Sunday, January 5, 2020

ముక్కోటి ఏకాద‌శీ వ్ర‌తం ప‌ర‌మార్ధం ఏమిటి...?

మృత్యువు వ‌చ్చిన‌ప్పుడు అది ఎలా ఉంటుందో దానికి సంబంధించిన‌ త‌ర్ఫీదును మ‌న‌సుకి ఇవ్వ‌డ‌మే ఏకాద‌శి ప‌ర‌మార్ధం. ఏకాద‌శీ వ్ర‌తం చాపి త్ర‌యం అత్యంత దుర్ల‌భం అంటారు. అందుకే ఏడాదంతా చేయ‌లేక‌పోయినా ఒక్క ముక్కోటి ఏకాద‌శి మాత్రం చాలున‌ని విష్ణుమూర్తి చెబుతాడు. ఒక్క ముక్కోటి ఏకాద‌శి చేసిన‌ట్ట‌యితే 24 ఏకాద‌శుల ఫ‌లితం ఇస్తాను అని ఆయ‌న అంటాడు. కాని ఒక‌టి ఎక్కువ నేన‌డుగుతాను, సాధార‌ణంగా చేసే దానితో క‌లిపి ఆ ఒక్క‌టి కూడా చేస్తే నీకు మూడు కోట్ల ఏకాద‌శుల ఫ‌లితం ఇస్తాను. కాని సాధార‌ణంగా చేసే ఏకాద‌శి క‌న్నా విరుద్ధంగా ముక్కోటి ఏకాద‌శి చేయాలంటాడు ఆయ‌న‌. ఎందుకు అలా విరుద్ధంగా చేయాలి...?  సాధార‌ణ ఏకాద‌శి నాడు ఉప‌వాసం ఉన్న‌ప్పుడు పండు లేదా కాయ తీసుకుంటే త‌ప్పులేదు. 

ఆదివారం, పౌర్ణ‌మి, అమావాస్య రోజుల్లో ఉప‌వాసం చేసిన‌ప్పుడు రాత్రి వేళ ఏమీ తిన‌కూడ‌దు. అష్ట‌మి, చ‌తుర్ద‌శి తిథుల్లో ప‌గ‌లంతా ఉప‌వాసం ఉండి రాత్రివేళ న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం పార‌ణం చేయ‌వ‌చ్చు. వారాలు అన్ని యుగాల్లో లేవు. క‌లియుగంలో మాత్ర‌మే వారాలున్నాయి. అందుకే క‌లియుగంలో మాత్ర‌మే వార‌నియ‌మాలున్నాయి. ఆరోగ్యం సూర్య‌భ‌గ‌వానుడి అనుగ్ర‌హంతోనే సాధ్య‌ప‌డుతుంది. ఆయ‌న తేజ‌స్సు ఎక్కువ‌గా ప‌రిపుష్టం అయ్యే రోజు భానువాస‌రం. అందుకే సూర్య భ‌గ‌వానుడి అనుగ్ర‌హం క‌ల‌గాలి అంటే ఆదివారం ఉప‌వాసం చేయాలి. 

