు అని శ‌పించాడు. శాపానికి భ‌య‌ప‌డిన ఆ విప్ర‌కుమారుడు తండ్రి పాదాల‌పై ప‌బి త‌రుణోపాయం వేడ‌గా "నాయ‌నా నీవు ఎప్పుడైతే కార్తీక మ‌హాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడు నీ ఎలుక రూపం పోతుంది" అని శాప‌విముక్తి తెలియ‌చేశాడు.
దేవ‌ద‌త్తునికి శాప‌విముక్తి
తండ్రి శాపం కార‌ణంగా క్ష‌ణాల్లో మూషిక రూపంలోకి మారిపోయిన ఆ బ్రాహ్మ‌ణ‌యువ‌కుడు గ‌జార‌న్‌యంలో ఫ‌ల‌వంత‌మైన‌ది, అనేక జంతువుల‌కు ఆశ్ర‌యం ఇచ్చేది అయిన ఒక మ‌హావృక్షం తొర్ర‌లో గ‌డ‌ప‌సాగాడు. కొంత‌కాలం గ‌డిచిన త‌ర్వాత మ‌హ‌ర్షి విశ్వామిత్రుడు శిష్య స‌మేతంగా కార్తీక స్నానం ఆచ‌రించి వ‌చ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొద‌టిలో కూచుని త‌న శిష్యుల‌కి ప‌ర‌మ పావ‌న‌మైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపించ‌సాగాడు. ఆ స‌మ‌యంలో ద‌యాహీనుడూ, పాపాల పుట్ట‌, అడ‌వి జీవాల‌ను హింసించి పొట్ట పోసుకునే వాడు అయిన ఒక కిరాత‌కుడు ఆ ప్రాంతానికి వ‌చ్చాడు. పుణ్య‌పురుషుల ద‌ర్శ‌నం వ‌ల్ల ఉప‌కార‌మే గాని, అప‌కారం ఎన్న‌టికీ జ‌రుగ‌దు. విశ్వామిత్రాది త‌పోధ‌నుల ద‌ర్శ‌నం చేత ర‌వంత ప‌శ్చాత్తాప‌ప‌డిన వాడై జ్ఞానం ఉద‌యించ‌గా ఆ కిరాత‌కుడు వారిని స‌మీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న క‌థ‌లేమిటి? అవి వింటుంటే నాకీ కిరాత‌క జీవితం ప‌ట్ల చిరాకు క‌లిగింది. ద‌య‌చేసి ఆ ర‌హ‌స్య‌మేమిటో చెప్పండి అని విన్న‌వించుకున్నాడు. అత‌నిలో వివేకం విచ్చుకుంటున్న వైనాన్ని గ‌మ‌నించిన విశ్వామిత్రుడు నాయ‌నా, మేము కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవ‌రైనా తెలిసి గాని, తెలియ‌క గాని స్నాన‌దాన జ‌ప‌త‌పాదులు చేసి పురాణ శ్ర‌వ‌ణం చేసిన‌ట్ట‌యితే వారు స‌ర్వ‌పాపాల నుంచి విముక్తుల‌వుతార‌ని చెప్పాడు. ఈ వ్ర‌తాన్ని భ‌క్తితో ఆచ‌రించే వారు జీవ‌న్ముక్తుల‌వుతార‌ని కూడా తెలిపాడు. అలా కిరాత‌కునికి చెబుతున్న కార్తీక మ‌హాత్మ్యం పూర్తిగా విన్న ఎలుక రూపంలోని ఆ బ్రాహ్మ‌ణ‌కుమారుడు శాప‌విమోచ‌న పొంది సొంత రూపం సంపాదించుకున్నాడు. విశ్వామిత్రాదుల‌కు ప్ర‌ణామాలు చేసి త‌న గాథ‌ను వినిపించి వారి నుంచి సెల‌వు తీసుకుని ఆశ్ర‌మానికి త‌ర‌లిపోయాడు. అనంత‌రం ఆ కిరాత‌కుడు కూడా విశ్వామిత్రాదుల నుంచి కార్తీక మాహాత్మ్యం సంపూర్ణంగా తెలుసుకుని దేహాంత‌రాన ఉత్త‌మ గ‌తులు పొందాడు. కాబ‌ట్టి ఓ జ‌న‌క‌మ‌హారాజా ఉత్త‌మ గ‌తులు కోరే వారు ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగా కార్తీక వ్ర‌తం ఆచ‌రించాలి లేదా క‌నీసం కార్తీక మ‌హాత్మ్యం భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో వినాలి.
పంచ‌మోధ్యాయ స‌మాప్తః
---------------

ష‌ష్ఠాధ్యాయ‌ము
వ‌శిష్ఠ మ‌హ‌ర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు. రాజ‌ర్షీ జ‌న‌కా, ఈ కార్తీకం 30 రోజులూ కూడా ఎవ‌రు శ్రీ మ‌హావిష్ణువును క‌స్తూరీ గంధాదుల‌తోనూ, పంచామృతాల‌తోనూ అభిషేకిస్తారో వారికి ప‌ది వేల అశ్వ‌మేథాలు చేసిన ఫ‌లితం ల‌భిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు స‌న్నిధిలో దీపారాధ‌నం చేసినా, దీప‌దానం చేసినా విష్ణులోకాన్ని పొందుతారు. ప‌త్తిని శుభ్ర‌ప‌రిచి దానితో వ‌త్తి చేసి, బియ్య‌ప్పిండి లేదా గోధుమ‌పిండితో ప్ర‌మిద‌లో ఆవు నేతిని పోసి వ‌త్తిని త‌డిపి వెలిగించాలి. చివ‌రి రోజున ఒక‌ స‌ద్ర్బాహ్మ‌ణునికి ఆహ్వానించి వెండి ప్ర‌మిద‌ను, భ‌మిడి వ‌త్తినీ చేయించి వాటిని బియ్య‌పు పిండి మ‌ధ్య‌న ఉంచి పూజా నివేద‌నాదులు ఆచ‌రించి భోజ‌నం పెట్టిన అనంత‌రం
శ్లో - స‌ర్వ‌జ్ఞాన‌ప్ర‌దం దీపం స‌ర్వ‌సంప‌చ్ఛుభావ‌హం
దీప‌దానం ప్ర‌దాస్యామి శాంతిర‌స్తు స‌దా మ‌మ
(జ్ఞాన‌మునూ, సంప‌ద‌ల‌నూ, శుభ‌ముల‌ను క‌లిగించేదైన దీప‌దానం చేస్తున్నాను. దీని వ‌ల‌న నాకు నిరంత‌ర సంప‌ద‌లు క‌లుగుగాక) అని చెప్పుకుంటూ పిండితో స‌హా ఆ దీపాన్ని బ్రాహ్మ‌ణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్ష‌య‌పుణ్యం పొందుతారు. దీప‌దానం వ‌ల‌న విద్య‌, జ్ఞానం, ఆయువు వృద్ధి చెందిన స‌ర్వ‌భోగాలు క‌లుగుతాయి. మ‌నోవాక్కాయ కృత పాపాల‌న్నీ స‌మ‌సిపోతాయి. ఉదాహ‌ర‌ణ‌కి ఒక క‌థ చెబుతాను విను.
