గురూజీ మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా గడగడా వణికిపోతోంది. ఏ క్షణాన వ్యాధి విరుచుకుపడుతుందో అని ప్రతీ ఒక్కరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే మనందరం మానసిక స్థైర్యంతో నిలబడి భగవంతునిపై పరిపూర్ణంగా దృష్టి కేంద్రీకరించినట్టయితే ఏ మహమ్మారి మన దరికి చేరదని గురూజీ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం నాకు అది అనుభవంలోకి వచ్చింది. నేను జర్నలిస్టునన్న విషయం అందరికీ తెలిసిందే. రెండు వారాల క్రితం ఒక రోజు నాకు తీవ్రంగా జలుబు చేసింది. జ్వరం అయితే రాలేదు గాని ఒంట్లో సలపరంగా ఉండేది. మర్నాడు స్వల్పంగా గొంతునొప్పి ప్రారంభం అయింది. అదే సమయంలో నా భార్య శ్రీదేవికి కూడా బాగా జలుబు చేసింది. దిక్కు తోచలేదు. భయంభయంగానే ఇద్దరం గడిపాము. ఆ మరుసటి రోజుకి కాస్తంత ఉపశమించింది. కాని గొంతునొప్పి మాత్రం ఉంది. ఇదంతా మంగళ, బుధవారాల్లో జరిగింది. బుధవారం ఉదయం గురువుగారికి ఫోన్ చేసి మనసులో బాధంతా చెప్పాను. అసలేం భయపడకండి, మన స్వామి అండగా ఉన్నారు. అనిర్వేద శ్రియో మూలం, తమస్మిన్ శ్లోకాలు రెండూ 11 రోజుల పాటు 11 మార్లు అనుసంధానం చేయండి, అన్నీ ఆయనే చూసుకుంటారు అని ధైర్యం చెప్పారు. అనుకోకుండా బుధవారం రాత్రి సాక్షాత్తు మన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామివారు పంపినట్టుగానే డాక్టర్ వెంకటశేషయ్యగారని ఒక హోమియో డాక్టర్ యుట్యూబ్ వీడియో ఒకటి వాట్సప్ లో షేర్ అయింది. అది చాలా బాగుంది, డీలిట్ చేయకుండా పూర్తిగా వినండి అని నా భార్య ఫోన్ చేసి చెప్పింది. ఆ వీడియోలో ఆయన కొన్ని హోమియో మందులు చెప్పారు. గురువారంనాడు కెపిహెచ్ బిలో హోమియో స్టోర్ కి వెళ్లి ఆయన చెప్పిన ఆర్సెనికం ఆల్బం, బెల్లడోనా తెచ్చాను. జలుబు, గొంతునొప్పి రెండూ తగ్గాయి. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు. ఈ రోజు నెలకొన్న వాతావరణంలో అందరం ఇలాంటి భయాలతోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. ఏదైనా కాస్తంత అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకుందామన్నా రెండు రోజుల తర్వాత గాని స్లాట్ దొరకదు, ఆ తర్వాత రిజల్ట్ రావడానికి మరో 48 గంటలు పడుతోంది. ఈ లోగా పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆస్పత్రికి పోయినా టెస్ట్ రిపోర్టులు లేనిదే చేర్చుకోవడంలేదు. చేర్చుకున్నా ప్రైవేటు ఆస్పత్రులైతే 10, 15 లక్షలు గుంజేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందించే స్థితి లేదు. ఈ సమయంలో మనందరం మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లించి దృఢంగా నిలబడాలన్నది గురూజీ ఆకాంక్ష. అందుకే ఆయన శనివారం నుంచి ఈ కింది కార్యక్రమం ప్రకటించారు. ఆంజనేయస్వామివారి ద్వాదశాక్షరి మంత్ర పారాయణ మనందరితో చేయించాలని సంకల్పించారు. శనివారం ఉదయం ఆయన ఇంట్లో కలశస్థాపన చేసి మనందరి గోత్ర నామాలు స్వామివారికి నివేదించి మనందరి తరఫున మంత్రోపదేశం, మంత్ర జపం చేస్తారు. ఆ క్షణంలో ఆయన సంకల్పంలో పేర్లు చెప్పిన వారందరికీ మంత్రోపదేశం చేసినట్టుగానే పరిగణనలోకి వస్తుంది.ఆదివారం ఉదయం నుంచి మనందరం ఇళ్లలోనే కూచుని ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని శక్తి మేరకు నిర్వహిస్తే ఆగస్టు రెండో తేదీ ఆదివారం నాడు మనందరి పేర్ల మీద వారింటిలోనే ద్వాదశాక్షరీ మంత్ర హోమం నిర్వహిస్తారు. ఇంతకన్నా మహద్భాగ్యం ఏముంటుంది...? మనంందరినీ ఆ కరోనా మహమ్మారి నుంచి స్వామివారే కాపాడతారు. ఈ కార్యక్రమంలో ఇతోధికంగా పాల్గొని విజయవంతం చేద్దామని అందరికీ సూచిస్తున్నాను.
- దామరాజు వెంకటేశ్వర్లు