ఏమి ఆ వేడుక...ఏమి వైభవం. వర్ణించేందుకు మాటలు చాలవు. ఒక చిన్న కార్యక్రమం తలపెడితేనే అది దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఎంతో సతమతమైపోతాం. అలాంటిది ఒక మహా సంకల్పం...లోకకల్యాణ దీక్షతో అందరి మేలు కోసం ఉచితంగా అష్టోత్తర శత (108) సుందరకాండలు చేయాలనే సంకల్పం. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరై హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల వారి మదిలో ఒక ఆలోచన మొలక మొలిచింది. మొదట ఆయన వెంట ఎవరూ లేరు. ఒకే ఒక్క మనిషి ప్రయత్నం మొదలు పెట్టారు. స్వప్రయోజన కాంక్ష లేకుండా లోకకల్యాణం కోసం ఆయన చేస్తున్న ఆ మహాదీక్షలో భాగస్వాములు కావాలని ఒక్కోక్కరుగా శిష్యులు చేరడం మొదలయింది. వానరసమూహం వంటి ఒక పెద్ద శిష్యబృందం ఆయనకు చేరువయింది. విజయవంతంగా 108 సుందరకాండలు పూర్తయ్యాయి. శిష్యుల ఆనందానికి అవధులు లేవు. 2009 డిసెంబర్ 20 నుంచి 27వ తేదీ వరకు వైభవంగా ప్రథమ అష్టోత్తర శత సుందరకాండల విజయోత్సవం నిర్వహించుకున్నారు. అక్కడతో ఆ ప్రయాణం ఆగలేదు. ఈ దీక్ష ముందుకు కొనసాగుతుందని ఆ రోజు ప్రకటించారు. ద్వితీయాష్టోత్తర (రెండో 108) సుందరకాండల సంకల్పం చిగురించింది. మళ్ళీ ప్రయాణం ప్రారంభమయింది. మరో ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. మరో 108 సుందరకాండలు పూర్తయ్యాయి. ద్వితీయాష్టోత్తర శత సుందరకాండ (108+108=216) ఐదు రోజుల పాటు ఐదు కుండాలతో హోమరూపకంగా 2015 డిసెంబర్ ఏడో తేదీన ప్రారంభించి డిసెంబర్ 12వ తేదీతో ముగించారు. ద్వితీయాష్టోత్తర శత సుందరకాండల విజయోత్సవాలు ఎంతో వైభవంగా డిసెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగాయి. రెండు విజయోత్సవాల్లోను విద్వత్ పురుషులను సత్కరించడం గురూజీకి అలవాటు. తొలుత ఆయనకు జన్మ ఇచ్చిన మాతృమూర్తి ఆండాళమ్మగారికి (97 సంవత్సరాల వయసు) పాదపూజ నిర్వహించి ఐదుగురు విద్వత్ శిఖామణులను సత్కరించారు. ఈ సారి గుతూజీ సుందకాండల నిర్వహణలో తనకు నిరంతరం అండగా నిలుస్తున్న ఐదుగురు శిష్యులను కూడా ఎంచుకుని పంచరత్నాలు పేరుతో సత్కరించారు. సుందరకాండ కార్యక్రమాల ప్రచారం కోసం బ్లాగ్, ఫేస్‌బుక్ పేజి, వాట్సప్ గ్రూప్ నిర్విహిస్తున్నందుకు దామరాజు వేంకటేశ్వర్లు అనే నాకు కూడా ఆ సత్కారం లభించడం నా పూర్వజన్మ సుకృతం. (నాకు జన్మనిచ్చి నేను ఇంతటి వాడిని కావడానికి పునాదులు వేసి ఊర్థ్వలోకాలకు తరలిపోయిన నా మాతా పితరులు శ్రీమతి శేషకుమారి, శ్రీ ఆంజనేయులు గార్ల ఆత్మలు కూడా సంతోషించా ఆ లోకాల నుంచి నాకు ఆశీస్సులు అందించి ఉంటారు).
ఇందుకు గురువుగారు మనందరికీ అందించిన ఆశీః పూర్వక సందేశం కూడా చూడండి...
ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోవడంలేదు. మూడో అష్టోత్తర శత సుందరకాండలు కూడా 2016 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్టు గురూజీ ప్రకటించారు. మరో ఆరు సంవత్సరాల తర్వాత తృతీయాష్టోత్తర శత సుందరకాండలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని మరో విజయోత్సవ వేడుకలు మనందరం నిర్వహించుకోవాలని, అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు మాకు అందించాలని ఆంజనేయస్వామివారిని సుందరకాండ కుటుంబం అందరి తరఫున కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment