శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం
వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః
వివరణ
- ఆంజనేయ స్వామివారు సీతాన్వేషణకై పయనమై త్రికూట పర్వత శిఖరం మీద లంకా నగర
ప్రాకారాన్ని చేరుకుంటాడు. దుర్భేద్యమైన లంకను చూసి హనుమంతుడు, దీన్ని
దేవతలు కూడా జయించలేరు... ఈ నగరాన్ని చేరుకునే వారిలో పైన వివరించిన
నలుగురు మాత్రమే రాగలరు అనుకుంటారు...
వ్యాఖ్యానము
- జీవాత్మ అరిషడ్వర్గములచే బంధింపబడి ఉంటుంది. ఆ బంధము నుండి జీవుడిని
విముక్తి చేసి తిరిగి పరమాత్మను చేర్చు వాడు ఆచార్యుడే... గురువు ద్వారానే ఈ
కార్యము సాధ్యమవుతుంది. ఇక్కడ సీతమ్మ జీవాత్మ... రాముడు పరమాత్మ...
రావణుడు అరిషడ్వర్గములు...ఆచార్యుడు ఆంజనేయ స్వామి...రావణుని సర్వ నాశనం
చేసి సీతమ్మను రాముని చేర్చు వాడు ఆంజనేయుడు. అనగా అరిషడ్వర్గముల బంధము
నుండి జీవాత్మను తప్పించి భగవంతుని చేర్చు వాడు ఆచార్యుడు.
ఇక్కడ
మారుతి, నలుగురము మాత్రమే లంకకు రాగలమన్నాడు. వారు అంగదుడు, నీలుడు,
సుగ్రీవుడు మరియు తాను... ఇందులో అంగదుడు శక్తి... నీలుడు యుక్తి...
సుగ్రీవుడు భక్తి... అంగదుడు ఒకే లంఘనములో శత యోజనముల సముద్రమును దాటి
లంకలోనికి ప్రవేశించగలడు... తిరిగి రావడానికి శక్తి పున్జుకోవలసి ఉంటుంది.
అది వేరే విషయం. అందు వలన శక్తి ద్వారా అంగదుడు లంకను చేరగలడు. నీటిలో రాయి
పడవేస్తే తేలే శక్తి నీలుడుకి ఉంది. అందుచేత లంకకు వారధి నిర్మించి
రాగలడు. అనగా యుక్తితో లంకను చేరగలడు. ఇక సుగ్రీవుడు భక్తికి ప్రతీక...
వాలి నుండి తన భార్య రుమను, కిష్కింధ సామ్రాజ్యమును రాముడు ఇప్పించినందుకు
ఆయనకు విధేయుడయ్యాడు.. కాబట్టి రాముని విధేయుడుగా ఆతను కూడా లంక చేరగలడు.
అయితే ఈ మువ్వురిలో ఎవ్వరు కూడా రాక్షసులను తప్పించుకుంటూ సీతాన్వేషణ
గావించే శక్తి లేని వారు... వివిధ రూపాలు ధరించి షష్టిర్యోజన విస్తీర్ణమైన
లంకలో తిరగగలిగిన శక్తి ఒక్క మారుతికే ఉంది... కాబట్టి జీవాన్వేషణ,
అరిషడ్వర్గ బంధ విముక్తి ఒక్క ఆచార్యునికే ఉంటుందని స్వామి వారు ఈ శ్లోకము
ద్వారా మనకు తెలియజేస్తున్నారు...
సర్వే జనాః స్సుఖినో భవంతు
No comments:
Post a Comment