Tuesday, October 29, 2019

కార్తీక పురాణం- 2వ రోజు పారాయ‌ణం (శుక్ల విదియ రోజున‌)

తృతీయాధ్యాయం
బ్ర‌హ్మ‌ర్షి వ‌శిష్ఠ మ‌హ‌ర్షి రాజ‌ర్షి జ‌న‌కునికి ఇంకా ఇలా చెప్ప‌సాగాడు
రాజా! స్నాన‌దాన‌జ‌ప‌త‌పాల‌లో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్ది పాటిగా ఆచ‌రించినా అది అక్ష‌య ఫ‌లాన్నిస్తుంది. ఎవ‌రైతే సుఖ‌లాల‌సులై శ‌రీర క‌ష్టానికి జ‌డిసి కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించ‌రో అలాంటి వారు నూరు జ‌న్మ‌లు కుక్క‌లుగా పుడ‌తారు.
శ్లో - పౌర్ణ‌మ్యాం కార్తీక మాసే స్నానాదీంస్తు నాచ‌ర‌న్
కోటి జ‌న్మ‌సు చండాల యోనౌ సంజాయ‌తే నృప‌
శ్లో - క్ర‌మాద్యోనౌ స‌ముత్ప‌న్నో భ‌వ‌తి బ్ర‌హ్మ‌రాక్ష‌సః
అత్రైవోదాహ‌రంతీ మ‌మితిహాసం పురాత‌నమ్‌
కార్తీక పౌర్ణ‌మి నాడు స్నాన‌దాన‌జ‌పోపాస‌నాల‌లో ఏ ఒక్క‌టీ కూడా ఆచ‌రించ‌ని వారు కోటి ప‌ర్యాయాలు చండాల‌పు యోనుల‌లో జ‌న్మించి తుద‌కు బ్ర‌హ్మ‌రాక్ష‌సులుగా మార‌తారు. ఉదాహ‌ర‌ణ‌గా ఒక గాథ చెబుతా విను.
త‌త్త్వ‌నిష్ఠోపాఖ్యాన‌ము
పూర్వ‌కాలంలో ఆంధ్ర‌దేశంలోఒ త‌త్త్వ నిష్ఠుడ‌నే బ్రాహ్మ‌ణుడుండేవాడు. స‌క‌ల శాస్త్ర పారంగ‌తుడు, అస‌త్యం ప‌లికే వాడు కాడు. అన్ని భూత‌ముల యందూ ద‌యాళువూ, తీర్థాట‌న ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థ‌యాత్రా సంద‌ర్భంగా ప్ర‌యాణిస్తూ మార్గ‌మ‌ధ్యంలో గోదావ‌రీ తీరాన గ‌ల ఒకానొక ఎత్తైన మ‌ర్రి చెట్టు మీద ముగ్గురు బ్ర‌హ్మ‌రాక్ష‌సుల‌ను చూశాడు. వారు న‌లుపు కాయ‌చ్చాయతో, ఎండిన డొక్క‌లు, ఎర్ర‌ని నేత్రాలు, గ‌డ్డాల‌తో, గుచ్చిన‌ ఇనుప తీగ‌ల‌ వ‌లె పైకి నిగిడి ఉన్న త‌ల వెంట్రుక‌ల‌తో, వికృత వ‌ద‌నార‌విందాల‌తో క‌త్తులు, క‌పాలాలు ధ‌రించి, స‌ర్వ‌జీవ భ‌యంక‌రులుగా ఉన్నారు. వారిని గురించిన భ‌యంతో ఆ మ‌ర్రిచెట్టు నాలుగు వైపులా ప‌న్నెండు మైళ్ల దూరంలో ఎక్క‌డా ప్రాణి సంచార‌మ‌నేదే లేదు. అటువంటి భ‌యంక‌ర స్వ‌రూపులైన ఆ రాక్ష‌సుల‌ను అల్లంత దూరం నుంచే చూసిన త‌త్త్వ‌నిష్ఠుడు అదిరి ప‌డ్డాడు. దానితో పాటే ఆ రాక్ష‌సులు కూడా త‌న‌ను చూడ‌డంతో మ‌రింత భ‌య‌ప‌డి శోకాకుల చిత్తంతో శ్రీ‌హ‌రిని స్మ‌రింప‌సాగాడు.
