పుష్కర నిరీక్షణ
ఇది నిజంగా మా సుందరకాండ మహాయజ్ఞంలోనే అత్యంత అరుదైన ఘట్టం. స్వామివారు మా ఇంటికి రావాలని ప్రగాఢంగా కోరుకుని ఆయన కోసం కన్నులు కాయలు కాసేలా నిరీక్షించిన వారి కోసం స్వామివారే తరలివచ్చిన సందర్భం. శ్రీ నందనంపాటి వీరాంజనేయులు సోదరులది గుంటూరు. వారు ఐదుగురు సోదరులు. గుంటూరులో వారు కాటన్, ఐరన్, స్టీల్ వ్యాపారాలు చేసే వారు. 2002 సంవత్సరంలో ఆ సోదరులు హైదరాబాద్ మకాం మార్చారు. ప్రస్తుతం వారందరూ ఆటోమొబైల్ బోల్టులు, నట్లు విక్రయించే వ్యాపారం నిర్వహిస్తుండగా తర్వాతి తరం సోదరులందరూ కలిసి ఎస్‌వికె సాఫ్ట్ వేర్ పేరిట ఒక కంపెనీ పెట్టుకుని దాన్ని నడుపుతున్నారు. అందరూ కాప్రా సమీపంలోని వంపుగుడా రోడ్డులో జీ స్కూల్ ఎదురుగా ఒక పెద్ద ప్రాంగణంలో ఐదు చక్కని భవనాలు నిర్మించుకుని కాపురం ఉంటున్నారు. వారికి ఎంతో కాలంగా తమ ఇంట్లో సుందరకాండ చేయించుకోవాలని ప్రగాఢమైన ఆకాంక్ష. కాని చక్కగా సుందరకాండ నిర్వహించే సద్గురువులు వారికి తారసపడలేదు. ఇలా ఉండగా ఒక రోజున ఆంధ్రజ్యోతిలో గురూజీ శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల వారి గురించి ఒక చక్కని వ్యాసం ప్రచురితం అయింది. 2007 ఫిబ్రవరి 9వ తేదీన ఆంధ్రజ్యోతి నివేదన పేజీలో అది ప్రచురించాం. ఆయనని ఇంటర్వ్యూ చేసి ఆ వ్యాసం రాసింది నేను, దానికి తుది మెరుగులు దిద్ది ప్రచురించినది ఆ పేజీని పర్యవేక్షించే మిత్రులు శ్రీ టి.కుమార్. ఆ వ్యాసాన్ని నందనంపాటి వారు చూశారు. వెంటనే వారు గురూజీ అడ్రస్ తెలుసుకోవాలని ప్రయత్నించారు గాని వారికి దొరకలేదు. ఎప్పటికైనా గురూజీతో సుందరకాండ చేయించుకోవాలన్న ప్రగాఢ ఆకాంక్షతో ఎదురుచూస్తూ ఆ వ్యాసాన్ని లామినేట్ చేయించుకుని ఇంటిలో ఉంచుకున్నారు. ఆ కోర్కెతోనే వారికి సుమారుగా పుష్కర కాలం గడిచిపోయింది. కాలం అలా గడిచిపోతూ ఉండగా కొద్ది నెలల క్రితం ఒక రోజున వారికి గురువుగారి అబ్బాయి తారసపడ్డారు. మాటల సందర్భంగా మా నాన్నగారు సుందరకాండ చేస్తారని చెప్పడం, వారు పేరు అడగడం, నాన్నగారి పేరు శృంగారం సింగరాచార్య అని చెప్పగానే వారు ఆనందపడిపోవడం, గురూజీ దర్శనభాగ్యం కావాలని కోరడం జరిగింది. దగ్గరలోనే నివాసం ఉంటున్న కుమారుని ఇంట్లోనే ఆ సమయంలో గురువుగారు ఉన్నారు. ఆ సంగతి తెలిసి గురూజీ దగ్గరకి వెళ్లి వారి దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషం వ్యక్తంచేస్తూ తమ కథ అంతా వివరించి మీరు వేంచేసి మా ఇంట్లో సుందరకాండ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వారి నిరీక్షణ కథ అంతా విన్న గురూజీ ఆనందాశ్చర్య చకితులై వారి ఇల్లు సందర్శించారు. వారందరూ వైష్ణవభక్తులు. వారి ఇళ్లన్నీ నిత్యం ధూపధీపాలతో పవిత్రత ఉట్టిపడుతూ ఉన్నాయి. ప్రధానంగా గురూజీని ఆకర్షించింది వారి ప్రాంగణంలోని కపిలగోవు. గతంలో కదళీవనంలో సుందరకాండ నిర్వహించిన సందర్భంతో శ్రీ బాపయ్య చౌదరి, శాంతిశ్రీ దంపతులు కపిలగోవు దర్శనభాగ్యం మా సుందరకాండ భక్తకోటికి కల్పించారు. తిరిగి మన వారందరికీ ఇన్నాళ్లకి కపిలగోవు దర్శన భాగ్యం కూడా కలగబోతున్నదని భావించి గురూజీ వారికి సుందరకాండ నిర్వహణ తేదీలు అక్కడికక్కడే ఇచ్చేశారు. రాబోయే హనుమజ్జయంతికి మీ ఇంట్లో సుందరకాండ నిర్వహిద్దామని చెప్పారు. అలా సుమారు పుష్కర కాల నిరీక్షణ ఫలించి ఇప్పుడు నందనంపాటి సోదరుల ఇళ్లలో తృతీయాష్టోత్తర శత పరంపరలోని ఈ 22వ సుందరకాండ జరుగుతోంది. స్వామివారు ఉన్నారు, ఆయన కోసం ఎంతగా నిరీక్షిస్తే అంత ఫలితం అందచేస్తారనేందుకు ఇంత కన్నాతార్కాణం ఏమి కావాలి...జై శ్రీరామ్, జై హనుమాన్.
No comments:
Post a Comment