Monday, October 28, 2019

కార్తీక పురాణం 1 వ రోజు పారాయణం (శుక్ల పాడ్య‌మి రోజున‌)


శ్రీ విఘ్నేశ్వ‌ర ప్రార్థ‌న
శ్లో - వాగీశాద్యా స్సుమ‌సస్స‌ర్వార్ధానాముప‌క్ర‌మే
యం న‌త్వా కృత‌కృత్య‌స్స్యుస్తం న‌మామి గ‌జాన‌న‌మ్ 
-----------------------
శౌన‌కాదుల‌కు సూతుడు కార్తీక‌ పురాణం ప్ర‌వ‌చ‌నం

శ్రీ‌మ‌ద‌నంత‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడైన భ‌గ‌వంతుని సృష్టిలోని అత్యంత విశిష్ట‌మైన నైమిశార‌ణ్యానికి విచ్చేసిన సూత మ‌హ‌ర్షిని స్థానికంగా నివాసులైన శౌన‌కాది ఋషులు స‌త్క‌రించి, సంతుష్టుని చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న చుట్టూ కూచుని ఓ సూత‌మునీ, క‌లిక‌ల్మ‌షాన్ని పోగొట్టేది, కైవ‌ల్య‌దాయ‌కం అయిన‌దైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపించి మ‌మ్మ‌ల్ని ధ‌న్యుల‌ను చేయండి అని కోరారు. వారి కోరిక‌ను మ‌న్నించిన వ్యాస శిష్యుడైన సూత‌మ‌హ‌ర్సి ఓ శౌన‌కాదులారా, మా గురువుగారైన భ‌గ‌వాన్ వేద‌వ్యాస మ‌హ‌ర్షుల వారు ఈ కార్తీక మాహాత్మ్యాన్ని అష్టాద‌శ పురాణాల్లోని స్కాంధ‌, ప‌ద్మ‌పురాణాలు రెండింటిలోనూ కూడా వివ‌రించారు. ఋషిరాజు శ్రీ వ‌శిష్ఠుల వారిచే రాజ‌ర్షి జ‌న‌కున‌కు స్కాంధ పురాణంలోను, హేలా విలాస బాలామ‌ణి అయిన స‌త్య‌భామ‌కు లీలామానుష విగ్ర‌హుడైన శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్మ ప‌ద్మ‌పురాణంలోను ఈ కార్తీక మాహాత్మ్యం స‌వివ‌రంగా బోధించారు. మ‌న అదృష్టం వ‌ల‌న నేటి నుంచి శుభ కార్తీక మాసం ప్రారంభం కావ‌డం వ‌ల‌న ప్ర‌తీ రోజూ నిత్య‌పారాయ‌ణ‌గా ఈ మాసం అంతా కార్తీక పురాణ శ్ర‌వ‌ణం చేసుకుందాం. ముందుగా స్కాంధ పురాణంలోని వ‌శిష్ఠ‌ప్రోక్త‌మైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపిస్తాను అంటూ చెప్ప‌సాగాడు
జ‌న‌కుడు వ‌శిష్ఠుని కార్తీక వ్ర‌త ధ‌ర్మాలు అడిగిన వృత్తాంతం