త‌త్త్వ‌నిష్ఠుడి శ‌ర‌ణాగ‌తి
శ్లో - త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయ‌ణావ్య‌య‌
స‌మ‌స్త భ‌య విధ్వంస‌న్ త్రాహిమాం శ‌ర‌ణాగ‌తం
వ్యాసం ప‌శ్యామి దేవేశ త్వ‌త్తోహం జ‌గ‌దీశ్వ‌ర‌
దేవ‌త‌ల‌కూ, లోకాల‌కూ య‌జ‌మాని అయిన వాడా, నారాయ‌ణా, అవ్య‌యా న‌న్ను కాపాడు. అన్ని ర‌కాల భ‌యాల‌ను అంతం చేసే వాడా, నిన్నే శ‌ర‌ణు కోరుతున్న న‌న్ను ర‌క్షించు అని ఎలుగెత్తి స్మ‌రిస్తూ రాక్ష‌సుల భ‌యంతో అక్క‌డ నుంచి పారిపోసాగాడు. అత‌న్ని ప‌ట్టి వ‌ధించాల‌నే త‌లంపుతో ఆ రాక్ష‌స త్ర‌యం అత‌ని వెనుక‌నే ప‌రుగెత్త సాగారు. ర‌క్క‌సులు చేరువ‌వుతున్న కొద్ది ఆ విప్రుని తేజ‌స్సు కంట ప‌డ‌డం, నిరంత‌ర హ‌రినామ స్మ‌ర‌ణ విన‌బ‌డ‌డం వ‌ల‌న వారికి జ్ఞానోద‌య‌మ‌యింది. అదే త‌డ‌వుగా ఆ బాప‌నికి ఎదురుగా చేరుకుని దండ‌ప్ర‌మాణాలాచ‌రించి అత‌నికి త‌మ వ‌ల‌న కీడు జ‌ర‌గ‌బోద‌ని న‌మ్మ‌బ‌లుకుతూ "ఓ విప్రోత్త‌మా, నీ ద‌ర్శ‌నంతో మా పాపాలు న‌శించిపోయాయి" అని ప‌దేప‌దే న‌మ‌స్క‌రించారు.
వారి న‌మ్ర‌త‌కు కుదుట‌ప‌డిన హృద‌యంతో త‌త్త్వ‌నిష్ఠుడు "మీరెవ‌రు, చేయ‌రాని ప‌నులు ఏవి చేయ‌డం వ‌ల‌న ఇలా అయిపోయారు, మీ మాట‌లు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మ‌రి ఈ వికృత రూపాలేమిటి?  నాకు వివ‌రంగా చెప్పండి. మీ బాధ‌లు తొల‌గే దారి చెబుతాను" అన్నాడు.
ద్రావిడుని క‌థ‌
ఆ ర‌క్క‌సుల‌లో ఒక‌డు త‌న క‌థ‌నిలా వినిపించ‌సాగాడు. "విప్రోత్త‌మా, నేను ద్రావిడుడ‌ను. ద్ర‌విడ దేశ‌మంద‌లి మంధ‌ర‌మ‌నే గ్రామాధికారిగా ప‌ని చేసే వాడ‌ను. కులానికి బ్రాహ్మ‌ణుడ‌నే అయినా గుణానికి కుటిలుడ‌ను, వంచ‌న‌న‌తో ఇత‌రుల‌ను బుట్ట‌లో వేయ‌గ‌ల చ‌మ‌త్కారిని. నా కుటుంబ శ్రేయ‌స్సు కోసం అనేక మంది విప్రుల విత్తాన్ని హ‌రించాను. బంధువుల‌కు గాని, బ్రాహ్మ‌ణుల‌కు గాని ఏ నాడూ ప‌ట్టెడ‌న్నం పెట్టిన పాపాన పోలేదు. న‌య‌వంచ‌న‌ల‌తో బ్రాహ్మ‌ణ ధ‌నాన్ని అప‌హ‌రించ‌డం వ‌ల‌న నాతో స‌హా నా కుటుంబం ఏడు త‌రాల వారు అథోగ‌తిపాలైపోయారు. మ‌ర‌ణానంత‌రం దుస్స‌హ‌మైన న‌ర‌క‌యాత‌న‌లు అనుభవించి బ్ర‌హ్మ‌రాక్ష‌సుడ‌న‌య్యాను. కృపాయ‌త్త చిత్తుడ‌వై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పండి" అని వేడుకున్నాడు.