లుబ్ధ వితంతువు మోక్ష‌మందుట‌
పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువుండేది. ఆమె రోజూ భిక్షాట‌నం చేసి వ‌చ్చిన దానిలో మంచి అన్నం కూర‌లు వండి విక్ర‌యించి మిగిలిన అన్నంతో తృప్తి ప‌డుతూ డ‌బ్బు వెన‌కేయ‌సాగింది. ఇత‌రుల ఇళ్ల‌లో వంట‌ప‌నులు, కుట్టుప‌నులు చేస్తూ ప్ర‌తిఫ‌లంగా వారి నుంచి ద్ర‌వ్యం తీసుకునేది. భిక్షాట‌న కూడా చేసేది. ఇలా నిత్య ధ‌నార్జ‌న‌లోనే మునిగిపోయిన ఆ వితంతువు డ‌బ్బు సంపాద‌న మిన‌హా ఏ రోజూ హ‌రినామ స్మ‌ర‌ణం చేయ‌లేదు. హ‌రిక‌థ లేదా పురాణ ప్ర‌వ‌చ‌నాలు విన‌లేదు. పుణ్య‌తీర్థాల‌కు తిర‌గ‌లేదు. ఏకాద‌శీ ఉప‌వాసం చేసి ఎరుగ‌దు. ఇలాంటి లుబ్ధురాలింటికి దైవ‌వ‌శాన శ్రీ‌రంగ యాత్రీకుడైన ఒక బ్రాహ్మ‌ణుడు వ‌చ్చాడు. ఆమెను మంచి దారిలో పెట్టాల‌ని భావించి ఓ అమాయ‌కురారా, నేను చెప్పేది శ్ర‌ద్ధ‌గా విను. ఆలోచించుకో. ఈ తోలు శ‌రీరం వ‌ట్టి అశాశ్వ‌తం అని తెలుసుకో. నేల‌, నీరు, నిప్పు, నింగి, గాలఇ అనే పంచ‌భూతాత్మ‌క‌మైన‌దే ఈ శ‌రీరం. ఈ దేహం న‌శించ‌గానే ఆ పంచ‌భూతాలు కూడా ఇంటి పై క‌ప్పు మీద కురిసిన వాన‌నీటి వ‌లె చెదిరిపోతాయి. నీటి మీద నురుగు లాంటి త‌నువు నిత్యం కాదు. ఇది శాశ్వ‌తం అనుకున్న‌ట్ట‌యితే ఆశ‌ల అగ్నిలో ప‌డే మిడ‌త వ‌లె మ‌సి కాక త‌ప్ప‌దు. మోహాన్ని, భ్ర‌మ‌ల‌ను వ‌దిలిపెట్టు. దైవం ఒక్క‌డే శాశ్వ‌తుడ‌ని, స‌ర్వ‌భూత‌ద‌యామ‌యుడ‌ని గుర్తించి నిరంత‌రం హ‌రిచ‌ర‌ణాల‌నే స్మ‌రించు. కామం, క్రోథం, భ‌యం, లోభం, మోహం, మ‌మ‌తాహంకారాలు అనే ఆరు శ‌త్రువుల‌ను వ‌దిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక వ్ర‌త స్నానం ఆచ‌రించు. విష్ణుప్రీతికై భ‌గ‌వ‌ద‌ర్ప‌ణంగా దీప‌దానం చేయి. త‌ద్వారా అనేక పాపాల నుంచి విముక్తి పొందుతావు అని హిత‌వు చెప్పి త‌న దారిన తాను వెళ్లిపోయాడు.


అత‌ని హితోక్తుల‌తో ఆమెకి జ్ఞానోద‌యం అయింది. తాను చేసిన పాపాల‌కు చింతిస్తూ కార్తీక వ్ర‌తం చేయాల‌ని సంక‌ల్పించుకుంది. ఆ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన కార్తీక మాసంలో వ్ర‌తాచ‌ర‌ణ ప్రారంభించింది. సూర్యోద‌యం వేళ‌క‌ల్లా చ‌న్నీటి స్నానం, హ‌రిపూజ‌, దీప‌దానం చేసి పురాణ‌శ్ర‌వ‌ణం చేసేది. ఇలా కార్తీక మాసం నెల‌రోజులూ ఆచ‌రించి చివ‌రి రోజున చ‌క్క‌గా బ్రాహ్మ‌ణ స‌మారాధ‌న కూడా చేసింది. త‌క్ష‌ణ‌మే ఆమె బంధాలు న‌శించిపోయి విగ‌త‌జీవురాల‌యింది. విమాన‌రూఢ‌యై పుణ్య‌లోకాల‌కు చేరి శాశ్వ‌త భోగ‌సౌఖ్యాలు పొందింది. కాబ‌ట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటి క‌న్నా ప్ర‌ధాన‌మైన‌ది దీప‌దానం. అది చేసిన వారు పాప‌విముక్తుల‌వుతున్నారు. దీన్ని విన్నా, చ‌దివినా కూడా బంధ విముక్తులై విష్ణుభ‌క్తి ప‌రాయ‌ణుల‌వుతారు.
కార్తీక మాహాత్మ్యం చ‌తుర్ధాధ్యాయం స‌మాప్తం
మూడ‌వ రోజు పారాయ‌ణం ముగిసింది.

No comments:

Post a Comment