పూర్వం ఒక సారి సిద్ధాశ్ర‌మంలో జ‌రుగుతున్న యాగానికి అవ‌స‌ర‌మైన ద్ర‌వ్యం కోసం వ‌శిష్ఠ మ‌హ‌ర్షి జ‌న‌క మ‌హారాజు ఇంటికి వెళ్లాడు. జ‌న‌కుడు ఆయ‌న‌కు యుక్త మ‌ర్యాద‌లు చేసి లోనికి ఆహ్వానించాడు. ఆ సంద‌ర్భంగా తాను వ‌చ్చిన కార‌ణాన్ని వ‌శిష్ఠ మ‌హ‌ర్షి తెలియ‌చేయ‌గా హే బ్ర‌హ్మ‌ర్షీ మీ యాగానికి ఎంత ద్ర‌వ్యం కావాల‌న్నా నిర‌భ్యంత‌రంగా ఇస్తాను. కాని స‌ర్వ‌పాప‌హ‌ర‌మైన ధ‌ర్మ‌సూక్ష్మాన్ని మీరు నాకు తెలియ‌చేయండి. సంవ‌త్స‌రంలో అన్ని మాసాల క‌న్నా కార్తీక మాసం అత్యంత మ‌హిమాన్విత‌మైన‌ద‌ని, ఆ వ్ర‌తాచ‌ర‌ణం స‌మ‌స్త ధ‌ర్మాల క‌న్నా శ్రేష్ఠ‌మైన‌ద‌ని చెబుతూ ఉంటారు క‌దా! ఆ నెల‌కు అంత‌టి ప్రాముఖ్య‌త ఎలా క‌లిగింది? ఆ వ్ర‌తం ఉత్కృష్ట‌మైన‌ది ఎలా అయింది అని అడిగాడు. మునిజ‌న వ‌రిష్ఠుడైన వ‌శిష్ఠ మ‌హ‌ర్షి జ్ఞాన హాసం చేస్తూ ఇలా ప్ర‌వ‌చించాడు. 

వ‌శిష్ఠ ప్ర‌వ‌చ‌నం
జ‌న‌క మ‌హారాజా, పూర్వ జ‌న్మ‌ల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని స‌త్వ‌శుద్ధి క‌ల‌గ‌దు. ఆ స‌త్వ‌శుద్ధి క‌లిగిన నీ వంటి వారికి మాత్ర‌మే ఇటువంటి పుణ్య‌ప్ర‌ద‌మైన‌ది, విన్నంత మాత్రం చేత‌నే అన్ని పాపాలు హ‌రించేది అయిన కార్తీక మాహాత్మ్యం వినాల‌నే కోరిక క‌లుగుతుంది. విశ్వ‌శ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవ‌డిగిన సంగ‌తుల‌న్నీ వివ‌రిస్తాను. జాగ‌రూకులై వినండి.
ఓ విదేహా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్ర‌మ‌ణంలో ఉండ‌గా స‌హృద‌యంతో ఆచ‌రించే స్నాన‌, దాన‌, జ‌ప, పూజాదులు విశేష ఫ‌లితాల‌నిస్తాయి. ఈ కార్తీక వ్ర‌తాన్ని తులాసంక్ర‌మ‌ణం నుంచి గాని, శుద్ధ పాడ్య‌మి నుంచి గాని ప్రారంభించాలి.
ముందుగా
శ్లో - స‌ర్వ‌పాప‌హ‌రం పుణ్యం వ్ర‌తం కార్తీక సంభ‌వం
నిర్విఘ్నం కురుమే దేవ దామోద‌ర న‌మోస్తుతే
ఓ దామోద‌రా, నా ఈ కార్తీక వ్ర‌తాన్ని నిర్విఘ్నంఘా పూర్తి చేయించు అని న‌మ‌స్కార‌పూర్వ‌కంగా సంక‌ల్పించుకుని కార్తీక స్నానం ఆరంభించాలి. కార్తీకంలో సూర్యోద‌య వేళ కావేరీ న‌దిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్ప‌న‌ల‌వి కాదు. సూర్యుడు తులారాశిలో ప్ర‌వేశించ‌గానే గంగాన‌ది ద్ర‌వ‌రూపం ధ‌రించి స‌మ‌స్త న‌దీ జ‌లాల్లోనూ చేరుతుంది. వాపీ కూప త‌టాకాది స‌మ‌స్త జ‌లాశ‌యాల్లోనూ కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మ‌ణుడైన వాడు కార్తీక మాసంలో న‌దికి వెళ్లి, హ‌రిధ్యానం చేసి, కాళ్లూ, చేతులూ క‌డుక్కుని, ఆచ‌మ‌నం చేసి శుద్ధాత్ముడై మంత్ర‌యుక్తంగా భైర‌వాజ్ఞ‌ను తీసుకుని మొల‌లోతు నీటిలో నిల‌బ‌డి స్నానం చేయాలి. ఆ త‌ర్వాత‌ దేవ‌త‌లు, ఋషులు, పిత‌రుల‌కు త‌ర్ప‌ణాలు వ‌ద‌లాలి. అనంత‌రం ఆఘ‌మ‌ర్ష‌ణ మంత్ర‌జ‌పంతో బొట‌న వేలి కొన‌తో నీటిని చుట్టు తిప్పుతూ మూడు దోసిళ్ల నీళ్లు తీసుకుని గ‌ట్టు మీద‌కు చిమ్మి తీరం చేరాలి. చేర‌గానే క‌ట్టుబ‌ట్ట కొన‌ల‌ను పిండాలి. దీన్నే య‌క్ష‌త‌ర్ప‌ణం అంటారు. అనంత‌రం ఒళ్లు తుడుచుకుని పొడి ఆరిన తెల్ల‌ని మ‌డి వ‌స్ర్తాల‌ను ధ‌రించి హ‌రినామ‌స్మ‌ర‌ణ చేయాలి. గోపీ చంద‌నంలో 12 ఊర్థ్వ‌పుండ్రాలు ధ‌రించి సంధ్యావంద‌న గాయ‌త్రీ జ‌పాల‌ను ఆచ‌రించాలి. ఆ త‌ర్వాత ఔపాస‌నం చేసి బ్ర‌హ్మ‌య‌జ్ఞ‌మాచ‌రించి తోట‌లో నుంచి చ‌క్క‌ని పుష్పాల‌ను తెచ్చి శంఖ‌చ‌క్ర‌ధారి అయిన విష్ణువును సాల‌గ్రామంలో స‌భ‌క్తిగా షోడ‌శోప‌చారాల‌తో పూజించాలి. అ త‌ర్వాత కార్తీక పురాణ ప‌ఠ‌నం లేదా శ్ర‌వ‌ణం చేసి ఇంటికి చేరాలి. ఇంటి వ‌ద్ద దేవ‌తార్చ‌న పూర్తి చేసుకుని భోజ‌నం కావించి ఆచ‌మించి తిరిగి పురాణ కాల‌క్షేపానికి స‌న్న‌ద్ధం కావాలి.
సాయంకాలం కాగానే ఇత‌ర వ్యాపారాల‌న్నింటినీ విర‌మించుకుని శివాల‌యంలో గాని, విష్ణ్వాల‌యంలో గాని య‌థాశ‌క్తి దీపాలు పెట్టి అక్క‌డి స్వామిని ఆరాధించి భ‌క్ష్య‌భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కుతో హ‌రిని స్తుతించి న‌మ‌స్క‌రించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్ర‌తాన్ని ఆచ‌రించిన వారు పున‌రావృత్తి ర‌హిత‌మైన వైకుంఠాన్ని పొందుతారు. ప్ర‌స్తుత‌, పూర్వ జ‌న్మార్జితాలైన పాపాల‌న్నీ ఈ కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌డం వ‌ల‌న హ‌రించుకుపోతాయి.
వ‌ర్ణాశ్ర‌మ‌, వ‌యోలింగ భేద‌ర‌హితంగా ఈ వ్ర‌తాన్ని ఎవ‌రు ఆచ‌రించినా వారు మోక్షార్హులు అవుతార‌నేది నిస్సంశ‌యం. జ‌న‌క‌రాజా, త‌న‌కు తానుగా ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించ‌లేక‌పోయినా ఇత‌రులు చేస్తుండ‌గా చూసి అసూయార‌హితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాల‌న్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి.
ప్ర‌థ‌మోధ్యాయ స‌మాప్తః
---------------- 
ద్వితీయోధ్యాయం

కార్తీక సోమ‌వార వ్ర‌తం
హే జ‌న‌క మ‌హారాజా, విన్నంత మాత్రం చేత‌నే మ‌నోవాక్కాయ క‌ర్మ‌ల ద్వారా చేసిన స‌ర్వ‌పాపాల‌నూ హ‌రింప‌చేసే కార్తీక మాహాత్మ్యాన్ని శ్ర‌ద్ధ‌గా విను. అందునా ఈ నెల‌లో శివ‌ప్రీతిగా సోమ‌వార వ్ర‌తం ఆచ‌రించే వాడు త‌ప్ప‌నిస‌రిగా కైలాసం చేరుకుంటాడు. కార్తీక మాసంలో వ‌చ్చే ఏ సోమ‌వారం నాడైనా స్నాన జ‌పాదులు ఆచ‌రించే వాడు వెయ్యి అశ్వ‌మేథాల ఫ‌లాన్ని పొందుతాడు. ఈ సోమ‌వార వ్ర‌త విధి ఆరు ర‌కాలుగా ఉంది.
ఉప‌వాసం, ఏక‌భుక్తం, న‌క్తం, అయాచితం, స్నానం, తిల‌దానం
ఉప‌వాసం : శ‌క్తి గ‌ల వారు కార్తీక సోమ‌వారం నాడు ప‌గ‌లంతా ఉప‌వాసం  ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం తుల‌సీ తీర్థం మాత్ర‌మే సేవించాలి.
ఏక‌భుక్తం :  సాధ్యం కాని వారు ఉద‌యం స్నాన‌దాన‌జ‌పాదులు య‌థావిధిగా నిర్వ‌ర్తించి మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి, రాత్రి భోజ‌నానికి బ‌దులు శైవ తీర్థ‌మో, తుల‌సి తీర్థ‌మో మాత్ర‌మే తీసుకోవాలి.
న‌క్తం : ప‌గ‌లంతా ఉప‌వాసం చేసి రాత్రి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నం త‌ర్వాత భోజ‌నం గాని, ఉపాహారం గానీ స్వీక‌రించాలి.
అయాచితం :  భోజ‌నానికి త‌మంత తాముగా ప్ర‌య‌త్నించ‌కుండా ఎవ‌రైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్ర‌మే భోజ‌నం చేయ‌డం అయాచితం.
స్నానం :  పైవి ఏవీ చేయ‌డానికి శ‌క్తి లేని వారు స‌మంత్ర‌కంగా స్నాన‌జ‌పాదులు చేసినా చాలును.
తిల‌దానం :  మంత్ర‌జ‌ప విధులు కూడా తెలియ‌ని వారు కార్తీక సోమ‌వారం నాడు నువ్వులు దానం చేసినా స‌రిపోతుంది.
పై ఆరు ప‌ద్ధ‌తుల్లో దేన్ని ఆచ‌రించినా కార్తీక సోమ‌వార వ్ర‌తం చేసిన‌ట్టే అవుతుంది. కాని తెలిసుండి కూడా ఏ ఒక్క‌దానిని ఆచ‌రించ‌ని వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక‌, రౌర‌వాది న‌ర‌కాల పాల‌వుతార‌ని ఆర్షులు చెప్పారు. ఈ వ్ర‌తాచ‌ర‌ణం వ‌ల‌న అనాథ‌లు, స్ర్తీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. కార్తీక మాసంలో వ‌చ్చే ప్ర‌తీ సోమ‌వారం నాడు ప‌గ‌లు ఉప‌వ‌సించి రాత్రి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం మాత్ర‌మే భోజ‌నం చేస్తూ ఆ రోజంతా భ‌గ‌వ‌ధ్యానంలో గ‌డిపేవ ఆరు త‌ప్ప‌కుండా శివ‌సాయుజ్యాన్ని పొందుతారు. సోమ‌వార వ్ర‌తాన్ని చేసే వారు న‌మ‌క‌, చ‌మ‌క స‌హితంగా శివాభిషేకం చేయ‌డం ప్ర‌ధానం. ఈ సోమ‌వార వ్ర‌త మాహాత్మ్యాన్ని వివ‌రించే ఒక ఇతిహాసం చెబుతా వినండి. 

నిష్ఠురి క‌థ‌
పూర్వ‌కాలంలో ఒక బ్రాహ్మ‌ణునికి నిష్ఠురి అనే ఒక కూతురుండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాస‌వంతంగాను ఉండే ఆమెకు గుణాలు మాత్రం శిష్ట‌మైన‌వి అబ్బ‌లేదు. దుష్ట‌గుణ భూయిష్ట అయి, గ‌య్యాళిగాను, కాముకురాలుగాను చ‌రించేది. ఈమెను ఆ గుణాల రీత్యా క‌ర్క‌శ అని కూడా పిలుస్తూ ఉండే వారు. బాధ్య‌త ప్ర‌కారం తండి ఆ క‌ర్క‌శ‌ను సౌరాష్ట్ర బ్రాహ్మ‌ణుడైన మిత్ర‌శ‌ర్మ అనే వానికిచ్చి వివాహం చేసి త‌న చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్ర శ‌ర్మ చ‌దువుకున్న వాడు. స‌ద్గుణ‌వంతుడు. స‌చాచార ప‌రాయ‌ణుడూ, స‌ర‌సుడూ మాత్ర‌మే కాక స‌హృద‌యుడు కూడా కావ‌డం వ‌ల‌న క‌ర్క‌శ ఆడిన‌ది ఆట‌గా, పాడిన‌ది పాట‌గా కొన‌సాగుతూ ఉండేది.
ఆమె ప్ర‌తీరోజూ భ‌ర్త‌ను, అత్త‌మామ‌ల‌ను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినా త‌న మ‌న‌సుకు న‌చ్చిన‌ది కావ‌డం వ‌ల‌న మోజు చంపుకోలేక‌, భార్య‌ను ప‌రిత్య‌జించ‌డం వంశానికే ప‌రువు త‌క్కువ‌నే ఆలోచ‌న కార‌ణంగాను క‌ర్క‌శ పెట్టే క‌ఠిన హింస‌ల‌న్నింటినీ మిత్ర‌శ‌ర్మ భ‌రిస్తూ ఉండే వాడు త‌ప్ప ఏ నాడూ భార్య‌ను శిక్షించ‌లేదు. ఆమె ఎంద‌రో ప‌ర‌పురుషుల‌తో సంబంధం పెట్టుకుని భ‌ర్త‌ను, అత్త‌మామ‌ల‌ను మ‌రింత నిర్ల‌క్ష్యంగా చూసేది. ఒకానొక నాడు ఆమె విటుల‌లో ఒక‌డు నీ మొగుడు బ‌తికి ఉండ‌డం వ‌ల్ల‌నే మ‌నం త‌ర‌చు క‌లుసుకోలేక‌పోతున్నాం అని రెచ్చ‌గొట్ట‌డంతో క‌ర్క‌
శ ఆ రాత్రికి రాత్రే నిద్ర‌లో ఉన్న భ‌ర్త‌ను పెద్ద బండ‌రాతితో మోది చంపేసింది. తానే మోసుకుపోయి ఒక నూతిలోకి విసిరేసింది. ఇదంగా గ‌మ‌నించినా కూడా ఆమెకు విటుల‌బ‌లం ఎక్కువ కావ‌డం చేత అత్త‌మామ‌లు ఆమెనేమీ అన‌లేక తాము ఇల్లు వ‌దిలి పారిపోయారు. అంత‌టితో మ‌రింత స్వ‌తంత్రించిన క‌ర్క‌శ క‌న్నుమిన్ను గాన‌క కామావేశంతో అనేక