మనం మరో చారిత్రక ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం. డిసెంబర్‌లో మన సుందరకాడ ద్వితీయాష్టోత్తర సుందరకాండ ముగింపు వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ వేడుకలు ఎంతో ఘనంగా నభూతో, నభవిష్యతి అన్న విధంగా నిర్వహించాలన్నది గురువుగారి సంకల్పం.ఇంతవరకు గురువుగారు ఎవరినీ ఎలాంటి ఆర్థిక సహాయం అర్థించకుండానే రెండు అష్టోత్తర సుందరకాండలు ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు.కాని ఈ సారి వేడుకలకు భారీగానే ఖర్చవుతుందని అంచనా. మన సుందరకాండకు ప్రత్యేకంగా నిధులేవీ లేవు. హుండీలో ఎవరైనా స్వచ్ఛందంగా సమర్పించే ప్రతీ ఒక్క పైసా ఆ స్వామి సేవకే ఉపయోగిస్తున్నామన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని గురువుగారే మనందరికీ స్వయంగా లేఖ రాశారు. ప్రతీ ఒక్కరూ ఉడతాభక్తిగా ఈ కార్యక్రమం నిర్వహణకు చేయూత అందించమని కోరారు. కాని కార్యక్రమం నిర్వహణ వ్యయాలు కొన్ని లక్షల్లో అయ్యేలా కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి ఎవరు ఎంత సహాయం అందించాలన్న విషయంలో నిర్దిష్ట పరిమితి ఏదీ లేకపోయినా మనందరం ఒక నియమం పెట్టుకుంటే బాగుంటుందనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీరాములవారు విజయయాత్రలో భాగంగా వేంచేస్తున్న గృహ యజమానులందరూ తలో ఐదు వేల రూపాయలు వేసుకుంటే బాగుటుందని మన సుందరకాండ కుటుంబంలో ప్రముఖులు శ్రీ భాస్కరభట్ల సూర్యప్రకాష్‌గారు సూచించారు. ఇది మంచి ఆలోచనే కాని ఈ సారి మార్గమధ్యంలో ఇంతవరకు సుందరకాండ నిర్వహించుకోని కొన్ని కొత్త కుటుంబాలకు కూడా స్వామివారిని పంపుతున్నాం. కేవలం ధనార్జన కాంక్షతోనే మనం ఇలా వారిళ్ళకి స్వామిని పంపామని వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకు నాదొక చిన్న సవరణ. ఇంతవరకు ఒక సారి లేదా ఆ పైబడి సుందరకాండలు నిర్వహించుకున్న కుటుంబాలు, సుందరకాండ కుటుంబ సభ్యులందరం తలో ఐదు వేల రూపాయలు వేసుకుని మిగతా వారిని వారు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వమంటే బాగుంటుందనిపించింది. అంతే కాదు మనలో కూడా కొందరు ఐదు వేల రూపాయలు భరించగల స్తోమత ఉన్న వారు కాదు. అలాంటి కొందరికి కూడా మినహాయింపు ఇస్తూ వీలైనంత ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరదాం. అంతే కాదు ప్రతీ ఒక్కరూ తమ బంధుమిత్రులకి కూడా ఈ మహత్కార్యం గురించి గురూజీ సంకల్పం గురించి తెలియచేసి అందరి సహకారం అందుకోవలసిన అవసరం ఉంది. అలా సహకారం అందించేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరి గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవాలని గురువుగారు తమ సర్కులర్‌లో కోరారు. అలా చేయడం వల్ల వారందరూ స్వయంగా వేడుకలకు రాలేకపోయినా వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించే వీలుంటుందన్నది గురువుగారి ఆలోచన. సమయం ఎంతో లేదు. సెప్టెంబర్ చివరి లోగా మనం ఈ నిధుల సమీకరణ చేయాల్సి ఉంటుంది. ఎంత మొత్తంలో నిధులు సమీకరించుకోగలిగామన్నది తేలితే దాన్ని బట్టి ఏర్పాట్లకు రంగంలోకి దిగడం సాధ్యమవుతుంది. శ్రీరాముని కార్యానికి వానర సమూహం చేతులు కలిపితే భారీ వారధి నిర్మాణం అయింది. రావణవధ జరిగింది. మనందరం తలుచుకుంటే గురువుగారి సంకల్పాన్ని సుసాధ్యం చేయడం కష్టం ఏమీ కాదు. అందరం కార్యోన్ముఖులమవుదాం.
భవదీయుడు
దామరాజు వెంకటేశ్వర్లు
భవదీయుడు
దామరాజు వెంకటేశ్వర్లు
No comments:
Post a Comment