ఆంధ్ర‌దేశీయుని క‌థ
రెండ‌వ రాక్ష‌సుడు త‌న క‌థ‌ను ఇలా వివ‌రించాడు. "ఓ ప‌విత్రుడా, నేను ఆంధ్రుడ‌ను. నా త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌హిస్తూ వారిని త‌ర‌చు దూషిస్తూ ఉండేవాడిని. నా భార్యాపిల్ల‌ల‌తో మృష్టాన్నం తింటూ త‌ల్లిదండ్రుల‌కు మాత్రం చ‌ద్దికూడు ప‌డేసే వాడిని. బాంధ‌వ బ్రాహ్మ‌ణ‌కోటికేనాడూ ఒక పూటైనా భోజ‌నం పెట్ట‌లేదు. విప‌రీతంగా ధ‌నార్జ‌న చేసి ఆ కావ‌రంతో బ‌తికే వాడిని. కాలం చేశాక న‌ర‌కాన ప‌డి ఘోరాతి ఘోర‌మైన బాధ‌ల‌నుభ‌వించి చివ‌రికి ఇక్క‌డ ఇలా బ్ర‌హ్మ‌రాక్ష‌సుడుగా మారాను. ద్రావిడుని వ‌లెనే నాకు కూడా ముక్తి మార్గానికి దారి చూపించండి మ‌హానుభావా" అని కోరాడు. 
పూజారి క‌థ‌
అనంత‌రం మూడ‌వ రాక్ష‌సుడు ముందుకు వ‌చ్చి త‌న మొర ఇలా వినిపించాడు. "ఓ స‌దాచార సంప‌న్నుడా, నేను ఆంధ్ర‌దేశ‌పు బ్రాహ్మ‌ణుడ‌ను. విష్ట్ణ్వాల‌యంలో పూజారిగా ఉండే వాడిని. కాముకుడినై అహంభావం ప్ర‌ద‌ర్శిస్తూ క‌ఠిన వ‌చ‌నాలు ప‌లుకుతూ ఉండే వాడ‌ను. భ‌క్తులు స్వామివారికి స‌మ‌ర్పించే కైంక‌ర్యాల‌న్నింటినీ వేశ్య‌ల‌కు అంద‌చేసి విష్ణు సేవ‌ల‌ను స‌క్ర‌మంగా చేయ‌క గ‌ర్వంతో తిరిగే వాడిని. తుద‌కు గుడి దీపాల‌లో నూనె కూడా హ‌రించి వేశ్య‌ల‌కు ధార పోసి వారితో సంభోగ సుఖాల‌నుభ‌విస్తూ పాప‌పుణ్య‌విచ‌క్ష‌ణా ర‌హితుడ‌నై ప్ర‌వ‌ర్తించే వాడిని. నా దోషాల‌కు ప్ర‌తిఫ‌లంగా మ‌ర‌ణానంత‌రం న‌ర‌కం చ‌వి చూసి అనంత‌రం ఈ భూమిపై నానా విధ హీన యోనుల‌లో నీచ జ‌న్మ‌లెత్తి చివ‌రికి ఘోర‌మైన ఈ బ్ర‌హ్మ‌రాక్ష‌స రూపం పొందాను. ఓ స‌దాచార సంప‌న్నుడా న‌న్ను మ‌న్నించి మ‌ర‌లా జ‌న్మ లేని విధంగా మోక్ష మార్గాన్ని ప్ర‌సాదించు" అని విల‌పించాడు.