మంది పురుషుల‌తో సంప‌ర్కం పెట్టుకుంది. ఎంద‌రో సంసార స్ర్తీల‌ను కూడా త‌న మాట‌ల‌తో భ్ర‌మింప‌చేసి త‌న విటుల‌కు తార్చి త‌ద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గ‌డిచింది. బ‌లం త‌గ్గి య‌వ్వ‌నం అంత‌రించిపోయింది. శ‌రీరంలోని ర‌క్తం ప‌ల‌చ‌బ‌డ‌డంతో క‌ర్క‌శ జ‌బ్బు ప‌డింది. అసంఖ్యాక పురుషుల‌తో ర‌మించిన ఆమెకు ప‌లు భ‌యంక‌ర‌మైన వ్యాధులు సోకాయి. పూల‌గుత్తి వంటి మేను పుళ్లు ప‌డిపోయింది. జిగిబిగి త‌గ్గిన క‌ర్క‌శ వ‌ద్ద‌కు విటుల రాక‌పోక‌లు త‌గ్గిపోయాయి. సంపాద‌న ప‌డిపోయింది. అంద‌రూ ఆమెను అస‌హ్యించుకోసాగారు. తుద‌కు అక్ర‌మ ప‌తుల‌కే గాని సుతుల‌ను నోచుకోని ఆ నిష్ఠుర తిన‌డానికి తిండి, ఉండేందుకు ఇల్లు, వంటి నిండా క‌ప్పుకునేందుకు వ‌స్త్రం కూడా క‌రువై సుఖ‌వ్ర‌ణాల‌తో న‌డివీధిన మ‌ర‌ణించింది. క‌ర్క‌శ శ‌వాన్ని కాటికి మోసుకుపోయే వారు కూడా లేక‌పోయారు. య‌మ‌దూత‌లు ఆ జీవిని పాశ‌బ‌ద్ధను చేసి తీసుకుని వెళ్లారు.
భ‌ర్తృద్రోహికి భ‌యంక‌ర న‌ర‌కం
భ‌ర్త‌ను విస్మ‌రించి ప‌ర‌పురుషుల‌ను ఆలింగ‌నం చేసుకున్న పాపానికి య‌ముడు ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగ‌లింప‌చేశాడు. భ‌ర్త త‌ల బ‌ద్ద‌లుకొట్టినందుకు ముళ్ల గ‌ద‌ల‌తో త‌ల చితికేట్టు మోదించాడు. భ‌ర్త‌ను దూషించినందుకు, కొట్టినందుకు, త‌న్నినందుకు దాని పాదాలు ప‌ట్టుకుని క‌ఠిన శిల‌ల‌పై వేసి బాదించాడు. సీసం కాచి చెవుల్లో పోయించాడు. కుంభీపాక న‌ర‌కానికి పంపాడు. ఆమె పాపాల‌కుగాను ముంద‌రి ప‌ది త‌రాల వారు, వెనుక ప‌ది త‌రాల వారు ఆమెతో క‌లిపి 21 త‌రాల వారు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. న‌ర‌కానుభ‌వం అనంత‌రం ఆమె 15 జ‌న్మ‌ల పాటు భూమిపై కుక్క‌గా జ‌న్మించింది. 15వ ప‌ర్యాయ‌మున క‌ళింగ‌దేశంలో కుక్క‌గా పుట్టి ఒక బ్రాహ్మ‌ణ గృహంలో ఉండేది.

