Tuesday, May 31, 2016

హ‌నుమ‌జ్జ‌యంతి శుభాకాంక్ష‌లు


‘‘శ్రీరామ దూతం శిరసానమామి’

‘‘సత్యం’’ ఒక్కటే కాలానికి చిక్కక, లొంగక, కాలగర్భంలో కలయక, దివ్వప్రభలతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు మన ‘‘రామాయణ, భారత, భాగవత’’ గ్రంధాలు. ఇవి కేవలం కథలు అయితే, ఏనాడో వాటికి కాలదోషం పట్టేది. అలా కాక, అవి ఇప్పటికీ కాలంతో సమానంగా పరుగులుతీస్తూ.. జాతిని జాగృతం చేస్తున్నామంటే.. వాటిలోని ప్రతిపాత్ర సత్యబలంతో జీవం పోసుకున్నవే. ధర్మసంకల్పంతో రూపం దాల్చినవే.

‘‘శ్రీరామ’’ అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ‘‘హనుమంతుడు’’. 7 కాండల గ్రంధమయిన ‘‘రామాయణం’’లో.. .4వ‌ కాండ అయిన ‘‘కిష్కింధాకాండ’’లో ప్రవేశించిన ‘‘హనుమంతుని పాత్ర’’ నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పలకరిస్తూనే ఉంది. 


రామాయణం ‘‘హరి, హర త‌త్వాత్మ‌కం"
శ్రీరాముడు విష్ట్ణ్వాంశ‌
 సంభూతుడు. హనుమంతుడు శివాంశసంభూతుడు. దీనికి సంబంధించిన కథ రామాయణంలోనే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. వారిరువురు ఏకాంత శయ్యామందిరం చేరారు. వారికి జన్మించబోయే పుత్రునివల్లే తారకా సంహారం జరగాలి. అందుకోసమే శోభనమందిరం వెలుపల దేవతలతో కొండంత ఆశతో, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నెలలు, మాసాలు దొర్లిపోతున్నాయి. శివ పార్వతులు శోభన మందిరం నుంచి బయటకు రాలేదు. లోపల ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధస్థితి దేవలది. చూచి రమ్మని అగ్నిని, వాయువును లోపలకు పంపారు దేవతలు. అదే సమయంలో ‘శివతేజస్సు’ బహిర్గత మవుతోంది. లోపలకు ఎవరో వచ్చారన్న సందేహం పార్వతికి కలిగింది. వెంటనే శివునకు దూరంగా జరిగింది. శివుడు తన తేజస్సును భూపతనం కానివ్వకుండా బంధించి దానిని అగ్నికి, వాయువుకు చెరిసగం పంచి పంపాడు. తనకు చెందవలసిన శివతేజస్సును అగ్ని, వాయువులు తన్నుకు పోతూంటే పార్వతికి దుఃఖం ఆగలేదు. దేవతలు చేసిన కార్యభంగానికి కోపగించి ‘దేవతలకు స్వభార్యల వలన సంతానం పుట్టకుండుగాక’ అని శపించింది.

అగ్నిదేవుడు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను భరించలేక గంగానది గర్భంలో ఉంచాడు. గంగ కూడా శివతేజస్సును భరించలేక ఒడ్డుకు నెట్టింది. ఆ శివతేజస్సు రెల్లు పొదల్లో పడి ఆరు ముఖాల‌తో
 ‘షణ్ముణుడు’ జన్మించాడు

వాయువు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను, సంతానంకోసం తపస్సు చేస్తున్న ‘అంజనాదేవి’ గర్భంలో నిక్షిప్తంచేసాడు. అంజనాదేవి గర్భం ధరించింది. నవమాసాలు నిండాయి. అంజనాదేవికి ప్రసవవేదన మొదలైంది. ఆ రోజు వైశాఖ బహుళ దశమి. పుర్వాభాద్ర నక్షత్రం. ఆ శుభ ముహూర్తంలో శివాంశతో అంజనా గర్భసంభూతుగా ‘‘ఆంజనేయుడు’’ జన్మించాడు.