బ్ర‌హ్మ‌రాక్ష‌సులు ఉత్త‌మ గ‌తి పొంద‌డం
త‌మ త‌మ పూర్వ‌జ‌న్మ‌ల సంచిత పాపాల‌కు ఎంత‌గానో ప‌శ్చాత్తాప‌ప‌డుతున్న ఆ ర‌క్క‌సుల‌ను గ‌ని వారికి అభ‌యం ఇచ్చి భ‌య‌ప‌డ‌కండి, నాతో క‌లిసి కార్తీక స్నానానికి రండి. మీ స‌మ‌స్త దోషాలు న‌శించిపోతాయి అని వారిని త‌న వెంట తీసుకువెళ్లి కావేరి న‌ది చేరుకున్నారు. అక్క‌డ త‌త్త్వ నిష్ఠుడు బ్ర‌హ్మ‌రాక్ష‌సుల నిమిత్తం సంక‌ల్పం చేసి తాను స్వ‌యంగా ముందు స్నానం చేసి ఆ త‌ర్వాత బ్ర‌హ్మ‌రాక్ష‌సుల చేత కూడా స్నానం ఆచ‌రింప‌చేశాడు. అనంత‌రం
శ్లో- ఆముకానాం బ్ర‌హ్మ‌రాక్ష‌స‌త్వ నివార‌ణార్ధం
అస్యాం కావేర్యాం ప్రాతః స్నాన‌మ‌హం క‌రిష్యే
అనే సంక‌ల్పంతో విధివిధానంగా స్నానం చేసి ఆ ఫ‌లాన్ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుల‌కు ధార‌పోయ‌గా వారి పాపాలు హ‌రించుకుపోయి దివ్య‌వేషాల‌తో వైకుంఠానికి ప్ర‌యాణ‌మ‌య్యారు.
విదేహ రాజా! కార్తీకమాసంలో సూర్యోద‌య కాలాన కావేరి న‌దిలో స్నాన‌మాచ‌రించి విష్ణువును పూజించిన వారికి అజ్ఞానం వ‌ల‌న గాని, మోహ ప్ర‌లోభాల వ‌లన గాని..ఏ కార‌ణం చేత‌నైనా గాని చేసిన పాపాలు తొల‌గిపోయి ప‌ది వేల య‌జ్ఞాలు చేసిన ఫ‌లం క‌లుగుతుంది. అందుకే ఏదో ఒక ఉపాయం చేసైనా స‌రే కార్తీక మాసంలో కావేరి స్నానం త‌ప్ప‌కుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాక‌పోతే గోదావ‌రి లేదా మ‌రెక్క‌డైనా స‌రే ప్రాతః కాల స్నానం చేసి తీరాలి. అలా ఎవ‌రైతే కార్తీక దామోద‌ర ప్రీతిగా పాతః స్నానం చేయ‌రో వాళ్లు ప‌ది జ‌న్మ‌లు చండాల‌పు యోనుల‌లో పుట్టి అనంత‌రం ఊర‌పందులుగా జ‌న్మిస్తారు. కాబ‌ట్టి ఎలాంటి మీమాంస‌తో నిమిత్తం లేకుండా స్ర్తీలు గాని, పురుషులుగాని కార్తీక మాసంలో ప్రాతః కాల స్నానం త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. 
తృతీయోధ్యాయ స‌మాప్తః
-----------------------
చ‌తుర్ధాధ్యాయం
జ‌న‌కుడు మ‌ర‌ల ఇలా అడిగాడు. ఓ మ‌హ‌ర్షీ మీరింత‌వ‌ర‌కు కార్తీక మాహాత్మ్యాన్ని అసాధార‌ణ ధోర‌ణిలో చెప్పారు. ఏ వ్ర‌తం ఆచ‌రించాలో, ఏయే దానాలు చేయాలో కూడా తెలియ‌చేయండి.