సోమ‌వార వ్ర‌తం చేత కుక్క‌కు కైలాస ప్రాప్తి
ఒక కార్తీక సోమ‌వారంనాడు ఆ బ్రాహ్మ‌ణుడు ప‌గ‌లు ఉప‌వాసం ఉండి శివాభిషేకాలు నిర్వ‌ర్తించి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం న‌క్త స్వీకారానికి సిద్ధ‌ప‌డి ఇంటి బ‌య‌ట బ‌లిని విడిచిపెట్టాడు. ఆ నాడంతా ఆహారం దొర‌క్క ప‌స్తు ఉన్న కుక్క ప్ర‌దోష స‌మ‌యంలో ఆ బ‌లి అన్నాన్ని భుజించింది. బ‌లి భోజనం వ‌ల‌న దానికి పూర్వ జ‌న్మ స్మృతి క‌లిగింది. ఓ విప్రుడా, ర‌క్షించు అని కుయ్యింటూ మొర‌పెట్టింది. దాని అరుపులు విని వ‌చ్చిన విప్రుడు కుక్క మాట‌లాడ‌డాన్ని గ‌మ‌నించి విస్తు పోతూ "ఏమి త‌ప్పు చేశావు, నేనెలా ర‌క్షించ‌గ‌ల‌ను" అని అడిగాడు.
అందుకా శున‌కం "ఓ బ్రాహ్మ‌ణుడా, పూర్వ జ‌న్మ‌లో నేనొక విప్ర‌వ‌నిత‌ను. కామంతో క‌ళ్లు మూసుకుపోయి జార‌త్వానికి ఒడిగ‌ట్టి భ‌ర్తృహ‌త్య‌కు, వ‌ర్ణ సంక‌రానికి కార‌కురాలిన‌య్యాను. ఆయా పాపాల‌కు అనుగుణంగా అనేక కాలం న‌ర‌కంలో చిత్ర‌హింస‌ల‌నుభ‌వించి ఈ భూమిపై ఇప్ప‌టికి 14 సార్లు కుక్క‌గా జ‌న్మించాను. ఇది శున‌కంగా 15వ జ‌న్మ‌. అలాంటిది ఇప్పుడు నాకు హ‌ఠాత్తుగా పూర్వ‌జ‌న్మ‌లెందుకు గుర్తు వ‌చ్చాయో అర్ధం కావ‌డంలేదు. ద‌య‌చేసి చెప్పండి" అని కోరింది.
బ్రాహ్మ‌ణుడు స‌ర్వాన్ని జ్ఞాన‌దృష్టితో తెలుసుకుని "ఓ శున‌క‌మా, ఈ కార్తీక సోమ‌వారం నాడు ప్ర‌దోష వేళ వ‌ర‌కు ప‌స్తు ఉండి నేను వ‌దిలిన బ‌లిభ‌క్ష‌ణం చేయ‌డం వ‌ల‌న నీకు ఈ పూర్వ‌జ‌న్మ జ్ఞానం క‌లిగింది" అని చెప్పాడు. ఆ పై ఆ జాగిలం క‌రుణామ‌యుడైన ఓ బ్రాహ్మ‌ణుడా నాకు మోక్షం ఎలా సంప్రాప్తిస్తుందో చెప్ప‌మ‌ని కోరిన మీద‌ట ద‌యాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమ‌వార వ్ర‌తాల్లో ఒక సోమ‌వార వ్ర‌త ఫ‌లాన్ని ఆ కుక్క‌కు ధార‌పోశాడు. ఆ క్ష‌ణంలోనే ఆ శున‌కం దేహాన్ని ప‌రిత్య‌జించి ప్ర‌కాశ‌మాన‌మైన హార‌వ‌స్త్ర విభూషిత అయి పితృదేవ‌తా స‌మ‌న్వితంగా కైలాసానికి చేరింది. కాబ‌ట్టి ఓ జ‌న‌క మ‌హారాజా, నిస్సంశ‌యంగా శ్రేయ‌దాక‌మైన ఈ కార్తీక సోమ‌వార వ్ర‌తం నీవు త‌ప్ప‌నిస‌రిగా ఆచ‌రించు అని వ‌శిష్ఠుడు చెప్ప‌డం ఆపాడు.
ద్వితీయోధ్యాయ స‌మాప్తః
స్కాంధ పురాణాంత‌ర్గ‌త‌ 1వ రోజు పారాయ‌ణం స‌మాప్తం 

No comments:

Post a Comment