అస‌లు ముక్కోటి ఉప‌వాసం ప‌ర‌మార్ధం ఏమిటి?
ఉప‌వాసాన్ని రెండుకోణాల్లో అర్ధం చేసుకోవాలి. దీన్ని మ‌న ఋషులు అద్భుతంగా అన్వ‌యించి చూపుతారు. క‌డుపులో ఉన్న ప‌దార్థం పూర్తిగా అయిపోయేంత వ‌ర‌కు తిరిగి అందులో ఏమీ వేయ‌కూడ‌దు అన్న‌దే ఆ నియ‌మం. అంటే క‌డుపు కండ‌రాలు క‌ద‌ల‌కుండా విశ్రాంతి ఇవ్వ‌డ‌మే ఉప‌వాసంలో ప్ర‌ధాన ప్ర‌క్రియ‌. ఉదాహ‌ర‌ణ‌కి పెద్ద పెద్ద ప్లాంట్ల‌ని కావాల‌ని అప్పుడ‌ప్పుడూ ష‌ట్ డౌన్ చేస్తారు. అలా చేయ‌డం వ‌ల్ల వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఋషులు దాన్నే మ‌న శ‌రీరానికి అన్వ‌యించారు. శ‌రీరం కూడా ఒక యంత్రం లాంటిదే. ఈ శ‌రీరం ఉన్నప్పుడే మ‌నం ఏ పుణ్య‌మైనా, ధ‌ర్మ‌కార్యాలైనా చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. అస‌లు ఆ శ‌రీర‌మే లేకుండా చేసుకుంటే ఎవ‌రైనా జీవుడు ఏం చేయ‌గ‌ల‌డు...?  ధ‌ర్మ‌కార్యాలు చేయాలంటే శ‌రీరం ఆయుర్దాయం పెంచాలి. ఆయుర్దాయం రెండు ర‌కాలుగా పెంచుకోవ‌చ్చు. ఒక‌టి ఆవేశ‌ప‌డి ఊపిరి తీయ‌డం నివారించాలి.వ‌ద‌ల‌కూడ‌దు. ఎందుకంటే ఆయుర్దాయం ఊపిరిలోనే ఉంది. అలాగే ఏదో ఒక‌టి దొరికింది క‌దా అని ఏది ప‌డితే అది తినేయ‌కుండా ఉండ‌డ‌మే రెండోది.ఈ రెండూ చేసిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. పాప‌కార్యాలు చేయ‌డానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడ‌దు. జీవుణ్ని చ‌క్క‌బెట్టుకోవ‌డానికి మాత్ర‌మే దీర్ఘాయుష్మంతుడు కావాలి. ఆ ప్ర‌క్రియ‌లో వ‌చ్చిన అద్భుత‌మైన తిథి ముక్కోటి ఏకాద‌శి.  

"ఏకాద‌శ్యాంతు క‌ర్త‌వ్యం స‌ర్వేషాం భోజ‌న ద్వ‌యం"  అని ఒక శ్లోకం ఉంది.. ఏకాద‌శి నాడు అంద‌రూ రెండు సార్లు భోజనం చేయాల‌ని ఆ శ్లోకానికి ఒక‌ అర్ధం వ‌స్తుంది. మ‌రి అలా చేస్తే ఉప‌వాసం ఏమిటి?  కాని అందులో అంత‌రార్ధం ఉంది. అంద‌రికీ ఏదో ఒక క‌న్సెష‌న్ ఇచ్చిన‌ట్టు క‌న‌ప‌డితే దాన్ని క‌ర్ఫ‌ర్మ్ చేసుకోవ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డ‌తారు. అందుకే ఆ శ్లోకానికి ఈ అంత‌రార్ధం పెట్టారు.  భో...జ‌న అంటే ఓ జ‌నులారా, ఏకాద‌శి నాడు రెండు నియ‌మాలు పాటించందే. శుద్ధోప‌వాసః ప్ర‌థ‌మః. ఏకాద‌శి నాడు శుద్ధోప‌వాసం చేయాలి. ద్వైత సంప్ర‌దాయంలో ఉన్న వారు శుద్ధోప‌వాసం చేస్తారు. వారు ఏకాద‌శి నాడు చివ‌రికి స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం కూడా చేయ‌రు. వ్ర‌తం చేస్తే భ‌గ‌వంతునికి నైవేద్యం పెట్టాలి. అందుకే వారు ఏకాద‌శి నాడు ఈశ్వ‌రుని కూడా క‌డుపు మాడ్చేస్తారు. ఏకాద‌శి నాడు ఎవ‌రైనా వాళ్లింటికి వెళ్లినా ప‌చ్చి మంచినీరు ఇవ్వ‌రు. ఇంటికి వ‌చ్చిన వారికి పండు కూడా చేతిలో పెట్ట‌రు. ఏం అనుకోకండి ఏకాద‌శి రోజు వ‌చ్చారు. ఏమీ ఇవ్వ‌డంలేదంటారు. వారు ఉమ్మి కూడా గుట‌క వేయ‌రు. వాళ్ల‌కి ఈశ్వ‌రుని మీద ఉన్న న‌మ్మ‌కం అటువంటిది. చివ‌రికి రాజ‌స్తాన్ ఎడారిలో అయినా అలాగే ఉంటారు. "స‌త్క‌థా శ్ర‌వ‌ణం త‌థాః" అన్న‌ది రెండో నియ‌మం. అంటే ఏకాద‌శి ఉప‌వాసం చేస్తున్నంత వ‌ర‌కు కూడా భ‌గ‌వంతునికి సంబంధించిన‌ స‌త్క‌థ‌లు వింటూ ఉండాలి. ఏకాద‌శి తిథి ఉన్నంత స‌మ‌యం నిరంత‌రాయంగా భ‌గ‌వంతుని ధ్యానం చేస్తావంటే జాగారం స‌యితం అందులోనే ఉంది. నీరు, ఆహారం తీసుకోలేదు గ‌నుక నీకు మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న‌కి కూడా వెళ్లే అవ‌స‌రం ఉండ‌దు.

