ఆపదలో ఉన్న వారి కొరకు హనుమత్ దీక్ష
------------------------------ --
తేదీ 23, ఏప్రిల్ 2016 రోజున సాయంత్రం 5.32 నిముషాలకు నాకు వాట్సప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఇంగ్లీషు అక్షరాలతో "గురువుగారికి నమస్కారము. ప్రభాకర్‌కి హార్ట్ ఎటాక్ వచ్చింది" అని మాత్రమే ఉంది. పంపిన వారి పేరు లేదు. హార్ట్ ఎటాక్ అను జబ్బు సామాన్యమైనది కాదు. క్షణాలలో కొంపలు ముంచేస్తుంది. పూర్తి వివరాలు ఆ మెసేజ్ పంపిన వారు తెలుపలేదు. సాయంత్రం 5.45 నిముషాలకు ఈ మెసేజ్ చూడగానే నాకు ఏమీ తోచలేదు. మొన్న నాతో కలిసి శ్రీ సీతారామ కల్యాణంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రభాకర్‌కు ఇంత తీవ్రమైన అనారోగ్యం కలగడమేమిటనుకున్నాను.
నాకు ఏమీ పాలు పోలేదు. 5.55కి వెంటనే తలపై నీళ్ళను గుమ్మరించుకుని, ఆ తడి గుడ్డలతోనే మా గృహముననే విరాజమానుడై ఉన్న కల్యాణ రాముని ముందు కూచుని, ధ్యానములో ఉండి, ప్రభాకరుకు మృత్యుభయము లేకుండా చూడమని ప్రార్థించి, వారము రోజుల పాటు నిరాహార దీక్షను స్వామివారి ముందు ప్రకటించాను.
(భోజనము విసర్జించి సాయంత్రము ఏడు గంటల తరువాతనే ఫలములు మాత్రము సేవించి నీరు తాగి ఉండడము)
ఆ తరవాత పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ప్రభాకర్‌ను సికింద్రాబాద్ యశోదలో చేర్చినట్టు, ఆయన ఆరోగ్యము మెరుగుపడినట్టు సమాచారం అందింది. ఈ లేఖ మీరు చదివే సమయానికి డిశ్చార్జి అయి ఇంటికి చేరినట్టు కూడా తెలియవచ్చుచున్నది.
అయినా నా సంకల్పము ప్రకారము నా దీక్ష 29-4-2016 సాయంత్రము ఏడు గంటల వరకు కొనసాగవలసినదే.
---------------------------------------
భక్తగణమునకు నా ప్రత్యేక వినతి
మా సుందరకాండ కుటుంబాలకు భయంకరమైన ఆపదలు రాకూడదు. ఇలాంటి భయంకరమైన వార్తలు మనం వినకూడదు. ఈ దీక్షలో మన కల్యాణ రామచంద్రుని ఇవే వేడాను. అయినా, మానవ మాతృలము కాబట్టి ఇవి అనివార్యము. అయితే ఇలాంటి భయంకరమైన విషయాలను నాకు తెలియచేయాలంటే ఫోను ద్వారానో, నా ఇ మెయిల్‌కో మెసేజ్ పంపండి. ఆ సమస్యకు నేను ఏలాంటి సముచిత నిర్ణయము తీసుకోవాలో ఆలోచించే అవకాశము ఇవ్వండి. ఒక భయంకర వార్తను టెలిగ్రాఫిక్ రూపకముగా పంపి, ఆ తరువాత నేనే అడిగి తెలుసుకునే అవకాశము కల్పించకండి.
ఇలాంటి మెసేజ్‌ల వల్ల నేను వివరాలు తెలియక, ఆదుర్దాలో స్వామివారి సన్నిధిన అనుచిత కఠోర దీక్షను స్వీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకు పూర్వము కూడా నేను మన ప్రియ భక్తుల కొరకు నిరాహార దీక్షలు స్వీకరించిన సంగతి మీకు తెలుసు. కాని సమయము పుష్కలముగా ఉన్నందున అవి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు.
వయోభారము, భానుని తాపము, ఇటీవల నాకు జరిగిన ప్రమాదము...ఇవన్నీ నా దీక్షకు ప్రతిబంధకాలు. అయినా స్వామి వారి ఆదేశము మేరకు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాను.
మన సుందరకాండ భక్తులు కూడా తమకు తోచిన విధముగా మన పురిగిండ్ల ప్రభాకర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై మళ్ళీ మన మధ్య తిరగవలయునని ఆ అంజనీసుతుని కోరండి.
మీ శృంగారం సింగరాచార్యులు
No comments:
Post a Comment