అది విని అన్ని పాపాల‌నూ హ‌రించేది, పుణ్యాల‌ను అగ‌ణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్ర‌తానికి ఫ‌లానా సంక‌ల్పం అనేది హాస్యాస్ప‌దంగా ఉంటుంది.
ఈ కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌డం వ‌ల‌న న‌శించ‌నంత‌టి పాపం అనేది ఈ ప్ర‌పంచ‌లోనే లేదు.
వ్ర‌త‌ధ‌ర్మాల‌నూ, వాటి ఫ‌లాల‌ను చెబుతాను, విను అంటూ వ‌శిష్ఠ మ‌హ‌ర్షి ఇలా చెప్ప‌సాగాడు.
కార్తీక మాసంలో సాయంకాల స‌మ‌యాన శివాల‌యంలో దీపారాధ‌న చేయ‌డం వ‌ల‌న అనంత‌మైన ఫ‌లం ల‌భిస్తుంది. శివాల‌యం గోపుర ద్వారాలు, శిఖ‌రాల వ‌ద్ద గాని, శివ‌లింగ స‌న్నిధిలో గాని దీపారాధ‌న చేయ‌డం వ‌ల‌న అన్ని పాపాలు హ‌రించిపోతాయి. ఎవ‌రైతే కార్తీకంలో శివాల‌యంలో ఆవునేతితో గాని, నువ్వుల‌నూనెతో గాని, ఇప్ప‌, నారింజ నూనెల‌తో గాని దీప స‌మ‌ర్ప‌ణ చేస్తారో వారు ధ‌ర్మ‌వేత్త‌ల‌వుతారు. ఆఖ‌రికి ఆముద‌పు దీపాన్న‌యినా స‌మ‌ర్పించిన వారు అత్యంత పుణ్య‌వంతుల‌వుతారు. బ‌డాయి కోసం న‌లుగురి న‌డుమ దీపాన్నిచ్చే వారు కూడా శివ‌ప్రియుల‌వుతారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక క‌థ చెబుతాను విను. 
కార్తీక దీపారాధ‌నా మ‌హిమ‌
పూర్వం పాంచాల రాజ్యాన్ని పాలించే మ‌హారాజు కుబేరుని మించిన సంప‌ద‌తో తుల‌తూగుతూ ఉన్నా పుత్ర సంతానం లేక కుంగిపోయి కురంగ‌పాణికై త‌ప‌స్సు ప్రారంభించాడు. ఆ వైపుగా వ‌చ్చిన పిప్ప‌లుడ‌నే మునివ‌ర్యుడు అత‌ని త‌ప‌స్సుకు కార‌ణం అడిగి తెలుసుకుని "ఓ రాజా, ఈ మాత్రం కోరిక‌కు త‌ప‌స్సుతో ప‌ని లేదు. కార్తీక మాసంలో శివ‌ప్రీతిగా వ్ర‌త‌మాచ‌రించి బ్రాహ్మ‌ణుల‌కు దీప‌దాన ద‌క్షిణ‌ల‌తో సంతోష‌పెట్టు. అలా చేస్తే నీకు త‌ప్ప‌క పుత్ర సంతానం క‌లుగుతుంది" అని సెల‌విచ్చాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా స్వీక‌రించిన రాజు త‌న ప‌ట్ట‌ణానికి చేరుకుని కార్తీక వ్ర‌త‌మాచ‌రించి శివ‌ప్రీతికై బ్రాహ్మ‌ణుల‌కు దీప‌దానాలు చేశాడు. మ‌హారాణి నెల‌త‌ప్పి యుక్త కాలంలో మ‌గ శిశువును ప్ర‌స‌వించింది. రాజ దంప‌తులు శిశువుకు శ‌త్రుజిత్తు అని పేరు పెట్టారు.