ద్వాద‌శి పార‌ణ నియ‌మం ఏమిటి...?
ఏకాద‌శి తిథి రోజున ఏమీ తిన‌కుండా ఉండ‌డం ఎంత ప్ర‌ధాన‌మో ద్వాద‌శి తిథి ప్ర‌వేశించ‌గానే పార‌ణం చేసి తీరాలి. ఏదో ఒక‌టి తినేయాలి. ద్వాద‌శి పార‌ణ మ‌ధ్యాహ్నం వేళ చేయ‌కూడ‌దు. చివ‌రికి ద్వాద‌శి తిథి తెల్ల‌వారు ఝామున వ‌స్తోందంటే తెల్ల‌వార‌కుండానే భోజ‌నం చేసేయాలి. ఉద‌యం 6.30కి ద్వాద‌శి తిథి వ‌స్తోందంటే ఆ లోగానే ఈశ్వ‌రునికి మ‌హానివేద‌న చేసి ఆ వెంట‌నే భోజ‌నం చేసితీరాలి. నాకు ఆక‌లి వేయ‌దు అనే మాట కూడా ప‌నికిరాదు. అంబ‌రీషుని కథే ఇందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. ద్వాద‌శి ఘ‌డియ‌లు రాగానే కొంచెం నీరు తాగినందుకే ఆయ‌న దూర్వాసుడి ఆగ్ర‌హానికి గురై ఆ త‌ర్వాత ఈశ్వ‌రానుగ్ర‌హం పొంద‌గ‌లిగాడు. ఈ భోజ‌నానికి కూడా నియ‌మం ఉంది. పాటు ష‌ర్టు వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తిన‌డం కూడా పార‌ణ నియ‌మం కాదు. అంటే పైన చొక్కా లేకుండా పంచె క‌ట్టుకుని కింద కూచుని భోజ‌నం చేయాలి. అలాగే ద్వాద‌శి రోజున త‌న ఇంటిలో త‌ప్ప వేరొక‌రి ఇంటిలో భోజ‌నం చేయ‌కూడ‌దు. అలా చేసిన‌ట్ట‌యితే ఏకాద‌శి ఉప‌వాస ఫ‌లితం కోల్పోతారు. నిత్యం తిరుగుతూ ఉండే ఉపాధిలో ఉన్న‌వారు, ఏదో ఒక మ‌హ‌త్త‌ర ప్ర‌యోజ‌నం కోసం వేరే ప్ర‌దేశానికి మాత్ర‌మే వెళ్లిన వారికే ఇంటిలో కాకుండా ఎక్క‌డైనా భోజ‌నం చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ నియ‌మం ఎందుకంటే ఏకాద‌శి రోజున ఉప‌వాసం చేశావు గ‌నుక భ‌గ‌వంతునికి నువ్వు ఆ రోజు మ‌హానివేద‌న పెట్ట‌లేదు. మ‌రి ద్వాద‌శి రోజున ఆయ‌న‌కి మ‌హానివేద‌న చేసి తీరాలి. అందుకే ఈ నియ‌మం పెట్టారు. ఏకాద‌శి తిథి వ‌చ్చిన రోజున అస‌లు ఇల్లు వ‌దిలే వెళ్ల‌కూడ‌దు. అందుకే పెద్ద పెద్ద నైవేద్య‌పు తిథుల్లో అస‌లు ఇల్లు వ‌దిలి వెళ్ల‌నేకూడ‌దు. ఏకాద‌శి వ‌స్తోంది క‌దండీ మేం ఇల్లు వ‌దిలి ఎలా రాగ‌లం అంటారు. అంటే ఏకాద‌శి నియ‌మంలో ఇల్లు వ‌దిలి వెళ్ల‌క‌పోవ‌డం అనే నియ‌మం కూడా ఉంది. అలా ఉన్న‌ప్పుడే ఈశ్వ‌రునికి నీ ఇంట్లో నివేద‌న చేయ‌గ‌లుగుతావు. కాయ‌క‌ష్టం చేసుకునే వారికి మాత్ర‌మే ఈ నియ‌మానికి మిన‌హాయింపు ఉంది. 