బాల ప్రాయంలోనే ఆంజనేయుడు తన శక్తి ఏమిటో లోకానికి చాటాడు. ఆకాశంలో ప్ర‌జ్వ‌రిల్లుతున్న సూర్య‌బింబాన్ని
 పండుగా భావించి, దానిని మ్రింగాలనే ఉద్దేశ్యంతో ఆకాశానికి ఎగిరాడు. ఆరోజు అమావాస్య, సంపూర్ణసూర్యగ్రహణం. అదే సమయానికి సూర్యగ్రహణం చెయ్యడానికి రాహువు వచ్చాడు. ‘‘ఈ సూర్యుడు నాదంటే నాది’’ అని రాహువుకు, బాలాంజనేయునికి మధ్య ఘర్షణ జరిగింది. విసుగు చెందిన ఆంజనేయుడు తన తోకతో రాహువును చుట్టి బలంగా విసిరివేసాడు. రాహువు దేవేంద్రుని ముందుపడి జరిగినది చెప్పాడు. కృద్ధుడైన దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పంపాడు. వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుని దవడ ఎర్రగా వాచిపోగా, స‌్పృహతప్పి నేలమీద పడ్డాడు. హనుమ (దవడ) వాచినవాడు కనుక ఆనాటి నుంచి ‘‘హనుమంతుడు’’ అని సార్ధక నామధేయుడయ్యాడు. తన కుమారుని దురవస్థ చూసి... వాయువు దేవతలపైన అలిగి స్తంభించాడు. సృష్టిమొత్తం సంక్షోభంతో అల్లకల్లోలమైంది. బ్ర‌హ్మాది దేవతలు వాయువును ప్ర‌స‌న్నం చేసుకోవడం కోసం, అందరూ హనుమంతునికి తలో వరం ఇచ్చారు. ఏ అస్త్రము హనుమంతుని బాధించవు, బంధించవు అని దీవించారు. సహజ బల సంపన్నుడైన హనుమంతుడు ఇప్పుడు వర బలసంపన్నుడయ్యాడు. అసలే కోతి... పైగా బాల్యం... దానికితోడు వరబలం హనుమంతుని అల్లరికి అంతేలేదు. అతని చిలిపిచేష్టలకు సహనం నశించిన ఋషులు ‘‘నీవు శక్తి హనుడవు అగుగాక’’అని శపించారు. ఆ తర్వాత అంజనాదంపతుల ప్రార్ధనకు ప్రసన్నులైన ఋషులు ‘‘ఎవ‌రైనా చెబితేనే అతని శక్తి అతనికి తెలుస్తుంది’’అని శాపానికి ఉప‌శ‌మ‌నం ప్ర‌సాదించారు.

ఆదిత్యుడే ఆచార్యుడు
హనుమంతునికి విద్యలు బోధించడానికి సాహసం చేసి ఎవరూ ముందుకు రాలేదు. హనుమంతుడు నిరుత్సాహం చెందక సూర్యుని దగ్గరకు వెళ్లి విద్యాదానం చెయ్యమని ప్రార్ధించాడు. ‘‘నాయనా.. క్షణకాలం కూడాఆగకుండా నిరాలంబపధంలో నిరంతరం సంచరించే నేను నీకేం విద్యాదానం చెయ్యగలను? నువ్వేం నేర్చుకోగలవు?’’ అన్నాడు సూర్యుడు. ‘‘గురుదేవా... మీతో సమానంగా సంచరిస్తూనే విద్యలు నేర్చుకుంటాను’’అని వినయంగా పలికాడు హనుమంతుడు. గురువు అంగీకరించాడు. శిష్యుడు అనుసరిస్తున్నాడు. విద్యాభ్యాసం మొదలైంది. అచిరకాలంలోనే సకల విద్యలు గ్రహించాడు హనుమ. ఇదీ హనుమంతుని బాల్య కథ.

No comments:

Post a Comment