శ‌తృజిత్తు చ‌రిత్ర‌ము
శ‌త్రుజిత్తు దిన‌దిన ప్ర‌వ‌ర్ధ‌మానుడై పెరిగి యువ‌కుడు, వీరుడు అయ్యాడు. కాని వేశ్యాంగ‌నాలోలుడై అప్ప‌టికీ తృప్తి చెంద‌క యుక్తాయుక్త విచ‌క్ష‌ణా ర‌హితుడై, శాస్త్రధిక్కారం చేస్తూ వ‌ర్ణ‌సంక‌రం చేశాడు. హిత‌వు చెప్పే వారిని చంపుతాయ‌ని బెదిరిస్తూ స్వేచ్ఛా విహారిగా ప్ర‌వ‌ర్తించ‌సాగాడు. అలాంటి సంద‌ర్భంలో సౌంద‌ర్య‌రాశి, సింహ‌మ‌ధ్య‌మ‌, చిలుక‌ప‌లుకులు ప‌లికేది అయిన ఒక బ్రాహ్మ‌ణ ప‌త్ని కంట‌బ‌డింది. శ‌త్రుజిత్తు ఆమె ప‌ట్ల మోహితుడ‌య్యాడు. అనుప‌మాన సౌంద‌ర్య‌, శౌర్య‌,తేజో విరాజితోడైన ఈ యువ‌రాజు ప‌ట్ల ఆ బ్రాహ్మ‌ణ వ‌నిత కూడా మోజు ప‌డింది. రోజూ భ‌ర్త నిద్ర పోగానే సంకేత స్థ‌లంలో రాజ‌కుమారుని క‌లిల‌సి సుర‌త క్రీడ‌ల్లో సుఖించేది. రంకూ, బొంకూ ఎన్నాళ్లో దాగ‌వు. ఆమె సంగ‌తి భ‌ర్త‌కు తెలిసింది. అత‌నొక క‌త్తి ధ‌రించి ఆ రంకుజంట కుత్తులుత్త‌రించాల‌ని తిరుగుతున్నాడు. మ‌హాకాముకురాల‌యిన చారిణి గాని, శ‌త్రుజిత్తు గాని ఆ విష‌యం గ్ర‌హించ‌లేక‌పోయారు. ఒకానొక కార్తీక పూర్ణిమ, సోమ‌వారం రాత్రి ఆ కాముకులు సుర‌త క్రీడ‌ల‌కై ఒక శివాల‌యం సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అప‌ర రాత్రి వేళ అక్క‌డ క‌లుసుకున్నారు. గ‌ర్భ‌గుడిలో అంతా చీక‌టిగా ఉంది. ఆ బ్రాహ్మ‌ణ వ‌నిత చీర చింపి వ‌త్తిని చేసింది. రాజ‌కుమారుడు వెతికి ఆముదం తెచ్చాడు. ఇద్ద‌రూ క‌లిసి అక్క‌డ ఖాళీ ప్ర‌మిద‌లో దీపం పెట్టారు. ఆ దీప‌కాంతుల్లో ఒక‌రినొక‌రు చూసుకుంటూ సంభోగంలో మునిగిపోయారు. 