నిజంగా ముక్కోటి ఏకాద‌శి చేసే వారు ఎంత‌మంది...?
ఏకాద‌శి ఉప‌వాసం చేసే వారు క‌నీసం మూడు రోజుల ముందు నుంచి పూర్తిగా సాత్వికాహారం తీసుకోవాలి. ఏకాద‌శి ఉప‌వాసం చేయాల‌నుకుని ముందు రోజున పుల్ల‌ని ప‌దార్థాలు లేదా తీయ‌ని ప‌దార్థాలు తినేయ‌కూడ‌దు. అలా చేస్తే దాహాన్ని ఆప‌డం సాధ్యం కాదు. సాత్వికాహారం తీసుకుంటే ఇంక దాహం వేయ‌డం ఉండ‌దు. అందుకే శ‌రీరాన్ని అల‌వాటు చేయ‌డం కోసం క‌నీసం మూడు రోజుల ముందు నుంచి పూర్తిగా సాత్వికాహారం తీసుకోవాలి.  శారీర‌క‌మైన, ఆంత‌రంగికమైన సాధ‌న‌లు చేయ‌డం అవ‌స‌రం. మ‌రీ వేడిగా ఉన్న ప్ర‌దేశంలో ఉండ‌కూడ‌దు. వాతావ‌ర‌ణం వేడిగా ఉంటే శ‌రీరం అల‌సిపోయి ప‌డిపోతుంది. అందుకే భ‌గ‌వంతుడు ముక్కోటి ఏకాద‌శిని నీటి అవ‌స‌రం అంత‌గా లేని పుష్య‌మాసం, హేమంత ఋతువులో పెట్టాడు. ముక్కోటి ఏకాద‌శి నాడు ఈ నియ‌మాల‌న్నీ పాటించి ఉప‌వాసం చేస్తే నీకు మూడుకోట్ల ఏకాద‌శుల ఫ‌లితం ఇస్తానంటాడు విష్ణుమూర్తి. కాని ఇది దుర్ల‌భం. ఎవ‌రికి వారు చేయ‌డం సాధ్యం కాదు. అందుకే స‌మూహంలో ఉండి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంటిలో దేవ‌తార్చ‌న అనంత‌రం దేవాల‌యంలో అంద‌రూ స‌మావేశ‌మై భ‌గ‌వ‌త్క‌థ‌లు వింటూ ఉండ‌డం, భ‌గ‌వ‌త్కార్యంలో పాల్గొన‌డం చేయాలి. 24 ఏకాద‌శుల్లో ఒక ఏకాద‌శి అలా చేయ‌గ‌ల‌గాలి అంటే ఒక్క‌సారే సాధ్యం కాదు. ముందుగా ఒక ఏడాది ఆ ప్ర‌య‌త్నం చేస్తే మ‌రో ఏడాదికైనా అది సాధ్యం అవుతుంది. అక‌స్మాత్తుగా ముక్కోటి ఏకాద‌శి చేస్తామ‌ని సంక‌ల్పించుకున్నంత మాత్రాన అది సాధ్యం కాదు.5 జ్ఞానేంద్రియాలు, 5 క‌ర్మే్ంద్రియాలు, మ‌న‌సు ఈశ్వ‌రుని మీద నిల‌బెట్ట‌డానికే ఈ సాధ‌న అవ‌స‌రం.  

ఆమ‌రణ నిరాహార దీక్ష శాస్త్రవిరుద్ధం
సామూహికంగా చేసే ముందు ఒక ఏడాది నుంచి ప్ర‌ణాళిక వేసుకుని ఎంత శ్ర‌మ‌కైనా త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగిన దారుఢ్యం గ‌ల వారిని ఎంపిక చేసుకుని స‌ప్త‌మి తిథి నుంచే వారిని సంసిద్ధుల‌ని చేయాలి. అలా చేసిన త‌ర్వాత ఏకాద‌శి తిథి నాడు ఎంత సేపు ఉండ‌గ‌లిగితే అంత సేపు ఉప‌వాసం, జాగారం ఉంటారు. అయినా కూడా ఉండ‌లేని స్థితి వ‌స్తే అవ‌స‌రాన్ని బ‌ట్టి నీరు, ఆహారం తీసుకోవ‌చ్చు. అంత‌మాత్రాన ఏకాద‌శి ఉప‌వాస ఫ‌లితం పోదు. ఈశ్వ‌రుడు మీరు చేసిన దానికి నూటికి నూరు శాతం సిల‌బ‌స్ ను బ‌ట్టి మార్కులు వేయ‌డు. మీ ప్ర‌య‌త్నానికి మార్కులు వేస్తాడు. అందుకే ప్ర‌య‌త్నం ప్ర‌ధానం. శ‌రీరం ప‌డిపోయే ప‌రిస్థితి వ‌స్తుంటే మాత్రం నీరు పుచ్చుకోవ‌చ్చు లేదా ఏదైనా స్వ‌ల్పంగా ఆహారం తీసుకోవ‌చ్చు. శ‌రీరాన్ని బ‌ల‌వంతంగా  ప‌డ‌గొట్టేస్తే ఈశ్వ‌రుడు మోక్షం ఇవ్వ‌క‌పోగా పిశాచ‌త్వం ఇస్తాడు. ఆహారం, నీరు లేకుండా శ‌రీరాన్ని ప‌డ‌గొడితే పిశాచాలుగా మారిపోతారు. అందుకే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష శాస్త్రవిరుద్ధం. 

ఈ నియ‌మాల‌న్నీ పాటిస్తూ శాస్త్రం చెప్పిన నియ‌మాల‌ను చేసిన వారికి మూడు కోట్ల ఏకాద‌శుల ఫ‌లితం వ‌స్తుంది. ముక్కోటి ఏకాద‌శి నాడు ఏ కార్యం చేసినా మూడు కోట్ల ఫ‌లితం వ‌స్తుంది. ఒక్క‌సారి శ్రీ‌రామ‌రామ రామేతి ర‌మే రామే మ‌నోర‌మే అని ఒక్క‌సారి అనుసంధానం చేస్తే మూడు కోట్ల మార్లు పారాయ‌ణ చేసిన ఫ‌లితం ల‌భిస్తుంది. అందుకే ముక్కోటి ఏకాద‌శి రోజున ఉప‌వాస‌మూ చేయాలి, వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కూడా చేయాలి. ఏదీ చేయ‌క‌పోతే మూడు కోట్ల పాపాల ఫ‌లితం పొందిన వారౌతారు. అందుకే ముక్కోటి ఏకాద‌శి రోజున రాత్రి జాగారం చేయ‌గ‌ల శ‌క్తి లేక‌పోయినా రోజంతా భ‌గ‌వ‌న్మామ సంకీర్త‌న చేయ‌గ‌లిగినా ఎంతో పుణ్యం చేసుకున్న వార‌వుతారు. ప్ర‌తీ ఒక్క‌రూ భ‌గ‌వంతుని సేవ‌లో ఉండండి, త‌రించండి.

( పూజ్య‌గురువులు శ్రీ‌మాన్ చాగంటి కోటీశ్వ‌ర‌రావుగారి ప్ర‌వ‌చ‌నం వీడియో ఆధారంగా చేసిన ప్ర‌య‌త్నం. వారు చెప్పింది అక్ష‌రం అక్ష‌రం య‌థాత‌థంగా రాసి ఉండ‌క‌పోవ‌చ్చు. కాని క‌నీసం 80 శాతం వ‌ర‌కు అయినా చేశాన‌నే న‌మ్మ‌కం ఉంది. చ‌ద‌వండి, ఆశీర్వ‌దించండి).
మీ
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు

No comments:

Post a Comment