 ఆ విష‌యం ఎలాగో ఆమె భ‌ర్త గ్ర‌హించాడు. ఇద్ద‌రూ సంభోగంలో మునిగిపోయి లోకం మ‌రిచిపోయి ఉన్న స‌మ‌యంలో మొద‌ట శ‌త్రుజిత్తుని, ఆ త‌ర్వాత త‌న భార్య‌ని న‌రికి తాను కూడా పొడుచుకుని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ముగ్గురూ విగ‌త‌జీవులై ప‌డి ఉండ‌గా పాశ‌హ‌స్తులైన య‌మ‌దూత‌లు, ప‌విత్రాత్ములైన శివ‌దూత‌లు ఒకేసారి అక్క‌డ‌కు వ‌చ్చారు. శివ‌దూత‌లు రాకుమారుని, రంకులాడిని త‌మ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. య‌మ దూత‌లు అమాయ‌క‌పు బ్రాహ్మ‌ణుని త‌మ‌తో న‌ర‌కం వైపు లాక్కుపోయారు. అది చూసి ఆశ్చ‌ర్య‌పోయిన ఆ బ్రాహ్మ‌ణుడు "ఓ శివ‌దూత‌రాలా, కాని ప‌ని చేసిన వారికి కైలాస భోగం, నా వంటి స‌దాచారునికి న‌ర‌క‌యోగ‌మా" అని ప్ర‌శ్నించాడు. అందుకు ఆ శివ‌దూత‌లు స‌మాధానం చెబుతూ "వారెంత పాపాత్ములైనా కార్తీక పౌర్ణ‌మి రోజు, సోమ‌వారం నాడు శివాల‌యంలోను...అందునా శిథిలాల‌యంలోను శివ‌లింగం ఎదురుగా దీపారాధ‌న చేశారు. గ‌నుక వారి పాపాలు న‌శించి పుణ్యాత్ముల‌య్యారు. ఏ కార‌ణం చేత‌నైనా శివ‌లింగానికి ఎదురుగా దీపారాధ‌న చేసిన వారిని అత్యంత పుణ్యాత్ముడ‌వైన నీవు వ‌ధించిన కార‌ణంగా పుణ్య‌హీనుడు, పాపాత్ముడు అయ్యావు, అందుకే నీకు న‌ర‌కం, వీరికి కైలాసం" అన్నారు. 
బ్రాహ్మ‌ణునికి, శివ‌దూత‌ల‌కు మ‌ధ్య జ‌రిగిన ఈ సంభాష‌ణ విన్న శ‌త్రుజిత్తు క‌లుగ‌చేసుకుని అయ్య‌లారా, దోషులం మేము కాగా మాకు కైవ‌ల్యం ఇచ్చి పుణ్యాత్ముల‌ను చేసిన ఆ అమాయ‌కుడిని న‌ర‌కానికి పంప‌డం భావ్యం కాదు. కార్తీక‌మాసం దొడ్డ‌దైతే, అందునా పౌర్ణ‌మి గొప్ప‌దైతే, సోమ‌వారం ఘ‌న‌మైన‌దేతై, దీపారాధ‌న పుణ్య‌క‌ర‌మ‌యితే మాతా పాటే మ‌ర‌ణించిన ఆ బ్రాహ్మ‌ణునికి కూడా కైలాస‌మీయ‌క త‌ప్ప‌ద‌ని వాదించాడు. శ‌త్రుజిత్తు తాను, త‌న ప్రియురాలు సంపాదించి తెచ్చిన‌ వ‌త్తీ, తైలం పుణ్యం తాముంచుకుని ఆ దీపం వెలిగించిన పుణ్యం బ్రాహ్మ‌ణునికి ధార‌పోశాడు. శివ‌దూత‌లు ఆ విప్రుని య‌మ‌దూత‌ల నుంచి కాపాడి కైలాసానికి తీసుకువెళ్లారు.
కాబ‌ట్టి ఓ మిథిలేశ్వ‌రా, కార్తీక మాసంలో త‌ప్ప‌నిస‌రిగా శివాల‌యంలో గాని, విష్ణు ఆల‌యంలో గాని దీపారాధ‌న చేసి తీరాలి. నెల‌పొడుగునా చేసిన వారు జ్ఞానులై మోక్షాన్ని పొంద‌గ‌లుగుతారు. శివాల‌యంలో దీపారాధ‌న నిరంత‌ర మోక్ష ప్ర‌దాయినిగా ఉంటుంది. నా మాట విని కార్తీక‌మాసం నెల పొడ‌వునా శివాల‌యంలో దీపారాధ‌న చేయి అని వ‌శిష్ఠుడు చెప్పాడు.
చ‌తుర్ధాధ్యాయ స‌మాప్తః
రెండో రోజు పారాయ‌ణం ముగిసింది. 

No comments:

Post a Comment